mlc nageswar
-
ఎమ్మెల్సీ స్థానాలకు కేసీఆర్ స్కెచ్!
పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ నాయకులను రంగంలోకి దింపాలని సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి, టీ జేఏసీకి మధ్య దూరం చాలా పెరిగిందని వినిపించింది. ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన వాళ్లలో శ్రీనివాస గౌడ్ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా, స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కానీ తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌కి మాత్రం ఏ పదవీ దక్కలేదు. మెదక్ లోక్‌సభ టికెట్ ఆశించినా, ఆయనకు భంగపాటు తప్పలేదు. ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకే దేవీ ప్రసాద్‌కు ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరో స్థానానికి అడ్వకేట్ జేఏసీ నేత రాజేందర్ రెడ్డి, మరో జేఏసీ నేత మల్లేపల్లి లక్ష్మయ్య పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో చూడాలి. 2009లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా కె.నాగేశ్వర్ ఎన్నికయ్యారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున కపిలవాయి దిలీప్ కుమార్ ఎన్నికయ్యారు. వారిద్దరి పదవీ కాలం 2015 మార్చి 29తో ముగియనుంది. ఆయా స్థానాలకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని గులాబి బాస్ స్కెచ్ గీస్తున్నట్లు సమాచారం. -
'కృష్ణా తీరంలో రాజధాని నిర్మిస్తే సహించం'
గుంటూరు:కృష్ణా తీర ప్రాంతంలో రాజధాని నిర్మిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్పష్టం చేశారు. జిల్లాలోని తాడేపల్లి మండలం పినపాకలో శుక్రవారం పర్యటించిన ఆయన.. రాజధాని రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా తీర ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరికాదన్నారు. సింగపూర్ అభివృద్ధితో ఏపీ రాష్ట్ర అభివృద్ధిని పోల్చడం సరికాదని సూచించారు. సింగపూర్ అనేది దేశమైతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమన్న సంగతి ఏపీ సర్కారు గుర్తించుకోవాలన్నారు. బీడు భూములు, మెట్ట ప్రాంతాల్లో రాజధాని నిర్మించుకోవాలని నాగేశ్వర్ సూచించారు. కృష్ణా నది తీరాన ఉన్న పంట పొలాలను వ్యవసాయ క్షేత్రాలుగానే ఉంచాలన్నారు. వాస్తు అనేది రాష్ట్ర నిర్మాణానికి ముఖ్యం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా నాగేశ్వర్ తెలిపారు. -
ఎమ్మెల్సీ నాగేశ్వర్ మెరుపు దీక్ష
ముషీరాబాద్, న్యూస్‌లైన్ : ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్, కండక్టర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బస్‌భవన్ ముందు ఎమ్మెల్సీ నాగేశ్వర్ నేల మీద కూర్చొని ఏడు గంటల పాటు దీక్ష చేపట్టారు. ఉదయం 9 గంటలకే ఒంటరిగా బస్‌భవన్ వద్దకు చేరుకొని దీక్షలో కూర్చున్నారు. ఆ తర్వాత ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లు ఆయనకు మద్దతుగా బైఠాయించారు. నాగేశ్వర్‌కు మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, సీపీఐ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు బాల సుబ్రహ్మణ్యం, లక్ష్మణ్‌రావు, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూని యన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, అధ్యక్షులు రాజిరెడ్డి, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రచార కార్యదర్శి థామస్‌రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయిబాబు, ప్రధాన కార్యదర్శి సుధాభాస్కర్, రమ, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు నరేందర్, అనురాధలతో పాటు పలు సంఘాల నాయకులు ఆయనను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ అక్రమ రవాణాల వల్ల ఆర్టీసీకి రూ. 2 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని, అక్రమ రవాణాను అరికట్టి అందులో పది శాతం ఖర్చు పెట్టినా 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల కడుపు నిండుతుందని అన్నారు. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిసినప్పుడు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ రవాణా శాఖ కార్యదర్శి అటువంటి అవకాశమే లేదని చెబుతున్నారని ఇద్దరూ కలిసి కార్మికులను పిచ్చివాళ్లను చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ న్యాయమైన సమస్య పరిష్కారం కోసం నాగేశ్వర్ చేస్తున్న పోరాటానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని.. వచ్చే మా ప్రభుత్వంలో కాంట్రాక్ట్ కార్మికులందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్షాన హామీ ఇస్తున్నామన్నారు. బీవీ రాఘవులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, సాయంత్రం 4 గంటల తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్ రావు బృందం ఎమ్మెల్సీ నాగేశ్వర్ వద్దకు వచ్చి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆయన తాత్కాలికంగా దీక్షను విరమించారు.