
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో తమ పొట్టకొడుతున్నారంటూ..
సాక్షి, హైదరాబాద్: బస్సు భవన్ ముట్టడికి మంగళవారం ఉదయం భారతీయ మజ్దూర్ సింఘ్(బీఎంఎస్) ఆటో కార్మికులు యత్నించారు. పలు డిమాండ్ల సాధనతో నిరసన ప్రదర్శన చేపట్టారు వాళ్లు. ఈ క్రమంలో బస్‌భవన్ వైపు దూసుకెళ్లే యత్నం చేయగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ.
అయితే ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో.. తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తీసుకొచ్చింది. ఈ క్రమంలో పథకానికి వ్యతిరేకంగా పలు జిల్లాల్లోనూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని, అలాగే తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు వాళ్లు. అలాగే.. ఓలా, ఉబర్ రాపిడోలతో ఇబ్బందులు పడుతున్నామని.. వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆటో కార్మికులు.