అవార్డు అందుకుంటూ...
కొన్ని సంవత్సరాల క్రితం...‘ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో తల్లీకూతుళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారు’ అనే వార్త చదివిన తరువాత శ్రీష్ఠి బక్షీ మనసు మనసులో లేదు. కళ్ల నిండా నీళ్లు. బాధ తట్టుకోలేక తాను చదివింది కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకుంది.
‘ఇలాంటివి మన దేశంలో సాధారణం’ అన్నారు వాళ్లు. ఈ స్పందనతో శ్రీష్ఠి బాధ రెట్టింపు అయ్యింది. ఇలా ఎవరికి వారు సాధారణం అనుకోవడం వల్లే పరిస్థితి దిగజారిపోతుంది. ఒక దుస్సంఘటన జరిగితే దానిపై ఆందోళన, ఆవేదన వ్యక్తం అవుతుంది తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు’ అనుకుంది.
ఆరోజంతా శ్రిష్ఠి అదోలా ఉంది.
ఈ నేపథ్యంలోనే తన వంతుగా ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. మహిళలకు సంబంధించిన భద్రత, హక్కుల గురించి అవగాహన కలిగించడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. దీనికి ముందు రకరకాల కేస్‌స్టడీలు, పరిశోధన పత్రాలు చదివింది. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో అపూర్వ విజయాలు సాధించిన సాధారణ మహిళల గురించి అధ్యయనం చేసింది.
బెంగాల్‌లోని ఒక పనిమనిషి సరదాగా యూట్యూబ్‌లో వంటలకు సంబంధించిన రకరకాల వీడియోలను పోస్ట్ చేసేది. కొద్దికాలంలోనే ఆమె యూట్యూబ్ స్టార్‌గా ఎదిగి ఆర్థికంగా బాగా సంపాదించడాన్ని స్ఫూర్తిగా తీసుకుంది.
ఆశీర్వాదం తీసుకుంటూ...
తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు వాట్సాప్ కేంద్రంగా దుస్తుల వ్యాపారం మొదలుపెట్టి ఘన విజయం సాధించారు... ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విజయాల గురించి తెలుసుకుంది. ఇలాంటి ఎన్నో విజయగాథలను తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంది.
‘టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు’ అనుకుంది శ్రిష్ఠి బక్షీ.
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల గుండా 3,800 కి.మీల పాదయాత్ర చేసింది. ఈ యాత్రలో ఎంతోమంది మహిళలు ఎన్నో సమస్యలను తనతో పంచుకున్నారు. పరిష్కార మార్గాల గురించి లోతైన చర్చ జరిగిదే. ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది.
తాజా విషయానికి వస్తే...
హక్కుల నుంచి సాధికారత వరకు వివిధ విషయాల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన శ్రిష్టి బక్షీని ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక ‘ఛేంజ్‌మేకర్’ అవార్డ్ వరించింది. 150 దేశాలకు చెందిన 3000 మంది మహిళల నుంచి ఈ అవార్డ్‌కు శ్రిష్ఠిని ఎంపికచేశారు.
‘యూఎన్ ఎస్‌డీజీ యాక్షన్ అవార్డ్‌ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సోషల్ ఛేంజ్‌మేకర్స్‌తో మాట్లాడే అవకాశం లభిస్తుంది. వారి అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాదు సమష్టిగా కూడా సమాజం కోసం పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది’ అంటుంది శ్రిష్ఠి.
‘సమీకరణ, స్ఫూర్తి, ఒకరితో ఒకరు అనుసంధానం కావడం ద్వారా సుందర భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు. మనం ఎలా జీవిస్తే మంచిది అనే విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయి. పునరాలోచనకు అవకాశం ఉంటుంది’ అంటుంది ఎస్‌డీజీ యాక్షన్ క్యాంపెయిన్ కమిటీ.
ఇ–కామర్స్ స్ట్రాటజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రిష్ఠి హాంకాంగ్‌లో పెద్ద ఉద్యోగం చేసేది. ‘నా జీవితం ఆనందమయం’ అని ఆమె అక్కడే ఉండి ఉంటే ‘ఛేంజ్‌మేకర్’గా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేది కాదు.
టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు.
ఆ వార్త చదివిన తరువాత తన కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ‘నేనేం చేయలేనా!’ అని భారంగా నిట్టూర్చింది. అంతమాత్రాన శ్రిష్ఠి బక్షీ బాధలోనే ఉండిపోలేదు. బాధ్యతతో ముందడుగు వేసింది...
Comments
Please login to add a commentAdd a comment