సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన బస్‌రోకో కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని బీఎన్ నగర్‌లోని ఆయన ఇంట్లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన తన నివాసంలోనే ఉదయం 10 గంటల నుంచి నిరవధిక దీక్ష చేస్తున్నారు. అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష విరమించాలని పోలీసులు ఆయనతో సంప్రదింపులు జరిపినప్పటికీ.. దీక్ష విరమించేది లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆయనను పరామర్శించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డికూడా ఎల్బీనగర్‌లోని రెడ్డి కాలనీలోని తన ఇంట్లో సాయంత్రం 7:30 గంటల నుంచి దీక్షకు కూర్చున్నారు. శనివారం బస్‌రోకో నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో పాటు రాజిరెడ్డిని ఉదయం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. స్టేషన్ నుంచి రాజిరెడ్డిని సాయంత్రం విడిచిపెట్టారు. ఇదిలాఉండగా.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కార్మికుల ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేమని ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ తేల్చిచెప్పారు. కార్మికుల డిమాండ్‌లను పరిష్కరించలేమని శనివారం ఆయన కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముందస్తుగా 219మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment