కృష్ణా, గోదావరి పరవళ్లు
జలాశయాల్లోకి భారీగా చేరిన నీరు
బెంగళూరు/గద్వాల/ధవళేశ్వరం/చర్ల: మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలతో మూడు రోజులుగా కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. ఆలమట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీ స్థాయిలో నీరు రావడంతో వాటిలో నీటిమట్టం గ రిష్ట స్థాయికి చేరింది. దీంతో విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని ఆలమట్టిలో సోమవారం సాయంత్రానికి 1,14,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 92 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వీటిలో 42 వేల క్యూసెక్కులను విద్యుదుత్పాదన కోసం వినియోగిస్తున్నారు. మిగిలిన 50 వేల క్యూసెక్కులను కొన్ని గేట్లను ఎత్తివేసి నారాయణపూర్ జలాశయానికి వదులుతున్నారు. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టులో ఒక క్రస్టు గేటును తెరిచి 6,735 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ విడుదలవుతున్న నీరు మంగళవారం సాయంత్రానికి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు చేరే అవకాశం ఉంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. సోమవారం దవళేశ్వరం బ్యారేజ్ వద్ద 9.50 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది.