హైదరాబాద్, సాక్షి: గవర్నర్ కోటా కింద ఎంపికైన కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. కోర్టు ఉత్తర్వులతో ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌లు మండలి సభ్యులిగా ప్రమాణం చేయకుండా ఉండిపోయిన సంగతి తెలిసిందే.
గవర్నర్ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులయ్యారు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్‌లు. అయితే వీళ్ల నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు బీఆర్‌ఎస్ నేతలు. దీంతో యథాతథస్థితి కొనసాగించాలని (స్టేటస్‌కో) ఆదేశిస్తూనే.. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బ్రేకులు వేసింది.
పిటిషన్ ప్రకారం..
గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించడాన్ని వారు సవాల్ చేశారు.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. పిటిషన్ల విచారణార్హతతో పాటు వాటిలోని వాస్తవాలు, సాంకేతిక అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కొత్తగా గవర్నర్ కోటాలో ఎవరినీ నియమించకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా తోసిపుచ్చింది. అలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వడం చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘పెద్దమనుషుల ఒప్పందం’ (జెంటిల్‌మెన్ అగ్రిమెంట్) మాదిరి అందరూ హుందాతనం పాటించాలని సూచించింది.
కొత్త నియామకాలపై స్టే ఇవ్వండి
ఈలోపే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫ్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్‌లను నియమిస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు వెలువరించారు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇందుకు సంబంధించిన జీవో నంబర్ 12ను సవాల్ చేస్తూ హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)లు దాఖలు చేశారు. కొత్త నియామకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను ప్రధాన పిటిషన్‌లో ఇంప్లీడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఐఏలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. దాసోజు తరఫున సీనియర్ న్యాయవాది అదిత్యా సోదీ వాదనలు వినిపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం హైకోర్టులో విచారణ దశలో ఉండగా కొత్త వారిని నియమించడం సరికాదని ఆయన అన్నారు. పైగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త నియామకాలు చేపట్టబోమని గవర్నర్ పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇది న్యాయస్థానం సూచించిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిందని, వాటిని పరిశీలించిన తర్వాతే గవర్నర్ ఆమోదించారని తెలిపారు. వీరి నియామకం చట్టప్రకారమే జరిగిందని, స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం దీనిపై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక్కరోజుతో మారిన సీన్
వాస్తవానికి.. ఒక్కరోజు వ్యవధిలోనే సీన్ అంతా మారిపోయింది. కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌లు ప్రమాణ స్వీకారం కోసం మండలికి వెళ్లారు. అయితే.. వారు వెళ్లే సమయానికి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్‌లో లేరు. దీంతో ఆయన రాక కోసం వారు కౌన్సిల్ హాల్‌లోనే చాలాసేపు ఎదురు చూశారు. అయినా చైర్మన్ రాకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఆరోగ్యం బాగోలేనందున చైర్మన్ మండలికి రాలేకపోయారని, ఈ నెల 31న ప్రమాణ స్వీకారానికి రావాలని వారిద్దరికీ కౌన్సిల్ నుంచి సమాచారం అందింది. ఈలోపే స్టేటస్‌కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment