rights protection
-
Srishti Bakshi: గ్రేట్ ఛేంజ్మేకర్
కొన్ని సంవత్సరాల క్రితం...‘ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో తల్లీకూతుళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారు’ అనే వార్త చదివిన తరువాత శ్రీష్ఠి బక్షీ మనసు మనసులో లేదు. కళ్ల నిండా నీళ్లు. బాధ తట్టుకోలేక తాను చదివింది కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకుంది. ‘ఇలాంటివి మన దేశంలో సాధారణం’ అన్నారు వాళ్లు. ఈ స్పందనతో శ్రీష్ఠి బాధ రెట్టింపు అయ్యింది. ఇలా ఎవరికి వారు సాధారణం అనుకోవడం వల్లే పరిస్థితి దిగజారిపోతుంది. ఒక దుస్సంఘటన జరిగితే దానిపై ఆందోళన, ఆవేదన వ్యక్తం అవుతుంది తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు’ అనుకుంది. ఆరోజంతా శ్రిష్ఠి అదోలా ఉంది. ఈ నేపథ్యంలోనే తన వంతుగా ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. మహిళలకు సంబంధించిన భద్రత, హక్కుల గురించి అవగాహన కలిగించడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. దీనికి ముందు రకరకాల కేస్‌స్టడీలు, పరిశోధన పత్రాలు చదివింది. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో అపూర్వ విజయాలు సాధించిన సాధారణ మహిళల గురించి అధ్యయనం చేసింది. బెంగాల్‌లోని ఒక పనిమనిషి సరదాగా యూట్యూబ్‌లో వంటలకు సంబంధించిన రకరకాల వీడియోలను పోస్ట్ చేసేది. కొద్దికాలంలోనే ఆమె యూట్యూబ్ స్టార్‌గా ఎదిగి ఆర్థికంగా బాగా సంపాదించడాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. ఆశీర్వాదం తీసుకుంటూ... తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు వాట్సాప్ కేంద్రంగా దుస్తుల వ్యాపారం మొదలుపెట్టి ఘన విజయం సాధించారు... ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విజయాల గురించి తెలుసుకుంది. ఇలాంటి ఎన్నో విజయగాథలను తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంది. ‘టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు’ అనుకుంది శ్రిష్ఠి బక్షీ. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల గుండా 3,800 కి.మీల పాదయాత్ర చేసింది. ఈ యాత్రలో ఎంతోమంది మహిళలు ఎన్నో సమస్యలను తనతో పంచుకున్నారు. పరిష్కార మార్గాల గురించి లోతైన చర్చ జరిగిదే. ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. తాజా విషయానికి వస్తే... హక్కుల నుంచి సాధికారత వరకు వివిధ విషయాల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన శ్రిష్టి బక్షీని ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక ‘ఛేంజ్మేకర్’ అవార్డ్ వరించింది. 150 దేశాలకు చెందిన 3000 మంది మహిళల నుంచి ఈ అవార్డ్‌కు శ్రిష్ఠిని ఎంపికచేశారు. ‘యూఎన్ ఎస్డీజీ యాక్షన్ అవార్డ్‌ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సోషల్ ఛేంజ్మేకర్స్తో మాట్లాడే అవకాశం లభిస్తుంది. వారి అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాదు సమష్టిగా కూడా సమాజం కోసం పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది’ అంటుంది శ్రిష్ఠి. ‘సమీకరణ, స్ఫూర్తి, ఒకరితో ఒకరు అనుసంధానం కావడం ద్వారా సుందర భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు. మనం ఎలా జీవిస్తే మంచిది అనే విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయి. పునరాలోచనకు అవకాశం ఉంటుంది’ అంటుంది ఎస్డీజీ యాక్షన్ క్యాంపెయిన్ కమిటీ. ఇ–కామర్స్ స్ట్రాటజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రిష్ఠి హాంకాంగ్‌లో పెద్ద ఉద్యోగం చేసేది. ‘నా జీవితం ఆనందమయం’ అని ఆమె అక్కడే ఉండి ఉంటే ‘ఛేంజ్మేకర్’గా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేది కాదు. టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు. ఆ వార్త చదివిన తరువాత తన కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ‘నేనేం చేయలేనా!’ అని భారంగా నిట్టూర్చింది. అంతమాత్రాన శ్రిష్ఠి బక్షీ బాధలోనే ఉండిపోలేదు. బాధ్యతతో ముందడుగు వేసింది... -
విచారణ ఖైదీల వెతలు తీరేదెన్నడు?
దేశంలోని 1350 జైళ్లలో ప్రస్తుతం సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరి స్వేచ్ఛగా జీవించే రాజ్యాంగ హక్కును దృష్టిలో పెట్టుకొని ఇటీవల సుప్రీంకోర్టు ‘సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సీబీఐ) కేసు తీర్పులో పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది. నిందితులకు, విచారణలో ఉన్న ఖైదీలకు బెయిల్ జారీ చేసే విధానాన్ని సరళతరం చేసే ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని ఆదేశించింది. అలాగే పోలీసు అధికారులు ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసే క్రమంలో సీఆర్పీసీలో తెల్పిన సెక్షన్ 41, 41ఏలోని నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ, గతంలో సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసు తీర్పులో తెల్పిన నిబంధనలను పాటించాలని పేర్కొంది. జైలు జీవితం గడుపుతున్న విచారణ ఖైదీలు, వారు చేసిన నేరా నికి విధించే శిక్షా సమయంలో 50 శాతం పూర్తి చేసిన వారిని దేశవ్యాప్తంగా ఉన్న మేజిస్ట్రేట్ కోర్టులు, హైకోర్టులు వారి బెయిల్ దరఖాస్తులను పరిశీలించి ఇతర న్యాయపరమైన నిబంధనలను పరిగణలోకి తీసుకొని తగు ఆదేశాల ద్వారా వారికి రెండు వారాల్లో బెయిల్ మంజూరు చెయ్యాలని ఆదేశించింది. అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిళ్లకు సంబంధించిన నిందితుల దరఖాస్తులను కూడా పరిశీలించి ఆరు వారాల్లో తగు ఆదేశాలను జారీ చేయాలని సూచించింది. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పోలీసు వ్యవస్థలోనే జరుగుతున్నవని గుర్తించి, అనేక సందర్భాల్లో ప్రతిష్ఠాత్మకమైన తీర్పులను సుప్రీంకోర్టు వెలువరించింది. 2015లో ‘డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ కేసు తీర్పులో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన నేరాలు పోలీస్ స్టేషన్లలోనే జరుగుతున్నట్లు గుర్తించి, దేశంలోని అన్ని పోలీస్ ఠాణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతకుముందు 2014లో ‘అర్నేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్’ కేసు తీర్పులో... ఏడు సంవత్సరాల వరకు శిక్షపడే అన్ని నేరాలకు సంబంధించిన నిందితులను ఉన్నట్లుండి అరెస్టు చేసి జైలుకు పంపకూడదని ఆదేశించింది. ఒకవేళ అలాంటి కేసుల్లో నిందితులను అరెస్టు చేయాలంటే అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని ఆదే శించింది. సంబంధిత పోలీస్ అధికారులు సదరు కోర్టుతీర్పు నిబంధనలను అతిక్రమించినట్లయితే కోర్టుధిక్కార నేరం కింద వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని హైకోర్టులను ఆదే శించింది. కోర్టుల్లో కేసుల విచారణకు ఎక్కువ కాలం పట్టడం వల్ల నేరం చేసినవారూ, అమాయకులూ కూడా అన్యాయానికి గురవుతున్నారు. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం. అలాగే పోలీసు వ్యవస్థ, కేసుల నమోదు ప్రక్రియ, కోర్టుల్లో విచారణ వంటివాటిపై ప్రాథమిక అవగాహన కల్పించే పాఠ్యాంశాలు విద్యలో భాగం కాకపోవడమూ మరోకారణం. అందుకే ప్రభుత్వాలు తక్షణం ఈ దిశలో చర్యలు తీసుకుని పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడాలి. (క్లిక్: ‘నడమంత్రపు’ ఎన్నికలకు సన్నాహాలా!) - కోడెపాక కుమారస్వామి సామాజిక కార్యకర్త -
ఓలా, ఉబెర్.. మరీ ఇంత వరెస్టా?
Ola And Uber Down In Fairwork India Rankings 2021: దేశంలోనే యాప్ యూజర్లకు ప్రయాణ సౌకర్యాలు అందించే అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌లుగా ఓలా, ఉబెర్‌లకు పేరుంది. అయితే చాలాసార్లు యూజర్లను ఇవి ముప్పుతిప్పలు పెడుతున్నాయనే ఫిర్యాదులు అందుతుంటాయి. అయితే ఇప్పుడు ఉద్యోగుల వెర్షన్లోనూ ఈ రెండింటికి ఎదురుదెబ్బ తగిలింది. ఫెయిర్‌వర్క్2021 ర్యాంకింగ్స్‌లో ఈ రెండు స్టార్టప్‌ల రేంజ్ సున్నాకి పడిపోయింది. కిందటి ఏడాది ఫెయిర్‌వర్క్2021లో ఓలాకు రెండు, ఉబెర్‌కు ఒక పాయింట్ రేటింగ్ దక్కింది. ఈ ఏడాది ఏకంగా ఈ రెండూ జీరోకి చేరుకోవడం విశేషం. గిగ్ ఎంప్లాయిస్ పట్ల ఈ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనమే ఈ రేటింగ్. అందుకే ఈ ఎదురుదెబ్బ తగిలింది. చాలామంది కంపెనీలు తమకు అందిస్తున్న కమిషన్, బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ఫెయిర్‌వర్క్ నివేదిక వెల్లడించింది. కొన్నిచోట్ల కనీసం వాళ్లను మనుషుల్లా చూడట్లేదన్న ఫీడ్‌బ్యాక్ ఎదురైందని తెలిపింది. ఇక ఈ లిస్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఏడు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. కిందటి ఏడాది 8 పాయింట్లతో టాప్‌లో నిలిచిన అర్బన్ కంపెనీ.. ఉద్యోగులకు(భాగస్వాములతో) నష్టం చేకూర్చే నిర్ణయం, వాళ్లను రోడ్డుకు ఎక్కించడం, నోటీసులు పంపడం లాంటి చేష్టలతో 5 పాయింట్లతో రెండో స్థానానికి దిగజారింది. ఇక స్విగ్గీ(కిందటి ఏడాది 1) ఈ వియంలో 3 పాయింట్లు మెరుగుపడి ఏకంగా 4 పాయింట్లు దక్కించుకుంది. జొమాటో(కిందటి ఏడాది 1) రెండు పాయింట్లు మెరుగుపర్చుకుని 3 పాయింట్ల రేటింగ్ దక్కించుకుంది. ఫ్లిప్‌కార్ట్, ఉబెర్, ఒలా, జొమాటో, స్విగ్గీ.. ఇలాంటి డిజిటల్-స్టార్టప్ బేస్డ్ కంపెనీల్లో పని చేసే వాళ్లను గిగ్ వర్కర్స్‌గా గుర్తిస్తారు. వీళ్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉండొచ్చు. వీళ్లకు ఆయా కంపెనీలు ఎలా పట్టించుకుంటున్నాయే స్కేలింగ్ ఆధారంగా లేబర్ స్టాండర్డ్స్ ఆధారిత వెబ్సైట్ ఫెయిర్ డాట్ వర్క్ ప్రతీ సంవత్సరం రేటింగ్ ఇస్తుంటుంది. ఈ స్కేలింగ్ పదిపాయింట్లకు ఉంటుంది. ఈ లిస్ట్‌లో డెలివరీ యాప్ కంపెనీ డుంజో కిందకి దిగజారగా.. అమెజాన్ 2 పాయింట్ల నుంచి 1 పాయింట్‌కు దిగజారింది. అందుతున్న జీతాలు.. ఇతర బెనిఫిట్స్, పని పరిస్థితులు, కాంట్రాక్ట్‌లు, మేనేజ్మెంట్ తీరు, ప్రాతినిధ్యాలు, ఇతర సౌకర్యాలు.. వీటి ఆధారంగా ఈ స్కేలింగ్‌ను నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా గిగ్ ఉద్యోగులు 50 లక్షల మందికి పైనే ఉన్నట్లు ఒక అంచనా. ఆయా కంపెనీల నుంచి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కలిగించాలంటూ గిగ్ ఎంప్లాయిస్ యూనియన్లు తరచూ కోర్టు మెట్లు ఎక్కుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది. చదవండి: మీరు పార్ట్నర్స్.. మీరే లొల్లి చేయడమేంది? -
భారత్‌లో మొట్టమొదటిసారి.. ఉద్యోగుల మీద దావా!
Urban Company Sues Women Employees: దేశంలో మొట్టమొదటిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందనే చర్చ నడుస్తోంది. సాధారణంగా హక్కుల ఉల్లంఘనల మీద ఉద్యోగులు కంపెనీల మీద కోర్టుకు వెళ్లడం చూస్తుంటాం. అయితే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీనే ఉద్యోగులపై దావా వేసిన ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. గురుగ్రామ్(హర్యానా) నగర వేదికగా హోం అండ్ బ్యూటీ సర్వీసులు అందించే ‘అర్బన్ కంపెనీ’.. మహిళా ఉద్యోగిణులపై కోర్టుకెక్కింది. కంపెనీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు తమ తమ ఆదాయాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయంటూ.. మహిళా ఉద్యోగిణులు రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల నిరసనను వ్యతిరేకిస్తూ unfair labor practices కింద గురుగ్రామ్ జిల్లా కోర్టుకు వెళ్లింది అర్బన్ కంపెనీ. దీంతో ఉద్యోగిణులు ఉన్నపళంగా నిరసనలను విరమించినట్లు సమాచారం. మ్యానిక్యూర్ సేవల నుంచి కార్పెట్ క్లీనింగ్, చిన్న చిన్న రిపేర్లు.. తదితర సేవలను మొబైల్ యాప్ ద్వారా అందిస్తోంది అర్బన్ కంపెనీ. ఇందుకోసం వేల సంఖ్యలో భాగస్వాములతో(ఆడామగా ఉద్యోగులతో) ఒప్పందం చేసుకుంటోంది. అయితే ఆమధ్య కంపెనీ ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దాని ప్రకారం.. సబ్స్క్రిప్షన్ స్కీమ్ తోపాటు భాగస్వాములు(ఉద్యోగిణులు) ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రతి నెలా కనీస సంఖ్యలో ఉద్యోగాలు, కొత్త భాగస్వామ్య వర్గాలు, కస్టమర్ల కోసం తీసుకొచ్చిన తగ్గింపు పథకం పాటించాల్సి వస్తుంది. ఈ పరిమితులన్నింటి వల్ల తమ ఆదాయానికి గండిపడుతోందన్నది ఉద్యోగిణుల(భాగస్వాముల) అభ్యంతరం. భాగస్వామి పాయింట్‌తో కొట్టింది! ఈ కొత్త పాలసీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల కంటే ముందునుంచే.. ‘బెటర్ పే, వర్కింగ్ కండిషన్’ డిమాండ్లతో అక్టోబర్ నుంచే ఉద్యోగిణులు రోడ్డెక్కడం గమనార్హం. సుమారు 50 మంది ఉద్యోగిణులు గురుగ్రామ్‌లోని కంపెనీ ముందు నినాదాలతో రాత్రింబవలు ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ తరుణంలో నలుగురు మహిళా ఉద్యోగిణుల పేర్లను చేర్చి మరీ దావా వేసింది అర్బన్ కంపెనీ. వాళ్ల(ఉద్యోగిణుల) చర్యలను అనైతికం, అన్యాయంగా పేర్కొంది కంపెనీ. పైగా వాళ్లను ఉద్యోగిణులుగా కాకుండా ‘భాగస్వాములు’గా దావాలో పేర్కొనడం కేసును మలుపు తిప్పింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సదరు భాగస్వాములకు(ఉద్యోగిణులకు) లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాదు అర్బన్ కంపెనీ ఆఫీస్ ప్రాంగణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఊహించని ఈ పరిణామంతో మహిళా ఉద్యోగిణులు బుధవారం తమ నిరసనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. తమ నిరసనలు మాత్రం కొనసాగుతాయని దావాలో పేర్కొనబడిన ఓ ఉద్యోగిణి చెప్తుండడం విశేషం. ఇదిలా ఉంటే మహిళా ఉద్యోగిణులను భాగస్వామ్యులుగా ప్రకటించుకుంటూ దేశవ్యాప్తంగా 35 వేల మందితో పని చేస్తోంది అర్బన్ కంపెనీ. భారత్‌తో పాటు అసీస్, సింగపూర్‌లోనూ సేవలిందిస్తోంది. ఇప్పుడు భాగస్వాములనే కారణాన్ని కోర్టులో పేర్కొంటూ.. వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. గిగ్ సెక్టార్లో వణుకు మన దేశంలో యాభై లక్షల మందికి పైగా గిగ్(చిన్న చిన్న పనులు.. ప్రదర్శనలు, ఇతరత్ర సేవలు.. స్టార్టప్ తరహా కంపెనీల్లో) ఎంప్లాయిస్ ఉన్నట్లు ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ చెప్తోంది. వీళ్ల వల్ల గిగ్ ఎకానమీ సమర్థవంతంగా నడుస్తోంది. అర్బన్ కంపెనీ వ్యవహారం ఉద్యోగుల్లో అభద్రత భావాన్ని కలిగిస్తోందని, తద్వారా గిగ్ సెక్టార్‌కు చాలా మంది దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే వీళ్ల హక్కుల రక్షణకు ఎలాంటి చట్టం సమర్థవంతంగా అమలు కావడం లేదు. ఫుడ్ డెలివరీ, రైడ్ ఇలాంటి యాప్స్‌లో పని చేసే ఉద్యోగులకు భద్రత కరువైంది. కరోనా పరిస్థితుల తర్వాత ఇది మరీ ఘోరంగా ఉంటోంది. ఈ తరుణంలో ఈ ఏడాది అక్టోబర్‌లో 35వేలమంది గిగ్ ఎంప్లాయిస్‌తో కూడిన ఓ యూనియన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉబెర్, ఒలా, జొమాటో, స్వీగ్గీ.. ఇలా కంపెనీల నుంచి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కలిగించాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని వేడుకుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ‘సోషల్ సెక్యూరిటీ చట్టం’ను 2020లోనే ప్రతిపాదించినప్పటికీ.. అది ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. -సాక్షి, వెబ్ స్పెషల్ -
హక్కుల రక్షణలో అలసత్వం
దళిత వర్గాల హక్కుల పరిరక్షణకు ఎంతో చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాల పరువు తీసే నిజాలివి. దేశంలో అత్యధిక ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం అమలు తీరును పర్యవేక్షించడంలో, తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని మంగళవారం లోక్‌సభలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌చంద్ గెహ్లోత్ చేసిన ప్రకటన వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. రాజ్యాంగంలోని వివిధ అధికరణలు షెడ్యూల్ కులాలు, తెగల రక్షణకు పూచీపడు తున్నాయి. ముఖ్యంగా 17వ అధికరణ అంటరానితనాన్ని ఏ రూపంలో పాటించినవారైనా శిక్షార్హు లని చెబుతోంది. ఆ అధికరణకు అనుగుణంగా 1955లో అంటరానితనాన్ని నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. దానికి మరింత పదునుపెడుతూ 1976లో పౌరహక్కుల రక్షణ చట్టాన్ని చేశారు. అయితే అందులోని లోపాలను పరిహరిస్తూ 1989లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం వచ్చింది. ఆ చట్టం కింద అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీలు ఏర్పడాలి. రాష్ట్ర స్థాయి కమిటీలు ఏడాదికి కనీసం రెండుసార్లు, జిల్లా స్థాయి కమిటీలు కనీసం మూడు నెలలకోసారి సమావేశం కావాలి. అయితే దేశంలోని 25 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ఈ కమిటీల గురించి పట్టించుకోవడం లేదని గెహ్లోత్ చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తుంది. 2016 మొదలుకొని 2018 వరకూ చూస్తే ఆ కమిటీలు ఒక్కసారైనా సమావేశం కాలేదని ఆయన చెబుతున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో 25 మందితో ఏర్పడే కమిటీలో హోంమంత్రి, ఆర్థికమంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రి తదితరులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు 16 మంది ఉండాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకొని ఉన్నతాధికారులుండాలి. జిల్లా స్థాయి కమిటీల్లో కలెక్టర్, ఎస్పీలతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం అమలు తీరుపై నిఘా వుండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనడం వెనక ముఖ్య కారణముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 1985 జూలై 17న ప్రకాశం జిల్లా కారంచేడులో దళితుల ఊచకోత జరిగింది. దళితులపై అమలవుతున్న అత్యాచారాలను, హత్యాకాండను నిలువరించడంలో పౌర హక్కుల రక్షణ చట్టం దారుణంగా విఫలమవుతున్నదని పలు దళిత, ప్రజా సంఘాలు అప్పట్లో ఆరోపించాయి. మరింత సమగ్రమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశాయి. పార్లమెంటులో సైతం అన్ని పార్టీలూ ముక్తకంఠంతో కోరడంతో పౌర హక్కుల రక్షణ చట్టం స్థానంలో మరో చట్టాన్ని తీసుకు రావాలని నిర్ణయించారు. చివరకు 1989లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం వచ్చింది. కానీ విషాద మేమంటే ఆ తర్వాత మరో మూడేళ్లు గడిచాకగానీ ఆ చట్టానికి సంబంధించిన మార్గ దర్శక సూత్రాలు రూపొందలేదు. ఈలోగా 1991 ఆగస్టులో చుండూరు మారణకాండ చోటు చేసుకుంది. 2014లో ఆ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీలుండాలని భావించడంలో కీలకమైన ఉద్దేశం వుంది. ఆ చట్టం సరిగా అమలు కావడంలేదని, తమను వేధిస్తున్న వారిపై కేసు పెట్టడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని దళితులు ఆరోపిస్తుంటారు. దళితులను వేధించేవారిలో పెత్తందారీ కులాలకు చెందినవారు, స్థాని కంగా డబ్బు, పలుకుబడి ఉన్నవారే అధికం. అందువల్ల సహజంగానే పోలీసులు చూసీ చూడనట్టు ఉండిపోతారు. అవతలివారి నుంచి డబ్బు తీసుకుని రాజీకి రావాలని ఒత్తిళ్లు తెస్తారు, బెదిరిస్తారు. కమిటీలు చురుగ్గా పని చేస్తుంటే కిందిస్థాయి అధికారులు అప్రమత్తంగా వుంటారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలకు సిద్ధపడకపోతే సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందన్న భయం వారిని వెన్నాడు తుంది. అటు పోలీ సుల వద్దా, ఇటు న్యాయస్థానాల్లోనూ కేసులు పెండింగ్ పడినప్పుడు ఏ దశలో, ఎందుకు నిలిచి పోయాయో కమిటీలు పరిశీలించి... ఆ అవరోధాలను తొలగించే ప్రయత్నం చేస్తాయి. ప్రత్యేక కోర్టుల ఏర్పాటులో జాప్యంవల్ల లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడంవల్ల కేసుల విచారణ నత్త నడకన సాగుతున్నదని తేలితే అందుకు అవసరమైన చర్యకు సిఫార్సు చేస్తాయి. నిర్ణీత కాల వ్యవధిలో కమిటీలు సమావేశమవుతుంటే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కానీ మూడేళ్లపాటు 25 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కమిటీలు ఒక్కసారి కూడా సమావేశం కాలేదంటే ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు ఎంతగా అలసత్వం ప్రద ర్శిస్తున్నాయో సులభంగానే తెలుస్తుంది. కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంలో ఆసక్తికరమైన అంశాలున్నాయి. దేశంలో ఒక్క హరియాణా మాత్రమే 2016, 2017 సంవత్సరాల్లో నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించింది. 2018లో ఒకసారి మాత్రమే సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో వరసగా మూడేళ్లూ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు సమావేశమే కాలేదని మంత్రి ఇచ్చిన జవాబు చూస్తే అర్థమవుతుంది. దళితుల విషయంలో చంద్రబాబుకున్న చిన్న చూపేమిటో వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. దేశ జనాభాలో ఎస్సీ కులాలు 16.6 శాతమైతే, ఎస్టీ వర్గాలవారు 8.6 శాతం. ఈ వర్గాలవారు సామాజికంగా ఎదగడానికి, అభివృద్ధి సాధించడానికి వివక్ష, వేధింపులు, దాడులు అవరోధంగా ఉంటున్నాయి. ఆ వర్గాల సంక్షేమానికి వివిధ పథకాలు అమలు చేయడం ఎంత అవసరమో... ఆ వర్గాలు నిర్భయంగా, గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన పరిస్థితులు కల్పించడం కూడా అంతే ప్రధానం. అయితే ఏటా సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల్లోని నిఘా, పర్యవేక్షణ కమిటీల పనితీరుపై ఇస్తున్న సమాచారం నిరాశాజనకంగానే వుంటోంది. ఈ విషయంలో రాష్ట్రాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహ రించాలి. చట్ట నిబంధనల్ని ప్రభుత్వాలే పాటించకపోతే ఇక సాధారణ పౌరుల నుంచి ఏం ఆశించగలం? -
విధులను పాటించాలి
న్యూడిల్లీ: విధులను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా నవభారత నిర్మాణం జరుగుతుందని, అప్పుడు హక్కులకోసం పోరాడాల్సిన అవసరం ఉండదని ప్రధాని మోదీ యువతకు సందేశమిచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న యువతను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భిన్నత్వంలో ఏకత్వమే భారత్ గొప్పదనం. భారత్‌లోని ప్రాంతాలుగానీ, ప్రజలుగానీ తాము వివక్షకు గురయ్యామన్న భావన రాకుండా మనమే చూసుకోవాలి. గత 70 ఏళ్లుగా ప్రపంచం ముందు మనం గొప్పగా నిలబడ్డాం. విధులు సక్రమంగా పాటించడం ద్వారా దీన్ని నిలుపుకోగలం. ఇదే గణతంత్ర దినోత్సవ పరేడ్ వెనుక ఉన్న అసలు లక్ష్యం’ అంటూ ప్రధాని మోదీ యువతకు పిలుపునిచ్చారు. రాజ్‌పాత్‌లో జరుగుతున్న కార్యక్రమం భారత శక్తిని ప్రపంచానికి చూపుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. విలువలు, ఆలోచనలు కలిగిన నవభారత్ను నిర్మించేందుకు శ్రమించాలని యువతకు సందేశం ఇచ్చారు. మీ నుంచి స్ఫూర్తి పొందుతాను.. ‘వివిధ రంగాల్లో మీరు సాధించిన విజయాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంత చిన్న వయసులో మీరు సాధించిన విజయాలు అమోఘం’ అంటూ ప్రధాని మోదీ.. ‘ప్రధానమంత్రి బాల్ పురస్కార్’ అవార్డు పొందిన పిల్లలతో ముచ్చటించారు. శుక్రవారం మోదీ తన నివాసంలో అవార్డు పొందిన పిల్లలను కలిశారు. ‘మీరు చేసిన పనుల గురించి వింటున్న సమయంలో, మీతో మాట్లాడుతున్న సమయంలో.. నేను కూడా స్ఫూర్తిని, శక్తిని పొందుతాను’ అని వ్యాఖ్యానించారు. -
భావ స్వేచ్ఛను కాపాడదాం.
ప్రజాస్వామ్యానికి గీటురాయి అసమ్మతి. భిన్నాభిప్రాయ ప్రకటనకు స్వేచ్ఛ లేకుంటే సామాజిక జీవి తానికి అర్థమే లేదు. కానీ నేడు పరిస్థితి దీనికి భిన్నంగా తయారైంది. నచ్చని భావాలు ప్రకటించే మేధావులు, రచయితల మీద దాడులు చేస్తున్నారు. కుట్ర కేసులు మోపి అక్రమంగా నిర్బంధిస్తున్నారు. ఆధిపత్యశక్తులకు వైవిధ్యమనే జీవన విలువ అంగీకారం కాదు. భావాలను అదుపు చేయాలనుకుంటారు. రచన అంటేనే అసమ్మతి కాబట్టి సృజనకారులపై దాడులు చేస్తున్నారు. బెది రిస్తున్నారు. రచయితలు తమ రచనలను తామే తృణీకరించుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. పాలకుల భావాలపై అసమ్మతి ప్రకటించే స్వేచ్ఛ ఉండాలి. అదే ప్రజాస్వామ్యం. దేశవ్యాప్తంగా మేధావులు, రచయితల అరెస్టుల సందర్భంగా మన సుప్రీం కోర్టు ఇదే చెప్పింది. ‘అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ లాంటిది. దాన్ని అనుమతించకుంటే ప్రజాస్వామ్యమనే ప్రెషర్ కుక్కర్ పేలిపోతుంద’ని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య భావనను బతికించుకుందాం. కులమత లింగ అంతరాలకు అతీతంగా మనిషిని ఉన్నతంగా నిలబెట్టే ఒక సామూహిక స్వరాన్ని వినిపిద్దాం. భావ ప్రకటనా స్వేచ్ఛకై, జీవించే స్వేచ్ఛకై మన గొంతునే ఒక ఉమ్మడి వేదిక చేద్దాం. కలెక్టివ్ వాయిస్ ఆధ్వర్యంలో వివిధ రంగాల మేధావులు, పత్రికా సంపాదకులు, ప్రముఖులు, భాగస్వామ్య సంస్థలతో వినిపిస్తున్న భావ ప్రకటన పరిరక్షణ సామూహిక స్వరంలో గొంతు కలుపుదాం. (భావప్రకటన స్వేచ్ఛ కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సభ) కలెక్టివ్ వాయిస్, హైదరాబాద్ -
నిరంతర ఉద్యమాలతోనే హక్కుల పరిరక్షణ
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: ప్రజలు నిరంతర పోరాటాలు చేయడం ద్వారానే హక్కుల పరిరక్షణ జరుగుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం అన్నారు. మానవుల కనీస అవసరాలు, సౌకర్యాల్ని చట్టాల రూపంలో తీసుకువస్తేనే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. దోమలగూడ ఏవీ కళాశాలలో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ తెలంగాణ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌ను పీయూసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రతాప్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. పీయూసీఎల్ రాష్ట్ర కార్యదర్శి జయ వింధ్యాల అధ్యక్షత వహించిన వర్క్‌షాపులో భాగంగా ‘తెలంగాణలో మానవహక్కులు- స్థితిగతులు’ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలకుల అణచివేత చర్యలతో తెలంగాణ ప్రజలు హక్కులు కోల్పోయారని..అయితే, అనేక ఉద్యమాల ద్వారానే స్వరాష్ట్రంతో పాటు, కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సమస్యలు పరిష్కరించుకునే దిశగా, ఓ వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన జరగలేదని చెప్పలేము కానీ, రాష్ట్ర ఏర్పాటుతో కొంత వెసులుబాటు కలిగిందని భావించవచ్చన్నారు. తమ సౌకర్యాల్ని హక్కులుగా పొందే పరిస్థితి ప్రజలకు వచ్చినప్పుడే మంచి మార్పు జరిగినట్లని ఆయనపేర్కొన్నారు. నాణ్యమైన విద్య, వైద్యాలను ప్రభుత్వాలు ఉచితంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది నజీర్‌ఖాన్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, బొబ్బిలి శారద, సోమయ్య, ప్రొఫెసర్ తిప్పారెడ్డి పాల్గొన్నారు.