illiteracy
-
బయోమెట్రిక్ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు
సాక్షి, వెల్గటూర్(ధర్మపురి): వృద్ధాప్యంలో ఆసరా ఉంటుందని రాష్ట్రప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తోంది. అయితే, కొందరు అక్రమార్కులు వీటిని కాజేస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల కొన్ని ఇలాంటివి వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా వెల్గటూర్ మండలంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో చాలా మోసాలు జరుగుతున్నట్లు వృద్ధులు, నిరక్షరాస్యులు ఆవేదన చెందుతున్నారు. బయోమెట్రిక్ పరికరంలో పింఛన్‌దారుల వేలుముద్రలు తీసుకుని తమ బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమచేసుకుంటున్నారు. వేలుముద్రలు రావడం లేదని పింఛన్‌దారులను ఇళ్లకు పంపిస్తున్నారు. కొందరు అనుమానంతో బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయిస్తే.. అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో అక్రమార్కులను నిలదీస్తే.. ఏవేవో మాయమాటలు చెబుతూ.. పింఛన్‌దారుల డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు. మండల కేంద్రంతోపాటు స్తంభంపల్లి అనుబంధ కొత్తపల్లిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. (చదవండి: స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. కూతురి పెళ్లిరోజే రాష్ట్రస్థాయి పదవి) -
Srishti Bakshi: గ్రేట్ ఛేంజ్మేకర్
కొన్ని సంవత్సరాల క్రితం...‘ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో తల్లీకూతుళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారు’ అనే వార్త చదివిన తరువాత శ్రీష్ఠి బక్షీ మనసు మనసులో లేదు. కళ్ల నిండా నీళ్లు. బాధ తట్టుకోలేక తాను చదివింది కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకుంది. ‘ఇలాంటివి మన దేశంలో సాధారణం’ అన్నారు వాళ్లు. ఈ స్పందనతో శ్రీష్ఠి బాధ రెట్టింపు అయ్యింది. ఇలా ఎవరికి వారు సాధారణం అనుకోవడం వల్లే పరిస్థితి దిగజారిపోతుంది. ఒక దుస్సంఘటన జరిగితే దానిపై ఆందోళన, ఆవేదన వ్యక్తం అవుతుంది తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు’ అనుకుంది. ఆరోజంతా శ్రిష్ఠి అదోలా ఉంది. ఈ నేపథ్యంలోనే తన వంతుగా ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. మహిళలకు సంబంధించిన భద్రత, హక్కుల గురించి అవగాహన కలిగించడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. దీనికి ముందు రకరకాల కేస్‌స్టడీలు, పరిశోధన పత్రాలు చదివింది. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో అపూర్వ విజయాలు సాధించిన సాధారణ మహిళల గురించి అధ్యయనం చేసింది. బెంగాల్‌లోని ఒక పనిమనిషి సరదాగా యూట్యూబ్‌లో వంటలకు సంబంధించిన రకరకాల వీడియోలను పోస్ట్ చేసేది. కొద్దికాలంలోనే ఆమె యూట్యూబ్ స్టార్‌గా ఎదిగి ఆర్థికంగా బాగా సంపాదించడాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. ఆశీర్వాదం తీసుకుంటూ... తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు వాట్సాప్ కేంద్రంగా దుస్తుల వ్యాపారం మొదలుపెట్టి ఘన విజయం సాధించారు... ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విజయాల గురించి తెలుసుకుంది. ఇలాంటి ఎన్నో విజయగాథలను తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంది. ‘టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు’ అనుకుంది శ్రిష్ఠి బక్షీ. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల గుండా 3,800 కి.మీల పాదయాత్ర చేసింది. ఈ యాత్రలో ఎంతోమంది మహిళలు ఎన్నో సమస్యలను తనతో పంచుకున్నారు. పరిష్కార మార్గాల గురించి లోతైన చర్చ జరిగిదే. ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. తాజా విషయానికి వస్తే... హక్కుల నుంచి సాధికారత వరకు వివిధ విషయాల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన శ్రిష్టి బక్షీని ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక ‘ఛేంజ్మేకర్’ అవార్డ్ వరించింది. 150 దేశాలకు చెందిన 3000 మంది మహిళల నుంచి ఈ అవార్డ్‌కు శ్రిష్ఠిని ఎంపికచేశారు. ‘యూఎన్ ఎస్డీజీ యాక్షన్ అవార్డ్‌ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సోషల్ ఛేంజ్మేకర్స్తో మాట్లాడే అవకాశం లభిస్తుంది. వారి అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాదు సమష్టిగా కూడా సమాజం కోసం పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది’ అంటుంది శ్రిష్ఠి. ‘సమీకరణ, స్ఫూర్తి, ఒకరితో ఒకరు అనుసంధానం కావడం ద్వారా సుందర భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు. మనం ఎలా జీవిస్తే మంచిది అనే విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయి. పునరాలోచనకు అవకాశం ఉంటుంది’ అంటుంది ఎస్డీజీ యాక్షన్ క్యాంపెయిన్ కమిటీ. ఇ–కామర్స్ స్ట్రాటజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రిష్ఠి హాంకాంగ్‌లో పెద్ద ఉద్యోగం చేసేది. ‘నా జీవితం ఆనందమయం’ అని ఆమె అక్కడే ఉండి ఉంటే ‘ఛేంజ్మేకర్’గా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేది కాదు. టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు. ఆ వార్త చదివిన తరువాత తన కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ‘నేనేం చేయలేనా!’ అని భారంగా నిట్టూర్చింది. అంతమాత్రాన శ్రిష్ఠి బక్షీ బాధలోనే ఉండిపోలేదు. బాధ్యతతో ముందడుగు వేసింది... -
తల్లిదండ్రుల మీద బతికేటోళ్లకు బంపరాఫర్
తల్లిదండ్రులకు పిల్లలు భారమా?.. ఓ వయసుకి వచ్చేసరికి పిల్లలు తమ కాళ్ల మీద తాము బతకాలని ప్రతీ తల్లీతండ్రి కొరుకుంటారు. కానీ, ఆ వయసు దాటిన తర్వాత కూడా గడపదాటకుండా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతుంటారు కొందరు. కారణాలు ఏవైనా.. ఈ కల్చర్‌ను తగ్గించేందుకు నాలుగున్నర కోట్లకు పైగా జనాభా ఉన్న స్పెయిన్ ఓ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా.. దూరంగా బతికే పిల్లలకు నెలకు 250 పౌండ్లు ప్రభుత్వమే చెల్లించనున్నట్లు ప్రకటించింది. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాన్షెజ్(49) స్వయంగా జాతిని ఉద్దేశించి మంగళవారం ఈ ప్రకటన చేశారు. 18 నుంచి 35 ఏళ్ల వయసులోపు పిల్లలు.. పేరెంట్స్‌కు దూరంగా, విడిగా ఉంటే నెలకు 250 పౌండ్లు(290 డాలర్లు.. మన కరెన్సీలో 21 వేల రూపాయలకు పైనే) ఇస్తామని ప్రకటించారాయన. అయితే ఇందుకు కొన్ని కండిషన్ కూడా పెట్టారు. కేవలం దూరంగా ఉండడం మాత్రమే కాదు.. ఏదైనా పని చేసుకుంటూ ఉంటేనే ఈ అమౌంట్ ఇస్తారట. అందులో ఏడాదికి 23 వేల పౌండ్లు సంపాదిస్తేనే.. ఈ బంపరాఫర్ వర్తిస్తుందని ప్రకటించారాయన. పైగా ప్రభుత్వం ఇచ్చే ఆ 250 పౌండ్లను అద్దె కోసమే ఖర్చు చేయాలని, అదీ రెండేళ్లపాటు ఇవ్వనున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. స్పెయిన్‌లో గత కొన్నేళ్లుగా నిరక్షరాస్యత, నిరుద్యోగం రేటు పెరిగిపోతోంది. ఉద్యోగాలు లేక బద్ధకంగా మారిపోతోంది యువత. దీంతో 30 పడిలో పడ్డా కూడా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతున్నారు. విశేషం ఏంటంటే.. సంపాదించే స్తోమత ఉన్నవాళ్లు సైతం అద్దెను తప్పించుకునేందుకు తమ భార్యాపిల్లలతో తల్లిదండ్రుల ఇళ్లలోకి చేరిపోతున్నారు. మరోవైపు కరోనా ప్రభావంతో చాలా మంది ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్లు సైతం అద్దెను మిగిల్చుకునేందుకు ఇలా తల్లిదండ్రుల పంచన చేరుతున్నారు. సొంత ఇళ్ల కొనుగోళ్ల సంగతి సరేసరి. ఈ కారణాలతో ‘ఇళ్ల మార్కెట్’ సైతం దారుణంగా పడిపోయింది. ఈ పరిస్థితి ఒక్క స్పెయిన్లోనేకాదు.. ఇటలీ, గ్రీస్ ఇలా దాదాపు ఈయూ దేశాల్లో ఇలాంటి సినారియోనే కనిపిస్తోంది. అందుకే స్పెయిన్ ప్రధాని పెడ్రో ‘హౌజింగ్ ప్లాన్’ రూపొందించి.. ఇలా ఆఫర్ల ద్వారా ఆకట్టుకుని హౌజ్ మార్కెటింగ్ ఆదాయం పెంచుకునేందుకు, యువతకు పట్టిన బద్ధకాన్ని వదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: పోర్న్ వీడియోలు.. న్యాయం చేయమంటే ఇలాంటి తీర్పు ఇచ్చారేంటి? -
సగం మందికి సంతకం రాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 35 ఏళ్లు దాటిన వారిలో 48.39 శాతం మంది నిరక్షరాస్యులే ఉన్నారు. అంటే దాదాపు సగం మంది నిరక్షరాస్యులేనన్న మాట. ఇక 50 ఏళ్లు పైబడిన వారిలో 35.85 శాతం మందే అక్షరాస్యులు ఉన్నారు. అంతేకాదు.. జాతీయ సగటు అక్షరాస్యత శాతం 72.98 ఉంటే రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 66.54 ఉంది. జాతీయ సగటు అక్షరాస్యతతో పోలిస్తే 6.44 శాతం తక్కువగా ఉంది. ఈ విషయాన్ని ‘సోషియో ఎకనామిక్ ఔట్లుక్’స్పష్టం చేస్తోంది. జాతీయ స్థాయిలో రాష్ట్రం దిగువ నుంచి మూడో స్థానంలో ఉండటాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం... యువతకు విద్యను అందించడమే కాదు వయోజనులను అక్షరాస్యులను చేసే కార్యక్రమాన్ని సైతం భుజానికెత్తుకుంది. రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యతగల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ నడుం బిగించారు. ఈచ్ వన్ టీచ్ వన్ నినాదాన్ని ఇచ్చి అక్షరయజ్ఞం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో ఎమ్మెల్యేలు సహా ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లోనూ రూ.100 కోట్లు ఇందుకోసమే కేటాయించారు. గతేడాది నుంచే చర్యలు చేపట్టినా.. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం గతేడాదే కార్యాచరణ ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ‘ఈచ్ వన్ టీచ్ వన్’అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొదట గ్రామాలపై దృష్టి సారించింది. రెండో దశ పల్లె ప్రగతిలో గ్రామ పంచాయతీలవారీగా 18 ఏళ్లు పైబడిన వారిలో అక్షరాస్యులు ఎందరు.. నిరక్షరాస్యులు ఎందరు అన్నది గుర్తించేందుకు సర్వే నిర్వహించింది. ఆ తరువాత పైలట్ ప్రాజెక్టుగా ‘స్టూడెంట్–పేరెంట్/గ్రాండ్ పేరెంట్ లిటరసీ’కార్యక్రమాన్ని గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభించింది. ఇందులో విద్యార్థులు తమ తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలకు చదవు చెప్పే కార్యక్రమాన్ని నిర్వహించారు. 1,779 పాఠశాలకు చెందిన 1,38,707 మంది విద్యార్థులు ఇందులో పాల్గొనగా 1,64,068 మంది నిరక్షరాస్యులు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు రెండో దశలో పట్టణాల్లోనూ నిరక్షరాస్యులను గుర్తించి ‘ఈచ్ వన్ టీచ్ వన్’ను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో ప్రజాప్రతినిధులు సహా చదువుకున్న వారందరినీ భాగస్వాములను చేసేందుకు కసరత్తు చేస్తోంది. -
పేదరిక పాట్లు.. నిరక్షరాస్య చీకట్లు
పేదరికం వారి బతుకుల్ని నాగరిక సమాజానికి దూరం చేసింది. బుక్కెడు బువ్వ పెట్టే నేల తల్లిని నమ్ముకుంటే.. వాన చినుకు రాలక బతుకులు ‘సుగ్గి’(వలస) పాలయ్యాయి. బతికేందుకు దారిలేని దుర్భర పరిస్థితుల్లో మగ్గుతున్న వారికి తమ జీవితాల్ని అక్షరం మారుస్తుందన్న నమ్మకం లేకపోయింది. దాంతో చదువుకూ దూరమయ్యారు. భూస్వాములు దోపిడి, పాలకుల అలసత్వంతో అలముకున్న పేదరికం, నిరక్షరాస్యత ఆ పేద జీవితాల్లో మరింత చీకటి నింపింది. అందుకే మూఢనమ్మకాలు, కట్టుబాట్లే జీవితంగా మార్చుకుని వెనుకబాటుతనానికి అలవాటుపడిపోయారు. మగపిల్లాడు పుడితే సమాజంలో గౌరవంగా చూస్తారనే అమాయకత్వంతో అబ్బాయి కోసం ఎంతమంది ఆడపిల్లల్నైనా కనేలా ఒత్తిడి చేస్తారు. పురిట్లోనే ఎందరో తల్లీబిడ్డలు ప్రాణాలు పోతున్నా.. కట్టుబాట్ల ప్రసవాలతో ఆడవాళ్లను ఆస్పత్రి గడప తొక్కనీయరు. మగబిడ్డ కోసం ఎంత మంది ఆడపిల్లల్నైనా పుట్టించుకునే కుటుంబాలు... అప్పటికీ అబ్బాయి పుట్టకపోతే మరో పెళ్లికి సిద్ధమయ్యే మగవాళ్లు.. పిల్లల్ని బడికి పంపడం కంటే కూలికి తీసుకెళ్లడమే వాళ్లకు తెలిసిన నాగరికత. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగూరు, ఆలూరు ప్రాంత పల్లెల్లో దుర్భర పరిస్థితులకు కారణాలు అన్వేషించేందుకు ‘సాక్షి’ బృందం ఆ గ్రామాల్లో పర్యటించింది. మొగిలి రవివర్మ, సాక్షి, కర్నూలు: ఆదోని డివిజన్లోని ఈ పల్లెల దుస్థితిపై మా బృందం అనేక మందిని ప్రశ్నించగా.. ‘కౌతాళం మండలంలోని గోతులదొడ్డి, రౌదూరు గ్రామాలతో పాటు మరికొన్ని ఫ్యాక్షన్ పల్లెల్లో పొట్టేలు మాంసం, మద్యం ఇస్తే హత్యలకు తెగించేవారున్నారు. ఇదంతా పేదరికం వల్ల వచ్చిన దుస్థితి’ అని చెప్పుకొచ్చారు. ఆదోని డివిజన్లోని ఎక్కువ శాతం పల్లెల్లో ఊరినిండా పేదరికం. చేద్దామంటే చేతినిండా పనుండదు. బతకాలంటే వలస పోవాల్సిందే. వర్షాధార పంటలు పండక చుట్టుముట్టిన పేదరికం. వారి బతుకులు ఇంత దారుణంగా ఉండడానికి నిరక్షరాస్యత మరో ప్రధాన కారణం. ఆదోని డివిజన్లోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని నియోజకవర్గాలలోని పల్లెల్లో పర్యటించినప్పుడు.. ఇప్పటికీ ఇలాంటి పల్లెలు ఉన్నాయా! అనిపిస్తుంది. ఉండేందుకు సరైన ఇళ్లు లేవు. పారిశుద్ధ్యంపై అసలు అవగాహన లేదు. కర్ణాటక సరిహద్దులో ఈ గ్రామాలు విసిరేసినట్లుంటాయి. పేదరికంతో చిన్నాభిన్నం ఈ ప్రాంతంలో జనాభా ఎక్కువ! భూమి తక్కువ. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండల జనాభా (2011 ప్రకారం) 69,275 మంది. మండలంలోని వ్యవసాయభూమి 45వేల ఎకరాలు మాత్రమే! ఈ ప్రాంతంలో వ్యవసాయమంటే వర్షాధారమే. సాగునీటి వనరులు అతి తక్కువ! వర్షం వస్తే వేరుశనగ సాగు చేస్తారు. లేదంటే ఆ ఏడాది పంటల్లేక, కూలీ పనులు దొరక్క వలస పోవాల్సిందే. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతోంది. ఒక్కోసారి పదేళ్లలో 7–8 ఏళ్లు వర్షమే ఉండదు. దీంతో ఇంటిల్లిపాది బెంగళూరు, సేలం, గుంటూరుకు వలస పోతారు. ఇప్పటికీ పూరిగుడిసెలు, ప్లాస్టిక్ కవర్లు, నాలుగు రాతి బండల మధ్య ఇళ్లుగా జీవిస్తున్న కుటుంబాలు ప్రతీ పల్లెలో పదుల సంఖ్యలో కన్పిస్తాయి. దొరల పెత్తనంతో దుర్భరం ఇక్కడ దొరల పెత్తనం ఎక్కువ! 30 ఏళ్ల క్రితం వరకూ ఈ పల్లెలన్నీ వారి కనుసన్నల్లోనే నడిచాయి. అన్ని రకాల అరాచకాలు, ఆకృత్యాల వల్ల వీరి బతుకులు మరింత దుర్భరంగా మారాయి. ప్రజలు అక్షరం నేరిస్తే అక్రమాలపై తిరుగుబాటు చేస్తారనే దుర్మార్గపు ఆలోచనలతో టీచర్లను బడికి వెళ్లకుండా అడ్డుకునేవారు. టీచర్లు దొరల ఇంటికెళ్లి సంతకం చేసి, వారి ఇంట్లో సాయంత్రం వరకూ ఉండి వెళ్లిపోవాలి. దీంతో ‘అక్షర వెలుగులు’ ఆ పల్లెల్ని సోకలేదు. ఈ ప్రాంతంలో దేశ ఆర్మీకి మందుగుండు సామగ్రి, తుపాకులు, ట్యాంకర్లు తయారుచేసే పరిశ్రమను ఏర్పాటు చేయాలని కేంద్రం గతంలో ప్రకటించింది. ఉపాధి దొరికితే ప్రజలు ఆర్థికంగా బలపడతారని, దాంతో తమ ఆధిపత్యం పోతుందనే దుర్భుద్దితో ఆ ప్రాజెక్టును అడ్డుకున్నారు. ఇలా ఎన్నో కారణాలతో ఈ ప్రాంతం చాన్నాళ్లు పేదరికం, నిరక్షరాస్యతతో మగ్గిపోయింది. కోసిగి మండలంలో అక్షరాస్యత కేవలం 28.4 శాతమే. నిరక్షరాస్యతలో దేశంలో మూడోస్థానంలో ఉంది. 40 శాతం కంటే తక్కువ ఉన్న మండలాలు కర్నూలు జిల్లాలో 10 వరకూ ఉన్నాయి. చిన్నారులకు శాపం.. మేనరిక వివాహాలు ఆదోని డివిజన్ ప్రాంతంలోని పిల్లల్లో అంగవైకల్యం ఎక్కువగా ఉండడం మేం చూశాం. దానిపై అధికారుల్ని ఆరాతీస్తే.. ఆ కుటుంబాల్లో మేనరిక వివాహాలు ఎక్కువ కావడంతో పిల్లల్లో దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఒకే ఇంట్లో నాలుగైదు తరాలుగా మేనరిక వివాహాలు చేసుకున్నవారూ ఉన్నారు. మేనరికం వల్ల పిల్లల్లో దుష్పరిణామాలు వస్తాయన్న అవగాహన కూడా వారికి లేదు. తరాలు మారుతున్నా కొన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు వీరిని సామాజికంగా, ఆర్థికంగా ముందడుగు వేయకుండా చేశాయి. అందుకు ఒక ఉదాహరణ మూడేళ్ల చిన్నారి ఉష.. కోసిగి మండలం జుమ్మాలదిన్నెలో అమల ప్రవల్లిక కూతురు ఉషా(3)కు లివర్వాపు వ్యాధి సోకింది. కర్నూలులో చూపిస్తే నయం కాలేదు. చివరకు నంద్యాలలో చూపించారు. మూడేళ్ల పాప కేవలం 8కిలోల బరువు మాత్రమే ఉంది. ఇటీవల 1.5 కిలోలు పెరిగింది. ఎందుకని ఆరా తీస్తే మేనరిక వివాహం. అమల తల్లిది మేనరికమే. మగపిల్లల కోసం రెండో పెళ్లికి సిద్ధం కోసిగి, కౌతాళం, మంత్రాలయం మండలాల్లో ఆర్డీటీ(రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు) స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మగపిల్లాడి కోసం దాదాపు 10 మంది ఆడపిల్లల వరకూ కనే కుటుంబాలు, ఆడపిల్లల కోసం రెండో పెళ్లి చేసుకున్న మగవాళ్లున్న కుటుంబాలు 454 వరకూ ఉన్నట్లు తేల్చారు. ‘మగపిల్లాడు పుడితే వంశం నిలుస్తుంది. కొడుకుంటే సమాజంలో గౌరవం’ అని మూఢనమ్మకం కట్టుబాటుగా అమలవుతోంది. అనారోగ్యంతో ఉన్న పిల్లల్ని ఆస్పత్రుల్లో చూపించాలనే కనీస అవగాహన కూడా వారికి లేదు. జబ్బు చేస్తే ఆస్పత్రులకు ఎందుకు వెళ్లడం లేదని కొన్ని కుటుంబాల్ని మేం ప్రశి్నంచగా.. ‘ఆస్పత్రికి వెళ్లం.. అది మా కట్టబాటు’ అన్న సమాధానం వచ్చింది. అబ్బాయిలు బడికి.. అమ్మాయిలు కూలికి మగబిడ్డను బడికి పంపిస్తారు. ఆడపిల్లలైతే కూలికి తీసుకెళ్తారు. ఇదేంటని కొందరి తల్లులను ఆరా తీస్తే ‘ఆడబిడ్డకు సదువెందుకయ్యా! కూలికి పోతే నూటేబై వత్తాది. సుగ్గికి పోతే ఇంగా ఎక్కువొత్తాది!’ అని చెప్పుకొచ్చారు. కొందరు ఆడపిల్లలు ఇంటివద్దే వారి చెల్లెళ్లకు కాపలా ఉంటారు. కోసిగి, వాడి రైలులో రేనిగాయలు అమ్ముతున్న బాలిక ఒకరికోసం ఒకరు ఇంటివద్దే.. జుమ్మాలదిన్నెకు చెందిన శ్రీదేవికి ఐదుగురు ఆడపిల్లలు. మగపిల్లవాడి కోసం ఐదుగురు ఆడపిల్లల వరకూ వేచిచూశారు. వారిలో ఒక్కరూ బడికి వెళ్లడం లేదు. ఎందుకని మా బృందం ప్రశ్నిస్తే.. ‘ రెండో అమ్మాయి కోసం పెద్దపాప నాగవేణిని ఇంటివద్దనే ఉంచాం. మూడో పాప కోసం రెండో అమ్మాయిని ఇంటి దగ్గర పెట్టి పెద్దమ్మాయిని మాతో తీసుకెళ్లేవాళ్లం. అలా ఒకరి కోసం మరొకరిని ఇంటి వద్దే ఉంచాం. దీంతో ఎవరూ బడికెళ్లలేదు.’ అని శ్రీదేవి చెప్పుకొచ్చింది. ఆర్థికంగా చేయూతనివ్వాలి ఈ ప్రాంతంలో పేదరికం వల్ల పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఇక అమ్మాయిల విషయంలో పూర్తి వివక్ష కొనసాగుతోంది. ఆర్థికంగా చేయూత అందితే అప్పుడు చదువుకోవాలన్న ఆసక్తి పెరగడంతో పాటు ఆడపిల్లలపై వివక్ష తగ్గుతుంది. ఈ విషయంలో అందరూ నడుం బిగించి ఆ ప్రాంతాల్లో చైతన్యం తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బడిబాట’ వంటి వాటితో కొంత ప్రయోజనం ఉండవచ్చు. – లక్ష్మణ్ రెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆదోని డివిజన్‌ను ప్రత్యేక ప్రాంతంగా పరిగణించాలి రాష్ట్రంలోనే ఆదోని విద్యాపరంగా వెనుకంజలోఉంది. ఇప్పటికీ పాత భావాలే చలామణిలో ఉన్నాయి. మూఢనమ్మకాలు ఎక్కువ. ఆడపిల్లలంటే చిన్నచూపు. ఆధునిక వైద్యంపై విశ్వాసం లేదు. ఇక్కడ భారీ ఎత్తున చైతన్యం, ఆడ, మగ ఒక్కటే అనే ఉద్యమం తీసుకురావాలి. పేదరిక నిర్మూలన, అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మూఢనమ్మకాల నిర్మూలనకు చైతన్యం కలిగించాలి. ఆ ప్రాంతాన్ని స్పెషల్జోన్గా పరిగణించి చర్యలు తీసుకోవాలి. – గేయానంద్, జనవిజ్ఞాన వేదిక -
బాల్యవివాహాల నిరోధక చట్టం ఇలా..
పశ్చిమగోదావరి, నిడమర్రు : ఆర్థిక అసమానతలు.. నిరక్షరాస్యత.. బాలికలను జాగ్రత్తగా పెంచలేమన్న అభద్రతా భావం.. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న బెంగ.. జిల్లాలో బాల్య వివాహాలు పెరిగేందుకు దోహదపడుతున్నాయి. చట్టాలు ఎన్ని చేసినా ఈ వివాహాలు ఆగడంలేదు. అధికారుల దృష్టికి 10 శాతం మాత్రమే వస్తుండగా.. 90 శాతం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. జిల్లా శిశు సంక్షేమశాఖ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసీపీఎస్) అధికారులు ఆపిన వివాహాలు అతి తక్కువగానే ఉన్నాయి. గత మూడేళ్లుగా జిల్లాలో 227 బాల్య వివాహాలు మాత్రమే అపినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరి లెక్కలోకి రాని వివాహాలు అనేకం ఉంటున్నాయి. ఈ బాల్య వివాహాలను నిరోధించే చట్టం బ్రిటీష్ కాలం 1929 నుంచి అమలులో ఉంది. ఈ చట్టంలో అనేక మార్పులు చేసిన కేంద్రం బాల్య వివాహల నిరోధక చట్టం–2006ను రూపొందించింది. వివాహానికి వయసును బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లుగా ఈ చట్టంలో నిర్ధారించారు. మరి ఈ చట్టం ఏమి చెబుతుందో తెలుసుకుందాం. నేరస్తుల విచారణలో.. 18 ఏళ్ళ వయస్సు పైబడిన వ్యక్తి బాలికను వివాహం చేసుకున్నట్టయితే అటువంటి వ్యక్తి శిక్షార్హుడని చట్టం పేర్కొంటోంది. బాల్య వివాహం నిర్వహించడం, ప్రోత్సహించడం వంటి పనులు చేస్తున్న వారిలో తల్లిదండ్రులు, సంరక్షకులు, ఇతర వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సరే ఈ చట్టంలో శిక్షార్హులుగా నిర్దేశించారు. ఈ తరహా నేరాలకు పాల్పడినవారిలో మహిళలుంటే మాత్రం వారికి జైలుశిక్ష విధించరాదని, జరిమానా రూపంలో శిక్ష విధించాలని ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. బాల్య వివాహం–నేరం–శిక్ష ♦ బాల్య వివాహాన్ని ప్రోత్సహించేవారు, చేసే వారు కఠిన కారాగార శిక్షకు అర్హులు. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ♦ బాల్య వివాహం జరిపి తర్వాత ఆ మైనరు బాలికను అక్రమ రవాణా చేయడానికి/ఆమెను దాచేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. ♦ బాల్య వివాహాలను నిషేధిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ♦ చట్టాన్ని ఉల్లంఘించి, మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఉల్లంఘించి బాల్య వివాహాన్ని ఏ మత సంప్రదాయాలలో జరిపినా ఆ వివాహం చెల్లదు. ♦ ఈ చట్టం కింద నమోదయ్యే కేసులో వారెంట్ లేదా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాన్ని ఆపవచ్చు. ♦ ఈ చట్టం కింద నేరస్తులకు శిక్షతో కూడిన లేదా బెయిలుకు వీలులేని శిక్ష విధిస్తారు. ఈ చట్టం కింద శిక్షార్హులయ్యే వ్యక్తులు ♦ ఇరు పక్షాల తల్లిదండ్రులు / సంరక్షకులు ♦ పురోహితులు ♦ ఇరుపక్షాల ఇరుగు పొరుగువారు ♦ అటువంటి వివాహాలు కుదర్చడానికి బాధ్యత వహించే పెళ్లి సంఘాలు/వ్యక్తులు ♦ ఈ వివాహానికి హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు ♦ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న పెళ్లికొడుకు ♦ సమాచారం అందించేవారి వివరాలు గోప్యంగా.. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు(ఫోన్ నంబర్ 100), మహిళా శిశుసంక్షేమ శాఖ పథకం సంచాలకులు, ఐసీపీఎస్, చైల్డ్‌లైన్(ఫోన్ నంబర్ 1098), తహసీల్దార్, సీడీపీవో, గ్రామస్థాయిలో అయితే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు వెంటనే తెలియజేయవచ్చు. అవసరమైతే సామాజిక సేవా కార్యకర్తలకు కూడా సమాచారం ఇవ్వవచ్చు. సమాచారం అందించినవారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. బాల్య వివాహం వల్ల వచ్చే సమస్యలు ♦ అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకముందే, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండకముందే వివాహం చేయడం వారి ఆరోగ్యానికి అంత క్షేమకరం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ♦ ప్రధానంగా స్త్రీలు త్వరగా రక్తహీనతకు గురికావడం, అనారోగ్య శిశువులు జన్మించడం, అవయవ ఎదుగుదల లేకపోవడం, శిశు మరణాలు ఎక్కువగా జరగడం ♦ త్వరగా గర్భం దాల్చడంవల్ల వారు త్వరగా బలహీనంగా మారతారు. ఆమెకు పుట్టే బిడ్డకు జన్యుపరమైన సమస్యలతోపాటు, పోషకలోపాలతో జన్మించడం. ♦ అధిక సంఖ్యలో గర్భస్రావాలు, మాతృ శిశు మరణాలు జరుగుతున్నట్టు వివిధ సర్వేలు చెపుతున్నాయి. ♦ దంపతుల మధ్య అవగాహన లోపంతో కుటుంబంలో కలహాలు రావడం, త్వరగా విడిపోయే అవకాశం. ♦ మానసిక సరిపక్వత లేక చిన్న సమస్య తలెత్తినా ఆత్మహత్యలకు ప్రయత్నించడం. ♦ కుటుంబ హింసకు, లైంగిక హింసకు ఇంకా పలు సమస్యలు బారిన పడే అవకాశం ఉంది. -
మూడు ముళ్ల బాల్యం
రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది బాల్య వివాహ బాధితుల దుస్థితి ఇదీ. ఆడపిల్లను బాధ్యత, బరువుగా భావిస్తున్న తల్లిదండ్రులు.. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా పాఠశాల చదువుకూడా పూర్తికాకుండానే అమ్మాయిలకు పెళ్లి చేసేస్తున్నారు. వారికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు, బంధువులు ఒత్తిడి చేసి బలవంతంగా పెళ్లి పీటల మీద కూర్చోబెడుతున్నారు. పెళ్లి, సంసారం, జీవితమంటే ఏమిటో పూర్తిగా తెలియని వయసులోనే బంధాల బాధ్యతల్లో బందీ అవుతున్నారు. దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో 1.5 కోట్ల మందికి బాల్య వివాహాలు జరగగా.. అందులో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఉన్నట్లు ఎంవీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో గత మూడేళ్లలో 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో 19.4 శాతం మందికి, అబ్బాయిల్లో 4.7 శాతం మందికి బాల్య వివాహం జరిగినట్లు తేలింది. ఎంవీ ఫౌండేషన్ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు, పాఠశాలలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పలు ప్రభుత్వ విభాగాల నుంచి సమాచారం సేకరించింది. బాల్య వివాహాలు చేసుకున్నవారిలో 46 మందిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి.. వారి ప్రస్తుత పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది. నిర్బంధ పరిస్థితులు బాల్య వివాహం జరిగిన అమ్మాయిల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. వారు సంసారం, కుటుంబం, పిల్లల బరువు బాధ్యతలతో ఓ వైపు.. ఆరోగ్య సమస్యలతో మరోవైపు కొట్టుమిట్టాడుతున్నారు. తమ ఆరోగ్య సమస్యల గురించి భర్తకు చెప్పుకోలేని నిర్బంధ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కూలీ పనో, ఏదైనా ఉద్యోగమో చేసి సంపాదించడానికి తోడు కుటుంబంలోని అందరికీ పనులు చేసి పెట్టడం, చాకిరీ చేయడం తప్పడం లేదు. దేనికి నిరాకరించినా భర్త, అత్తమామల దాడులకు గురికావాల్సి వస్తోంది. కొందరైతే కుటుంబ సభ్యుల నుంచే లైంగిక దాడులకూ గురవుతున్నారు. ఈ బాధలన్నీ పడలేక చాలా మంది ఆత్యహత్యాప్రయత్నాలు కూడా చేసినట్లు సర్వేలో వెల్లడైంది. పాలమూరు టాప్.. కరీంనగర్ లాస్ట్ బాల్య వివాహాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల బాల్య వివాహాలు జరిగితే.. మహబూబ్‌నగర్‌లోనే 26.2 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాల్లో నల్లగొండ (21.5 శాతం), రంగారెడ్డి (21.1 శాతం), ఖమ్మం, మెదక్ (21 శాతం), వరంగల్ (18 శాతం), ఆదిలాబాద్ (17.8 శాతం), నిజామాబాద్(16.3 శాతం), కరీంనగర్ (14.2 శాతం) జిల్లాలు ఉన్నట్టు ఎంవీ ఫౌండేషన్ సర్వేలో వెల్లడైంది. ఆమె పేరు రమ్య.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ బస్తీలో ఉండే ఆమెకు 14 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. సంసారం అంటే ఏమిటో పూర్తిగా తెలియని స్థితి. పెళ్లయిన తొలిరాత్రే తీవ్ర నరకాన్ని అనుభవించింది. భర్త రోజు కూలీ. రోజూ మద్యం తాగి రావడం, వంట సరిగ్గా చేయలేదనో, డబ్బులు అడుగుతోందనో కొట్టడం, వేధించడం.. పెళ్లయిన ఈ రెండేళ్లలోనే రెండు కాన్పులు. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో తొలికాన్పులో పుట్టిన పాప ఆరోగ్యం సరిగా లేక చనిపోయింది. రెండో కాన్పులో పుట్టిన పాప ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు. భర్త, అత్తమామలు పట్టించుకోరు. ఏం చేయాలో తెలియని ఆవేదనలో కొట్టుమిట్టాడుతోంది.. ఆమె పేరు పరమేశ్వరి.. వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలు. 14 ఏళ్లకే మేనబావతో పెళ్లి చేసేశారు. కొద్దిరోజులకే గర్భం దాల్చింది. చిన్న వయసు, సరైన పోషకాహారం లేక శిశువు సరిగా ఎదగలేదు. పుట్టగానే చనిపోయింది. మరోసారి కూడా ఇలాగే జరిగింది. కొద్దినెలలకే మూడోసారి గర్భం దాల్చింది. ఈ సారి కడుపులో బిడ్డ సరిగా పెరగడం లేదని, ఇన్ఫెక్షన్ సోకిందని గర్భసంచి తీసేశారు. ఇక పిల్లలు పుట్టరనే ఆగ్రహంతో పరమేశ్వరిని భర్త, అత్తమామలు హింసించడం మొదలుపెట్టారు. రెండేళ్ల నుంచి నరకయాతన పడుతోంది.. – సాక్షి, హైదరాబాద్ బాల్య వివాహంతో ఎంతో యాతన - బాల్య వివాహం జరిగిన బాలికల్లో 67 శాతం మంది తమ సమస్యలను భర్తకు చెప్పుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. - 90% మంది బాధితులకు అనారోగ్య సమయంలో ఎలాంటి సహాయం అందడం లేదు. - 73% మంది భర్తలు నిత్యం మద్యం తాగడం, దాడికి పాల్పడడం చేస్తున్నారు. మిగతావారిలోనూ చాలా మంది తరచూ మద్యం తాగుతున్నారు. - 91% మంది భర్తలు రాత్రి 12 గంటల తర్వాత ఇంటికి వస్తున్నట్లు సర్వేలో తెలిసింది. - 85% బాధిత మైనర్లు పుట్టింటికి వెళ్లడానికి కూడా సరిగా అవకాశం ఉండడం లేదని సర్వేలో వెల్లడించారు. - 89% మంది బాధితులు కూలి పని చేయాల్సి వస్తోంది. భర్త చేతిలో భౌతిక దాడులకు గురవుతున్నారు. - 71% మంది అత్తమామల ద్వారా వేధింపులకు గురవుతున్నారు. - 78% మంది బాధిత అమ్మాయిలు గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్నారు. - 15% మంది మానసికంగా కుంగిపోయారు. 37% మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. - అసలు ఏ ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడవలేదు. - బాల్య వివాహ బాధితుల్లో 59% మంది పెళ్లికి ముందు దినసరి కూలీలుగా పనిచేసినవారేనని.. పెళ్లి తర్వాత కూడా 41% మంది కూలిపనికి వెళుతున్నారని సర్వేలో తేలింది. అంతా 8, 10 తరగతి లోపే.. బాల్య వివాహాలు జరిగినవారిలో చాలా మంది 13 నుంచి 15 ఏళ్లలోపు వారే. 8వ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న సమయంలోనే బలవంతంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత చదువుకునే అవకాశం కేవలం 3% మందికే లభించింది. బాల్య వివాహాలు జరిగినవారిలో 83% మంది భర్తతో కలసి ఉండగా.. 11% మంది వేరుగా ఉంటున్నారు. 4% మంది విడాకులు తీసుకున్నారు. 2 శాతం మంది వితంతువులున్నారు. ఆడపిల్లను కంటే వేధింపులు జరిగిందే బాల్య వివాహం. ఆపై ఆడపిల్ల పుట్టిందంటే ఇక వేధింపులే. బాల్య వివాహాలు జరిగిన అమ్మాయిల్లో 62 శాతం మంది తొలికాన్పులో ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఇలాంటి అమ్మాయిల్లో 74 శాతం మంది అత్తమామల అసంతృప్తి, వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే విధంగా 50 శాతం మంది భర్తలు వేధింపులకు దిగుతున్నారు. ప్రసవించి నాలుగైదు నెలలు కాకుండానే కూలి పనులకు పంపిస్తున్నారు. సంపాదించిన డబ్బును కూడా భర్త, అత్తమామలే తీసుకుంటున్నారు. డబ్బులు అడిగితే దాడులు సైతం ఎదుర్కోవాల్సిన దుస్థితి ఉంది. అధికశాతం బీసీలే.. బాల్య వివాహాలు జరిగిన వారిలో అత్యధికం వెనుకబడిన తరగతుల వారే. బాల్య వివాహాల్లో 43 శాతం బీసీ కులాలకు చెందినవారుకాగా.. 36 శాతం షెడ్యూల్ కులాలు, 15 శాతం గిరిజన తెగలకు చెందిన వారున్నట్టు సర్వేలో వెల్లడైంది. చట్టాలున్నా చట్టుబండలే..! బాల్య వివాహాల నియంత్రణకు 2006లో కఠిన చట్టం తీసుకువచ్చారు. దానికితోడు జువైనల్ జస్టిస్ చట్టం, బాలల లైంగిక వేధింపుల నియంత్రణ చట్టం, విద్యాహక్కు చట్టం.. ఇలా అనేక చట్టాలున్నా బాల్య వివాహాలు మాత్రం పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. రోజురోజుకూ ఆధునికత, టెక్నాలజీ, విద్యాభివృద్ధి పెరుగుతున్నా ఇప్పటికీ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. పేదరికం, నిరక్షరాస్యతే కారణం కడు పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల్లోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కుటుంబాల్లో 79 శాతం కుటుంబాల ఏడాది సంపాదన రూ.50 వేలలోపే ఉంటోంది. 16 శాతం కుటుంబాల్లో రూ.51 వేల నుంచి రూ.75 వేల ఆదాయం ఉంటోంది. కేవలం 5 శాతం కుటుంబాలు మాత్రమే రూ.లక్షకుపైగా వార్షికాదాయం ఉన్నవారు. ఇక తల్లిదండ్రుల్లో పెద్దగా చదువుకున్న వాళ్లు లేకపోవడం సైతం బాల్య వివాహాలకు కారణమవుతోంది. ఇలాంటి వివాహాలు జరుగుతున్న కుటుంబాల్లో 91 శాతం మంది తల్లిదండ్రులు నిరక్షరాస్యులే. ఆరు శాతం మంది 5వ తరగతి వరకు, మూడు శాతం మంది ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. -
వివాహ బంధనం
పేరు అంజనమ్మ(19). రాయచోటిì ప్రాంతం. ఆమెకు ఐదేళ్ల క్రితంవివాహమైంది. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులదికర్ణాటకలోని బళ్లారి. భర్త పనుల కోసం దూరప్రాంతాలకు వెళ్లి వచ్చేవాడు. ఆమెకు సరైనఆహారం అందక కాన్పు కూడా కష్టమైంది.అతికష్టం మీద బతికి బయట పడింది.చిన్న వయసులో వివాహం చేయడంతోపాపను ఎలా చూసుకోవాలో తెలిసేది కాదు. దగ్గరలోని అంగన్వాడీ కేంద్రానికివెళ్లడం వల్ల ఇప్పుడిప్పుడే విషయాలు తెలుసుకుంటోంది.నా బిడ్డను బాగా చదివించి వివాహ వయసు వచ్చిన తర్వాతేవివాహం చేస్తానని చెబుతోంది. వివాహం.. జీవితాంతం మిగిలే తీపి గుర్తు.. పెళ్లితో వ్యక్తిగత సంబంధం బాధ్యతల బంధం.. .అనుబంధాల హరివిల్లుగా పెనవేసుకుంటాయి.. ఇది మరిచిపోలేని అనుభవం. ఇది నాణేనికి ఒకవైపు చిత్రం. మరో వైపు పరికిస్తే.. బాల్య వివాహం జీవితానికో శాపం. అనారోగ్యానికి హేతువు. వ్యక్తిగత స్వాతంత్య్రానికి విఘాతం. చదువుకునే వయసులో సంసార బాధ్యతల చట్రంలో పిల్లలు చిక్కుకుంటారు. కాలంతోపాటు ఆధునికత కొత్త పుంతలు తొక్కుతున్నా బాల్య వివాహాల జాడ్యం సమాజాన్ని వదల్లేదు. నిరక్షరాస్యత, అవగాహన లోపం, సంప్రదాయం, మూఢ నమ్మకాలే ఇందుకు పునాదులవుతున్నాయి. జిల్లాలో రాయచోటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పురుషునికి 21 ఏళ్లు, స్త్రీకి 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయరాదని చట్టం చెబుతోంది. కానీ పాఠశాల వయస్సులోనే పెళ్లి పీటలు ఎక్కుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఇది మారుమూల గ్రామాల్లో అధికంగా చోటుచేసుకుంటోంది. బాల్య వివాహాల విషయంలో ప్రచార లోపమే బాలికలకు శాపంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రుల నిరక్షరాస్యత.. పూర్తిగా అవగాహన లేకపోవడం, చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడమే బాల్య వివాహాలు జరగడానికి ప్రధాన కారణం. సర్వోన్నత న్యాయస్థానం బాల్య వివాహాల విషయంలో చాలా కఠినంగా తీర్పులు ఇచ్చినా యంత్రాంగంలో కదలిక లేకపోవడం శోచనీయం. బాల్య వివాహాలపై సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషియల్ స్ట్రాటజీ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. సంస్థ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇవే అనర్థాలు బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్నతనంలో గర్భం దాల్చడం వల్ల ప్రసవ సమయంలో ఎక్కువ సమస్యలు ఎదురవుతాయని పేర్కొంటున్నారు. తల్లీబిడ్డలు ఇద్దరికీ ప్రాణహాని ఎక్కువగా ఉంటుందని, బిడ్డ వైకల్యంతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురై తీవ్ర ఇబ్బందులు పడతారని అంటున్నారు. చిన్నతనంలో కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకోవాల్సి రావడంతో ఎక్కువ శాతం మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతారన్నారు. మెదడు, ఇతర శరీర అవయవాలు సరిగా పరివర్తన చెందకముందే వివాహం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అవగాహన లోపంతో చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పౌష్టికాహారం తీసుకుంటూ చక్కగా చదువుకోవాల్సిన సమయంలో వివాహం జరగడం వల్ల దూషణ, హింస, అవమానాలకు గురి కావాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. బాల్య వివాహాలకు కారణాలు తల్లిదండ్రులు బాలికకు ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత త్వరగా తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తారు. చిన్నప్పుడే వివాహం చేస్తే తమకు నచ్చిన వాడికి ఇవ్వవచ్చని, తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందన్న భావన తల్లిదండ్రుల్లో నెలకొంది. పెద్దయ్యాక వివాహం చేస్తే వ్యక్తిగత అభిప్రాయాలు, అధిక కట్నాలు ఇవ్వాల్సి వస్తుందన్న భయం ఉంది. వయస్సుకు వచ్చిన యువతి ఇంటిలో ఉంటే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా యువతి భవిష్యత్తుకు వివాహం ఒక ప్రధాన మార్గమన్నది తల్లిదండ్రుల నమ్మకం. ఇంటిలో పెద్దలు, వృద్ధులు మనవరాళ్ల వివాహాలను కళ్లారా చూడాలని తొందర పెట్టడం, మేనరిక సమస్యలు. నిరక్షరాస్యత, అవగాహన లోపం, బాల్య వివాహ నిషేధ చట్టం అమలు కాకపోవడం, కుటుంబాల్లో సరైన నిబద్ధత కనిపించకపోవడం తదితర కారణాలు తల్లిదండ్రులను వేధిస్తున్నాయి. చట్టం ఏం చెబుతుందంటే... ♦ 2006లో బాల్య వివాహాల నిషేధ చట్టంలోని జీఓ నెంబర్. 13 ప్రకారం 18 ఏళ్లు నిండని బాలికలకు వివాహాలు చేస్తే కఠినంగా శిక్షించవచ్చు. ♦ వివాహం చేసే పురోహితుడు, పాస్టర్, ఖాజీను వెంటనే అరెస్టు చేసే అధికారం ఈ చట్టం ద్వారా వచ్చింది. వీరికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమాన విధించవచ్చు. ♦ బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిని కూడా కఠినంగా శిక్షించవచ్చని చట్టం చెబుతోంది. ♦ 1923 బాల్య వివాహాల చట్టం కన్నా 2006లో చేసిన చట్టం కూడా కఠినమైంది. బాల్య వివాహాల నిర్మూలన విషయంలో యంత్రాంగానికి సర్వహక్కులు కల్పించారు. కానీ అధికారుల అలసత్వంతో చిన్నారుల నిండు జీవితం నాశనమై పోతోంది. ఐసీడీఎస్దే కీలకపాత్ర బాల్య వివాహాలను అడ్డుకోవడంలో స్త్రీ శిశు సంక్షేమశాఖదే కీలకపాత్ర. అంగన్వాడీ కార్యకర్తలు బాల్య వివాహాలను గుర్తిస్తే ఉన్నతాధికారులతోపాటు పోలీసులకూ సమాచారం ఇవ్వాలి. బాల్య వివాహంపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసే అధికారం అంగన్వాడీ కార్యకర్తలకు ఉంది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఉంది. బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారం ఉంటే నేరుగా ఛైల్డ్‌లైన్ 1098 నంబరుకు లేదా పోలీసు డయల్ యువర్ 100కు ఫిర్యాదు చేయవచ్చు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. నాకు 13 ఏళ్లకే పెళ్లి చేశారు. నాకు కానీ, నా భర్తకు కానీ బతకడానికి ఏ ఆధారం లేదు. దీనికి తోడు వివాహం అయిన ఏడాదిలోనే గర్భం దాల్చాను. ప్రసవ సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను. అధికంగా రక్తస్రావం అయింది. తల్లీబిడ్డ ఇద్దరికీ కష్టమేనని చెప్పడంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులంతా దిగులు చెందారు. ఎలాగోలా దేవుడి దయతో బతికి బయటపడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 4 ఏళ్లుగా ఏదో రకంగా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నాను. – రాయచోటి శివారు కాలనీకి చెందిన వివాహిత మా తల్లిదండ్రులు కేరళలో కూలిపనులకు వెళ్లాలన్న కారణంతో నాకు 14 ఏళ్లకే పెళ్లి చేశారు. పెళ్లి అయిన ఏడాదికే గర్భం దాల్చాను. ప్రసవ సమయంలో భర్త , అత్తమామలు ఐసీయూలో వైద్యం ఇప్పించి తల్లీబిడ్డలను కాపాడుకున్నారు. చదువుకోకపోవడం వల్లనే మా అమ్మానాన్నలు చెప్పిన విధంగా , వారు చేసినప్పుడే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం నెలలో సగం రోజులు అనారోగ్యంతో బాధపడుతూ, మరో సగం రోజులు భర్తతో కలిసి పనులు చేస్తూ పాపను పోషించుకుంటున్నాను. –సుండుపల్లె మండలానికి చెందిన వివాహిత మా కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో నన్ను 15 ఏళ్లకే లారీ డ్రైవర్‌కు ఇచ్చి వివాహం చేశారు. మా ఇద్దరి వయస్సులో కూడా చాలా (8సంవత్సరాలు) తేడా ఉండేది. అయితే వివాహం అయిన 3 సంవత్సరాలకే రోడ్డుప్రమాదంలో నా భర్త చనిపోయారు. అప్పటి నుంచి నా జీవితం అంధకారంలో ఉండిపోయింది . అత్తమామల ఇల్లు వదిలి, అమ్మానాన్నల దగ్గరే ఉంటున్నాను. చదువుకోవాలన్న ఆలోచన రావడంతో దూరవిద్య కేంద్రం ద్వారా డిగ్రీ చదువుకుంటున్నాను. గతంలోనే నన్ను మా వాళ్లు బాగా చదివించి ఉంటే కుటుంబానికి అండగా ఉండేదాన్ని. వివాహ వయస్సు వచ్చిన తరువాత పెళ్లి చేసుకునేదాన్ని.–చిన్నమండెం మండలానికి చెందిన వివాహిత బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవు – వసంతాభాయ్, సీడీపీఓ , రాయచోటి బాల్య వివాహాలను ప్రోత్సహించే కుటుంబ సభ్యులు, పెద్దలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అడపిల్లలను బాగా చదివించాలి. వివాహ వయస్సు 18సంవత్సరాలు దాటిన తరువాతనే వారికి పెళ్లి చేయాలి. ఈ విషయంపైన అంగన్వాడీ కేంద్రాల్లో, అవగాహన సదస్సుల్లో తెలియజేస్తున్నాము. బాల్య వివాహాలు చేయడం వల్ల బాలికలు శారీరకంగా అనేక ఇబ్బందులకు గురవుతారు. బాల్య వివాహాల విషయాన్ని 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పండి, చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము. -
అక్షరం వల్లె వేయని పల్లె!
►నిరక్షరాస్యుల్లో దక్షిణాదిలో మనదే ప్రథమస్థానం ►దేశంలోనే నాలుగో స్థానంలో తెలంగాణ, ఏపీకి ఐదో స్థానం ►తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోనే నిరక్షరాస్యులు అధికం ►రోజువారీ కూలీలు ఆంధ్రప్రదేశ్‌కన్నా తెలంగాణలో తక్కువ ►గ్రామీణ భారతం స్థితిగతులపై సామాజిక, ఆర్థిక, కుల గణన తాజా గణాంకాలు వెల్లడి సాక్షి, మంచిర్యాల: రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలనకు ఇన్నేళ్లుగా కోట్లకొద్దీ నిధులు వెచ్చించినా ఫలితం లేకుండా పోయింది. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో చదువు లేనివారు ఎక్కువగా ఉన్నది మన రాష్ట్రంలోనే అన్న విషయం నివ్వెర పరుస్తోంది. ఇక దేశంలో గ్రామీణ అక్షరాస్యతలో తెలంగాణ అట్టడుగు నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సగటున 35.73 శాతం నిరక్షరాస్యులు ఉండగా, దక్షిణాది సగటు 29.62 శాతం. తెలంగాణలో మాత్రం 40.44 శాతం నిరక్షరాస్యులతో గ్రామీణ ప్రాంతాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణన (ఎస్ఈసీసీ)లో వెల్లడైన గణాంకాలివి. గ్రామీణ భారత పరిస్థితులు, వారు గడుపుతున్న జీవితం, సంపాదన తీరు, షెడ్యూల్ కులాలు, తెగల్లో ఆర్థిక సాధికారత, విద్య, ఉద్యోగం తదితర అంశాలపై నిర్వహించిన ఈ సర్వే నివేదికను భారత గ్రామీణ మంత్రిత్వశాఖ అధికారులు కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు ఇటీవల ఢిల్లీలో అందజేశారు. 2011లో ప్రారంభమైన ఈ సర్వే గతేడాది నవంబర్‌లో పూర్తికాగా, ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పరిస్థితులను కళ్లకు కట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువులేని నిరక్షరాస్యులతో 47.58 శాతంతో రాజస్థాన్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ (44.23%), బిహార్ (43.92%) వరుసగా కింది నుంచి 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత 40.44 శాతం మంది నిరక్షరాస్యులతో తెలంగాణ అట్టడుగు నుంచి నాలుగో స్థానంలో ఉంది. పక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (37.90% ) మనకన్నా మెరుగ్గా ఐదో స్థానంలో నిలిచింది. సంపూర్ణ అక్షరాస్యత గల రాష్ట్రం కేరళలో గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేనివారు కేవలం 11.38 శాతంగా ఉండడం గమనార్హం. గోవాలో 15.42 శాతం, కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో 9 శాతం , ఎన్సీటీ (నేషనల్ కేపిటల్ టెరిటరీ) ఢిల్లీలో 13.58 శాతం మంది మాత్రమే నిరక్షరాస్యులుగా ఉండడం గమనార్హం. ఉద్యోగ, వ్యవసాయ రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలకన్నా మెరుగైన స్థానంలోనే ఉన్నా, అక్షరాస్యతలో మాత్రం అధ్వాన్నంగా మారింది. అక్షరాస్యత పట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అవగాహన పెరగడం లేదనే విషయం ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యతోనే చదువు ఆపేస్తున్న వారి సంఖ్యను చూస్తే తేటతెల్లం అవుతోంది. ప్రాథమిక, సెకండరీ విద్య స్థాయిలోనే సుమారు 20 శాతం వరకు డ్రాపవుట్లు ఉంటున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. గ్రాడ్యుయేట్ ఆపై స్థాయి విద్యను అభ్యసించిన గ్రామీణ ప్రజలు తెలంగాణలో 4.21 శాతం మాత్రమే ఉండడం ఆందోళన కలిగించే విషయం. తక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్షరాస్యత సగటున 85 శాతం వరకు ఉంటే, ఈశాన్య రాష్ట్రాల్లో కూ డా మెరుగైన రీతిలోనే ఉండడం గమనార్హం. గ్రామీణ ఢిల్లీతోపాటు మణిపూర్, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్, గోవా, చండీగఢ్ రాష్ట్రాల్లోని పల్లెల్లో గ్రాడ్యుయేట్ ఆపైన చదివిన వారి సంఖ్య 6 నుంచి 9 శాతం వరకు ఉన్నారు. పదో తరగతిలోపే డ్రాపవుట్లు ఎక్కువ దక్షిణాది రాష్ట్రాల్లో నిరక్షరాస్యతలో తెలంగాణ మొదటిస్థానం ఉండగా, డ్రాపవుట్ల విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. 40.44 శాతం గ్రామీణ నిరక్షరాస్యులు ఉండగా, ప్రాథమిక విద్య లోపు అక్షరాస్యత ఉన్న వారు 10.72 శాతం మాత్రమే . ప్రాథమిక విద్యతోనే చదువు ఆపిన వారు 14.65 శాతం కాగా, 10వ తరగతి వరకు చదివిన వారు 10.55 శాతం ఉన్నారు, ఇంటర్మీడియట్ విద్యతోనే ఆపేసిన వారు 6 శాతం కాగా, గ్రాడ్యుయేట్, ఆ పై స్థాయి విద్య ను అభ్యసించిన వారు కేవలం 4.21 శాతం మాత్రమే. దక్షిణాదిలో గ్రాడ్యుయేట్లు కేరళలో అత్యధికంగా 7.76 శాతం తమిళనాడులో 6.61 శాతంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 3.43కే పరిమితమైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నివేదికలో తేలింది. ఆదిలాబాద్ నిరక్షరాస్యతలోనూ టాప్ తెలంగాణ రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలలో వెనుకబడ్డ జిల్లాలు అంటే గుర్తుకొచ్చేవి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలే. అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ అక్షరాస్యతలో మాత్రం అన్ని ఉమ్మడి జిల్లాల కన్నా వెనుకబడి ఉంది. ఈ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చదువులేని వారి శాతం 47.51 శాతం ఉంది. ఇది దేశంలో సగటు నిరక్షరాస్యత 32.85 శాతం కన్నా 15 శాతం ఎక్కువ కావడం గమనార్హం. తరువాత స్థానం పాలమూరుది. రాజధానిని ఆనుకొని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే రాష్ట్రంలోనే అక్షరాస్యత ఎక్కువున్న గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 32.90 శాతం మాత్రమే నిరక్షరాస్యులు ఉండగా.. 5.73 శాతం గ్రాడ్యుయేట్లు ఈ జిల్లాలోనే ఉండడం గమనార్హం. -
చిన్నారి పెళ్లికూతుళ్లకు విముక్తి
► జిల్లాలో ఒక్కరోజే 18 బాల్య వివాహాల అడ్డగింత ► తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ► పలువురు బాలికలు స్టేట్ హోంకు తరలింపు ► పసితనానికి మూడు‘ముళ్లు’! బడికి వెళ్లాల్సిన వయస్సులో కుటుంబ ‘బరువు బాధ్యతలు’ మోపుతున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆ ‘బరువు’ను మోయలేమని తల్లిదండ్రులకు ఎదురుచెప్పలేక ఆ..చిన్నారి పెళ్లికూతుళ్లు నరకయాతన అనుభవిస్తూ పెళ్లిపీటలెక్కుతున్నారు. జిల్లాలో బుధవారం ఒక్కరోజే ఒకటికాదు..రెండు కాదు..ఏకంగా 18 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఇది కేవలం సమాచారం తెలియడంతో అడ్డుకున్నవి. ఇంకా ఎవరికీ తెలియకుండా పదుల సంఖ్యలో బాల్య వివాహాలు జరిగినట్లు అంచనా. కుటుంబ ఆర్థిక పరిస్థితి, నిరక్ష్యరాస్యత కారణంగా బాల్య వివాహాలకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పలువురు బాలికలను స్టేట్‌హోంకు తరలించారు. ధన్వాడ/బాలానగర్/దౌల్తాబాద్/కొత్తకోట రూరల్: ముక్కుపచ్చలారని బాలికలకు బాల్యంలోనే కుటుంబ బాధ్యతలు అంటగడుతున్నారు. నిరక్షరాస్యత, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అవరోధాలు.. వంటి సమస్యలు పసితనాన్ని పెళ్లిపీటలు ఎక్కిస్తున్నాయి. లేతమనసుకు తల్లిదండ్రులు వేస్తున్న ఆ మూడు‘ముళ్ల’ బం ధాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఆడి పా డే వయసులో పెళ్లి‘భారం’కాకూడదని వారికి సూచించారు. బుధవారం జిల్ల్లాలో వేర్వేరు గ్రామాల్లో 18మంది బాలికల వివాహాలను ఆపివేయించారు. ధన్వాడ మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన ఓ బాలికకు చిన్నచింతకుంట మండలం పళ్లమర్రి గ్రామానికి చెందిన యువకుడితో ఈనెల 21న వివాహం చేయాలని నిశ్చయించారు. మరికల్ ఎస్ఐ సయ్యాద్ ఫర్హాత్ హుస్సేన్ ఇరువురి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చిబాలికను మహబూబ్‌నగర్‌లోని స్టేట్‌హోంకు తరలించారు. బాలానగర్ మండల కేంద్రానికి చెందిన ఓ బాలికను మద్దూరు మండలం వీరారం గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి ఈనెల 22న లగ్నం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. బాలానగర్ ఎస్ఐ అశోక్‌కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని వివాహాన్ని అడ్డుకున్నారు. అలాగే వీరన్నపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఓ బాలికకు కొత్తూరు మండలం చలివేంద్రంపల్లికి చెందిన ఓ యువకుడితో గురువారం వివాహం జరిపించాలని కుటుంబసభ్యులు సంబంధం కుదుర్చుకున్నారు. గ్రామస్తులు కొందరు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ అశోక్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అండాలు కౌన్సెలింగ్ ఇచ్చి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామానికి చెందిన పదో తరగతి పూర్తయిన ఓ బాలికకు ఈనెల 21న పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. వివాహానికి ఏర్పాట్లు కూడా చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ రవికాంత్‌రావు, ఆర్ఐ సహదేవ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ జయశ్రీ వివాహాన్ని ఆపివేయించారు. వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన బాలికను కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన యువకుడికి ఇచ్చి బుధవారం ఉదయం వివాహం జరిపించేందుకు నిశ్చయించారు. బాల్యం జరుగుతుందన్న విషయాన్ని గ్రామస్తులు కొందరు అధికారులకు చెప్పడంతో వనపర్తి ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి, కొత్తకోట హెడ్‌కానిస్టేబుల్ జహంగీర్, ఐసీడీఎస్ అధికారిణి లక్ష్మమ్మ కానాయపల్లికి వెళ్లి పెళ్లిని అడ్డుకుని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కొల్లాపూర్ పట్టణంలోని ఎరుకలి గేరికి చెందిన కా లనీకి చెందిన ఓ యువకుడికి ఇదే మండలం చిన్నం బావి గ్రామానికి చెందిన బాలికతో బుధవారం వివాహం నిర్ణయించారు. అధికారులు అవగాహన కల్పించి వివాహం ఆపివేయించారు.ఇటిక్యాల మండలం కొండేరు గ్రామానికి చెందిన బాలికను బుధవారం వివాహం చేయాలని ఆమె తల్లిదండ్రులు నిశ్చయించారు. సీఐ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని వివాహాన్ని అడ్డుకున్నారు. పెద్దకొత్తపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడికి మరికల్‌కు చెందిన ఓ బాలికను ఇచ్చి ఈనెల 15న వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు బాలికలకు, దేవల్తిర్మలాపూర్కు చెందిన ఓ బాలికకు ఈనెల 22న పెళ్లి చేసేందుకు ముహూర్తం ఖరారుచేశారు. ఎస్ఐ సైదయ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ జయమణెమ్మ వారి వివాహాలను ఆపించేశారు.జిల్లాకేంద్రంలోని కుమ్మరివాడికి చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది. ఆమెకు జడ్చర్లకు చెందిన ఓ యువకుడితో బుధవారం స్థానిక ఎల్లమ్మ ఆలయంలో పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వివాహాన్ని ఆపేసి ఇరువురి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
వెనుకబాటుతనానికి అవిద్యే కారణం
మంత్రి రావెల కిషోర్‌బాబు భవానీపురం : నిరక్షరాస్యత, అవిద్యే వెనుకబాటుతనానికి కారణమని సాంఘిక, గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఏపీ ట్రైబల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగిన ఆదివాసీ ఆత్మగౌరవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. వెనుకబాటు తనానికి కారణం నిరక్షరాస్యతేనని గుర్తించి రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. ప్రకృతిలోని సహజ వనరులను కంటికి రెప్పలా కాపాడేది గిరిజనులేనని అన్నారు. మారుతున్న కాలానుగుణంగా ఆదివాసీలు కూడా మార్పు చెందాలన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మసర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడిచినా ఆదివాసీలలో అక్షరాస్యత పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు కమిషన్లు ఉన్నాయి గానీ గిరిజనులకు లేకపోవడం విచారకరమన్నారు. అధికారుల అలసత్వం, గిరిజనుల అవగాహన లోపంతో వారికి అందాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు అందడం లేదన్నారు. రాజకీయంగా ప్రోత్సాహం లేకపోవడం వల్ల కూడా గిరిజనులు వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పందుల పెంపకం తదితర కుల వృత్తులకు రుణాలు, రాయితీలు అందటం లేదని ఆరోపించారు. సభ తొలుత 3 గంటలకు ప్రారంభమవుతుందని ప్రకటించగా రాత్రి 7 గంటలకు గానీ ప్రారంభం కాలేదు. సభను నిర్వాహకుడు ప్రారంభించిన అనంతరం మంత్రి రావెల దాదాపు గంటసేపు ప్రసంగించడంతో ఆడిటోరియంలోని ఆహూతులు, వేదికపై ఆశీనులైనవారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ దేవర సుబ్బారావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్రావు, బొండా ఉమామహేశ్వరరావు, జేసీ గంధం చంద్రుడు, పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు. ఆత్మ గౌరవ సభ కాదు.. ఆత్మ వంచన సభ :ఎమ్మెల్యే సర్వేశ్వరరావు ఇది గిరిజనుల ఆత్మ గౌరవ సభ కాదు.. ఆత్మ వంచన సభగా భావిస్తున్నానని అరకు ఎమ్మెల్యే కె.సర్వేశ్వరరావు చేసిన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు.. గిరిజనులకు ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని అనడంతో ఆడిటోరియంలో చప్పట్లు మార్మోగాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఎంతమంది గిరిజనులను ఇంజనీరు, డాక్టర్లు, ఐఏఎస్‌లను చదివిస్తున్నారు.. ఎంతమందికి ఇళ్లు కట్టిచ్చారని మంత్రి రావెలను ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్, ఆంత్రాక్స్ వంటి వ్యాధులతో చని పోతున్న గిరిజనులకు ఎటువంటి వైద్య సౌకర్యాలు కల్పించారని అడిగారు. అక్కడ హాస్పటల్స్ ఉండవు.. ఉంటే వైద్యులు ఉండరు... వారుంటే మందులు ఉండవు. ఇలా ఎంత కాలం గిరిజనులను మోసం చేస్తారని ధ్వజమెత్తారు. మన తలరాతలను మార్చే నేతలు కావాలి గానీ, ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నాయకులు కాదన్నారు. నగరాల్లో గ్రామాలను దత్తత తీసుకోవడం కాదు, గిరిజన కుటుంబాలను ఎంతమంది దత్తత తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా గిరిజనులను విభజించి పాలిస్తూ వారి పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాలలో బాక్సైట్ తవ్వకాల వల్ల ఎంతోమంది గిరిజనులు ఊళ్లు వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులు ఎక్కువగా ఉండే విశాఖపట్నం ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల వల్ల ఆదిమవాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఈ విషయమై మంత్రిగారు హైదరాబాద్‌లో ఒకమాట, బయటకు వస్తే మరోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మన జాతి అభివృద్ధికి మనమేం చేయాలి అన్నదాని గురించి ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు. -
నిరక్షరాస్యతను పారదోలుదాం
జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ఆత్మకూర్ (నర్వ) : పాలమూరు జిల్లాలో నిరక్షరాస్యతను పారదోలుదామని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదే వి పిలుపునిచ్చారు. శనివారం అ మరచింత గ్రామంలో డీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రేరణ శిక్షణ తరగతులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సాం ఘిక దురాచారాలు.. మూధనమ్మకాలు, బాణామతి, ఆడపిల్లల పుట్టుక తో కుటుంబానికి అరిష్టం అనే భావాల తో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. విజ్ఙానం తెలి సిన ప్రతి వ్యక్తీ ఇలాంటి దురాచారాల పై స్పందించాల్సిన అవసరముందన్నారు. చదువుకుంటేనే కుటుంబంతోపా టు గ్రామాలు అభివృద్ధి చెందుతాయ న్న వాస్తవ విషయాలు నేటితరం విద్యార్థులు చాటి చెప్పాలన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి కు టుంబానికి, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీ సుకురావాలని కోరారు. గ్రామానికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవా ది దేశాయి ప్రకాష్‌రెడ్డి తన ట్రస్టుతో ప్రేరణ తరగతులను నిర్వహించడం హర్షించదగ్గ విషయం అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వి ద్యావ్యాప్తి కోసం సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రేరణ తరగతులలో మంచి మార్కులు పాధిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశా రు. కార్యక్రమంలో నారాయణపేట డో స్వర్ణలత, ఎంఈఓ నర్సింహులు , డీ ఎంఆర్ఎం ట్రస్ట్ చైర్మన్ దేశాయి ప్రకాష్‌రెడ్డి, ఎత్తిపోతల సంఘం జిల్లా అధ్యక్షురాలు సౌజన్యరెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతిరెడ్డి, సైకాలజిస్టు శ్రీనివాసులు, రిటైర్ ఫా రెస్ట్ ఆఫీసర్ రామన్ గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేందర్ సింగ్, జ యసింహారెడ్డి, విజయ్, కలాంపాషా, నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
