ఆర్టీసీ చైర్మన్ భవనంపై సర్కారు కన్ను?
స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు
* ఇటీవల స్వయంగా సీఎం వచ్చి పరిశీలన
* ప్రస్తుతం పోలీసు పహారాలో భవనం
* అత్యంత విలువైన ప్రాంతంలో ఉండటంతో వాణిజ్యపరంగా ఆర్టీసీకి ఉపయోగపడే వీలు
* తీవ్ర నష్టాల్లో ఉన్నందున దాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకోవాలంటున్న ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: నష్టాలు... అప్పులు.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీ జీతాల కోసం ది క్కులు చూస్తుండగా... దాని అధీనంలో ఉన్న అత్యంత విలువైన భూమిపై సర్కారు కన్నేసింది. ఇందులో విలాసవంతమైన భవనంతోపాటు చుట్టూ ఖాళీ స్థలం ఉండటంతో దాన్ని స్వాధీనం చేసుకొని ఇతర అవసరాలకు వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్ కోసం తార్నాకలో ప్రధాన రహదారిపై విశాలమైన భవంతి ఉంది.
దాని చుట్టూ దాదాపు రెండెకరాల స్థలం ఉంది. స్వయంగా సీఎం కేసీఆర్ ఇటీవల ఉన్నట్టుండి ఆ భవన పరిశీలనకు వచ్చారు. ఆయన గతంలో టీడీపీ ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఇదే భవనాన్ని అధికారిక నివాసంగా వినియోగించుకున్నారు. సీఎం ఉన్నట్టుండి భవన పరిశీలనకు రావటంతో అధికారులు కూడా విస్మయం చెందారు. ఆ తర్వాత రోడ్లు భవనాల శాఖ అధికారులు హడావుడిగా అందులో కొన్ని మరమ్మతులు కూడా చేపట్టారు. రెండు రోజుల పాటు సీఎం అందులో సమావేశాలు నిర్వహించి వెళ్లిపోయారు.
దాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా వాడుకోవాలని అప్పట్లో భావించినట్లు సమాచారం. అయితే రెండెకరాలే ఉండటంతో క్యాంపు కార్యాలయానికి అనుకూలంగా ఉండదని రోడ్లు భవనాల శాఖ తేల్చింది. సీఎం కొత్త క్యాంపు కార్యాలయాన్ని ఐఏఎస్ అధికారుల సంఘం స్థలంలో నిర్మించనున్నందున ఈ భవనాన్ని మరోరకంగా వాడుకోనున్నట్టు సమాచారం.
రైల్వే నుంచి స్వాధీనం
నిజాం హయాంలో ఆర్టీసీ, రైల్వే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇది ఆ సంస్థ అధీనంలో ఉండేది. ఆ తర్వాత రైల్వే-ఆర్టీసీ విడిపోయి ఆస్తులు పంచుకున్నప్పుడు ఈ స్థలం ఆర్టీసీ పరమైంది. 4 దశాబ్దాలుగా దాన్ని ఆర్టీసీ చైర్మన్ అధికారిక నివాసంగా వినియోగిస్తున్నారు. కేసీఆర్ సహా కొందరు మంత్రులు, ఆర్టీసీ ఎండీలు కూడా దాన్ని నివాసభవనంగా వినియోగించుకున్నారు. ఉమ్మడి ఆర్టీసీ చివరి చైర్మన్ ఎం.సత్యనారాయణరావు కూడా దాన్ని వినియోగించుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో చైర్మన్ పదవి భర్తీ కాకపోవటంతో కొంతకాలంగా ఇది ఖాళీగా ఉంది. కేసీఆర్ దాన్ని పరిశీలించినప్పటి నుంచి అందులో పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది.
వాణిజ్య అవసరాలకు ఉపయోగం
ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందే క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ స్థలాలను వాణిజ్య సముదాయాలుగా మార్చాలనే ప్రయత్నం జరిగింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్‌భవన్ సమీపంలోని ఖాళీస్థలాన్ని ఓ బడా సం స్థకు ఇందుకోసం కేటాయించినా ఆ తర్వాత ఆ ప్రయత్నం విఫలమైంది. భవిష్యత్తులో మళ్లీ అలాంటి యత్నాలు చేయాలనే యోచనలో ఆర్టీసీ ఉంది. అదే పట్టాలెక్కితే తార్నాకలోని ఈ చైర్మన్ భవనం ఉన్న స్థలం బాగా ఉపయోగపడుతుందని ఆర్టీసీ ఉద్యోగులంటున్నారు.
గతంలోనే ఓ మంత్రి ప్రయత్నం...
కొన్ని నెలల క్రితం నగరానికి చెందిన ఓ మంత్రి ఈ భవనాన్ని నివాసం, క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని యత్నించారు. ఆర్టీసీ అధికారులనూ సం ప్రదించారు. కానీ అది ఆర్టీసీ చైర్మన్ కోసం కేటాయించింది కావటంతోపాటు అత్యంత విలువైన ప్రాంతంలో ఉన్నం దున ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మంత్రి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.