Ola And Uber Down In Fairwork India Rankings 2021: దేశంలోనే యాప్ యూజర్లకు ప్రయాణ సౌకర్యాలు అందించే అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌లుగా ఓలా, ఉబెర్‌లకు పేరుంది. అయితే చాలాసార్లు యూజర్లను ఇవి ముప్పుతిప్పలు పెడుతున్నాయనే ఫిర్యాదులు అందుతుంటాయి. అయితే ఇప్పుడు ఉద్యోగుల వెర్షన్‌లోనూ ఈ రెండింటికి ఎదురుదెబ్బ తగిలింది. ఫెయిర్‌వర్క్2021 ర్యాంకింగ్స్‌లో ఈ రెండు స్టార్టప్‌ల రేంజ్ సున్నాకి పడిపోయింది.
కిందటి ఏడాది ఫెయిర్‌వర్క్2021లో ఓలాకు రెండు, ఉబెర్‌కు ఒక పాయింట్ రేటింగ్ దక్కింది. ఈ ఏడాది ఏకంగా ఈ రెండూ జీరోకి చేరుకోవడం విశేషం. గిగ్ ఎంప్లాయిస్ పట్ల ఈ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనమే ఈ రేటింగ్. అందుకే ఈ ఎదురుదెబ్బ తగిలింది. చాలామంది కంపెనీలు తమకు అందిస్తున్న కమిషన్, బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ఫెయిర్‌వర్క్ నివేదిక వెల్లడించింది. కొన్నిచోట్ల కనీసం వాళ్లను మనుషుల్లా చూడట్లేదన్న ఫీడ్‌బ్యాక్ ఎదురైందని తెలిపింది.
ఇక ఈ లిస్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఏడు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. కిందటి ఏడాది 8 పాయింట్లతో టాప్‌లో నిలిచిన అర్బన్ కంపెనీ.. ఉద్యోగులకు(భాగస్వాములతో) నష్టం చేకూర్చే నిర్ణయం, వాళ్లను రోడ్డుకు ఎక్కించడం, నోటీసులు పంపడం లాంటి చేష్టలతో 5 పాయింట్లతో రెండో స్థానానికి దిగజారింది. ఇక స్విగ్గీ(కిందటి ఏడాది 1) ఈ వియంలో 3 పాయింట్లు మెరుగుపడి ఏకంగా 4 పాయింట్లు దక్కించుకుంది. జొమాటో(కిందటి ఏడాది 1) రెండు పాయింట్లు మెరుగుపర్చుకుని 3 పాయింట్ల రేటింగ్ దక్కించుకుంది.
ఫ్లిప్‌కార్ట్, ఉబెర్, ఒలా, జొమాటో, స్విగ్గీ.. ఇలాంటి డిజిటల్-స్టార్టప్ బేస్డ్ కంపెనీల్లో పని చేసే వాళ్లను గిగ్ వర్కర్స్‌గా గుర్తిస్తారు. వీళ్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉండొచ్చు. వీళ్లకు ఆయా కంపెనీలు ఎలా పట్టించుకుంటున్నాయే స్కేలింగ్ ఆధారంగా లేబర్ స్టాండర్డ్స్ ఆధారిత వెబ్‌సైట్ ఫెయిర్ డాట్ వర్క్ ప్రతీ సంవత్సరం రేటింగ్ ఇస్తుంటుంది. ఈ స్కేలింగ్ పదిపాయింట్లకు ఉంటుంది.
ఈ లిస్ట్‌లో డెలివరీ యాప్ కంపెనీ డుంజో కిందకి దిగజారగా.. అమెజాన్ 2 పాయింట్ల నుంచి 1 పాయింట్‌కు దిగజారింది. అందుతున్న జీతాలు.. ఇతర బెనిఫిట్స్, పని పరిస్థితులు, కాంట్రాక్ట్‌లు, మేనేజ్‌మెంట్ తీరు, ప్రాతినిధ్యాలు, ఇతర సౌకర్యాలు.. వీటి ఆధారంగా ఈ స్కేలింగ్‌ను నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా గిగ్ ఉద్యోగులు 50 లక్షల మందికి పైనే ఉన్నట్లు ఒక అంచనా. ఆయా కంపెనీల నుంచి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కలిగించాలంటూ గిగ్ ఎంప్లాయిస్ యూనియన్లు తరచూ కోర్టు మెట్లు ఎక్కుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది.
Comments
Please login to add a commentAdd a comment