సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేలా బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని స్వాగతిస్తూనే అందులో కొన్ని అంశాలపై సవరణలను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన 512, తెలంగాణకు దక్కిన 299 టీఎంసీలను పంపిణీ చేయడంపైనే కృష్ణా బోర్డు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేలా చూడాలని విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువ ఆయకట్టుకు గోదావరి వరద జలాలను మళ్లించగా.. అక్కడ మిగిలే కృష్ణా నీటిని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించుకునే స్వేచ్ఛ కల్పించడం ద్వారా ఆ ప్రాంతాల సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి మార్గం సుగమం చేయాలని కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది.
విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో అప్పటికే నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుగంగ, గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రీ–నీవా, తెలంగాణలోని నెట్టెంపాడు (22 టీఎంసీలు), కల్వకుర్తి (25 టీఎంసీలు) కేంద్రం అనుమతి ఇచ్చిందని.. ఇప్పుడు వాటికి ఆర్నెళ్లలోగా మళ్లీ అనుమతి తీసుకోవాలంటూ విధించిన నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరనుంది. విభజన చట్టం ద్వారా ఆ ప్రాజెక్టులకు కల్పించిన రక్షణను కొనసాగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బోర్డులను ఏర్పాటు చేసిన ఏడేళ్ల తర్వాత వాటి పరిధిని ఖరారు చేయడాన్ని స్వాగతిస్తూనే కొన్ని మార్పులు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ..
తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ), దిగువ ప్రధాన కాలువ (ఎల్లెల్సీ) ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో ఉన్నాయి. తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా హెచ్చెల్సీకి కేటాయించిన 32.5, ఎల్లెల్సీకి కేటాయించిన 29.5 టీఎంసీలను దామాషా పద్ధతిలో తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తోంది. వాటికి తుంగభద్ర జలాశయంలో నీటిని విడుదల చేసినప్పుడు రాష్ట్ర సరిహద్దులోనూ టెలీమీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీలను మళ్లీ కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని, వాటిని పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి వి/æ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద లెక్కిస్తే చాలు..
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే ప్రాంతమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని కేటాయించిన నీటిని విడుదల చేసేటప్పుడు టెలీమీటర్ల ద్వారా లెక్కిస్తే సరిపోతుంది.
ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ ఛానల్, వెలిగోడు రిజర్వాయర్, తెలుగుగంగ లింక్ కెనాల్, ఎస్సార్‌బీసీ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు కాలువల వ్యవస్థలను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని అక్కడ నీటిని లెక్కించాల్సిన అవసరం లేదని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల బోర్డుకు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకే కృష్ణా బోర్డు పరిధిని పరిమితం చేసేలా కేంద్రానికి సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు అనుమతి లేదంటే ఎలా?
వెంకటనగరం ఎత్తిపోతల 2006 నాటికే పూర్తయిందని, తెలుగుగంగ ఆయకట్టును స్థిరీకరించడానికి చేపట్టిన సిద్ధాపురం ఎత్తిపోతల, ఎల్లెల్సీ ఆయకట్టు స్థిరీకరణకు చేపట్టిన గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం 2008 నాటికే పూర్తైందని, ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ఆ ప్రాజెక్టులకు అనుమతి లేదనడం సరి కాదని కేంద్రానికి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పూర్తై ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతి తీసుకోవాలనే నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రతిపాదించనుంది.
ఎగువ రాష్ట్రాలతో సంబంధం లేని ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఎందుకు?
కృష్ణా డెల్టాకు నీళ్లందించే ప్రకాశం బ్యారేజీ, గోదావరి డెల్టాకు నీళ్లందించే ధవళేశ్వరం బ్యారేజీ, పోలవరం, పోలవరం దిగువన తొర్రిగడ్డ పంపింగ్ స్కీం, వెంకటనగరం ఎత్తిపోతల, పుష్కర, పురుషోత్తపట్నం, తాడిపూడి, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల వల్ల ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని నీటిపారుదలరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తేవడం వల్ల అదనపు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా వాటిని బోర్డుల పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకుంటే సరి..
గోదావరి పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఉమ్మడి ప్రాజెక్టులు ఏవీ లేవు. కానీ.. కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఉమ్మడి ప్రాజెక్టులు. జూరాల, పులిచింతల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులు. ఇందులో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల స్పిల్ వేలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, వాటిపై ఆధారపడ్డ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రధాన ప్రాంతాలు(ఇన్‌టేక్‌లు), ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పులిచింతలలో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తే సరిపోతుందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల బోర్డుపై అదనపు భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. బోర్డుల పరిధి విస్తృతమైతే వాటి పరిధిలోని ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ నిర్వహణకు భారీ ఎత్తున వ్యయం అవుతుందని, దీనివల్ల రెండు రాష్ట్రాలపైనా ఆర్థికంగా తీవ్ర భారం పడుతుందని విశ్లేషిస్తున్నారు.
నీటి లభ్యత ఆధారంగా దామాషాలో పంపిణీ..
రెండు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు 811 టీఎంసీలు ఉంటే 66 : 34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని, ఒకవేళ వర్షాభావంతో లభ్యత తగ్గితే అదే నిష్పత్తిలో దామాషా పద్ధతిలో నీటి పంపిణీ చేసేలా కృష్ణా బోర్డుకు నిర్దేశించాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. 2019–20, 2020–21 తరహాలోనే బేసిన్‌లో భారీ ఎత్తున వరద వస్తే.. శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసి వరద జలాలు సముద్రంలో కలిసే సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు ఏ స్థాయిలో నీటిని మళ్లించుకున్నా వాటిని పరిగణలోకి తీసుకోకూడదని వి/æ్ఞప్తి చేయనుంది. తద్వారా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని కోరనుంది.
Comments
Please login to add a commentAdd a comment