తరతరాల నుంచి మానవ సమాజ పురోగతి అంతా మానవుడు అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించడంపై ఆధారపడి ఉంది. ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి, సమాజాభివృద్ధి అనే దృగ్విషయాలు అభివృద్ధితో మిళితమై ఉంటాయి. ‘అభివృద్ధి భావనలు’ అనే పాఠ్యాంశంలో వివిధ రకాల అభివృద్ధిని విద్యార్థులకు అర్థమయ్యేటట్లుగా విశ్లేషించారు. అభివృద్ధి భావనలు, లక్ష్యాలు, ప్రామాణికాలను సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా గణాంకాలు, పట్టికలు, కథనాలను పొందుపర్చారు. ఈ పాఠాన్ని అధ్యయనం చేయడం ద్వారా విద్యార్థులు ఆర్థికాభివృద్ధి, మానవాభివృది ్ధపరస్పరం ఎలా తోడ్పడతాయో తెలుసుకుంటారు. తద్వారా దేశ సర్వతోముఖాభివృద్ధి సాధనకు ఎలా కృషి చేయాలో అవగాహన పెంచుకుంటారు. అభివృద్ధి భావనలు అభివృద్ధి గురించి వివరించడం సంక్లిష్టైమైన పని. ప్రజల అభివృద్ధి వారి వైయక్తిక కోరికలు, ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. అవి వేర్వేరు వ్యక్తులకు సంబంధించి వేర్వేరుగా ఉన్నా అంతిమంగా వారి జీవన నాణ్యతను మెరుగ్గా ఉంచడానికి సోపానాలుగా ఉపయోగపడతాయి. ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, భద్రత, సరైన ఆదాయం ఉన్న వివక్షత లేని అభివృద్ధిని కోరుకుంటారు. ప్రజల సమున్నత లక్ష్యాలను నెరవేర్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తాయి. స్థానిక వనరులు, విద్యా, ఆరోగ్య వసతులు, వివిధ ప్రజాసంక్షేమ సదుపాయాల అభివృద్ధి లాంటి లక్ష్యాల సాధనకు ప్రభుత్వాలు వెన్నుదన్నుగా ఉంటాయి. ముఖ్యాంశాలు పరిణామక్రమంలో 2 లక్షల ఏళ్ల క్రితమే ఆహార సేకరణ కోసం వేటను వృత్తిగా ఎంచుకున్నాడు మానవుడు. 12 వేల సంవత్సరాలకు పూర్వమే వ్యవసాయం చేయడం ఆరంభించాడు. 400 ఏళ్ల కిందట పారిశ్రామికీకరణ ప్రారంభమైంది. తమిళనాడు తీర ప్రాంతంలో ఉన్న ‘కుడంకుళం’ (తిరునల్వేలి జిల్లా)లో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. తమ భద్రతకు, జీవనోపాధికి, పర్యావరణ సమతౌల్యానికి ఈ కర్మాగారం ఆటంకంగా మారుతుందన్న భయంతో అక్కడి ప్రజలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తుల జీవన పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలుంటాయి. జాతీయాదాయం (దేశ ఆదాయం) కంటే తలసరి ఆదాయాన్ని ఆర్థికాభివృద్ధికి సరైన సూచికగా తీసుకుంటారు. తలసరి ఆదాయాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని మానవాభివృద్ధిని కచ్చితంగా అంచనా వేయలేం. {పపంచ బ్యాంక్ వివిధ దేశాల తలసరి ఆదాయాలను ప్రామాణికంగా తీసుకొని ప్రపంచ అభివృద్ధి నివేదిక-2012కు రూపకల్పన చేసింది. దీని ప్రకారం.. అధిక ఆదాయ (ధనిక) దేశాలు: 12,600 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలు. మధ్యస్థ ఆదాయం ఉన్న (అభివృద్ధి చెందుతున్న) దేశాలు: 12,600 డాలర్ల కంటే తక్కువ 1035 డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలు. తక్కువ ఆదాయం ఉన్న (పేద) దేశాలు: 1035 డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలు. 2013లో భారత్ తలసరి ఆదాయం 3285 డాలర్లు. పై జాబితా ప్రకారం ఇండియా మధ్య ఆదాయం ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (ూ్ఖఈ్క): ఏటా వివిధ దేశాలకు సంబంధించిన మానవాభివృద్ధి సూచికల నివేదికలను యూఎన్డీపీ విడుదల చేస్తుంది. వివిధ దేశాల ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను ప్రామాణికాలుగా తీసుకొని ఈ నివేదికలను రూపొందిస్తుంది. 2013లో వెలువరించిన ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో మొత్తం 177 దేశాల్లో భారతదేశం 136వ స్థానాన్ని పొందింది. విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్రాలు అధిక వృద్ధి సాధిస్తున్నాయి. కేరళ, హిమాచల్ ప్రదేశ్ దీనికి మంచి ఉదాహరణలు. 2005లో భారతదేశం మొత్తం మీద విద్యకు సంబంధించి సగటున ప్రతి విద్యార్థిపై * 1049 ఖర్చుపెట్టగా హిమాచల్ ప్రదేశ్‌లో * 2005 ఖర్చుచేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత 73 శాతం ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లో అక్షరాస్యత 84 శాతంగా ఉంది. కేరళలో 94 శాతం అక్షరాస్యతతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. కీలక పదాలు - నిర్వచనాలు జాతీయాదాయం: ఒక దేశంలో ఒక ఏడాదిలో ఉత్పత్తి అయిన అంత్య వస్తువులు, సేవల విలువల మొత్తం. అంటే ఒక దేశంలోని వ్యక్తులు, సంస్థలు సంపాదించిన మొత్తం ఆదాయం. తలసరి ఆదాయం: ఏడాదిలో ఒక దేశం మొత్తం జాతీయాదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చే మొత్తం. తలసరి ఆదాయం జాతీయాదాయం ొ జనాభా మానవాభివృద్ధి: తలసరి ఆదాయం, విద్యాస్థాయి, ఆరోగ్య స్థితుల ఆధారంగా లెక్కించే అభివృద్ధి. ఈ మానవాభివృద్ధి సూచికలను అభివృద్ధికి అత్యుత్తమ ప్రమాణాలుగా గుర్తించారు. {పజా సదుపాయాలు: ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, సౌకర్యాలను ప్రజా సదుపాయాలు అంటారు. విద్యా సూచికలు: మానవాభివృద్ధిని అంచ నా వేసేటప్పుడు విద్యా సూచికలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి.. దేశంలో మొత్తం బడి వయసు పిల్లల సంఖ్య, వారిలో బడిలో ఉన్న పిల్లల సంఖ్య, బడికి వెళ్లకుండా బడి బయట ఉన్న పిల్లల సంఖ్య, అక్షరాస్యత శాతం మొదలైనవి. ఆరోగ్య సూచికలు: శిశు మరణాల రేటు, ప్రసూతి రేటు, ప్రసూతి మరణాల రేటు, మానవ ఆయుఃప్రమాణం మొదలైనవి ఆరోగ్యసూచికలు. వీటిని మానవాభివృద్ధి సూచికలను నిర్ణయించడంలో ఉపయోగిస్తారు. అక్షరాస్యత: దేశంలో ఒక ప్రత్యేకమైన భాషను చదివగలిగే, రాయగలిగే ప్రజలను అక్షరాస్యులు అంటారు. దేశంలో 7 ఏళ్ల వయసు, ఆ పైన ఉన్నవారిలో అక్షరాస్యుల సంఖ్యను అక్షరాస్యత రేటు అంటారు. శిశు మరణ రేటు: సజీవంగా పుట్టిన ప్రతి వేయి మంది పిల్లల్లో ఏడాది లోపు వయసులోనే మరణించిన పిల్లల సంఖ్యను శిశు మరణాల రేటు అంటారు. ఆయుఃప్రమాణం: వ్యక్తులు జీవించే సగటు వయసునే ఆయుఃప్రమాణం లేదా ఆయుర్దాయం అంటారు. నాలుగు మార్కుల ప్రశ్నలు 1. ఆడవాళ్లు ఇంటి బయట పనిచేయడానికి, లింగ వివక్షతకు మధ్య సంబంధం ఏమిటి? (సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, {పశ్నించడం) {పాచీన కాలం నుంచి భారతీయ సమాజంలో స్త్రీ, పురుష వివక్షత (లింగ వివక్షత) కొనసాగుతూనే ఉంది. శారీరకంగా, విద్యాపరంగా, సామాజికపరంగా, ఆర్థికంగా స్త్రీ.. పురుషుడితో సమానం కాదని, స్త్రీ పురుషుడి అండతోనే ఉనికిలో ఉండాలనే అభిప్రాయం సమాజంలో ఇంకా ఉంది. మహిళలు వంట గదికే పరిమితమవ్వాలని, వారికి తక్కువ కూలీ డబ్బులు ఇవ్వాలని, వారి సొంత వ్యక్తిత్వానికి ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా వారిని అనేక విధాలుగా అణగదొక్కాలనే చర్యలు మహిళల హక్కులను కాలరాస్తున్నాయి. వరకట్న వేధింపులు బాగా పెరిగి అనేక మంది స్త్రీలు బలవుతున్నారు. ఈ విధమైన వివక్షతలను రూపుమాపాలంటే మహిళల అక్షరాస్యత పెరగాలి. తద్వారా వారు విజ్ఞానవంతులవ్వాలి. వంట గది నుంచి బయటకు వచ్చి వివిధ రకాల ఉద్యోగాలు చేయడానికి ముందుకు రావాలి. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో ప్రవేశించాలి. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కూడా అనేక వివక్షతలను ఎదుర్కొంటున్నారు. వారు అలాంటి వాటిని ధైర్యంగా ప్రతిఘటించినప్పుడు అవి పునరావృతం కాకుండా కనుమరుగవుతాయి. ఈ విధంగా మహిళలు కార్యోన్ముఖులై మహిళా సాధికారతను సాధించినప్పుడు సమాజంలోని లింగ వివక్షతను రూపుమాపవచ్చు. ఆడవాళ్లు విద్యావంతులై మగవాళ్లతో సమానంగా ఇంటి బయట కూడా పనిచేయడానికి సంసిద్ధులైనప్పుడు లింగ వివక్షత తగ్గుముఖం పడుతుంది. 2 మార్కుల ప్రశ్నలు 1. అభివృద్ధి అంటే ఏమిటి? వివిధ అభివృద్ధి భావనలను తెలపండి. (విషయావగాహన) {పజలు స్వేచ్ఛగా, సమానత్వంతో జీవిస్తూ, జీవనానికి తగిన ఆదాయం, భద్రత పొందుతూ ఎలాంటి వివక్షతను ఎదుర్కోకుండా నాణ్యమైన జీవన ప్రమాణాన్ని కలిగి ఉండటాన్నే అభివృద్ధిగా పేర్కొంటారు. అభివృద్ధి భావనలు: జాతీయాదాయం, తలసరి ఆదాయం, అక్షరాస్యతలను పెంచడం. లింగ వివక్షత రూపు మాపడం, శిశు మరణాలను లేకుండా చేయడం. ఆయుఃప్రమాణం పెంచడం. ప్రజల అవసరాలు తీర్చే అన్ని సదుపాయాలు కల్పించడం. 2. భారత ప్రభుత్వం కుడంకుళంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం నిరంతరం పెరుగుతున్న దేశ విద్యుచ్ఛక్తి అవసరాలు తీర్చడం. అక్కడి ప్రజలు వారి భద్రత, రక్షణ, జీవనోపాధుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. ఈ పోరాటం మరింత కాలం కొనసాగే పరిస్థితి ఏర్పడింది. శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు అక్కడి ప్రజల తరఫున ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. (ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం) ఎ. ప్రభుత్వ ఉద్దేశాన్ని నీవెలా సమర్థిస్తావు? {పజల విద్యుత్ అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత. విద్యుత్ ఉత్పత్తిని పెంచకపోతే భవిష్యత్‌లో పెరిగే దేశ జనాభా విద్యుత్ అవసరాలు తీర్చడం వీలు కాదు. దేశ అభివృద్ధి దృష్ట్యా విద్యుదుత్పాదనకు అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించడం ఆవశ్యకం. బి. ప్రజల వ్యతిరేకతను అంగీకరించాలంటే ప్రభుత్వానికి నీవేం ప్రత్యామ్నాయ పరిష్కారం చూపుతావు? {పభుత్వం పూర్తిగా అణు విద్యుత్‌పైనే కాకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన పునరుద్ధారిత ఇంధన వనరులపై దృష్టి పెట్టాలి. అలాంటి వాటిలో సౌర విద్యుత్, పవన విద్యుత్, సముద్ర అలల విద్యుత్ ముఖ్యమైనవి. వీటికి ఖర్చు ఎక్కువైనా.. ప్రమాద రహితమైనవి. 1 మార్కు ప్రశ్నలు 1. భూమి లేని గ్రామీణ కార్మికుల అభివృద్ధి లక్ష్యాలేవి? (విషయావగాహన) జీవించడానికి కావాల్సిన కనీస వేతనం, సామాజిక వివక్ష లేకపోవడం. 2. కింది చిత్రం ఏ రకమైన దేశాన్ని సూచిస్తుంది? (పట నైపుణ్యం) ధనికులు, పేదలు అనే రెండు వర్గాలున్న దేశం. -
మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి
తెలంగాణ ప్రభుత్వానికి ‘ముక్త’ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ మహిళల అధ్యయన వేదిక ‘ముక్త’ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అత్యాచారాలు, వేధింపులు.. మహిళల సమస్యలకు పరిష్కార మార్గాలపై అధ్యయ నం చేసి ‘ముక్త’ రూపొందించిన నివేదికను గురువారం రాష్ట్ర మహిళా భద్రత కమిటీ చైర్పర్సన్ పూనం మాలకొండయ్యకు సంస్థ ప్రతినిధులు అందజేశారు. నిరక్షరాస్యత, పసలేని పాఠ్యాంశాలు, కుంటుపడుతున్న బాలికావిద్య, మహిళలను అపహరించి విక్రయించడం, స్కూళ్లు, హాస్టళ్లలో వసతులు వంటి అంశాలను నివేదికలో ప్రస్తావించారు. నివేదిక ప్రతిని సీఎం కార్యాలయంలో కూడా అందజేశారు. చైర్‌పర్సన్‌ను కలిసినవారిలో ‘ముక్త’ అధ్యక్షురాలు విమల, ప్రధానకార్యదర్శి కిరణ్‌కుమారి, టి.దేవకీదేవి, వసుధ, కె.శైలజ, శోభ, నకాషి ఉన్నారు. -
భిక్షాటనలో బాల్యం
పట్టించుకోని పాలకులు గూడూరు టౌన్ : బాల్యం భిక్షాటన చేస్తోంది. నిరక్షరాస్యత, పేదరికం లాంటి కారణాలతో బాల్యం ప్రశ్నార్థకంగా మారింది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల పలువురు బాలలు యాచకులుగా మారుతున్నారు. ‘బడిపిలుస్తోంది’ కార్యక్రమాలతో బడీఈడు పిల్లలను బడికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. భిక్షాటన చేస్తున్న బాలల కోసం అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఎందుకూ పనికి రావడం లేదు. భిక్షాటనే వృత్తిగా.. : జిల్లాలో 2 వేలకు పైగా చిన్నారులు భిక్షాటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, సినిమాహాళ్లు, కళాశాలలు, షాపింగ్‌మాల్స్, కూడలి ప్రాంతాలు, ఆలయాల వద్ద అనేక మంది చిన్నారులు యాచిస్తున్నారు. బడిఈడు పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలకు పంపేలా ఐసీపీఎస్, ఐసీడీఎస్, విద్యాశాఖాధికారులతో పాటు ప్రభుత్వంలోని అన్నిశాఖల అధికారులు పని చేయాల్సి ఉంది. భిక్షాటన చేస్తు న్న వారిలో ఎక్కువగా 14 ఏళ్లలోపు చిన్నారులే ఉంటున్నారు. నెల్లూరులోని సుందరయ్య కాలనీ, గూడూరు, కావలి రైల్వేస్టేషన్ల సమీపంలో నివాసముంటున్న వారి పిల్లలే అధికంగా భిక్షాటన చేస్తున్నారు. కొంతమంది అయ్యప్పమాల సీజన్లో స్వామి మాలలు ధరించి భిక్షాటన చేస్తున్నారు. తూతూ మంత్రంగా పథకాలు అమలు.. నిర్బంధ విద్య, బడి పిలుస్తోంది తదితర పథకాలు తూతూ మంత్రంగా అమలవుతుండడంతో చిన్నారుల జీవితాలు భిక్షాటనతో బుగ్గిపాలవుతున్నాయి. భిక్షాటన చేస్తున్న బాలలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా వారు మారడం లేదని ఐసీపీఎస్ అధికారులు అంటున్నారు. అందుకే పోలీసుల సాయంతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో బాలికల కోసం ఐదు పునరావాస కేంద్రాలున్నాయన్నాయన్నారు. బాలురకు పునరావాస కేంద్రాలు లేవు. వారిని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న కేంద్రాలకు పంపుతున్నట్లు వారు తెలిపారు. -
బాల్యానికి సంకెళ్లు..
బడిబాట పట్టాల్సిన బాలలు పనిబాట పడుతున్నారు.. పలకా బలపం పట్టాల్సిన చేతితో గిన్నెలు శుభ్రం చేస్తున్నారు.. పాఠాలు చదువుకోవాల్సిన సమయంలో చెత్తపేపర్లు ఏరుకుంటున్నారు.. ఇలా ఆటపాటలతో ఆహ్లాదంగా సాగాల్సిన బాల్యం చెత్తకుప్పల పాలవుతోంది.. - నగరంలో పెరిగిపోతున్న బాలకార్మికుల సంఖ్య నాలుగు వేలకు పైగా ఉన్నారని అంచనా - పేదరికం, నిరక్షరాస్యతే కారణమంటున్న అధికారులు పనిబాట పడుతున్న బాలలు - నేరమని తెలిసినా ప్రోత్సహిస్తున్న యజమానులు సాక్షి, ముంబై: నగరంలో బాల కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందని ఓ సామాజిక సంస్థ నిర్వహించిన సర్వే ఆధారంగా తేలింది. దాదాపు 4 వేల మంది బాల కార్మికులు నగరంలో పనిచేస్తున్నారని సంస్థ గుర్తించింది. వీరిని పనిలో పెట్టుకున్న వారిపై నగర పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. నగరంలో ఉన్న బాల కార్మికులకు విముక్తి కలిగించడానికి ఓ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. దీనిని త్వరలోనే అమలు చేయనున్నామన్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పోలీసులు దాదాపు 100 మంది బాల కార్మికులను విముక్తి చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య ఎక్కువగానే ఉందని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ సర్వీస్ బ్రాంచ్ (ఎస్ఎస్బీ)డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ పాటిల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దాదాపు నాలుగు వేల మంది చిన్నారులను బాలకార్మికుల నుంచి విముక్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ మేరకు ప్రతిరోజూ తాము కొన్ని ప్రాంతాలను తనిఖీ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా స్థానికుల సహాయం కూడా తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. బాల కార్మికులను గుర్తించి పునరావాసం కల్పించినప్పటికీ వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం చేత తిరిగి అదే వృత్తిని ఎంచుకుంటున్నారని ఎస్ఎస్బీ అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఇందులో ఎక్కువ శాతం బాలలు ఇండ్లలో పని చేసేవారేనన్నారు. అదేవిధంగా మరికొందరు లెదర్, జరీ, హోటళ్లలో పనిచేస్తుండగా, మరికొందరు చెత్తకుప్పల్లో కాగితాలు ఏరుకుంటూ ఉంటారని తెలిపారు. ఇదిలా ఉండగా కొందరు వ్యసనాలకు బానిసలైన తల్లిదండ్రులు డబ్బుల కోసం తమ పిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయిస్తారని వారు తెలిపారు. బాలకార్మికుల్లో ఎక్కువ మంది వలస కుటుంబాలకు చెందినవారేనని చెప్పారు. వీరంతా మురికివాడల్లో ఉంటూ యజమానుల వద్ద తక్కువ వేతనం తీసుకుంటూ ఎక్కువ గంటలు పనిచేస్తారని తెలిపారు. అందుకే నేరమని తెలిసినా ఎక్కువ శాతం యజమానులు బాలకార్మికులను పనిలో పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు. బాలకార్మికుల్లో ఎక్కువశాతం బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచేకాక పక్క దేశమైన నేపాల్వాసులే ఉంటారని అధికారి తెలిపారు. వీరు ఐదు నుంచి 16 ఏళ్ల వయసు మధ్యలో ఉంటారని పేర్కొన్నారు. కాగా, బాలలను పనిలో పెట్టుకున్న వారికి చట్ట ప్రకారం రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20 వేల నుంచి 50 వేల జరిమానా కూడా విధిస్తారు. -
అధ్వానంగా సాక్షరభారత్ సెంటర్ల పనితీరు
మెదక్:ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ప్రతి ఒక్కరి చదువు దేశానికి వెలుగు అన్నది మేధావుల నినాదం. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సాక్షరభారత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే గ్రామ సమన్వయ కర్తలు సక్రమంగా పని చేయకపోవడంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. రికార్డుల్లో మాత్రం వేల సంఖ్యలో అక్షరాస్యులుగా మారుతున్నారని అధికారులు చూపుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వందల సంఖ్యలో కూడా అక్షరాలు నేర్చుకున్న వారు లేరన్నది సత్యం. కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. తల్లి ఒడే పిల్లలకు మొదటి పాఠశాల కాబట్టి మహిళలు అక్షరాస్యులుగా మారితే వారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దని భావించిన ప్రభుత్వం సాక్షరభారత్ పథకాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా 2010 సెప్టెంబర్ 8న దేశ వ్యాప్తంగా సాక్షరభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండు సంవత్సరాల లోపు పిల్లలను ఈ కేంద్రాల్లో చేరుకొని వారికి అక్షరాస్యులుగా నేర్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ఇందులో భాగంగా మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గానూ 46 మంది గ్రామ కోఆర్డినేటర్లను నియమించారు. వీరి విధుల పర్యవేక్షణకు మండల కోఆర్డినేటర్ ను కూడా నియమించారు. అన్ని గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం కొన్ని సెంటర్లలో మినహా ఎక్కడా వలంటీర్లు పనిచేయడం లేదు. మండలంలో 7,500 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి కోసం 750 సెంటర్లు ప్రారంభించారు. మండల వ్యాప్తంగా ఒక్క సెంటర్ కూడా సక్రమంగా నడవడం లేదన్నది సత్యం. గ్రామ సమన్వయ కర్తకు నెలకు రూ. రెండు వేల గౌరవ వేతనం ఇస్తున్నారు. ఒక్కో అభ్యాసకుడికి నోట్‌బుక్, పెన్సిల్, మెండర్, రబ్బరు, ప్రైమరీ, బ్రిడ్జి బుక్స్ అందిస్తున్నట్టు అధికారులు లెక్కలు చూపుతున్నా అవి సమన్వయ కర్తల వద్దే ఉంటాయన్నది వాస్తవం. మండలంలోని 23 సెంటర్లకు ప్రతి రోజూ రెండు దినపత్రికలు, ఒక మాస పత్రిక, కరంటు బిల్లుకు నెలకు రూ. వంద చొప్పున చెల్లిస్తున్నారు. సెంటర్లలో వసతులు కల్పించేందుకు అల్మారా, ఒక కార్పెట్, పది కుర్చీలను అందజేశారు. అభ్యాసకులు ఆడుకోవడానికి ఆటవస్తువులను సమకూర్చారు. ఇవి కూడా ఆయా సెంటర్లలో కనబడడం లేదు. పథకం లక్ష్యం బాగున్నా పాలకులు, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రజా ధనం వృథా అవుతోంది. కొత్త ప్రభుత్వమైనా ఈ పథకంపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.