
సాక్షి, హైదరాబాద్ : చలో ట్యాంక్‌బండ్ నిరసన కార్యక్రమం విజయవంతమైందని ఆర్టీసీ జేసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ‘కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు. పాదాభివందనాలు’అని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా కార్మికులు ధైర్యంగా నిరసన వ్యక్తం చేశారని కొనియాడారు. విద్యానగర్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ఆయన మీడియాతో మట్లాడారు. చలో ట్యాంక్‌బండ్ నిరసనలో జరిగిన దమనకాండపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేశారు. రేపు మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు పిలవాలని విఙ్ఞప్తి చేశారు.
నలుగురి నిరాహార దీక్ష
ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకులు నలుగురు రేపు (సోమవారం) ఒక్కరోజు నిరాహార దీక్షకు కూర్చుంటారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. 13, 14వ తేదీల్లో ఢిల్లీలో మానవహక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌ను కలుస్తామని చెప్పారు. కార్మికులపై దమనకాండకు నిరసనగా ఈ నెల 18న సడక్ బంద్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్మికులపై దాడికి సంబంధించిన ఫొటోలను ఎగ్జిబిషన్ పెట్టి ప్రదర్శిస్తామని అన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు వీ.హనుమంతరావు, సంపత్‌కుమార్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజుకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment