లేని సిబ్బందికి లక్షల్లో జీతాలు! | Fraud In Warangal RTC Office | Sakshi
Sakshi News home page

లేని సిబ్బందికి లక్షల్లో జీతాలు!

Published Tue, Dec 15 2020 1:01 AM | Last Updated on Tue, Dec 15 2020 8:47 AM

Fraud In Warangal RTC Office - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: అసలే నష్టాలతో ఆర్టీసీ కుదేలైంది. ఇటు ఆదాయం పెరగకపోగా దివాలా దిశగా సాగుతోంది. దాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. కానీ ఆ సంస్థలో తిష్ట వేసిన కొందరు అవినీతి అధికారులు ఇప్పుడు కూడా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఆదాయానికీ తెలివిగా గండి కొడుతున్నారు. వీరితో ఉండే సంబంధాలతో ఉన్నత అధికారులు దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఓ అధికారి బాగోతం విజిలెన్స్‌  విచారణలో బట్టబయలైంది. అయినా ఆ అధికారిని కాపాడేందుకు తెరవెనక యత్నాలు జరుగుతున్నాయి.

జీతాల పేరుతో స్వాహా..
ఆర్టీసీలో కొన్ని విభాగాల్లో సొంత సిబ్బంది సరిపోక ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమించుకోవటం పరిపాటి.. అలా ఓ డిపోలో మెకానిక్‌లను నియమించుకున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించి, వారికి జీతాలు చెల్లించినట్టు చూపి ఆ నిధులు స్వాహా చేసినట్టు ఫిర్యాదులందాయి. దీనికి సంబంధించి విజిలెన్స్‌ అధికారులు కొన్ని రోజులుగా విచారణ జరుపుతున్నారు. గేట్‌ వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఓ హాజరుపట్టికను నిర్వహిస్తారు. లోనికి Ððవెళ్లేప్పుడు, వచ్చేప్పుడు అక్కడ సిబ్బంది సంతకం చేస్తారు. వీరు తప్ప సెక్యూరిటీ అనుమతి లేకుండా లోనికి వేరెవరూ వెళ్లటానికి ఉండదు. కానీ, గేటు వద్ద ఉండే హాజరు రిజిస్టర్‌తో పోలిస్తే లోపల ఉండే ప్రధాన హాజరుపట్టికలో మాత్రం అదనంగా కొందరు సిబ్బంది సంతకాలు చేసినట్టు ఉంది. అంటే లోనికి ఎవరూ అదనంగా వెళ్లకుండానే సంతకాలు ప్రత్యక్షమయ్యాయి. అవన్నీ బోగస్‌ సిబ్బంది పేర అధికారులే పెట్టిన సంతకాలన్న విషయం బయటకొచ్చింది. దీనిపైనే విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు చేసి డిపోలోని ఓ ఉన్నతాధికారిని విచారిస్తున్నారు.

ఇప్పుడు కరీంనగర్‌లో ఉండే స్థానిక విజిలెన్స్‌ ప్రధాన కార్యాలయానికి ఆ అధికారిని పిలిపించి ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇక ఇదే అధికారి గతంలో రోడ్డు ప్రమాదానికి గురై దెబ్బతిన్న బస్సు డ్రైవర్‌ నుంచి నష్టపరిహారంగా వసూలు చేసిన రికవరీ మొత్తం నుంచి కొంత స్వాహా చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. అప్పట్లో విజిలెన్స్‌ విచారణలో ఆ బాగోతం వెలుగుచూసింది. కానీ ఓ ఉన్నతాధికారి దగ్గరుండి మరీ వేటు పడకుండా బదిలీతో సరిపుచ్చారు. ఆ ఉన్నతాధికారి అండదండలతోనే మళ్లీ ఆ అవినీతి అధికారి తిరిగి పాత డిపోకు వచ్చి నిధుల స్వాహా పర్వానికి తెరతీశారు. ఇప్పుడు కూడా మళ్లీ వేటు పడకుండా అంతర్గత విచారణ పేరుతో కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్టు సిబ్బంది ఆరోపిస్తున్నారు. 

వేసవిలో కూజాల కొనుగోలు పేరుతో..
ఇక మరో అధికారి గతంలో వేసవిలో సిబ్బందికి చల్లటి నీళ్లందించేందుకు కూజాలు కొన్నట్టు బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేశారు. దానికి సూత్రధారి అయిన అధికారిని నాడు వరంగల్‌లో పనిచేసి ప్రస్తుత హెడ్‌ఆఫీసులో ఉన్న అధికారి కాపాడారని సిబ్బంది చెప్పుకొంటారు. ఆ ఉన్నతాధికారి ఇప్పటికీ ఆ అవినీతి అధికారికి అండదండలు అందిస్తున్నారు. ప్రభుత్వ పరంగా పైస్థాయిలో పర్యవేక్షణ అంతంత మాత్రమే కావటం, గతంలో బస్‌భవన్‌ నుంచి నేరుగా ఉండే పర్యవేక్షణ లోపించటంతో ఉన్నతాధికారులు తమ బలహీనతలతో అవినీతి సిబ్బందిని పెంచి పోషిస్తున్నారు. దొంగ బిల్లులతో ఆర్టీసీ ఖజానాకు గండికొడుతున్నారు. కొందరు ఉన్నతాధికారులు కార్యాలయాల్లో అందుబాటులో లేకుండా, తాము కాపాడుతున్న సిబ్బందితో అంటకాగుతున్నారు. బస్‌భవన్‌పై దృష్టి సారిస్తే అలాంటి వారు దొరుకుతారని, వారే ఆర్టీసీ ఆదాయం పెరగకుండా గండి కొడుతున్నారని ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. పదవీ విరమణ చేసి ఆర్టీసీ విజిలెన్స్‌లో ఉన్నత స్థానంలో ఉన్న కొందరు అధికారుల అండదండలు ఉండటంతోనే అవినీతికి పాల్పడుతున్న సిబ్బందికి ఏ భయం లేకుండా పోయిందని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement