నిరంతర ఉద్యమాలతోనే హక్కుల పరిరక్షణ
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్: ప్రజలు నిరంతర పోరాటాలు చేయడం ద్వారానే హక్కుల పరిరక్షణ జరుగుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం అన్నారు. మానవుల కనీస అవసరాలు, సౌకర్యాల్ని చట్టాల రూపంలో తీసుకువస్తేనే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. దోమలగూడ ఏవీ కళాశాలలో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ తెలంగాణ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌ను పీయూసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రతాప్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.
పీయూసీఎల్ రాష్ట్ర కార్యదర్శి జయ వింధ్యాల అధ్యక్షత వహించిన వర్క్‌షాపులో భాగంగా ‘తెలంగాణలో మానవహక్కులు- స్థితిగతులు’ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలకుల అణచివేత చర్యలతో తెలంగాణ ప్రజలు హక్కులు కోల్పోయారని..అయితే, అనేక ఉద్యమాల ద్వారానే స్వరాష్ట్రంతో పాటు, కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సమస్యలు పరిష్కరించుకునే దిశగా, ఓ వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణం ఏర్పడిందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన జరగలేదని చెప్పలేము కానీ, రాష్ట్ర ఏర్పాటుతో కొంత వెసులుబాటు కలిగిందని భావించవచ్చన్నారు. తమ సౌకర్యాల్ని హక్కులుగా పొందే పరిస్థితి ప్రజలకు వచ్చినప్పుడే మంచి మార్పు జరిగినట్లని ఆయనపేర్కొన్నారు. నాణ్యమైన విద్య, వైద్యాలను ప్రభుత్వాలు ఉచితంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది నజీర్‌ఖాన్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, బొబ్బిలి శారద, సోమయ్య, ప్రొఫెసర్ తిప్పారెడ్డి పాల్గొన్నారు.