సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశంపై కేంద్రం మరోమారు రంగంలోకి దిగనుంది. అక్టోబర్ 14 నుంచే గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రావాల్సి ఉన్నా.. తెలుగు రాష్ట్రాల నుంచి సరైన మద్దతు కరువైన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై బోర్డులతో చర్చించనుంది. ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర జల శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ రెండు బోర్డుల చైర్మన్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి, తదుపరి నిర్ణయాలు చేసే అవకాశాలున్నాయని తెలిసింది.
అమలుకు నోచని గెజిట్
కేంద్రం వెలువరించిన గెజిట్ ప్రకారం.. కేంద్రం గుర్తించిన ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ప్రధాన పనులు, రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా అందరూ బోర్డుల పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్ బలగాలతో భద్రత కల్పించడంతో పాటు నీటి విడుదల, విద్యుదుత్పత్తి, వినియోగం అంశాలను బోర్డులే చూడాల్సి ఉంది. అయితే ఇరు రాష్ట్రాల చర్చల్లో గోదావరిలో కేవలం పెద్దవాగు, కృష్ణాలో 15 ఔట్‌లెట్‌లను మాత్రమే అప్పగించే అంశంపై కొంత సానుకూలత ఏర్పడింది.
అయితే ఇందులోనూ కృష్ణాలోని విద్యుదుత్పత్తి కేంద్రాలను బోర్డులకు అప్పగించేందుకు తెలంగాణ ససేమిరా అంటోంది. విద్యుదుత్పత్తి కేంద్రాలు లేకుండా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటే ఫలితం ఉండదని ఏపీ అంటుండటంతో గెజిట్ అమలు ముందుకు కదలడం లేదు. దీంతో పరిస్థితిని బోర్డులు కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాయి. ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై మార్గనిర్దేశకత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం, ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తామని సమాచారమిచ్చింది. గురు లేక శుక్రవారాల్లో గెజిట్ అమలులో నెలకొన్న సమస్యలపై చర్చించనుంది.
డీపీఆర్‌లపైనా చర్చ
కృష్ణా, గోదావరి నదీ బేసిన్లలో అనుమతి తీసుకోకుండా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులకు ఆర్నెల్లలోగా అనుమతి తీసుకోవాలని, ఒకవేళ అనుమతి తీసుకోవడంలో విఫలమైతే.. ఆ ప్రాజెక్టులు పూర్తయినా వాటి నుంచి నీటిని సరఫరా చేయడాన్ని ఆపేయాల్సిందేనని గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్రానికి అందించాయి.
ముఖ్యంగా తెలంగాణ సీతారామ, తుపాకులగూడెం, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ప్రాజెక్టుల డీపీఆర్‌లను అందించింది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్ అంశాలపైనా కేంద్రం బోర్డులతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటివరకు అందించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు, వాటిపై రాష్ట్రాలను కోరిన వివరణలు, వాటికి సమాధానాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment