Professor Kodanda Ram
-
ప్రొ. కోదండరాం ప్రమాణ స్వీకారంపై నేడు క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ కోటా కింద ఎంపికైన కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. కోర్టు ఉత్తర్వులతో ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్లు మండలి సభ్యులిగా ప్రమాణం చేయకుండా ఉండిపోయిన సంగతి తెలిసిందే. గవర్నర్ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులయ్యారు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్లు. అయితే వీళ్ల నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. దీంతో యథాతథస్థితి కొనసాగించాలని (స్టేటస్కో) ఆదేశిస్తూనే.. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బ్రేకులు వేసింది. పిటిషన్ ప్రకారం.. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించడాన్ని వారు సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. పిటిషన్ల విచారణార్హతతో పాటు వాటిలోని వాస్తవాలు, సాంకేతిక అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కొత్తగా గవర్నర్ కోటాలో ఎవరినీ నియమించకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా తోసిపుచ్చింది. అలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వడం చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘పెద్దమనుషుల ఒప్పందం’ (జెంటిల్మెన్ అగ్రిమెంట్) మాదిరి అందరూ హుందాతనం పాటించాలని సూచించింది. కొత్త నియామకాలపై స్టే ఇవ్వండి ఈలోపే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫ్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్‌లను నియమిస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు వెలువరించారు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇందుకు సంబంధించిన జీవో నంబర్ 12ను సవాల్ చేస్తూ హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)లు దాఖలు చేశారు. కొత్త నియామకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఐఏలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. దాసోజు తరఫున సీనియర్ న్యాయవాది అదిత్యా సోదీ వాదనలు వినిపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం హైకోర్టులో విచారణ దశలో ఉండగా కొత్త వారిని నియమించడం సరికాదని ఆయన అన్నారు. పైగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త నియామకాలు చేపట్టబోమని గవర్నర్ పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇది న్యాయస్థానం సూచించిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిందని, వాటిని పరిశీలించిన తర్వాతే గవర్నర్ ఆమోదించారని తెలిపారు. వీరి నియామకం చట్టప్రకారమే జరిగిందని, స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం దీనిపై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కరోజుతో మారిన సీన్ వాస్తవానికి.. ఒక్కరోజు వ్యవధిలోనే సీన్ అంతా మారిపోయింది. కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌లు ప్రమాణ స్వీకారం కోసం మండలికి వెళ్లారు. అయితే.. వారు వెళ్లే సమయానికి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్లో లేరు. దీంతో ఆయన రాక కోసం వారు కౌన్సిల్ హాల్లోనే చాలాసేపు ఎదురు చూశారు. అయినా చైర్మన్ రాకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఆరోగ్యం బాగోలేనందున చైర్మన్ మండలికి రాలేకపోయారని, ఈ నెల 31న ప్రమాణ స్వీకారానికి రావాలని వారిద్దరికీ కౌన్సిల్ నుంచి సమాచారం అందింది. ఈలోపే స్టేటస్కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. -
కేంద్ర గెజిట్‌ను అడ్డుకుందాం
సాక్షి, పంజగుట్ట(హైదరాబాద్): ఈనెల 14నుంచి తెలుగురాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులను, ప్రాజెక్టులను కేంద్రం చేతుల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కేంద్రగెజిట్ను రెండు రాష్ట్రాల ప్రజలు అడ్డుకోవాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రం ఒకవైపు ప్రత్యేకరాష్ట్రంల ఇచ్చి మరోవైపు నీటిహక్కుల్ని లాక్కుంటే ఇక రాష్ట్రమిచ్చిన ప్రయోజనం ఏముందని నాయకులు ప్రశ్నించారు. అందుకే కేంద్ర గెజిట్ ప్రతుల్ని దగ్ధం చేయడంతోపాటుగా ఈ అంశంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు శనివారం మీడియాకు తెలిపారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కృష్ణాలో తెలంగాణకు న్యాయపరమైన వాటా సాధిద్దాం’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. నదీ జలాల పంపకం సరిగ్గా జరగలేదని, ఆంధ్రాలో కేవలం గేట్లు ఎత్తితే నీరు పారుతుందని, తెలంగాణలో ఎత్తిపోతల ద్వారానే నీటిని వాడుకోవాల్సి పరిస్థితి ఉందని వివరించారు. కృష్ణా నీటి పంపకాల్లో వివాదం ఉంటే గోదావరి ప్రాజెక్టులపై కూడా కేంద్ర పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. సీపీఐ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలల ప్రాజెక్టు కాళేశ్వరం కూడా కేంద్రం అధీనంలోకి వెళ్లబోతోందని, ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం పెత్తనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధ్యయన వేదిక కన్వీనర్లు ఎం.రాఘవాచారి, ఎ.రాజేంద్రబాబు, టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్యపద్మ, పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అశ్వత్థామ దీక్ష భగ్నానికి పోలీసుల యత్నం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన బస్‌రోకో కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని బీఎన్ నగర్‌లోని ఆయన ఇంట్లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన తన నివాసంలోనే ఉదయం 10 గంటల నుంచి నిరవధిక దీక్ష చేస్తున్నారు. అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష విరమించాలని పోలీసులు ఆయనతో సంప్రదింపులు జరిపినప్పటికీ.. దీక్ష విరమించేది లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆయనను పరామర్శించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డికూడా ఎల్బీనగర్లోని రెడ్డి కాలనీలోని తన ఇంట్లో సాయంత్రం 7:30 గంటల నుంచి దీక్షకు కూర్చున్నారు. శనివారం బస్‌రోకో నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో పాటు రాజిరెడ్డిని ఉదయం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. స్టేషన్ నుంచి రాజిరెడ్డిని సాయంత్రం విడిచిపెట్టారు. ఇదిలాఉండగా.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కార్మికుల ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేమని ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ తేల్చిచెప్పారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని శనివారం ఆయన కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో స్పష్టం చేశారు. కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముందస్తుగా 219మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (చదవండి : ‘డిమాండ్లు పరిష్కరించం.. చర్చలు జరపం’) (చదవండి : ఆర్టీసీ జేఏసీ నేతల హౌస్ అరెస్ట్) -
ఛలో ట్యాంక్ బండ్‌కు పోలీసుల నో పర్మిషన్..!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష నేతలు మగ్దూం భవన్లో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఛలో ట్యాంక్ బండ్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పినా కూడా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ట్యాంక్‌బండ్‌పై సభకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ కమిషనర్‌ను కోరితే.. నిరాకరించారని వారు వెల్లడించారు. ఛలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ముందస్తు అరెస్టులపై ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు చర్చించారు. కోదండరాం, ఎల్.రమణ, చాడ వెంకటరెడ్డి, కె.నారాయణ, తమ్మినేని వీరభద్రం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఛలో-ట్యాంక్ బండ్ కార్యక్రమానికి అనుమతి కోరినా పోలీసులు ఇవ్వడం లేదు. ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం. ఏదేమైనా శనివారం మధ్యహ్నం చలో ట్యాంక్ బండ్ జరిపి తీరుతామని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ముఖ్యమంత్రికి సోయి రావటం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి విడిపోకుండా.. విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు టీఎస్ ఆర్టీసీకి లేదని ఆయన చెప్పారు. కేంద్రం అనుమతి లేకుండా.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే హక్కు కేసీఆర్‌కు లేదని వెల్లడించారు. కార్మికులకు మద్దతుగా సామూహిక నిరసన దీక్షలకు దిగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. -
పొన్నాల ప్రయత్నాలు ఫలించేనా?
సాక్షి, న్యూఢిల్లీ: జనగామ అసెంబ్లీ సీటు విషయంలో హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనగామ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాల్లో జనగామ సీటు విషయం తేల్చకపోవడంతో.. ఈ సీటును కోదండరామ్‌కు కేటాయించారని ప్రచారం సాగింది. దీంతో పొన్నాల రాహుల్‌గాంధీ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. జనగామ సీటుపై రాహుల్ పొన్నాలకు హామీ ఇచ్చారనీ.. కోదండరామ్ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనగామపై స్పష్టత లేదు.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మీడియాతో శుక్రవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ‘జనగామ సీటు విషయంలో జరుగుతున్న పరిణామాలు సంతృప్తికరంగా లేవు. కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎటూ తేల్చలేదు. సీట్ల పంపకం ఆలస్యమవడం కొంత నష్టం కలిగించేదే. ఈ రోజు సాయంత్రం టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆర్సీ కుంతియా, పొన్నాలతో భేటీ అవుతాను’ అని తెలిపారు. ఏదేమైనా ప్రజాకూటమిగా ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతామని కోదండరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీజేఎస్ అభ్యర్థులకు రేపు బీ-ఫామ్‌లు ఇస్తామని తెలిపారు. టీజేఎస్ 8 సీట్లలో 6 సీట్లపై స్పష్టత వచ్చిందనీ, ఈ సాయంత్రం అభ్యర్థుల్ని ప్రకటిస్తామని తెలిపారు. చాడ వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కోదండరామ్ తెలిపారు. టీజేఎస్ బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ఇద్దరం కలిసి ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఒకటి, రెండు చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని అన్నారు. ప్రచారం అనుకున్నంత వేగంగా సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. -
నిరంతర ఉద్యమాలతోనే హక్కుల పరిరక్షణ
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: ప్రజలు నిరంతర పోరాటాలు చేయడం ద్వారానే హక్కుల పరిరక్షణ జరుగుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం అన్నారు. మానవుల కనీస అవసరాలు, సౌకర్యాల్ని చట్టాల రూపంలో తీసుకువస్తేనే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. దోమలగూడ ఏవీ కళాశాలలో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ తెలంగాణ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌ను పీయూసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రతాప్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. పీయూసీఎల్ రాష్ట్ర కార్యదర్శి జయ వింధ్యాల అధ్యక్షత వహించిన వర్క్‌షాపులో భాగంగా ‘తెలంగాణలో మానవహక్కులు- స్థితిగతులు’ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలకుల అణచివేత చర్యలతో తెలంగాణ ప్రజలు హక్కులు కోల్పోయారని..అయితే, అనేక ఉద్యమాల ద్వారానే స్వరాష్ట్రంతో పాటు, కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సమస్యలు పరిష్కరించుకునే దిశగా, ఓ వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన జరగలేదని చెప్పలేము కానీ, రాష్ట్ర ఏర్పాటుతో కొంత వెసులుబాటు కలిగిందని భావించవచ్చన్నారు. తమ సౌకర్యాల్ని హక్కులుగా పొందే పరిస్థితి ప్రజలకు వచ్చినప్పుడే మంచి మార్పు జరిగినట్లని ఆయనపేర్కొన్నారు. నాణ్యమైన విద్య, వైద్యాలను ప్రభుత్వాలు ఉచితంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది నజీర్‌ఖాన్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, బొబ్బిలి శారద, సోమయ్య, ప్రొఫెసర్ తిప్పారెడ్డి పాల్గొన్నారు.