krishna godavari
-
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లంక భూములకు డి పట్టాలు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలోని లంక భూములకు డి పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ, బీ కేటగిరీలుగా గుర్తించిన లంక భూములకు సంబంధించి వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వడంతోపాటు సి కేటగిరీలో ఉన్న భూములకు ఐదేళ్ల లీజు పట్టాలు ఇవ్వనుంది. ఈ మేరకు లంక భూముల అసైన్డ్ నిబంధనలను సవరిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ జీఓ జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని ఒండ్రు మట్టి ఒక దగ్గర చేరి ఉన్న భూములు కాలక్రమేణా సాధారణ భూములుగా మారి సారవంతంగా ఉండడంతో రైతులు (శివాయి జమేదార్లు) వాటిని సాగు చేసుకుంటున్నారు. ఏ, బీ కేటగిరీ భూముల్లోని కొందరికి గతంలో డి పట్టాలిచ్చారు. మునిగిపోయే అవకాశం ఉండడంతో సీ కేటగిరీ భూములకు పట్టాలివ్వకుండా ఒక సంవత్సరం లీజుగా ఇచ్చారు. వాటినే లీజు పట్టాలుగా పిలుస్తారు. ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా పట్టాలు పూర్వపు తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ మూడు కేటగిరీల్లో ఉన్న లంక భూములను సాగు చేసుకుంటున్న చాలా మందికి పట్టాలు లేవు. అలాంటి వారిని గుర్తించి నిబంధనల ప్రకారం పట్టాలివ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి ఏ, బీ కేటగిరీల్లోని భూములకు ఆమోదంతో పట్టాలివ్వనుంది. సీ కేటగిరీ కింద ఉన్న భూములకు గతంలో ఇచ్చే సంవత్సరం లీజును ఐదేళ్లకు పొడిగించి ఇవ్వనున్నారు. అసైన్మెంట్ కమిటీల ఆమోదంతో పట్టాలిచ్చే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. లంక భూముల్లో సీజీఎఫ్ (కో–ఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్) సొసైటీలు ఉండేవి. మిగిలిన ప్రాంతాల్లోని సీజీఎఫ్‌ఎస్ భూములకు పట్టాలిచ్చినా, లంక భూముల్లోని సీజీఎఫ్‌ఎస్ భూములకు మాత్రం ఇవ్వలేదు. ఈ సొసైటీలు రద్దయ్యే పరిస్థితుల్లో వాటి కింద ఉన్న అర్హులను గుర్తించి తాజాగా పట్టాలివ్వాలని నిర్ణయించారు. గతంలో ఇచ్చిన పట్టాలు, అడంగల్‌లో నమోదైన పట్టాదారులకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు డి పట్టాలివ్వాలని జీవోలో స్పష్టం చేశారు. 10 వేల మందికి మేలు లంక భూముల కేటగిరీలను మార్చేందుకు తాజాగా అవకాశం కల్పించారు. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, రివర్ కన్సర్వేటర్ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)లతో ఉన్న కమిటీ కేటగిరీ మార్పుపై వచ్చే దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్ సిఫారసు చేస్తారు. ఈ సిఫారసుల ఆధారంగా జిల్లా కలెక్టర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు నిబంధనలను సవరించారు. దీనివల్ల సుమారు 10 వేల మంది లంక భూముల రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. అర్హులకు పట్టాలివ్వగా మిగిలిన భూముల్లో 50 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ రైతులకు, మిగిలిన 50 శాతం భూమిలో మూడింట రెండొంతుల (2/3) భూమిని బీసీ రైతులకు, మిగిలిన (1/3) భూమిని నిరుపేద రైతులకు పంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏ కేటగిరీ: గట్టుకు దగ్గరగా ఉండి, వరద వచ్చినా కొట్టుకుపోని భూమి బీ కేటగిరీ: ఏ కేటగిరీ భూమికి ఆనుకుని, కొంత నదిలోకి ఉన్న భూమి సీ కేటగిరీ: ఏ, బీ కేటగిరీకి ఆనుకుని నదిలోకి ఉండి.. వరదలు వస్తే పూర్తిగా మునిగిపోయే భూమి -
అంచనాలకు మించి జల విద్యుదుత్పత్తి
విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. జెన్కో కాసుల పంట పండింది. గత ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 10 వరకు భారీగా 3849.79 మిలియన్ యూనిట్ల (ఎంయూ) జల విద్యుదుత్పత్తి జరిపింది. సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. తెలంగాణ విద్యుదు త్పత్తి సంస్థ (జెన్కో) కాసుల పంట పండించింది. గత ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 10 వరకు భారీగా 3,849.79 మిలియన్ యూనిట్ల (ఎంయూ) జల విద్యుదుత్పత్తి జరిపింది. అందులో 480.78 ఎంయూలను గడిచిన పది రోజుల్లోనే ఉత్పత్తి చేయడం విశేషం. గతేడాది మాదిరే మంచి వర్షాలు కురిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 3,718.53 ఎంయూల ఉత్పత్తికి అవకాశముందని జెన్కో అంచనా వేయగా, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటికే 3,849 ఎంయూల ఉత్పత్తి జరగడం గమనార్హం. తొలి అర్ధ వార్షికం ముగిసే (సెప్టెంబర్ చివరి) నాటికే 3,369 ఎంయూల ఉత్పత్తి జరిగింది. 6,000 ఎంయూల ఉత్పత్తికి అవకాశం కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల తదితర జలాశయాల్లో నిల్వ ఉన్న 578 టీఎంసీల జలాలతో 2,052 ఎంయూలు, గోదావరి బేసిన్‌లోని నిజాంసాగర్, పోచంపాడు తదితర జలాశయాల్లో నిల్వ ఉన్న 137 టీఎంసీలతో 138 ఎంయూలు కలిపి మొత్తం 2,190 ఎంయూల జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశముందని జెన్కో అంచనాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్‌తో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసినా, ఇంకా విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి. జలాశయాలన్నీ నిండి ఉండటంతో విద్యుదుత్పత్తి ద్వారా వచ్చిన నీళ్లను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ జెన్కో రికార్డుస్థాయిలో 6,000 ఎంయూల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశముంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో.. 900 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్కొక్కటీ 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 యూనిట్లు ఉండగా, ఐదు యూనిట్లు మాత్రమే ఉత్పత్తికి లభ్యంగా ఉన్నాయి. రెండేళ్ల కింద జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఓ యూనిట్ పునరుద్ధరణ ఇంకా పూర్తికాలేదు. ఇక్కడి నుంచి 100% స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయడానికి 45 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో అవసరం. ఇప్పటికే శ్రీశైలంలో నిల్వ ఉన్న 214 టీఎంసీల జలాలతో 1,009 ఎంయూల జల విద్యుదుత్పత్తి చేయొచ్చని జెన్కో అంచనా వేసింది. కొనసాగుతున్న ఇన్‌ఫ్లోను పరిగణనలోకి తీసుకుంటే ఉత్పత్తి మరింత పెరగనుంది. ►815.6 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రంలో 100శాతం ఉత్పత్తి చేసేందుకు 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో అవసరం. జలాశయంలో నిల్వ ఉన్న 311 టీఎంసీలతో 987 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. డిస్కంలకు భారీ ఊరట తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలను.. ఈ ఏడాది జల విద్యుత్ కొంత వరకు ఆదుకుంది. చౌక ధరకు లభించే జల విద్యుత్ భారీ మొత్తంలో ఉత్పత్తి కావడంతో డిస్కంలపై విద్యుత్ కొనుగోళ్ల భారం కొంత తగ్గింది. 2022–23లో మొత్తం 3,561 ఎంయూల జలవిద్యుత్ కొనుగోళ్లు చేసేందుకు డిస్కంలకు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిచ్చింది. ఇందుకు రూ.1,307 కోట్లను ఫిక్స్డ్ చార్జీలుగా జెన్కోకు చెల్లించాలని ఆదేశించింది. జలవిద్యుత్‌కు వేరియబుల్ చార్జీలేమీ ఉండవు... అంతే వ్యయానికి అదనంగా ఉత్పత్తైన జల విద్యుత్‌ను సైతం డిస్కంలకు జెన్కో సరఫరా చేయాల్సి ఉంటుంది. దీంతో కనీసం రూ.వెయ్యి కోట్లకు పైగా రాష్ట్ర డిస్కంలకు ఆదా కానుంది. -
కేంద్ర గెజిట్‌ను అడ్డుకుందాం
సాక్షి, పంజగుట్ట(హైదరాబాద్): ఈనెల 14నుంచి తెలుగురాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులను, ప్రాజెక్టులను కేంద్రం చేతుల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కేంద్రగెజిట్ను రెండు రాష్ట్రాల ప్రజలు అడ్డుకోవాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రం ఒకవైపు ప్రత్యేకరాష్ట్రంల ఇచ్చి మరోవైపు నీటిహక్కుల్ని లాక్కుంటే ఇక రాష్ట్రమిచ్చిన ప్రయోజనం ఏముందని నాయకులు ప్రశ్నించారు. అందుకే కేంద్ర గెజిట్ ప్రతుల్ని దగ్ధం చేయడంతోపాటుగా ఈ అంశంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు శనివారం మీడియాకు తెలిపారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కృష్ణాలో తెలంగాణకు న్యాయపరమైన వాటా సాధిద్దాం’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. నదీ జలాల పంపకం సరిగ్గా జరగలేదని, ఆంధ్రాలో కేవలం గేట్లు ఎత్తితే నీరు పారుతుందని, తెలంగాణలో ఎత్తిపోతల ద్వారానే నీటిని వాడుకోవాల్సి పరిస్థితి ఉందని వివరించారు. కృష్ణా నీటి పంపకాల్లో వివాదం ఉంటే గోదావరి ప్రాజెక్టులపై కూడా కేంద్ర పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. సీపీఐ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలల ప్రాజెక్టు కాళేశ్వరం కూడా కేంద్రం అధీనంలోకి వెళ్లబోతోందని, ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం పెత్తనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధ్యయన వేదిక కన్వీనర్లు ఎం.రాఘవాచారి, ఎ.రాజేంద్రబాబు, టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్యపద్మ, పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘కృష్ణా, గోదావరి’ గెజిట్ అమల్లో ముందడుగు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో ముందడుగు పడింది. కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల వివరాలన్నీ తక్షణమే ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏయే ప్రాజెక్టులను బోర్డులు ఆదీనంలోకి తీసుకుని నిర్వహించాలన్నది తేలాకనే సీఐఎస్ఎఫ్ భద్రతపై చర్చిద్దామని తెలిపాయి. ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా డిపాజిట్ చేసే అంశాన్ని ప్రభుత్వాలతో చర్చించాకనే వెల్లడిస్తామని రెండు రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు ఇచ్చే అంశాల ఆధారంగా బోర్డు స్వరూపాలను ఖరారు చేసి బోర్డులకు అందజేస్తామని ఉపసంఘాల కన్వీనర్లు తెలిపారు. బోర్డు పరిధి, స్వరూపాన్ని ఖరారు చేసేందుకు వేర్వేరుగా కృష్ణా, గోదావరి బోర్డులు ఉపసంఘాలను నియమించాయి. ఈ రెండు ఉపసంఘాలు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో వేర్వేరుగా సమావేశమయ్యాయి. కృష్ణా బోర్డు ఉప సంఘానికి రవికుమార్ పిళ్లై, గోదావరి బోర్డు ఉప సంఘానికి బీపీ పాండే నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఉప సంఘాల సమావేశాల్లో బోర్డు సభ్యులు, ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ సీఈ మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. 23లోగా వివరాలు ఇవ్వాల్సిందే తొలుత కృష్ణా బోర్డు ఉప సంఘం సమావేశం జరిగింది. ప్రాజెక్టుల వివరాలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అందజేసింది. తెలంగాణ అధికారులు ఈనెల 23లోగా ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫరి్నచర్‌తో సహా అన్ని వివరాలను అందిస్తూనే వాటి పరిధిలో పనిచేసే ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను అందజేయాలని ఉపసంఘం కన్వీనర్ రవికుమార్ పిళ్లై ఆదేశించారు. వాటితోపాటే నిర్మాణంలోని ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన వివరాలు, వాటి బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీల జాబితా, వాటి నిర్వహణకు చేస్తున్న ఖర్చుల వివరాలు ఇవ్వాలని కోరారు. శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని విడుదల చేసేటప్పుడు లెక్కిస్తున్న నేపథ్యంలో.. దాని దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌ను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏపీ సీఈ శ్రీనివాసరెడ్డి చెప్పగా.. తెలంగాణ సీఈ మోహన్‌కుమార్ వ్యతిరేకించారు. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు అన్ని వివరాలు అందజేయాలని కన్వీనర్ రవికుమార్ పిళ్లై కోరారు. 20న మళ్లీ గోదావరి బోర్డు ఉపసంఘం భేటీ గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల వివరాలన్నీ ఏపీ అధికారులు ఇప్పటికే బోర్డుకు అందజేశారు. తెలంగాణ అధికారులు ఇప్పటిదాకా ప్రాజెక్టుల వివరాలు ఇవ్వకపోవడంతో.. తక్షణమే అందజేయాలని గోదావరి బోర్డు ఉపసంఘం కన్వీనర్ బీపీ పాండే ఆదేశించారు. గెజిట్ నోటిఫికేషన్‌ను అక్టోబర్ 14 నుంచి అమలు చేయాల్సిన నేపథ్యంలో బోర్డు పరిధి, స్వరూపాన్ని తక్షణమే ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో 20న మళ్లీ ఉపసంఘం సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
నేడు జలసౌధలో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సబ్ కమిటీ సమావేశం
హైదరాబాద్: జలసౌధలో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల సబ్ కమిటీ సమావేశం శుక్రవారం జరగనుంది. ఈ సమావేశానికి ఇరురాష్ట్రాల ఇంజనీర్లతో కూడిన ఏడుగురు సభ్యుల బృందం హాజరుకానుంది. కాగా, గెజిట్ నోటిఫికేషన్ అమలు, తీసుకోవాల్సిన చర్యలపై సబ్‌కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బోర్డులో సిబ్బంది నియామకం, బోర్డు పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులు, అవసరమైన నిధులు, భద్రత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గెజిట్ నోటిఫికేషన్ అంశాలను అక్టోబర్ 14నుంచి అమలు చేయాలని కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీలను కేంద్రం ఆదేశించింది. చదవండి: ఆంధ్రా ఆక్వా అంటే.. అమెరికాలో లొట్టలు! -
కేంద్రం ఎలా చెబితే అలా
సాక్షి, హైదరాబాద్: కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలుపై తెలుగు రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశాల వివరాలను కృష్ణా, గోదావరి బోర్డులు కేంద్రానికి నివేదించనున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన నెల రోజుల్లోగా గెజిట్‌లోని అంశాల అమలుకు నిర్దిష్ట కార్యాచరణ పూర్తి చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన సమన్వయ కమిటీ, బోర్డుల అత్యవసర భేటీ వివరాలను మంగళవారమే కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక రూపంలో పంపనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా బోర్డులు తదుపరి కార్యాచరణను మొదలు పెట్టే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అత్యవసర భేటీ అసంపూర్ణమే.. ఈ నెల 3న బోర్డులు ఉమ్మడిగా నిర్వహించిన సమన్వయ కమిటీ భేటీకి దూరంగా ఉన్న తెలంగాణ, సోమవారం నాటి అత్యవసర బోర్డుల భేటీకి కూడా దూరంగా ఉంది. సోమవారం ఉదయం 11 గంటలకు జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ తరఫున జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో బోర్డులకు సిబ్బంది నియామకం, నిధుల విడుదల, బోర్డు స్వరూపం తదితరాలపై చర్చించారు. ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం, అనుమతుల్లేని ప్రాజెక్టులు, సీఐఎస్ఎఫ్ భద్రత, విద్యుదుత్పత్తి వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపకల్పనకు ఏపీ సహకారాన్ని బోర్డులు కోరాయి. గెజిట్‌లో పేర్కొన్న మేరకు అన్ని నివేదికలు, వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. దీనిపై స్పందించిన ఏపీ షెడ్యూల్–2, 3లో పేర్కొన్న కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని తెలిపింది. వీటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని పేర్కొంది. దీంతో కేంద్రానికి నివేదించే అంశాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని బోర్డులు పేర్కొన్నాయి. బోర్డుల నిర్వాహక వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించాలని కోరగా అందుకు ఏపీ అంగీకరించింది. అనంతరం బోర్డులు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి. తెలంగాణ సభ్యులు ఎవరూ ఈ భేటీకి హాజరు కాలేదని తెలిపాయి. వివిధ అంశాలపై ఏపీ అధికారుల స్పందనను తెలియజేశాయి. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత అంశంపై కేంద్ర హోంశాఖతో కేంద్ర జల్‌శక్తి శాఖ చర్చిస్తోందని తెలిపాయి. నిర్దిష్ట గడువులకు అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ అమలుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరాయి. గెజిట్ అమలుకు సహకరిస్తాం: ఏపీ బోర్డులకు సంబంధించి వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. అక్టోబర్ 14 నుంచి నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని, దీనికి తగ్గట్టుగా ప్రాజెక్టుల వివరాలు బోర్డులకు అందిస్తామన్నారు. -
భేటీకి హాజరుకాలేం.. స్పష్టం చేసిన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలుపై చర్చించేందుకు సోమవారం ఏర్పాటు చేసిన పూర్తి స్థాయి బోర్డు భేటీకి దూరంగా ఉండాలని తెలంగాణ నిర్ణయించింది. ఇదే రోజున సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ప్రాధాన్య కేసుల విచారణ ఉన్నందున.. ఈ భేటీలకు హాజరుకాలేమని ఇదివరకే తెలంగాణ స్పష్టం చేసింది. ఆదివారం కూడా బోర్డులకు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ మళ్లీ లేఖలు రాసింది. తెలంగాణ లేఖల నేపథ్యంలో సోమవారం నాటి బోర్డుల ఉమ్మడి భేటీ ఉంటుందా.. లేదా.. అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో బోర్డులు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ భేటీకి సైతం రాలేమని తెలంగాణ చెప్పినా సమావేశం కొనసాగించాయి. ఇదే రీతిన బోర్డులు ముందుకు సాగుతాయా.. లేక తెలంగాణ వినతి నేపథ్యంలో వెనక్కి తగ్గుతాయా అన్నది ఉత్కంఠగా మారింది. ఒకరిపై ఒకరు లేఖాస్త్రాలు.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గత నెల 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలే అజెండాగా ఈనెల 9న భేటీ నిర్వహిస్తామని తెలుగు రాష్ట్రాలకు రెండు బోర్డులు 4న లేఖలు రాశాయి. అయితే దీనిపై తెలంగాణ వెంటనే స్పందించింది. అదే రోజు తమకు కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ఉపసంహరణపై విచారణ, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎన్జీటీ ముందు విచారణకు రానుందని, ఈ నేపథ్యంలో భేటీలకు హాజరు కాలేమని తెలిపింది. అయినా పట్టించుకోని బోర్డులు, గత నెల 28న కేంద్ర జల శక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్థీ రాసిన లేఖలను ప్రస్తావిస్తూ.. 30 రోజుల్లో నోటిఫికేషన్ అమలు చేసేలా సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాల్సి ఉన్న దృష్ట్యా ఈ భేటీకి రావాలని లేఖలో కోరాయి. అయితే ఈ లేఖల అంశాలతో పాటు, గెజిట్‌లోని ఇతర అంశాలపై శని, ఆదివారాల్లో సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇరిగేషన్ ఇంజనీర్లకు పలు అంశాలపై మార్గదర్శనం చేశారు. ఆయన సూచన మేరకు ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ ఆదివారం బోర్డులకు వేర్వేరుగా లేఖలు రాశారు. కోర్టు కేసుల విచారణ దృష్ట్యా 9న భేటీకి రాలేమని, అందరికీ ఆమోదమైన మరో రోజున భేటీ నిర్వహిస్తే రాష్ట్ర ఇంజనీర్లు హాజరై, వారి అభిప్రాయాలు వెల్లడిస్తారని లేఖల్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో పరిపాలన పరమైన అంశాలే కాకుండా, నీటి వినియోగానికి సంబంధించిన అంశాలను సైతం అజెండాలో చేర్చాలని కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో కోరారు. అయితే దీనిపై బోర్డులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది సోమవారం ఉదయం వెల్లడి కానుంది. ఏపీ మాత్రం ఈ భేటీలకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అజెండా పంపి.. వాటాలు రాబట్టాలి బోర్డుల భేటీ వాయిదా కోరుతున్న తెలంగాణ కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాపై పోరాడేందుకు సిద్ధమవుతోంది. రెండ్రోజుల పాటు వరుసగా దీనిపై చర్చించిన సీఎం బోర్డులకు సమగ్ర అజెండా అంశాలతో లేఖలు రాయాలని, వాటిని బోర్డుల్లో చర్చించేలా పట్టుబట్టాలని ఇంజనీర్లకు సూచించారు. దానికి అనుగుణంగా రావాల్సిన వాటాలు దక్కించుకోవాలని చెప్పారు. ముందుగా రాష్ట్రం లేవనెత్తుతున్న అంశాలను చర్చించేలా అజెండాతో బోర్డులకు లేఖలు రాయాలని సూచించినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా ఇంతవరకు కొనసాగుతున్న కృష్ణా జలాల్లో ఉన్న నీటి వాటాల నిష్పత్తిని మార్చి దాన్ని చెరిసగం పంచాలని, ఏపీ అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను తక్షణమే ఆపేలా చర్యలతో పాటు, పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా తరలిస్తున్న నీటి తరలింపును అడ్డుకునేలా వాదనలు సిద్ధం చేయాలని చెప్పినట్లు సమాచారం. వీటితో పాటే బచావత్ అవార్డు ప్రకారం.. పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల వాటాపై గట్టిగా వాదనలు వినిపించాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. తాగునీటి అవసరాలకు వినియోగించే నీటిలో 20 శాతం వినియోగం మాత్రమే పరిగణనలోకి తీసుకునే అంశాలపై ఇదివరకే రాసిన లేఖలు, దీనిపై బోర్డులు, కేంద్రం స్పందించిన తీరు, చేపట్టిన చర్యలన్నింటినీపైనా బలమైన వాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనల నేపథ్యంలో ఆదివారం సైతం అంతర్రాష్ట్ర విభాగపు ఇంజనీర్లు తమ కసరత్తును కొనసాగించారు. -
నదుల అనుసంధానం.. ఓ భగీరథయత్నం
సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం అంటే.. ఎవరో కట్టిన కాలువలో నాలుగు చెంబుల నీళ్లు ఎత్తిపోయడమా.. ఆ కాలువలో వర్షపు నీటిని చూపించి రెండు నదులను అనుసంధానించేశామంటూ కోట్లు ఖర్చుపెట్టి ఈవెంట్లు చేయడమా... వేర్వేరు మార్గాలలో పయనించే రెండు నదులను అనుసంధానించడం ఓ భగీరథయత్నం.. ఇందుకు నిధులు మాత్రమే కాదు నిబద్ధత, దృఢ దీక్ష కూడా అవసరమే. పాలకులకు అవి ఉన్నప్పుడే అనుసంధాన యత్నాలు ఫలిస్తాయి. రెండు కాదు.. మూడు కాదు రాష్ట్రంలో మొత్తంగా ఆరు చోట్ల నదుల అనుసంధానం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రం పరిధిలోని నదుల అనుసంధానం పనులను వేగవంతం చేస్తూనే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ వంటి అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంపైనా కేంద్రంతో కలిసి కసరత్తు చేస్తోంది. నదుల అనుసంధానం అంటే ఇదీ.. నదుల అనుసంధానానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఒక నదిపై బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి వరద జలాలను మరో నదిపై నిర్మించే బ్యారేజీలోకి తరలించినప్పుడే ఆ రెండు నదులు అనుసంధానం చేసినట్లు లెక్క. గోదావరి నదిపై ఎలాంటి బ్యారేజీ నిర్మించకుండా..దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన పోలవరం కుడి కాలువ మీదుగా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి 2016లో గోదావరి జలాలను తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసినట్లు నాటి సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని అప్పట్లో సీడబ్ల్యూసీ ఖండించడం గమనార్హం. రూ.145.34 కోట్లతో వంశధార–నాగావళి అనుసంధానం నాగావళి నదిలో వరద ఆలస్యంగా రావడం, నారాయణపురం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఖరీఫ్‌లో ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో హిరమండలం రిజర్వాయర్‌కు తరలించిన వంశధార నీటిని, ఆ రిజర్వాయర్ మట్టికట్ట 5.6 కి.మీ వద్ద నుంచి 33.583 కి.మీల పొడవున హెచ్చెల్సీ(హైలెవల్ కెనాల్)ను తవ్వి రోజుకు 600 క్యూసెక్కులను నారాయణపురం ఆనకట్టకు ఎగువన నాగావళి నదిలోకి పోయడం ద్వారా ఆ రెండు నదులను అనుసంధానం చేసి, ఆయకట్టును సస్యశ్యామలం చేసే పనులను రూ.145.34 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే 31.30 కి.మీ పొడవున హెచ్చెల్సీ తవ్వకం పనులను పూర్తి చేసింది. కేవలం 2.283 కి.మీల కాలువ తవ్వకం పనులు మాత్రమే మిగిలాయి. వాటిని ఖరీఫ్ నాటికి పూర్తి చేసి.. వంశధార–నాగావళి అనుసంధానాన్ని సాకారం చేయనున్నది. దీని వల్ల నారాయణపురం ఆనకట్ట కింద 39,179 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు హెచ్చెల్సీ కింద కొత్తగా ఐదు వేల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం నుంచి గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు అనుసంధానం ► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి అనుసంధానం.. తెలుగుంగ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా(శ్రీశైలం రిజర్వాయర్)–పెన్నా (సోమశిల రిజర్వాయర్)ను ఇప్పటికే అనుసంధానం చేశారు. సోమశిల వరద కాలువ 12.52 కి.మీ నుంచి రోజుకు 2,500 క్యూసెక్కులను తరలించి.. చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో పోయడం ద్వారా కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి నదులను అనుసంధానం చేసే పనులను ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టింది. ఈ అనుసంధానం ద్వారా 1.23 లక్షల ఎకరాలకు నీళ్లందించనున్నారు. స్వర్ణముఖి నది పెన్నా ఉప నది. కృష్ణా–పెన్నా–పాపాఘ్ని అనుసంధానం.. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం కింద 2009 నాటికే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా–పెన్నా నదులను అనుసంధానం చేశారు. పెన్నా ఉప నది అయిన పాపాఘ్ని పరీవాహక ప్రాంతం పూర్తిగా వర్షాభావ ప్రాంతంలో ఉంది. దీని వల్ల పాపాఘ్నిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గాలేరు–నగరి ద్వారా శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా నదీ వరద జలాలు.. గాలేరు–నగరి ప్రధాన కాలువ 56 కి.మీ వద్ద నుంచి జలాలను ఎత్తిపోసి.. పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్‌లోకి తరలించే పనులను చేపట్టారు. దీని ద్వారా 26 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కృష్ణా–వేదవతి అనుసంధానం.. కృష్ణా ఉప నది అయిన వేదవతిపై అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్టును 1956లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. టీడీపీ సర్కార్ హయాంలో కర్ణాటకలో వేదివతిపై చెక్ డ్యామ్‌లు నిర్మించడంతో బీటీపీలోకి చుక్క నీరు చేరడం లేదు. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే నీటిని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీలోకి ఎత్తిపోయడం ద్వారా కృష్ణా–వేదవతి నదుల అనుసంధానం పనులను రూ.968 కోట్లతో చేపట్టింది. దీని ద్వారా బీటీపీ కింద 12 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు వర్షాభావ ప్రాంతంలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో చెరువులను నింపడం ద్వారా మరో 10,323 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కసరత్తు... గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. జానంపల్లి నుంచి గోదావరి–కృష్ణా(నాగార్జునసాగర్)–పెన్నా(సోమశిల)–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం చేసేలా ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) రూపొందించిన ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను చెబుతూ.. తక్కువ వ్యయంతో గరిష్టంగా వరద జలాలను ఒడిసి పట్టి.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలనూ సిద్ధం చేయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశాక.. వాటిని ఎన్‌డబ్ల్యూడీఏకు పంపి.. పనులు చేపట్టాలని నిర్ణయించారు. కేసీ కెనాల్‌తోనే నదుల అనుసంధానానికి నాంది.. తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో సుంకేశుల వద్ద ఆనకట్ట నిర్మించి, అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లాలో పెన్నా నదిని అనుసంధానిస్తూ కేసీ కెనాల్ తవ్వకం పనులను 1863లో ప్రారంభించిన డచ్ సంస్థ 1870 నాటికి పూర్తి చేసింది. ఈ కాలువను నౌకా మార్గంగా వినియోగించుకుని వ్యాపారం చేసేది. వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ కాలువను 1882లో ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ సంస్థ నుంచి రూ.3.02 కోట్లకు కొనుగోలు చేసింది. సర్ ఆర్ధర్ కాటన్ ప్రతిపాదన మేరకు కేసీ కెనాల్‌ను 1933లో సాగునీటి వనరుగా మార్చింది. ఈ కాలువ కింద ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. దేశంలో కేసీ కెనాల్ ద్వారానే నదుల అనుసంధానం చేయడం ప్రథమం కావడం గమనార్హం. కేసీ కెనాల్ స్ఫూర్తితోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినట్లు ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది. తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా తుంగభద్రపై తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా తుంగభద్ర జలాలను పెన్నాపై నిర్మించిన మధ్య పెన్నార్ ప్రాజెక్టులోకి.. అక్కడి నుంచి చిత్రావతిపై నిర్మించిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి తరలించేలా ప్రణాళిక రూపొందించి.. పనులు ప్రారంభించారు. ఈ పనులు 2009 నాటికి పూర్తయ్యాయి. దీని ద్వారా తద్వారా తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం పనులను 2009 నాటికి దివంగత సీఎం వైఎస్ పూర్తి చేశారు. దీని ద్వారా 1,90,035 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. నదుల అనుసంధానానికి రాష్ట్రమే స్ఫూర్తి.. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడం కోసం కృష్ణా నది నుంచి తన కోటాలో నుంచి ఐదు టీఎంసీల చొప్పున కేటాయించేందుకు ఫిబ్రవరి 15,1976న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలు అంగీకరించాయి. ఈ నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తరలించేలా అక్టోబర్ 27, 1977న ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. చెన్నైకి తాగునీటిని అందించడంతోపాటు 29 టీఎంసీల కృష్ణా వరద జలాలు, 30 టీఎంసీల పెన్నా వరద జలాలను ఒడిసి పట్టి.. కర్నూల్, వైఎస్సార్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టేందుకు 1978లో ప్రభుత్వం సర్వే పనులను చేపట్టింది. ఈ పనులను 2009 నాటికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. తెలుగుగంగలో భాగంగా కృష్ణా(శ్రీశైలం)–పెన్నా(సోమశిల)–పూండి రిజర్వాయర్(తమిళనాడు)ను అనుసంధానం చేశారు. దేశంలో అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి ఈ పథకమే స్ఫూర్తి అని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి.. బీడు భూములకు మళ్లించి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా నదులను అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్రం పరిధిలోని ఆరు అనుసంధానాల పనులను చేపట్టాం. వంశధార–నాగావళి, గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు, కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి, కృష్ణా–పెన్నా–పాపాఘ్ని, కృష్ణా–వేదవతి అనుసంధానం పనులను వేగవంతం చేశాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి అత్యధిక ప్రయోజనం చేకూరేలా గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానం చేయడంపై కసరత్తు చేస్తున్నాం. నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
కృష్ణా, గోదావరి బోర్డులే బాస్‌లు!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు తెరదించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం రాత్రి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కృష్ణా బేసిన్‌లోని 36 ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో 71 ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి వస్తాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్సహా చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ(ట్రాన్స్మిషన్ లైన్స్), ఆయకట్టుకు నీటి విడుదల చేసే ప్రాంతాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతలను బోర్డులే నిర్వహిస్తాయి. బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. ఈ మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, నిర్వహణ నియమావళిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అనుమతి తీసుకోకుండానే పూర్తి చేసినవి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను నోటిఫికేషన్లో పేర్కొన్నంత మాత్రాన వాటిని ఆమోదించినట్లు కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా చేపట్టిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులను ఆపివేయాలని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ప్రచురించిన రోజు నుంచి ఆర్నెల్లలోగా వాటికి అనుమతి తెచ్చుకోవాలని సూచించింది. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ఆ ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి బోర్డులు సమర్థంగా పని చేసేందుకు 60 రోజుల్లోగా ఒక్కో బోర్డు ఖాతాలో సీడ్ మనీ కింద ఒకేసారి రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కృష్ణా / గోదావరి బోర్డు ఛైర్మన్ ఆమోదంతో నిర్వహణ ఖర్చుల్ని విడుదల చేయాలని కోరిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని, ఒకవేళ చెల్లించడంలో విఫలమైతే బోర్డుల నిర్వహణలో ఎదురయ్యే పరిణామాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లో ముఖ్యాంశాలు ఇవీ.. విభజన చట్టం ప్రకారం.. విభజన చట్టం సెక్షన్–85(1) ప్రకారం నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా 2014 మే 28న కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బోర్డులు అపెక్స్ కౌన్సిల్ పర్యవేక్షణలో పని చేస్తాయి. కృష్ణా, గోదావరి బోర్డుల ౖచైర్మన్లుగా రెండు రాష్ట్రాలకు చెందని వారినే నియమించాలి. రెండు రాష్ట్రాలకు చెందని వారినే బోర్డు సభ్య కార్యదర్శులుగా, చీఫ్ ఇంజనీర్లుగా నియమించాలి. కృష్ణా, గోదావరి బోర్డుల స్వరూపాన్ని నిర్ణయించుకునే అధికారం ఆ బోర్డులకే ఉంటుంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించిన రోజు నుంచి 30 రోజుల్లోగా బోర్డులు నిర్దేశించుకున్న స్వరూపం, వాటిలో పనిచేసేందుకు ఆయా విభాగాల ఉద్యోగులను కేంద్రం నియమించాలి. బోర్డుల పరిధి ఇదీ.. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విభజన చట్టం సెక్షన్–87(1) ప్రకారం రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని షెడ్యూల్–1, షెడ్యూల్–2, షెడ్యూల్–3లో పేర్కొన్న ప్రకారం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, బ్యారేజీలు, కాలువల వ్యవస్థలో విభాగాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ(ట్రాన్స్మిషన్ లైన్స్) బోర్డు పరిధిలోకి వస్తాయి. ప్రాజెక్టుల పరిధిలోని రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోసహా అందరూ బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాలి. ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. ప్రాజెక్టుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. ►బోర్డులు తమ స్వాధీనంలోకి తీసుకునే షెడ్యూల్–1 ప్రాజెక్టులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ప్రచురితమైన రోజు నాటికి హైకోర్టు, సుప్రీం కోర్టు, ట్రిబ్యునళ్లలో ఏవైనా కేసులు విచారణలో ఉన్నా, భవిష్యత్‌లో కేసులు దాఖలైనా వాటికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ►షెడ్యూల్–3 ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలి. ►ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు చేపట్టాలి. గెజిట్ ప్రకారం అనుమతి లేనివంటే...?. 1. బోర్డు అనుమతి తీసుకోనివి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదించని ప్రాజెక్టులు. 2. కేంద్ర జల్ శక్తి శాఖ, కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలి ఆమోదించని సాగునీటి, బహుళార్ధసాధక, వరద నియంత్రణ ప్రాజెక్టులు. 3. బోర్డు, అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి ఆమోదించిన మేరకు కాకుండా మార్పు చేసిన నిర్మించినవి, నిర్మిస్తున్న ప్రాజెక్టులు. బోర్డుల విధి విధానాలు .. ►కృష్ణా, గోదావరి నదీ వివాదాల ట్రిబ్యునళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం. ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అనుసరించి నీటిని పంపిణీ చేయడం. è ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రెండు రాష్టాలకు పంపిణీ చేయడం. ►కృష్ణా, గోదావరిపై రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను పరిశీలించి కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలికి బోర్డు పంపుతుంది. బోర్డుల పరిశీలనకు పంపని డీపీఆర్‌లను సీడబ్ల్యూసీ టీఏసీ పరిగణనలోకి తీసుకోదు. è ఏదైనా ఒక ప్రాజెక్టును బోర్డులకు ప్రతిపాదించినప్పుడు పరిధిపై వివాదం తలెత్తితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. దీనిపై నిర్ణయాధికారం కేంద్రానిదే. ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత.. గతేడాది అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేయాలని సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. ఈ క్రమంలో నదీ జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదనతో ఏకీభవిస్తూ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు తెరదించేలా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టారు. బోర్డులు ఏర్పాటైన ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు కేంద్రం వాటి పరిధిని ఖరారు చేయడం గమనార్హం. -
ఇద్దరి హక్కులకూ భద్రత
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేలా బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని స్వాగతిస్తూనే అందులో కొన్ని అంశాలపై సవరణలను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన 512, తెలంగాణకు దక్కిన 299 టీఎంసీలను పంపిణీ చేయడంపైనే కృష్ణా బోర్డు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేలా చూడాలని విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువ ఆయకట్టుకు గోదావరి వరద జలాలను మళ్లించగా.. అక్కడ మిగిలే కృష్ణా నీటిని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించుకునే స్వేచ్ఛ కల్పించడం ద్వారా ఆ ప్రాంతాల సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి మార్గం సుగమం చేయాలని కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది. విభజన చట్టం 11వ షెడ్యూల్లో అప్పటికే నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుగంగ, గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రీ–నీవా, తెలంగాణలోని నెట్టెంపాడు (22 టీఎంసీలు), కల్వకుర్తి (25 టీఎంసీలు) కేంద్రం అనుమతి ఇచ్చిందని.. ఇప్పుడు వాటికి ఆర్నెళ్లలోగా మళ్లీ అనుమతి తీసుకోవాలంటూ విధించిన నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరనుంది. విభజన చట్టం ద్వారా ఆ ప్రాజెక్టులకు కల్పించిన రక్షణను కొనసాగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బోర్డులను ఏర్పాటు చేసిన ఏడేళ్ల తర్వాత వాటి పరిధిని ఖరారు చేయడాన్ని స్వాగతిస్తూనే కొన్ని మార్పులు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ), దిగువ ప్రధాన కాలువ (ఎల్లెల్సీ) ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో ఉన్నాయి. తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా హెచ్చెల్సీకి కేటాయించిన 32.5, ఎల్లెల్సీకి కేటాయించిన 29.5 టీఎంసీలను దామాషా పద్ధతిలో తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తోంది. వాటికి తుంగభద్ర జలాశయంలో నీటిని విడుదల చేసినప్పుడు రాష్ట్ర సరిహద్దులోనూ టెలీమీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీలను మళ్లీ కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని, వాటిని పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి వి/æ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద లెక్కిస్తే చాలు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే ప్రాంతమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని కేటాయించిన నీటిని విడుదల చేసేటప్పుడు టెలీమీటర్ల ద్వారా లెక్కిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ ఛానల్, వెలిగోడు రిజర్వాయర్, తెలుగుగంగ లింక్ కెనాల్, ఎస్సార్బీసీ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు కాలువల వ్యవస్థలను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని అక్కడ నీటిని లెక్కించాల్సిన అవసరం లేదని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల బోర్డుకు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకే కృష్ణా బోర్డు పరిధిని పరిమితం చేసేలా కేంద్రానికి సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు అనుమతి లేదంటే ఎలా? వెంకటనగరం ఎత్తిపోతల 2006 నాటికే పూర్తయిందని, తెలుగుగంగ ఆయకట్టును స్థిరీకరించడానికి చేపట్టిన సిద్ధాపురం ఎత్తిపోతల, ఎల్లెల్సీ ఆయకట్టు స్థిరీకరణకు చేపట్టిన గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం 2008 నాటికే పూర్తైందని, ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ఆ ప్రాజెక్టులకు అనుమతి లేదనడం సరి కాదని కేంద్రానికి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పూర్తై ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతి తీసుకోవాలనే నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రతిపాదించనుంది. ఎగువ రాష్ట్రాలతో సంబంధం లేని ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఎందుకు? కృష్ణా డెల్టాకు నీళ్లందించే ప్రకాశం బ్యారేజీ, గోదావరి డెల్టాకు నీళ్లందించే ధవళేశ్వరం బ్యారేజీ, పోలవరం, పోలవరం దిగువన తొర్రిగడ్డ పంపింగ్ స్కీం, వెంకటనగరం ఎత్తిపోతల, పుష్కర, పురుషోత్తపట్నం, తాడిపూడి, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల వల్ల ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని నీటిపారుదలరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తేవడం వల్ల అదనపు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా వాటిని బోర్డుల పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకుంటే సరి.. గోదావరి పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఉమ్మడి ప్రాజెక్టులు ఏవీ లేవు. కానీ.. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఉమ్మడి ప్రాజెక్టులు. జూరాల, పులిచింతల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులు. ఇందులో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల స్పిల్ వేలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, వాటిపై ఆధారపడ్డ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రధాన ప్రాంతాలు(ఇన్‌టేక్‌లు), ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పులిచింతలలో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తే సరిపోతుందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల బోర్డుపై అదనపు భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. బోర్డుల పరిధి విస్తృతమైతే వాటి పరిధిలోని ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ నిర్వహణకు భారీ ఎత్తున వ్యయం అవుతుందని, దీనివల్ల రెండు రాష్ట్రాలపైనా ఆర్థికంగా తీవ్ర భారం పడుతుందని విశ్లేషిస్తున్నారు. నీటి లభ్యత ఆధారంగా దామాషాలో పంపిణీ.. రెండు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో నీటి లభ్యత బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు 811 టీఎంసీలు ఉంటే 66 : 34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని, ఒకవేళ వర్షాభావంతో లభ్యత తగ్గితే అదే నిష్పత్తిలో దామాషా పద్ధతిలో నీటి పంపిణీ చేసేలా కృష్ణా బోర్డుకు నిర్దేశించాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. 2019–20, 2020–21 తరహాలోనే బేసిన్లో భారీ ఎత్తున వరద వస్తే.. శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసి వరద జలాలు సముద్రంలో కలిసే సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు ఏ స్థాయిలో నీటిని మళ్లించుకున్నా వాటిని పరిగణలోకి తీసుకోకూడదని వి/æ్ఞప్తి చేయనుంది. తద్వారా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని కోరనుంది. -
నెలలోగా అపెక్స్ కౌన్సిల్.. ఎజెండా పంపండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరిలపై రెండు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు.. జలాల వినియోగంలో వివాదాలను పరిష్కరించేందుకు జూలైలో అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ చెప్పారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లు రెండు రాష్ట్రాలు ఇప్పటికీ ఇవ్వకపోతే మీరేం చేస్తున్నారంటూ కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్‌లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీఆర్‌లు ఇవ్వాలని మరోసారి 2 రాష్ట్రాలకు లేఖలు రాయాలని.. ఆ లేఖలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎజెండా పంపాలని కోరాలని బోర్డుల చైర్మన్లను ఆదేశించారు. ‘అప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించకపోతే.. మీరే అపెక్స్ కౌన్సిల్‌కు ఎజెండా సిద్ధం చేసి పంపండి’అని బోర్డు చైర్మన్లకు దిశానిర్దేశం చేశారు. ఆ అంశాల ఆధారంగా ఎజెండా.. కృష్ణా, గోదావరి నదులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు, నీటి వివాదాలపై బోర్డు చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్‌లతో గురువారం ఢిల్లీ నుంచి కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2014 జూన్ 2 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులు, కేంద్ర జలసంఘం నుంచి సాంకేతిక అనుమతి తీసుకోకుండా చేపట్టిన ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలని స్పష్టం చేశారు. ఇదే ప్రాతిపదికగా కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను రెండు రాష్ట్రాల నుంచి తీసుకుని.. వాటిని పరిశీలించి సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు పంపడంలో జాప్యం చేస్తున్నారంటూ బోర్డు చైర్మన్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశాల్లో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఈనెల 10లోగా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఆదేశించామని.. కానీ ఇప్పటికీ డీపీఆర్‌లు ఇవ్వలేదని యూపీ సింగ్‌కు బోర్డుల చైర్మన్లు వివరించారు. దీనిపై యూపీ సింగ్ స్పందిస్తూ.. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాల ని మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని ఆదేశించారు. అప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించకపోతే.. ఈ అంశాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు అపెక్స్ కౌన్సిల్‌కు ఎజెండా పంపకపోతే.. బోర్డు సమావేశాల్లో చర్చించిన అంశాలు, వివాదంగా మారిన ప్రాజెక్టుల ఆధారంగా ఎజెండాను సిద్ధం చేయాలని.. దాన్నే ప్రాతిపదికగా తీసుకుని అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తామని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్‌కు ఎజెండా పంపితే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి.. వారి వీలును బట్టి వచ్చే నెలలో ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. -
సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదులపై ఆయా నదీ యాజమాన్య బోర్డుల టెక్నికల్ అనుమతి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్ (డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)లు సమర్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఆదేశించాయి. పూర్తి అనుమతులు వచ్చే వరకు ఆయా ప్రాజెక్టుల పనులు చేయొద్దని స్పష్టం చేశాయి. కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, గోదావరి బోర్డు సభ్యుడు పీఎస్ కుటియాల్ తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి శనివారం లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలను అతిక్రమించి రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే బోర్డులకు సమర్పించాలని ఆదేశించారు. ఎంపీ సంజయ్ లేఖకు స్పందన ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకా వత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రమంత్రి ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులపై వెంట నే సమావేశం నిర్వహించాలని కృష్ణాబోర్డును ఆదేశించారు. ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని ఏపీని ఆదేశించాలని సూచించారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించా రు. కేంద్రమంత్రి ఆదేశాలతో జలవనరుల శాఖ కృష్ణాబోర్డు అధికారులకు లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ, బోర్డు అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముం దుకు వెళ్లకుండా నిలువరించాలని ఆదేశించింది. జూన్ 4న నిర్వహించే కృష్ణా బోర్డు సమావేశంలో ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించేలా ఏపీ అధికారులను పట్టుబట్టా లని సూచించారు. గోదావరి బోర్డుకు ఏపీ ఫిర్యాదు గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, దేవాదుల ఫేజ్–3, మిషన్ భగీరథ, చనకా – కొరటా సహా పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు బోర్డుకు సమర్పించాలని, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేస్తున్న ఈ ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలని బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. చదవండి: గొర్రెల పెంపకంలో మనదే అగ్రస్థానం -
ప్రాజెక్టులపై పెత్తనమెవరికి?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవాలా? లేక రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలా అన్నది తేలే సమయం ఆసన్నమయింది. ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఇరు రాష్ట్రాల ఉద్యోగులూ బోర్డు అధీనంలోనే పని చేసేలా గతంలో రూపొందించిన వర్కింగ్ మాన్యువల్‌పై ఈ నెల 8న జరుగనున్న కృష్ణాబోర్డు భేటీలో కీలక చర్చ జరుగనుంది. ప్రాజెక్టుల నియంత్రణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో బోర్డు మెట్టు దిగుతుందా? లేదా? అన్నది ప్రశ్నగా ఉంది. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డులు ఎప్పటినుంచో కోరుతోంది. దీంతో పాటే ఇప్పటికే నీటి వినియోగం జరుగుతున్న ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంటామని చెబుతోంది. తమ పరిధిలో ఉంటేనే పర్యవేక్షణ సులువవుతుందని అంటోంది. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి బోర్డుపెత్తనమే మేలని చెబుతూ వస్తోంది. దీంతో రేపు జరిగే భేటీ కీలకం కానుంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య 34ః66గా ఉన్న నీటి వినియోగ వాటాను 50ః50గా చేయాలని తెలంగాణ కోరే అవకాశం ఉంది. దీనిపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
‘అపెక్స్’లోనే తేల్చుదాం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ కోర్టులోకి నెట్టింది. కృష్ణాబోర్డు ఇప్పటికే తయారు చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై తెలుగు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న దృష్ట్యా, దీన్ని కేంద్ర జల వనరులశాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో చర్చించి తుది నిర్ణయానికి రావాలని నిర్ణయించింది. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఉన్న సమస్యలపై గురువారం హోంశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం బోర్డు అధికారులతో చర్చించింది. ఈ భేటీలో బోర్డు సిద్ధంచేసిన వర్కింగ్ మాన్యువల్‌ను సంఘానికి అందించారు. ప్రాజెక్టుల నియంత్రణ తమ పరిధిలో లేనందున శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి వినియోగంలో ఇరు రాష్ట్రాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని, తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని బోర్డు అధికారులు స్థాయీ సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ దృష్ట్యా ప్రాజెక్టుల నియంత్రణను తమకు అప్పగించాలని కోరడంతో పాటుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో భేటీ జరిపి తుది నిర్ణయం చేద్దామని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఇక టెలీమెట్రీ అంశంపైనా ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని బోర్డు వర్గాలు తెలిపాయి. -
‘కృష్ణా, గోదావరి వినియోగంలోకి వస్తేనే లాభం’
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి జలాలు తెలంగాణ ప్రజలకు సంపూర్ణంగా వినియోగంలోకి వచ్చిననాడే లాభం ఉంటుందని టీఆర్ఎస్ ఎంపీలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని నీటి లభ్యత, నాణ్యత అంశాలపై స్వానిటి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీలు సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీబీ పాటిల్, బూర నర్సయ్యగౌడ్, బండ ప్రకాశ్, బడుగు లింగయ్య, ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్ర తేజావత్, తెలంగాణ భవన్ ఆర్సీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ నిపుణులు ఎం.కె.శ్రీనివాస్, జలవనరుల అభివృద్ధి అథారిటీ ఎంఎస్ అగర్వాల్, జలవనరుల అథారిటీకి సంబంధించిన టెక్నోక్రాట్ల బృందం తెలంగాణలోని నీటి లభ్యత, వినియోగం తదితర అంశాలపై ఎంపీలకు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. -
గ్యాస్ ధరలపై కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీం
న్యూఢిల్లీ: కృష్ణాగోదావరి(కేజీ) బేసిన్ నుంచి లభించే గ్యాస్‌కు ధరను నిర్ణయించడంలో ప్రణాళికలేమిటన్నది వివరించాల్సిందిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది. ఈ విషయంలో గత యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాలను అవలంబించనున్నారా లేక వీటిపై వాదనలకు తెరలేపనున్నారా అంటూ ప్రశ్నించింది. ఇదీ కాకుంటే ఇతర ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా అన్న విషయాలను తెలియజేయాల్సిందిగా కోరింది. ఈ అంశంపై ప్రస్తుత పరిస్థితిని వెల్లడించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. గ్యాస్ ధరల అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించింది. గ్యాస్ ధరను రెట్టింపు చేయడంపై సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తాతోపాటు, ఎన్జీవో కామన్‌కాజ్ అనే సంస్థ 2013లో ప్రజోపయోగ వ్యాజ్యాన్ని(పీఐఎల్) దాఖలు చేశాయి. -
కృష్ణా, గోదావరి పరవళ్లు
జలాశయాల్లోకి భారీగా చేరిన నీరు బెంగళూరు/గద్వాల/ధవళేశ్వరం/చర్ల: మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలతో మూడు రోజులుగా కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. ఆలమట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీ స్థాయిలో నీరు రావడంతో వాటిలో నీటిమట్టం గ రిష్ట స్థాయికి చేరింది. దీంతో విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని ఆలమట్టిలో సోమవారం సాయంత్రానికి 1,14,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 92 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వీటిలో 42 వేల క్యూసెక్కులను విద్యుదుత్పాదన కోసం వినియోగిస్తున్నారు. మిగిలిన 50 వేల క్యూసెక్కులను కొన్ని గేట్లను ఎత్తివేసి నారాయణపూర్ జలాశయానికి వదులుతున్నారు. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టులో ఒక క్రస్టు గేటును తెరిచి 6,735 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ విడుదలవుతున్న నీరు మంగళవారం సాయంత్రానికి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు చేరే అవకాశం ఉంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. సోమవారం దవళేశ్వరం బ్యారేజ్ వద్ద 9.50 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది.