bus bhavan
-
TG: బస్ భవన్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో అమలు చేస్తోన్న పలు కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ట్రైనీ ఐఏఎస్‌లు బస్ భవన్ని శుక్రవారం సందర్శించారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమాలను వారికి వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు.తెలంగాణ కేడర్‌కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్-హెచ్ఆర్డీ)లో ప్రాక్టీకల్ ట్రైనింగ్ ప్రోగ్రాం శిక్షణ తీసుకుంటున్నారు. బస్ భవన్‌ను సందర్శించిన వారిలో ట్రైనీ ఐఏఎస్‌లు ఉమా హారతి, గరిమా నరులా, మనోజ్, మృణాల్, శంకేత్, అభిజ్ఞాన్, అజయ్‌లు ఉన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్, కృష్ణకాంత్‌లతో పాటు ఎంసీఆర్ హెచ్ఆర్డీ సీడీఎస్ సెంటర్ హెడ్ డాక్టర్ కందుకూరి ఉషారాణి, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్నామని ఆటో డ్రైవర్ల ఆందోళన
-
హైదరాబాద్‌లోని బస్‌భవన్ వద్ద ఆటోడ్రైవర్ల ఆందోళన
-
ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి పెడతాం:మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: బస్సు భవన్ ముట్టడికి మంగళవారం ఉదయం భారతీయ మజ్దూర్ సింఘ్(బీఎంఎస్) ఆటో కార్మికులు యత్నించారు. పలు డిమాండ్ల సాధనతో నిరసన ప్రదర్శన చేపట్టారు వాళ్లు. ఈ క్రమంలో బస్‌భవన్ వైపు దూసుకెళ్లే యత్నం చేయగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ. అయితే ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో.. తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తీసుకొచ్చింది. ఈ క్రమంలో పథకానికి వ్యతిరేకంగా పలు జిల్లాల్లోనూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని, అలాగే తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు వాళ్లు. అలాగే.. ఓలా, ఉబర్ రాపిడోలతో ఇబ్బందులు పడుతున్నామని.. వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆటో కార్మికులు. -
బస్‌భవన్‌లో స్వతంత్ర వజ్రోత్సవాలకు నరసింహ.. సత్తయ్య..
సాక్షి, హైదరాబాద్: 1947 పంద్రాగస్టు.. తొలిసారి జాతీయ పతాకం ఎగిరినప్పుడు ఆ ఇద్దరూ మువ్వన్నెల జెండా రెపరెపలను తిలకించారు. మళ్లీ ఇప్పుడు స్వతంత్ర వజ్రోత్సవాల వేళ అదే జాతీయ పతాకాన్ని వారు ఎగురవేయనున్నారు. మొదటి పంద్రాగస్టు వేడుకల కాలంలో వారు నిజాం రోడ్డు రవాణా విభాగం ఉద్యోగులుకాగా.. 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆర్టీసీ మాజీ ఉద్యోగులుగా.. ఆర్టీసీ ప్రధాన కేంద్రంలో జెండా పండుగకు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. వారే నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ (ఎన్ఎస్ఆర్–ఆర్టీడీ)లో చేరి ఏపీఎస్ఆర్టీసీ (ఉమ్మడి రాష్ట్రం)లో రిటైరైన ‘ఆర్టీసీ కురువృద్ధులు’ 97 ఏళ్ల టి.ఎల్.నరసింహ, 92 ఏళ్ల ఎం.సత్తయ్య. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బస్‌భవన్‌లో జెండా పండగకు ఈ ఇద్దరినీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. వారే జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఇది ఆర్టీసీ సగర్వంగా భావిస్తోందని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని సమున్నతంగా సత్కరించడంతోపాటు ఆర్టీసీ పక్షాన కొన్ని వరాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం బస్‌పాస్, మందులు తప్ప.. 1925లో జన్మించిన బొల్లారం వాసి టి.ఎల్.నరసింహ 1944లో తాత్కాలిక గుమాస్తాగా నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరి 1983లో ఆర్టీసీ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా రిటైరయ్యారు. నిజాం కరెన్సీ ఉస్మానియా సిక్కాలో రూ. 47 జీతంతో మొదలుపెట్టి రూ. 1,740 అందుకొని పదవీవిరమణ పొందారు. మరోవైపు ప్రస్తుతం యానాంలో ఉంటున్న ఎం.సత్తయ్య మార్చి 1930లో జన్మించారు. ఆయన 1946లో ఆఫీస్ బాయ్‌గా ఉస్మానియా సిక్కా రూ. 8 జీతంతో ఉద్యోగంలో చేరి ముషీరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన స్టోర్స్‌లో అసిస్టెంట్ స్టోర్ కీపర్‌గా 1988లో రిటైరయ్యారు. ఆయన చివరి జీతం రూ.855. ఆర్టీసీలో పెన్షన్ వసతి లేనందున ప్రస్తుతం వారు సంస్థ నుంచి బస్‌పాస్‌తోపాటు ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి నుంచి మందులు తీసుకుంటున్నారు. బస్‌పాస్ రికార్డుల ఆధారంగానే వారిని ఆర్టీసీ అధికారులు గుర్తించి పంద్రాగస్టు కార్యక్రమాలకు ఆహ్వానించారు. ట్యాంక్‌బండ్‌పై ఆర్టీసీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నిజాం కాలం బస్సు కవాడిగూడ: దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసీ శనివారం వినూత్న ర్యాలీ నిర్వహించింది. నిజాం కాలంలో 1932లో ప్రారంభించిన మొట్టమొదటి బస్సు నుంచి ప్రస్తుతం సంస్థ నడుపుతున్న అత్యాధునిక బస్సుల వరకు ఉన్న వాటితో పరేడ్ చేపట్టింది. ఈ ర్యాలీ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు సాగింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించిన ఈ ర్యాలీలో 1932 నాటి నాందేడ్ బస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా బ్యాండ్ మేళా, బైక్ ర్యాలీ సైతం నిర్వహించారు. నిజాంపేట ఆర్టీసీలో 1944లో చేరి 1983లో రిటైరైన టి.ఎల్. నరసింహను సజ్జనార్ పూలబొకే, శాలువాతో సత్కరించారు. -
ఒక్కరు మినహా అందరు ఈడీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమూల ప్రక్షాళనకు ఎండీ సజ్జనార్ నడుం బిగించారు. ఒక్కరు మినహా అందరు ఈడీలనూ బదిలీ చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్లను మార్చేశారు. 11 మంది ఆర్ఎంలు అటూ ఇటూ మారిపోయారు. త్వరలో మరో బదిలీ ఉత్తర్వు కూడా వెలువడనుంది. డీవీఎంలను, దాదాపు 70 మంది డీఎంలను బదిలీ చేయనున్నట్టు సమాచారం. డీవీఎం పోస్టులతో ఉపయోగం లేదని, ఆ పోస్టుల్లోని అధికారులను వేరే అవసరాలకు వాడుకోవాలని ఎండీ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కొందరు తప్ప మిగతా డీవీఎంలను మారుస్తారని సమాచారం. ఆపరేషన్స్ ఈడీగా మునిశేఖర్ కొంతకాలంగా డిపో స్థాయి నుంచి బస్‌భవన్ వరకు అన్ని విభాగాలను సమీక్షిస్తున్న సజ్జనార్.. ప్రతి విభాగం, ఆయా విభాగాల అధికారుల పనితీరుపై పూర్తి అవగాహనకొచ్చారు. పనితీరు సరిగా లేని వారిని కీలక పోస్టుల నుంచి తప్పించి మెరుగ్గా ఉందని భావించిన వారికి ముఖ్య పోస్టులను అప్పగించారు. సర్వీస్‌లో సీనియరే అయినా ఈడీ పోస్టు నిర్వహణలో జూనియర్‌గా ఉన్న మునిశేఖర్‌కు అత్యంత కీలకమైన, ఆర్టీసీకి ఆయువుపట్టుగా నిలిచే ఆపరేషన్స్ విభాగాన్ని అప్పగించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ఈడీగా ఉన్నారు. ఇంతకాలం ఆ పోస్టు నిర్వహించిన యాదగిరికి గ్రేటర్ హైదరాబాద్ జోన్ బాధ్యతలు అప్పగించారు. యాదగిరి పనితీరుపై సజ్జనార్ అసంతృప్తితో ఉన్నట్టు బస్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. (క్లిక్: ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు, జీఎమ్మార్ అంగీకరిస్తే..) గ్రేటర్ హైదరాబాద్ ఈడీగా ఉన్న వెంకటేశ్వర్లును కరీంనగర్ జోన్ ఈడీగా మార్చారు. గతంలో ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలు రెండూ యాదగిరి వద్ద ఉండేవి. అందులో అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని ఏ ఈడీకి అప్పగించలేదు. బదిలీల వ్యవహారాలు ఈ విభాగం పరిధిలోనే ఉంటాయి. దీన్ని తనే స్వయంగా పర్యవేక్షించాలని ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. బదిలీలు జరిగిన విభాగాల్లో ఎవరికీ కేటాయించనివి ఎండీ వద్దే ఉంటాయని బదిలీ ఆదేశాల్లో స్పష్టం చేశారు. (క్లిక్: ఐటీ కారిడార్లలో వజ్ర పరుగులు.. చార్జీలు ఎంతంటే?) -
రిటైర్మెంట్లకు సెటిల్మెంట్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత ఆర్టీసీ లో మళ్లీ ఉద్యోగుల పదవీ విరమణలు మొదలు కాబోతున్నాయి. డిసెంబర్లో 130 మంది, మార్చి నాటికి మరో 500 మంది రిటైర్ కానున్నారు. 2023 మార్చి నాటికి మరో 2 వేల మంది పదవీవిరమణ పొందనున్నారు. జీతాల భారంతో ఇబ్బంది పడు తున్న సంస్థకు ఈ విరమణలు ఊరటనివ్వబోతు న్నాయి. ప్రస్తుతం మొత్తం వ్యయంలో జీతాల వాటా ఏకంగా 53 శాతం ఉండటంతో ఆర్టీసీ ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే. రెండేళ్లుగా పదవీ విరమణలు లేకపోవటంతో జీతాల చెల్లింపు పెద్ద సమస్యగా మారింది. ఎట్టకేలకు రిటైర్మెంట్లు ప్రారంభం కానుండటంతో క్రమంగా జీతాల బరు వు తగ్గనుంది. రిటైర్మెంట్ సమయంలో ఉద్యో గుల జీతాలు గరిష్ట స్థాయిలో ఉంటాయనేది తెలిసిన విషయమే. కొత్త నియామకాలు కూడా ఉండబో వని ఇప్పటికే ఆర్టీసీ తేల్చి చెప్పినందున భవిష్యత్తు లో జీతాల పద్దు చిక్కిపోవటమే కానీ, పెరగడం ఉండదు. ఒకవేళ వేతన సవరణ చేస్తే మాత్రం భా రం పడుతోంది. కానీ, సిబ్బంది సంఖ్య తగ్గనున్నందున పెంపు భారం కొంత తక్కువే ఉండనుంది. 2019 చివర్లో బ్రేక్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 2019లో ఆర్టీసీ రెండేళ్లు పెంచింది. పదవీ విరమణ ప్రయోజనాలు ఇచ్చే పరిస్థితి లేకపోవటంతో, కొంతకాలం కొనసాగించేందుకు రిటైర్మెంటు వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిందనేది సంస్థ ఉద్యోగుల మాట. ఏదిఏమైనా ఆర్టీసీ నిర్ణయంతో 2019 చివరి నుంచి రిటైర్మెంట్లు ఆగిపోయాయి. ఇప్పుడు రెండేళ్లు గడవటంతో ఈ డిసెంబర్ నుంచి మళ్లీ పదవీ విరమణలు మొదలు కాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలన్న ఇటీవలి ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్టీసీలో కూడా అమలు చేసే ప్రతిపాదన సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. అదలా ఉండగానే ఇప్పు డు రిటైర్మెంట్లు ప్రారంభం కాబోతున్నాయి. అదనపు సిబ్బంది సమస్య పరిష్కారం గతసమ్మె తర్వాత ఆర్టీసీలో వేయికిపైగా బస్సులను తొలగించారు. 1,500 అద్దె బస్సులను కొత్తగా తీసుకున్నారు. వెరసి ఆర్టీసీలో దాదా పు మూడున్నర వేలమంది సిబ్బంది మిగిలిపోయా రు. డిసెంబర్ నుంచి పదవీ విరమణలు మొదలు కానుండటంతో అదనపు సిబ్బంది సమస్య కూడా తగ్గుతూ రానుంది. 2023 మార్చి నాటికి మొత్తం 2,630 మంది పదవీ విరమణ పొందనుండటం, ఇతర అవసరాలు కొన్ని పెరగనుండటంతో ఈ సమస్య సమసిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. సెటిల్మెంట్లకు నిధులెలా? రిటైర్ అయిన ఉద్యోగులకు సగటున రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రయోజనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు సగటున రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు చెల్లించాలి. ఆర్టీసీకి ఇదే సమస్యగా మారింది. డిసెంబర్ నుంచి చెల్లింపులు చేయాల్సి ఉన్నందున డబ్బుల కోసం వెతుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం ఆర్టీసీ రోజువారీ టికెట్ ఆదాయం కొంత పెరిగినా.. అది డీజిల్ ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి. అలాగని ప్రభుత్వం సాయం చేసే పరిస్థితి కూడా దాదాపుగా లేదు. ఇక బ్యాంకుల నుంచి రుణం పొందటమే మొదటి ఉపాయంగా ఉంది. గత బడ్జెట్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.1,500 కోట్లు కేటాయించింది. ఇవి గ్రాంటు కానందున ప్రభుత్వ పూచీకత్తుతో రుణంగా పొందాలి. ఇలా ఇప్పటికే రూ.వేయి కోట్లు తీసుకుంది. మిగతా రూ.500 కోట్లను కూడా అలాగే తీసుకోవాలి. ఇప్పుడు రిటైర్మెంట్ సెటిల్మెంట్లు ఆ రూ.500 కోట్లపైనే ఆధారపడాలి. లేదంటే ఆస్తులను తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలి. కాదంటే అవే భూములను లీజుకు ఇవ్వటమో, అమ్మేయటమో చేయటం ద్వారా నిధులు సమకూర్చుకోవాలి. -
టీఎస్ఆర్టీసీ బస్ భవన్లో వాస్తు మార్పులు..
-
ఆర్టీసీ నష్టాలకు వాస్తు దోషమా? బస్‌భవన్‌కు వాస్తు మార్పులు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు అధికారులు వారికి తోచిన రీతిలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వాస్తును కూడా వారు అనుసరిస్తున్నారు. తాజాగా బస్‌భవన్‌కు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రధాన మార్గం వైపు ఉన్న గేటును మూసేశారు. ఈ మార్గానికి సరిగ్గా వెనకవైపు చిన్న రోడ్డుపై ఉన్న మరో గేటును వినియోగిస్తున్నారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం సంధ్య థియేటర్ ముందు నుంచి వెళ్లే రోడ్డు ప్రధానమైంది కావడంతో ఇంతకాలంగా ఆ వైపు గేటునే ప్రధాన ద్వారంగా వినియోగిస్తూ వస్తున్నారు. అయితే ఇది దక్షిణ ముఖంగా ఉండడంతో వాస్తుకు అనుకూలంగా లేదన్న ఉద్దేశంతో తాజాగా ఈ మార్పు చేశారు. కొత్తగా వినియోగించే గేటు ఈశాన్యం వైపు ఉంది. ప్రస్తుతం వాహనాలన్నింటిని ఆ గేటు నుంచే అనుమతిస్తున్నారు. కొత్త ఎండీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన రోజున నూతన గేటులోంచే లోనికి వచ్చారు. ఇదిలా ఉండగా సజ్జనార్ రాకముందే వాస్తు మార్పు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు దానిని అమలులోకి తెచ్చామని ఓ అధికారి పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం -
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్
-
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్లో శుక్రవారం సజ్జనార్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. సజ్జనార్ అంతకుముందు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా పని చేసి నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009లో దేశంలోనే సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్ గతంలో సీఐడీ, ఇంటిలిజెన్స్ విభాగాల్లో పని చేశారు. చదవండి: లవ్ మ్యారేజ్ జంట మూడు నెలలకే తట్టుకోలేక.. చదవండి: కలెక్టరేట్లో గన్‌మెన్‌గా భర్త.. రోడ్డుపై విగతజీవిగా భార్య -
ఆర్టీసీకి ఎట్టకేలకు అప్పు పుట్టింది!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీకి ఎట్టకేలకు అప్పు పుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో ఓ బ్యాంకు రూ.500 కోట్ల రుణాన్ని అందించింది. ఇంతకాలం రుణం ఇచ్చేందుకు బ్యాంకులు జంకటంతో ఆర్టీసీ సంస్థ దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడింది. సొంత ఆదాయం ఏమాత్రం అవసరాలను తీర్చలేకపోవడం, కోవిడ్ దెబ్బతో భారీగా టికెట్ ఆదాయం తగ్గిపోవటం, కార్గో విభాగం పుంజుకోకపోవటం, ప్రత్యామ్నాయ ఆదాయం లేకపోవటంతో ఆర్టీసీ కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు నుంచి అందిన రూ.500 కోట్ల అప్పు కొంత ఊరటనిచ్చినట్టయింది. గోప్యంగా అప్పు విషయం వాస్తవానికి రూ.వేయి కోట్ల సాయం కావాలని ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్లో కేటాయించిన మొత్తం నుంచి దాన్ని విడుదల చేయాలని అడిగింది. కానీ, నిధులు ఇచ్చేందుకు ఆసక్తి చూపని ప్రభుత్వం, అంతమేర పూచీకత్తు ఇచ్చేందుకు సిద్ధపడింది. ఆ పూచీకత్తు చూపి బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు బ్యాంకుల చుట్టూ తిరగ్గా ఓ బ్యాంకు సరే అన్నా దాని కేంద్ర బోర్డు మోకాలొడ్డింది. అసలే దివాలా దిశలో ఉన్న ఆర్టీసీకి ఏకంగా రూ.వేయి కోట్ల అప్పు ఇవ్వడం సరికాదని నిరాకరించింది. రూ.500 కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. దాన్ని కూడా నెలన్నర కాలయాపన తర్వాత తాజాగా విడుదల చేసింది. ఈ రుణం విషయం తెలిసి, పాత బకాయిలు చెల్లించాలంటూ ఆర్టీసీ సహకార పరపతి సంఘం పాలకవర్గం, అద్దె బస్సుల యజమానులు, ఆయిల్ కంపెనీలు బస్‌భవన్ చుట్టూ తిరగటం ప్రారంభించారు. మరోవైపు పాత వేతన సవరణ బకాయిలు చెల్లించాలని కార్మిక సంఘాలూ ఒత్తిడి ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో రుణం చేతికందిన విషయాన్ని ఆర్టీసీ గోప్యంగా ఉంచింది. ఎండీ వచ్చాక నిర్ణయం.. తనను ఆర్టీసీ బాధ్యతల నుంచి తప్పించాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్న ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ అనారోగ్య కారణాలతో 25 రోజులుగా సెలవులో ఉన్నారు. ఆయన మంగళవారం విధుల్లో చేరనున్నారు. అధికారులు ఆయనను సంప్రదించి ఆ రూ.500 కోట్లను వేటివేటికి ఖర్చు చేయాలన్న విషయంలో స్పష్టత తీసుకోనున్నారు. -
కొలిక్కిరాని ఆర్టీసీ చర్చలు
సాక్షి, అమరావతి: ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ ఏడాది జూన్ 18న టీఎస్ఆర్టీసీ అధికారులు విజయవాడకు వచ్చి చర్చలు జరిపిన సందర్భంలో కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సుల్ని నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో భేటీకి హాజరైన అధికారులు తెలంగాణకు నడిపే సర్వీసులు, కి.మీ.ల ప్రతిపాదనను టీఎస్ఆర్టీసీ అధికారులకు అందించారు. అయితే టీఎస్ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను, లేదా కి.మీ.లను తగ్గించుకోవాలని ఏపీకి సూచించారు. ఈ సూచన ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, తర్వాత నిర్ణయం చెబుతామని ఏపీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణకు ఏపీఎస్ఆర్టీసీ రోజూ 2.65 లక్షల కి.మీ. బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు అందించింది. అయితే టీఎస్ఆర్టీసీ ఏపీకి 1.16 లక్షల కి.మీ. బస్సు సర్వీసులు నడుపుతోంది. ఈ మేరకే ఏపీఎస్ఆర్టీసీ కూడా తగ్గించాలని సూచించింది. -
ఆర్టీసీ సమ్మె : అధ్యయన కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన ఈడీ అధికారుల కమిటీ బస్ భవన్లో బుధవారం సమావేశమైంది. సీఎం ఆదేశాలతో కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. దీనిలో భాగంగా రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా రేపు లేదా ఎల్లుండి ఆర్టీసీ కార్మిక నాయకులతో చర్చలు జరుపనున్నారు. రెండు రోజుల్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. నివేదిక సారాంశాన్ని 28న జరిగే విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు వివరించనుంది. (చదవండి : కార్మికుల డిమాండ్లపై కేసీఆర్ కీలక ఆదేశాలు) ఇక విలీనం మినహా మిగతా 21 డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయడంతో.. చర్చలకు ఆహ్వానిస్తే వెళ్తేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మరోవైపు ‘విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదు’ అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొనడం గమనార్హం. సమ్మెలో భాగంగా బుధవారం దిల్సుఖ్ నగర్ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘విలీనంపై వెనక్కి తగ్గినట్లు ఎక్కడైనా చెప్పినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం’అని వ్యాఖ్యానించారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 19వ రోజుకు చేరింది. -
బస్ భవన్ వద్ద ఉద్రిక్తతలకు దారితీసిన బీజేపీ ఆందోళన
-
దారుణంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కార్
-
ఆర్టీసీ సమ్మె: తీవ్ర ఉద్రిక్తత, లక్ష్మణ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శనివారం బీజేపీ బస్ భవన్ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ని, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్ చేశారు. దాంతో ఓ ఆర్టీసీ కార్మికుడు చెట్టు ఎక్కి నిరసన తెలిపాడు. ధర్నా నేపథ్యంలో బస్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్థంభించడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే.. ప్రగతి భవన్‌ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇన్ని రోజులుగా కార్మికుల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి.. వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటుందని తెలిపారు. కార్మికుల సమస్యలపై స్పందించకపోతే.. కేసీఆర్ పాలనను స్తంభింపచేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు. -
బట్టలు చించేలా కొట్టారు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం మాట్లాడితే వాళ్లను బట్టలు చించేలా కొట్టారని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ జనసమితి, సీపీఐ, ప్రజా సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శనివారం ఉదయం బస్‌భవన్‌ను ముట్టిడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బస్‌భవన్ ముందు బైఠాయించి ఆందోళనకారులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంధ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. విలీనం చేయకపోగా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఆర్టీసీ సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో విసిగిపోయిన కార్మికులు సమ్మె చేపట్టారని, వీరికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. చర్చల కమిటీని మొదటి రోజే ఎలా రద్దు చేస్తారు? చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు తీసేస్తామంటూ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థను దెబ్బదీసి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం తెగించి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు అన్ని వర్గాలు ముందుకు రావాలని సంధ్య పిలుపునిచ్చారు. కేసీఆర్.. ‘సెల్ప్ డిస్మిస్’ అర్థం చెప్పు ముఖ్యమంత్రి కేసీఆర్ సెల్ప్ డిస్మిస్ పదానికి అర్థం చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల్లో సెల్ప్ డిస్మిస్ అనే పదం లేదన్నారు. రాజ్యాంగం, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడుతున్న తీరు కార్మిక వర్గాలకు పెను సవాల్ విసురుతోందన్నారు. రాష్ట్ర కార్మిక సంఘాలన్ని ఏకమై కేసీఆర్ మెడలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్‌టీసీ, సీపీఎంఎల్ కూడా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటున్నాయని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ వైఖరితో ఇప్పటికే నాలుగురైదుగురు ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారని, 1200 మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందో ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అండగా ఉంటాం: టీజేఎస్ ఆర్టీసీ కార్మికులకు చివరి వరకు అండగా ఉంటామని తెలంగాణ జనసమితి(టీజేఎస్) నాయకులు స్పష్టం చేశారు. సకల జనుల సమ్మెలో జీవితాలను సైతం లెక్కచేయకుండా పాల్గొని ఆర్టీసీ కార్మికులు ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ఆర్టీసీ సమ్మె: బస్‌భవన్ ఎదుట ధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లాలో కార్మికులు యధావిధిగా సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు కార్మికులు డిపోల ఎదుట మౌన దీక్ష చేయనున్నారు. అదే విధంగా బీజేపీ అధ్వర్యంలో బస్ భవన్ ముందు ధర్నా నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రం వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, పలు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఖమ్మం మున్సిపల్ కార్మికులు తమ విధులను బహిష్కరించి.. మున్సిపల్ కార్యాలయం నుంచి డిపో వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మద్దతు పలుకుతుందని జీ దామోదర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు బర్తరఫ్ అయినట్లుగా ప్రకటించి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించడం అప్రజాస్వామికం అన్నారు. ప్రభుత్వం చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎనిమిది డిపోల పరిధిలో 672 బస్సులు, 2890 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా సమ్మెలో పాల్గొన్నడం వల్ల ఇప్పటి వరకు రూ. 7 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
ఇన్‌చార్జ్‌లతో ఆర్టీసీ అస్తవ్యస్తం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఆయన ఓ ఉన్నతాధికారి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బస్‌భవన్‌లో ఇన్చార్జి ఈడీగా ఉన్నారు. ఆయన అసలు పోస్టు ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్. హైదరాబాద్–ఆదిలాబాద్ మధ్య 300 కి.మీ. దూరం ఉంటుంది. ఇంతదూరంలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఒకే వ్యక్తి ఎలా పనిచేయగలరు. ఇది ఆర్టీసీలో ఉన్న గందరగోళానికి ఓ నిదర్శనం. ఇదే అధికారి ఈనెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. సీనియారిటీ క్రమంలో ఆయనకు ఈడీ పదోన్నతి రావాలి. కానీ, ఎన్నికల కోడ్ పేరుతో ఇంతకాలం కాలయాపన జరిగింది. కోడ్ ముగిసినా ఇప్పటివరకు పదోన్నతుల ఊసు లేదు. ఇలాగే ఉంటే ఆయన ఈడీగా కాకుండా అంతకంటే ఓ మెట్టు దిగువన ఉండే రీజినల్ మేనేజర్‌గానే పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు పది ప్రాంతాల్లో పూర్తిస్థాయి ఆర్ఎంలు, డీవీఎంలు లేరు. ఎక్కడెక్కడో ఉన్న వారితో ఇన్చార్జులుగా నెట్టుకొస్తున్నారు. ఇంత గందరగోళంగా ఉన్న ఆర్టీసీకి అసలు పూర్తిస్థాయి ఎండీనే లేకపోవటంతో ఈ పదోన్నతులు, బదిలీల గందరగోళం తీవ్రమైంది. మూడు పోస్టులతో సతమతమవుతున్న ఇన్చార్జి ఎండీకి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, కీలక అంశాలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసేవారు కూడా లేకపోవటంతో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. అసలే తీవ్ర నష్టాలతో దివాలా దిశలో సాగుతున్న ఆర్టీసీ... గాడిలో పడాల్సింది పోయి ఇలా గందరగోళంతో కుస్తీపడుతోంది. ఆ కమిటీ ఎక్కడుంది? రాష్ట్ర విభజన జరిగినా ఇప్పటికీ ఆర్టీసీ సాంకేతికంగా రెండు రాష్ట్రాల మధ్య విడిపోలేదు. దీంతో తెలంగాణ ఆర్టీసీకి పాలకమండలి లేదు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది పాలకమండలి కావటంతో చాలా పనులు తాత్కాలిక పద్ధతిలో జరుగుతున్నాయి. పదోన్నతుల విషయంలోనూ అదే జరుగుతోంది. దీంతో గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రభుత్వం సెలక్షన్, డిసిప్లినరీ కమిటీని నియమించింది. ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ ఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్, రవాణా శాఖ, ఫైనాన్స్ (ట్రాన్స్‌పోర్టు), కార్మిక శాఖల కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇది అమలులో ఉంటుంది. అంటే గతేడాది సెప్టెంబర్‌లో ఈ కమిటీ ఏర్పడినందున అంతకుముందు జరిగిన వాటిని రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బస్‌భవన్‌లో పురుషోత్తమనాయక్, వినోద్‌కుమార్‌లు ఈడీలుగా పదోన్నతి పొంది పనిచేస్తున్నారు. వీరిద్దరిని కూడా ఈ కమిటీ రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు కొత్త పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ రావటంతో గతేడాది చివరి నుంచి పదోన్నతులు ఆగిపోయాయి. పదోన్నతులు లేనందున కొత్త ఖాళీలు ఏర్పడక బదిలీలు కూడా నిలిచిపోయాయి. వాస్తవానికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటై ఉన్నందున, ఆ కమిటీ సమావేశమై బదిలీలు, పదోన్నతులపై నిర్ణయం తీసుకుని అత్యవసర పనిగా ఎన్నికల కమిషన్ ముందు ప్రతిపాదిస్తే ఆమోదం లభించే అవకాశం కూడా ఉండేదన్న అభిప్రాయం ఉంది. కానీ, ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు కమిటీ సమావేశమే కాలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసినా ఆ ఊసే లేక పాలన అంతా అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 20 కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాక్షాత్తూ బస్‌భవన్‌లోనే ముగ్గురు ఈడీలు ఇన్చార్జులుగా ఉన్నారు. ఇటీవల ఆర్ఎం స్థాయిలో ఉన్న అధికారులను తాత్కాలిక పద్ధతిలో ఈడీలుగా కూర్చోబెట్టారు. పదోన్నతులు లేనందున వీరు పర్యవేక్షించే రెగ్యులర్ పోస్టుల్లో ఎవరినీ నియమించలేదు. ఈ ముగ్గురు అధికారులకు ఈడీ పదోన్నతి ఇస్తే వారు చూసే రెగ్యులర్ ఆర్ఎం కేడర్ పోస్టులు ఖాళీ అవుతాయి. వాటిని డీవీఎంలతో భర్తీ చేస్తారు. అలా ఖాళీ అయ్యే డీవీఎం పోస్టులను సీనియర్ డీఎంలతో భర్తీ చేస్తారు. వాటిని అసిస్టెంట్ డీఎం పోస్టులతో.. ఇలా కిందిస్థాయి వరకు పోస్టులు భర్తీ అవుతాయి. కానీ ఈ ప్రక్రియ జరగక అధికారుల్లో అయోమయం నెలకొంది. ఇక దాదాపు పది డిపోలకు పూర్తిస్థాయి డిపో మేనేజర్లు లేరు. వాటిని తాత్కాలిక పద్ధతిలో ఇతరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ వ్యవహారం ఆర్టీసీ బస్సుల నిర్వహణపై పడుతోంది. సాధారణంగా రెండుమూడేళ్లు జిల్లాల్లో పనిచేసే పెద్ద అధికారులను ఆ తర్వాత నగరానికి బదిలీ చేస్తారు. కానీ ప్రస్తుతం నాలుగేళ్లు దాటినా తమకు హైదరాబాద్ భాగ్యం దక్కటం లేదని కొందరు అధికారులు వాపోతున్నారు. ఇక పాఠశాలలు తెరిచేలోపే బదిలీలు జరిగితే బాగుండేదని, ఇప్పుడు బడులు తెరిచినందున మధ్యలో ట్రాన్స్ఫర్స్ జరిగితే పిల్లల చదువులకూ ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులు వాపోతున్నారు. ఈ వ్యవహారం మరోవైపు ఆర్టీసీ అధికారుల సంఘంలోనూ లుకలుకలకు కారణమైంది. బదిలీలు, పదోన్నతుల విషయంలో ఎండీపై ఒత్తిడి చేయటం లేదంటూ బాధ్యులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంఘానికి ఎన్నికలు నిర్వహించాలంటూ కొందరు డిమాండ్ ప్రారంభించారు. ఇక సందట్లో సడేమియాగా జూనియర్ అధికారులు కొందరు పైరవీలతో పెద్ద పోస్టుల్లో తాత్కాలిక పద్ధతిలో నియామకమయ్యేలా చక్రం తిప్పుతున్నారు. -
చక్రం తిరుగుతోంది చందాలతోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పరిస్థితి అత్యంత దయ నీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కార్మికులకు జీతాలు ఇవ్వడానికే దిక్కులు చూస్తున్న సంస్థ.. ఏవైనా పనులు చేయించాలంటే వారి వద్దే చేయి చాస్తోంది. కార్మికులు తమ జేబులో నుంచి డబ్బులు తీస్తే తప్ప.. సంస్థలో అభివృద్ధి పనులు జరగని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ ఏర్పడిన తర్వాత 8 దశాబ్దాల్లో ఎన్నడూ ఇంతటి గడ్డు పరిస్థితి లేదు. నష్టాలు వచ్చినప్ప టికీ.. సిబ్బంది వేతనాలు, ఇతరత్రా అభివృద్ధి పనులకు అంతగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా మారింది. సంస్థ వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో కొత్త బస్సులు కొనలేక డొక్కు బస్సులతోనే నెట్టు కొస్తోంది. కార్మికుల కోసం డిపోల పరిధిలో ఏవైనా పనులు చేయాల్సి వస్తే ‘బస్ భవన్’ నిస్సహాయంగా చూస్తోంది. దీంతో కార్మికులే చందాలు వేసుకుని పనులు చేసుకుంటున్నారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు... వరంగల్ రీజియన్ పరిధిలోని కార్మికులందరి చేతిలో ‘క్లినిక్ డిస్పెన్సరీ డెవలప్మెంట్ ఫండ్’ కూపన్లే కనిపిస్తున్నాయి. హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల కోసం విశాలమైన డిస్పెన్సరీ ఉంది. వరంగల్–1 డిపో మేనేజర్ కార్యాలయం ఉన్న భవనం రెండో అంతస్తులో దీనిని ఏర్పాటు చేశారు. అయితే, దీనికి లిఫ్టు వసతి లేదు. కనీసం ర్యాంపు కూడా లేకపోవడంతో అత్యవసర చికిత్స కోసం వచ్చే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పైకి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల డిమాండ్ మేరకు డిస్పెన్సరీని రీజినల్ మేనేజర్ కార్యాలయం ఉన్న భవనంలో కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.లక్షల్లోనే ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ, ఆ నిధులు ఇచ్చేందుకు ఆర్టీసీ వద్ద ఎలాంటి ఫండ్ లేదు. ఏరోజుకారోజు టికెట్ల రూపంలో వచ్చే డబ్బులు తప్ప ఆర్టీసీ వద్ద ఎలాంటి నిధులూ లేవు. కార్మికుల భవిష్యనిధి, ఆర్టీసీ పరపతి సహకార సంఘం, పదవీ విరమణ, చనిపోయిన కార్మికులకు ఇచ్చే థ్రిఫ్ట్ అండ్ బెన్వలెంట్ ఫండ్‌ను కూడా వదలకుండా వాడేసుకుంటున్న దుస్థితి నెలకొంది. దీంతో ఇలాంటి అభివృద్ధి పనులకు ఇవ్వడానికి నయా పైసా కూడా సంస్థ వద్ద లేదు. ఆర్టీసీ కేంద్ర కార్యాలయం నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేకపోవటంతో వరంగల్ రీజియన్ అధికారులు స్థానిక కార్మిక సంఘాలతో సమావేశమై చందాలు వేసుకుని ఈ పని చేయించుకోవాలని నిర్ణయించారు. వరంగల్ రీజియన్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు రూ.50 చొప్పున చెల్లించే విధంగా రశీదు పుస్తకాలు ముద్రించారు. వాటిని డిపోలకు పంపిణీ చేసి చందాలు వసూలు చేస్తున్నారు. లక్కీ డ్రా తీసి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామంటూ కూపన్లపై ముద్రించారు. దీంతో కొందరు కార్మికులు పది వరకు కూపన్లు తీసుకుంటున్నట్టు తెలిసింది. డిస్పెన్సరీ చాలా ఉపయోగకరమైంది కావటంతో కొంతమంది స్వచ్ఛందంగా అదనంగా చందాలు రాస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న మొత్తంతో కొత్త డిస్పెన్సరీ పనులు చేయిస్తున్నారు. డ్రైవర్డేకు చందాలే దిక్కు... కార్మికుల సంక్షేమం, ఇతర ప్రత్యేక రోజులకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీ. డ్రైవర్ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఆ రోజు డ్రైవర్ల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవటంతోపాటు వారికి బహుమతులు ఇచ్చి, ఉత్తమ డ్రైవర్లను సన్మానిస్తారు. ఇలాంటి కార్యక్రమాలకు ఆర్టీసీనే ఖర్చు భరిస్తుంది. కానీ నిధులు లేక ఇటీవల కార్మికులే చందాలు వేసుకుని ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వరంగల్ రీజియన్‌లో ఇలా రూ.50, రూ.100 చొప్పున చందాలు వేసుకుని అన్ని డిపోల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రం కావడంతో అన్ని డిపోల్లో మంచినీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇందుకోసం చాలాచోట్ల భారీ ట్యాంకులు ఏర్పాటు చేసి కార్మికులకు మంచినీటిని అందుబాటులో ఉంచుతున్నారు. అయితే, ట్యాంకులు కొనడానికి నిధులు లేకపోవటంతో చాలాచోట్ల కార్మికులే చందాలు వేసుకున్నట్టు సమాచారం. అవినీతికి ఆస్కారం కాదా? అభివృద్ధి పనుల పేరుతో కార్మికుల నుంచి చందాలు వసూలు చేయటాన్ని కొందరు తప్పుపడుతున్నారు. అది అవినీతికి దారి తీస్తుందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికుల నుంచి చందాలు వసూలు చేసి పనులు పూర్తి చేసిన తర్వాత, భవిష్యత్తులో ఆ ఖర్చు తాలూకు బిల్లులు పెట్టి ఆర్టీసీ నిధుల నుంచి వసూలు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ భాగస్వామ్యంలో ఇలాంటి పనులు జరగడం సంతోషంగా ఉందని అనేవారూ ఉన్నారు. గతంలో తమ జీతాల నుంచి కొంత మొత్తం మినహాయించి కొత్త బస్సులు కొన్నారని, ఇప్పటికీ అవి తిరుగుతున్నాయని, వాటిని చూస్తే ఆనందం కలుగుతుందని పేర్కొంటున్నారు. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి నిర్మాణ సమయంలో కూడా తాము చందాలు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలేం చేస్తున్నారు..? వాస్తవానికి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు తమ అభివృద్ధి నిధులను కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం గతంలోనే ఎమ్మెల్యేలకు ఆర్టీసీ లేఖలు రాసింది. గత ప్రభుత్వ హయాంలో ఈటల రాజేందర్, మధుసూదనాచారి, మహేందర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ సహా పది పన్నెండు మంది మాత్రమే కొంతమేర ఆర్టీసీకి నిధులిచ్చారు. మిగిలినవారు ఎవరూ స్పందించలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఒక్కరు కూడా ఆర్టీసీకి నిధులు కేటాయించలేదు. కొన్ని చోట్ల అధికారులు విన్నవించినా ఎమ్మెల్యేలు స్పందించలేదు. -
ఆర్టీసీలో ‘కుల’కలం!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు అధికారులపై ఒకే తరహా ఫిర్యాదులొచ్చాయి. విజిలెన్సు విచారణలో అవి నిజమేనని తేలాయి. కానీ ఓ అధికారిని విధుల నుంచి తొలగించారు... మరో అధికారి ఆ తర్వాత ప్రమోషన్ అందుకుని పెద్ద పోస్టులో కొనసాగుతున్నాడు. ఇప్పుడీ అంశం ఆర్టీసీలో వివాదానికి కారణమవుతోంది. వేటు పడ్డ అధికారి ఎస్సీ కావటమే దీనికి కారణం. సొంతంగా బస్సులు కొనటం ఆర్టీసీ భారంగా భావిస్తుండటంతో కొంతకాలంగా అద్దె బస్సులను పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటోంది. వీటి పరిమితిపై ఉన్న నిబంధనను కూడా సడలించి వాటి సంఖ్యను పెంచుకుంటోంది. ఇది కొందరు ఉన్నతాధికారులకు ఆదాయవనరుగా మారింది. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ఈ బస్సుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు దండుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఆ బస్సులు నడుపుకు నేందుకు అనుమతించినా, ఈ అధికారి మాత్రం ఒక్కో బస్సు నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించి, మరో జిల్లా రీజినల్ మేనేజర్‌కు ఆ బాధ్యత అప్పగించారు. ఆయన కూలంకషంగా విచారణ జరిపి వసూళ్లపై ఆధారాలున్నట్టు నివేదిక సమర్పించారు. మరో కేసులో.. వరంగల్‌లో కూడా ఇదే స్థాయి అధికారి అద్దె బస్సులపై పడి జేబులు నింపేసుకున్నాడు. దీనిపై కూడా బస్‌భవన్‌కు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణ చేసి ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. రాజుకున్న కుల వివాదం నల్లగొండలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి పదోన్నతి పొంది బస్‌భవన్‌లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇది కులం రంగు పులుముకొంది. వేటుపడిన అధికారి ఎస్సీ కావటంతో ఆ వర్గం అధికారులు, సిబ్బంది దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒకే నేరానికి శిక్ష కూడా ఒకే రకంగా ఉండాలని కోరుతున్నారు. ఎస్సీ అధికారిపై వేటువేసి, మరో కులానికి చెందిన అధికారిని కాపాడటం కుల వివక్షగానే పరిగణించాలంటూ వారు ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తీవ్ర ఆరోపణలున్నా.... నల్లగొండ జిల్లాలో పనిచేసి బదిలీ అయిన అధికారిపై గతంలో కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా బస్టాండ్లలో దుకాణాల కేటాయింపులో ఆయన హస్తలాఘవం ప్రదర్శించారన్నది ప్రధాన ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా పదార్థాలు, వస్తువులు అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో మిగ తా దుకాణాలు ఖాళీగా ఉండిపోయి ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లింది. ఆయన అక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత స్థానిక అధికారులు మళ్లీ వాటికి టెండర్లు పిలిచారు. కానీ దుకాణదారులతో కుమ్మక్కై ఆ అధికారి టెండర్లు రద్దు చేయించారు. -
ఆర్టీసీలో మళ్లీ వేతన సవరణ రగడ
-
ఈనెల 21 తర్వాత టీఎస్ఆర్టీసీ సమ్మె!
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం ‘చలో బస్‌భవన్’ చేపట్టారు. దీంతో బస్‌భవన్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్మికుల వేతన సవరణ, ఆర్టీసీలో ఖాళీల భర్తీ, ఉద్యోగుల సమ్యలు పరిష్కరించాలని టీఎంయూ డిమాండ్ చేస్తోంది. 2017, ఏప్రిల్ నుంచి రావాల్సిన పే స్కేల్‌ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్‌భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరించారు. ఈ సందర్భంగా టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ.. టీఎంయూ మీటింగ్ ఓ ఉదాహరణ మాత్రమేనన్నారు. కార్మిక లోకం కన్నెర్ర చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు కార్మికులు శాంతియుతంగా ఉన్నారన్నారు. ప్రగతి భవన్ ముట్టడి వరకు రానివ్వద్దననారు. ప్రభుత్వంలో కొందరు మంత్రులుగా ఉన్నారంటే అది తెలంగాణ అర్టీసీ కార్మికుల చలువేనన్నారు. ఎవరి దయదాక్షిణ్యాల మీద కార్మికులు లేరని తెలిపారు. చీటికిమాటికీ కార్మికులు, ఉద్యోగుల మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఫలాలు ఆర్టీసీ కార్మికులకు అందలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలు పెరిగిపోయాయని, వాటిని నియంత్రించే నాధుడే లేరన్నారు. ఉద్యమకారుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో అదే ఉద్యమకారుల మీటింగ్‌కు ఎందుకు అనుమతి దొరకడం లేదు? కార్మిక, ఉద్యోగులకు ఆర్టీసీలో ఎందుకు ఉద్యోగ భద్రత లేదు? అని ప్రశ్నించారు. ఇతర కార్మిక సంఘాలు కూడా ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం కలిసి రావాలని కోరారు. నేడు జరిగిన ఈ ధర్నా హెచ్చరిక మాత్రమేనని, ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. -
ప్రింటింగ్ ప్రెస్‌కు ఆర్టీసీ బైబై
సాక్షి, హైదరాబాద్: అది 50 ఏళ్ల చరిత్ర గల ఆర్టీసీ అనుబంధ సంస్థ.. ప్రస్తుతం నలుగురే దాన్ని మోస్తున్నారు.. మరో 4 నెలల్లో వారూ పదవీవిరమణ చేయనున్నారు.. వారి రిటైర్మెంట్తో పాటు ఆ సంస్థ కూడా శాశ్వతంగా సెలవు తీసుకోబోతోంది.. అలుపెరగకుండా సేవలందించిన ఆ సంస్థే ఆర్టీసీ ముద్రణాలయం.. ఉత్పత్తి పూర్తిగా నిలిపేసి చిన్నాచితకా పనులకే పరిమితమైన ప్రింటింగ్ ప్రెస్‌ను మూసేందుకు రంగం సిద్ధమైంది. యాభై ఏళ్లుగా రవాణా సంస్థతో కలసి సాగుతున్న ఆ ప్రెస్‌తో శాశ్వతంగా బంధాన్ని తెంచుకునేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. దాన్ని మోయలేని భారంగా భావి స్తున్న ఆర్టీసీ వదిలించుకుంటోంది. మున్ముందు అవసరమైన ముద్రణ పనులకు ప్రైవేటుపై ఆధారపడేందుకు ఆసక్తి చూపుతోంది. అందులో పని చేసే ఉద్యోగుల జీత భత్యాలు, సంస్థ నిర్వహణ ఖర్చులను సమస్యగా భావిస్తుండటంతో ప్రభుత్వమూ ఆ విషయంలో జోక్యం చేసుకోనంటోంది. 50 ఏళ్ల క్రితం.. రోడ్డు రవాణా సంస్థకు అనుబంధంగా 50 ఏళ్ల క్రితం ముద్రణాలయం ఏర్పడింది. ఆర్టీసీకి అవసరమైన టికెట్లు, పుస్తకాలు, ఎస్ఆర్ జాబితాలు సహా సంస్థ అవసరాలకు సంబంధించిన అన్ని ప్రతులను ముద్రించేందుకు ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్‌భవన్ ఉన్న ప్రాంతంలో ఈ యూనిట్ ఉండేది. అప్పట్లో బస్‌బాడీ యూనిట్ కూడా ఇక్కడే ఉండేది. 1985లో ప్రస్తుతం ఉన్న చోట్లకు వాటిని తరలించారు. బస్‌బాడీ యూనిట్ ను మియాపూర్‌లో ఏర్పాటు చేయటంతో అక్కడే ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పారు. దానికి 200 మంది కార్మికులను కేటాయించారు. కంప్యూటరీకరణ పెరగడంతో పుస్తకాల ముద్రణ ఆపి సిబ్బంది సంఖ్యను 130కి పరిమితం చేశారు. కొంతకాలంగా ఆర్టీసీ టిమ్స్‌లో వినియోగించే టికెట్ రోల్స్‌పై ఆర్టీసీ లోగో ముద్రించే పనే అందులో నిర్వహిస్తున్నారు. పనిలేదన్న కారణంతో సిబ్బందిని ఇతర విభాగా లకు తరలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న నలుగురు పదవీ విరమణ పొందేవరకు ప్రెస్‌ను కొనసాగించి తర్వాత మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక ఆర్టీసీకి ముద్రణ అవసరం ఉంటే ప్రైవేటు కంపెనీల్లో చేయించాల్సిందే. మూతబడుతున్న యూనిట్లు.. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి సహా జిల్లాల్లోని డిస్పెన్సరీలకు సంబంధించిన ఫార్మసీలను ఇప్పటికే ఆర్టీసీ ప్రైవేటుకు అప్పగించింది. దీని వెనక ఓ రాజకీయ నేత హస్తం ఉందన్న ఆరోపణలు కార్మికుల్లో గుప్పుమంటున్నాయి. తన బంధువుల సంస్థకు ఫార్మసీ బాధ్యతలు అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలొస్తున్నాయి. కార్మికులకు మెరుగైన సేవలందించేందుకు ఫార్మసీ ని ప్రైవేటీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. వరంగల్‌లో ఉన్న ఆర్టీసీ టైర్ రీ ట్రేడింగ్ యూనిట్‌నూ ఇప్పటికే మూసేశారు. అరిగిపోయిన టైర్లు మరికొంత కాలం మన్నేలా రబ్బర్‌ను ఏర్పాటు చేసి వాటిని తిరిగి సిద్ధం చేయటం ఈ యూనిట్ విధి. ఇలాంటి మూడు సంస్థలో ఓ దాన్ని మూసేశారు. మూసే జాబితాలో ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ చేరింది.