►నిరక్షరాస్యుల్లో దక్షిణాదిలో మనదే ప్రథమస్థానం
►దేశంలోనే నాలుగో స్థానంలో తెలంగాణ, ఏపీకి ఐదో స్థానం
►తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోనే నిరక్షరాస్యులు అధికం
►రోజువారీ కూలీలు ఆంధ్రప్రదేశ్‌కన్నా తెలంగాణలో తక్కువ
►గ్రామీణ భారతం స్థితిగతులపై సామాజిక, ఆర్థిక, కుల గణన తాజా గణాంకాలు వెల్లడి
సాక్షి, మంచిర్యాల: రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలనకు ఇన్నేళ్లుగా కోట్లకొద్దీ నిధులు వెచ్చించినా ఫలితం లేకుండా పోయింది. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో చదువు లేనివారు ఎక్కువగా ఉన్నది మన రాష్ట్రంలోనే అన్న విషయం నివ్వెర పరుస్తోంది. ఇక దేశంలో గ్రామీణ అక్షరాస్యతలో తెలంగాణ అట్టడుగు నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సగటున 35.73 శాతం నిరక్షరాస్యులు ఉండగా, దక్షిణాది సగటు 29.62 శాతం. తెలంగాణలో మాత్రం 40.44 శాతం నిరక్షరాస్యులతో గ్రామీణ ప్రాంతాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణన (ఎస్‌ఈసీసీ)లో వెల్లడైన గణాంకాలివి. గ్రామీణ భారత పరిస్థితులు, వారు గడుపుతున్న జీవితం, సంపాదన తీరు, షెడ్యూల్ కులాలు, తెగల్లో ఆర్థిక సాధికారత, విద్య, ఉద్యోగం తదితర అంశాలపై నిర్వహించిన ఈ సర్వే నివేదికను భారత గ్రామీణ మంత్రిత్వశాఖ అధికారులు కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు ఇటీవల ఢిల్లీలో అందజేశారు.
2011లో ప్రారంభమైన ఈ సర్వే గతేడాది నవంబర్‌లో పూర్తికాగా, ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పరిస్థితులను కళ్లకు కట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువులేని నిరక్షరాస్యులతో 47.58 శాతంతో రాజస్థాన్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ (44.23%), బిహార్ (43.92%) వరుసగా కింది నుంచి 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత 40.44 శాతం మంది నిరక్షరాస్యులతో తెలంగాణ అట్టడుగు నుంచి నాలుగో స్థానంలో ఉంది. పక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (37.90% ) మనకన్నా మెరుగ్గా ఐదో స్థానంలో నిలిచింది. సంపూర్ణ అక్షరాస్యత గల రాష్ట్రం కేరళలో గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేనివారు కేవలం 11.38 శాతంగా ఉండడం గమనార్హం. గోవాలో 15.42 శాతం, కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో 9 శాతం , ఎన్‌సీటీ (నేషనల్ కేపిటల్ టెరిటరీ) ఢిల్లీలో 13.58 శాతం మంది మాత్రమే నిరక్షరాస్యులుగా ఉండడం గమనార్హం. ఉద్యోగ, వ్యవసాయ రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలకన్నా మెరుగైన స్థానంలోనే ఉన్నా, అక్షరాస్యతలో మాత్రం అధ్వాన్నంగా మారింది.
అక్షరాస్యత పట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అవగాహన పెరగడం లేదనే విషయం ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యతోనే చదువు ఆపేస్తున్న వారి సంఖ్యను చూస్తే తేటతెల్లం అవుతోంది. ప్రాథమిక, సెకండరీ విద్య స్థాయిలోనే సుమారు 20 శాతం వరకు డ్రాపవుట్లు ఉంటున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. గ్రాడ్యుయేట్ ఆపై స్థాయి విద్యను అభ్యసించిన గ్రామీణ ప్రజలు తెలంగాణలో 4.21 శాతం మాత్రమే ఉండడం ఆందోళన కలిగించే విషయం. తక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్షరాస్యత సగటున 85 శాతం వరకు ఉంటే, ఈశాన్య రాష్ట్రాల్లో కూ డా మెరుగైన రీతిలోనే ఉండడం గమనార్హం. గ్రామీణ ఢిల్లీతోపాటు మణిపూర్, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్, గోవా, చండీగఢ్ రాష్ట్రాల్లోని పల్లెల్లో గ్రాడ్యుయేట్ ఆపైన చదివిన వారి సంఖ్య 6 నుంచి 9 శాతం వరకు ఉన్నారు.
పదో తరగతిలోపే డ్రాపవుట్లు ఎక్కువ
దక్షిణాది రాష్ట్రాల్లో నిరక్షరాస్యతలో తెలంగాణ మొదటిస్థానం ఉండగా, డ్రాపవుట్ల విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. 40.44 శాతం గ్రామీణ నిరక్షరాస్యులు ఉండగా, ప్రాథమిక విద్య లోపు అక్షరాస్యత ఉన్న వారు 10.72 శాతం మాత్రమే . ప్రాథమిక విద్యతోనే చదువు ఆపిన వారు 14.65 శాతం కాగా, 10వ తరగతి వరకు చదివిన వారు 10.55 శాతం ఉన్నారు, ఇంటర్మీడియట్ విద్యతోనే ఆపేసిన వారు 6 శాతం కాగా, గ్రాడ్యుయేట్, ఆ పై స్థాయి విద్య ను అభ్యసించిన వారు కేవలం 4.21 శాతం మాత్రమే. దక్షిణాదిలో గ్రాడ్యుయేట్లు కేరళలో అత్యధికంగా 7.76 శాతం తమిళనాడులో 6.61 శాతంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 3.43కే పరిమితమైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నివేదికలో తేలింది.
ఆదిలాబాద్ నిరక్షరాస్యతలోనూ టాప్
తెలంగాణ రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలలో వెనుకబడ్డ జిల్లాలు అంటే గుర్తుకొచ్చేవి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలే. అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ అక్షరాస్యతలో మాత్రం అన్ని ఉమ్మడి జిల్లాల కన్నా వెనుకబడి ఉంది. ఈ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చదువులేని వారి శాతం 47.51 శాతం ఉంది. ఇది దేశంలో సగటు నిరక్షరాస్యత 32.85 శాతం కన్నా 15 శాతం ఎక్కువ కావడం గమనార్హం. తరువాత స్థానం పాలమూరుది. రాజధానిని ఆనుకొని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే రాష్ట్రంలోనే అక్షరాస్యత ఎక్కువున్న గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 32.90 శాతం మాత్రమే నిరక్షరాస్యులు ఉండగా.. 5.73 శాతం గ్రాడ్యుయేట్లు ఈ జిల్లాలోనే ఉండడం గమనార్హం.
అక్షరం వల్లె వేయని పల్లె!
Published Fri, Jan 27 2017 3:12 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement
Advertisement