ముషీరాబాద్, న్యూస్‌లైన్ :
ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్, కండక్టర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బస్‌భవన్ ముందు ఎమ్మెల్సీ నాగేశ్వర్ నేల మీద కూర్చొని ఏడు గంటల పాటు దీక్ష చేపట్టారు. ఉదయం 9 గంటలకే ఒంటరిగా బస్‌భవన్ వద్దకు చేరుకొని దీక్షలో కూర్చున్నారు. ఆ తర్వాత ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లు ఆయనకు మద్దతుగా బైఠాయించారు. నాగేశ్వర్‌కు మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, సీపీఐ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు బాల సుబ్రహ్మణ్యం, లక్ష్మణ్‌రావు, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూని యన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, అధ్యక్షులు రాజిరెడ్డి, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రచార కార్యదర్శి థామస్‌రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయిబాబు, ప్రధాన కార్యదర్శి సుధాభాస్కర్, రమ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు నరేందర్, అనురాధలతో పాటు పలు సంఘాల నాయకులు ఆయనను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ అక్రమ రవాణాల వల్ల ఆర్టీసీకి రూ. 2 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని, అక్రమ రవాణాను అరికట్టి అందులో పది శాతం ఖర్చు పెట్టినా 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల కడుపు నిండుతుందని అన్నారు.
రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిసినప్పుడు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ రవాణా శాఖ కార్యదర్శి అటువంటి అవకాశమే లేదని చెబుతున్నారని ఇద్దరూ కలిసి కార్మికులను పిచ్చివాళ్లను చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ న్యాయమైన సమస్య పరిష్కారం కోసం నాగేశ్వర్ చేస్తున్న పోరాటానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని.. వచ్చే మా ప్రభుత్వంలో కాంట్రాక్ట్ కార్మికులందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పక్షాన హామీ ఇస్తున్నామన్నారు. బీవీ రాఘవులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, సాయంత్రం 4 గంటల తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్ రావు బృందం ఎమ్మెల్సీ నాగేశ్వర్ వద్దకు వచ్చి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆయన తాత్కాలికంగా దీక్షను విరమించారు.
ఎమ్మెల్సీ నాగేశ్వర్ మెరుపు దీక్ష
Published Sat, Dec 14 2013 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement