
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన ఈడీ అధికారుల కమిటీ బస్ భవన్‌లో బుధవారం సమావేశమైంది. సీఎం ఆదేశాలతో కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. దీనిలో భాగంగా రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా రేపు లేదా ఎల్లుండి ఆర్టీసీ కార్మిక నాయకులతో చర్చలు జరుపనున్నారు. రెండు రోజుల్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. నివేదిక సారాంశాన్ని 28న జరిగే విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు వివరించనుంది.
(చదవండి : కార్మికుల డిమాండ్లపై కేసీఆర్ కీలక ఆదేశాలు)
ఇక విలీనం మినహా మిగతా 21 డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయడంతో.. చర్చలకు ఆహ్వానిస్తే వెళ్తేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మరోవైపు ‘విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదు’ అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొనడం గమనార్హం. సమ్మెలో భాగంగా బుధవారం దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘విలీనంపై వెనక్కి తగ్గినట్లు ఎక్కడైనా చెప్పినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం’అని వ్యాఖ్యానించారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 19వ రోజుకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment