ఎమ్మెల్సీ స్థానాలకు కేసీఆర్ స్కెచ్!
పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ నాయకులను రంగంలోకి దింపాలని సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి, టీ జేఏసీకి మధ్య దూరం చాలా పెరిగిందని వినిపించింది. ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన వాళ్లలో శ్రీనివాస గౌడ్ మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా, స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్గా ఎన్నికయ్యారు.
కానీ తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్కి మాత్రం ఏ పదవీ దక్కలేదు. మెదక్ లోక్సభ టికెట్ ఆశించినా, ఆయనకు భంగపాటు తప్పలేదు. ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకే దేవీ ప్రసాద్కు ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరో స్థానానికి అడ్వకేట్ జేఏసీ నేత రాజేందర్ రెడ్డి, మరో జేఏసీ నేత మల్లేపల్లి లక్ష్మయ్య పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో చూడాలి.
2009లో మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్గా కె.నాగేశ్వర్ ఎన్నికయ్యారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున కపిలవాయి దిలీప్ కుమార్ ఎన్నికయ్యారు. వారిద్దరి పదవీ కాలం 2015 మార్చి 29తో ముగియనుంది. ఆయా స్థానాలకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని గులాబి బాస్ స్కెచ్ గీస్తున్నట్లు సమాచారం.