సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత ఆర్టీసీ లో మళ్లీ ఉద్యోగుల పదవీ విరమణలు మొదలు కాబోతున్నాయి. డిసెంబర్‌లో 130 మంది, మార్చి నాటికి మరో 500 మంది రిటైర్ కానున్నారు. 2023 మార్చి నాటికి మరో 2 వేల మంది పదవీవిరమణ పొందనున్నారు. జీతాల భారంతో ఇబ్బంది పడు తున్న సంస్థకు ఈ విరమణలు ఊరటనివ్వబోతు న్నాయి. ప్రస్తుతం మొత్తం వ్యయంలో జీతాల వాటా ఏకంగా 53 శాతం ఉండటంతో ఆర్టీసీ ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే.
రెండేళ్లుగా పదవీ విరమణలు లేకపోవటంతో జీతాల చెల్లింపు పెద్ద సమస్యగా మారింది. ఎట్టకేలకు రిటైర్మెంట్లు ప్రారంభం కానుండటంతో క్రమంగా జీతాల బరు వు తగ్గనుంది. రిటైర్మెంట్ సమయంలో ఉద్యో గుల జీతాలు గరిష్ట స్థాయిలో ఉంటాయనేది తెలిసిన విషయమే. కొత్త నియామకాలు కూడా ఉండబో వని ఇప్పటికే ఆర్టీసీ తేల్చి చెప్పినందున భవిష్యత్తు లో జీతాల పద్దు చిక్కిపోవటమే కానీ, పెరగడం ఉండదు. ఒకవేళ వేతన సవరణ చేస్తే మాత్రం భా రం పడుతోంది. కానీ, సిబ్బంది సంఖ్య తగ్గనున్నందున పెంపు భారం కొంత తక్కువే ఉండనుంది.
2019 చివర్లో బ్రేక్
ఉద్యోగుల పదవీ విరమణ వయసును 2019లో ఆర్టీసీ రెండేళ్లు పెంచింది. పదవీ విరమణ ప్రయోజనాలు ఇచ్చే పరిస్థితి లేకపోవటంతో, కొంతకాలం కొనసాగించేందుకు రిటైర్మెంటు వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిందనేది సంస్థ ఉద్యోగుల మాట.
ఏదిఏమైనా ఆర్టీసీ నిర్ణయంతో 2019 చివరి నుంచి రిటైర్మెంట్లు ఆగిపోయాయి. ఇప్పుడు రెండేళ్లు గడవటంతో ఈ డిసెంబర్ నుంచి మళ్లీ పదవీ విరమణలు మొదలు కాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలన్న ఇటీవలి ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్టీసీలో కూడా అమలు చేసే ప్రతిపాదన సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. అదలా ఉండగానే ఇప్పు డు రిటైర్మెంట్లు ప్రారంభం కాబోతున్నాయి.
అదనపు సిబ్బంది సమస్య పరిష్కారం
గతసమ్మె తర్వాత ఆర్టీసీలో వేయికిపైగా బస్సులను తొలగించారు. 1,500 అద్దె బస్సులను కొత్తగా తీసుకున్నారు. వెరసి ఆర్టీసీలో దాదా పు మూడున్నర వేలమంది సిబ్బంది మిగిలిపోయా రు. డిసెంబర్ నుంచి పదవీ విరమణలు మొదలు కానుండటంతో అదనపు సిబ్బంది సమస్య కూడా తగ్గుతూ రానుంది. 2023 మార్చి నాటికి మొత్తం 2,630 మంది పదవీ విరమణ పొందనుండటం, ఇతర అవసరాలు కొన్ని పెరగనుండటంతో ఈ సమస్య సమసిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు.
సెటిల్మెంట్లకు నిధులెలా?
రిటైర్ అయిన ఉద్యోగులకు సగటున రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రయోజనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు సగటున రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు చెల్లించాలి. ఆర్టీసీకి ఇదే సమస్యగా మారింది. డిసెంబర్ నుంచి చెల్లింపులు చేయాల్సి ఉన్నందున డబ్బుల కోసం వెతుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం ఆర్టీసీ రోజువారీ టికెట్ ఆదాయం కొంత పెరిగినా.. అది డీజిల్ ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి.
అలాగని ప్రభుత్వం సాయం చేసే పరిస్థితి కూడా దాదాపుగా లేదు. ఇక బ్యాంకుల నుంచి రుణం పొందటమే మొదటి ఉపాయంగా ఉంది. గత బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.1,500 కోట్లు కేటాయించింది. ఇవి గ్రాంటు కానందున ప్రభుత్వ పూచీకత్తుతో రుణంగా పొందాలి. ఇలా ఇప్పటికే రూ.వేయి కోట్లు తీసుకుంది. మిగతా రూ.500 కోట్లను కూడా అలాగే తీసుకోవాలి. ఇప్పుడు రిటైర్మెంట్ సెటిల్‌మెంట్లు ఆ రూ.500 కోట్లపైనే ఆధారపడాలి. లేదంటే ఆస్తులను తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలి. కాదంటే అవే భూములను లీజుకు ఇవ్వటమో, అమ్మేయటమో చేయటం ద్వారా నిధులు సమకూర్చుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment