సాక్షి, హైదరాబాద్ : సంక్రాతికి పండుగ కోసం పట్నం నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ ఝలక్ ఇస్తున్నాయి. ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా టికెట్ ధరల్ని అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టారీతిన టికెట్ ఛార్జీలు పెంచినా రవాణా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారుని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఆర్టీసీ బస్సుల కంటే రెండు నుంచి మూడుంతలు అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో అడ్డగోలుగా పెంచిన ఛార్జీలతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు ఒక్కో కుటుంబం రూ.15 వేల నుంచి 20,000 చెల్లించాల్సి వస్తుంది. ఏపీలోని విజయవాడ, గుంటూరు తిరుపతి, పాలకొల్లు, విశాఖపట్నం, భీమవరం, నర్సాపురం, రాజమండ్రి వెళ్లేందుకు ఒక్కో టికెట్‌పై రెండు నుంచి మూడు వేలు పెరగడంపై ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.
గతంలో రూ.1000 రూపాయలు, రూ.1200 ఉన్న టికెట్ తాజాగా రూ.3000 పైమాటే ఉంది. భీమవరం వెళ్లే ప్రయాణికుల నుంచి రూ. 3000 నుంచి రూ.4000, రాజమండ్రికి రూ. 3500 నుంచి రూ.4000 చెల్లించాల్సి వస్తుంది. ఇందేంటని ప్రశ్నిస్తే.. పండగ వేళ అంతే ఉంటాయి అని ప్రైవేట్ ట్రావెల్స్ బుకాయింపుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment