'కృష్ణా తీరంలో రాజధాని నిర్మిస్తే సహించం'
గుంటూరు:కృష్ణా తీర ప్రాంతంలో రాజధాని నిర్మిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్పష్టం చేశారు. జిల్లాలోని తాడేపల్లి మండలం పినపాకలో శుక్రవారం పర్యటించిన ఆయన.. రాజధాని రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా తీర ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరికాదన్నారు. సింగపూర్ అభివృద్ధితో ఏపీ రాష్ట్ర అభివృద్ధిని పోల్చడం సరికాదని సూచించారు. సింగపూర్ అనేది దేశమైతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమన్న సంగతి ఏపీ సర్కారు గుర్తించుకోవాలన్నారు.
బీడు భూములు, మెట్ట ప్రాంతాల్లో రాజధాని నిర్మించుకోవాలని నాగేశ్వర్ సూచించారు. కృష్ణా నది తీరాన ఉన్న పంట పొలాలను వ్యవసాయ క్షేత్రాలుగానే ఉంచాలన్నారు. వాస్తు అనేది రాష్ట్ర నిర్మాణానికి ముఖ్యం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా నాగేశ్వర్ తెలిపారు.