
సాక్షి, హైదరాబాద్: కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలుపై తెలుగు రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశాల వివరాలను కృష్ణా, గోదావరి బోర్డులు కేంద్రానికి నివేదించనున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన నెల రోజుల్లోగా గెజిట్‌లోని అంశాల అమలుకు నిర్దిష్ట కార్యాచరణ పూర్తి చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన సమన్వయ కమిటీ, బోర్డుల అత్యవసర భేటీ వివరాలను మంగళవారమే కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక రూపంలో పంపనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా బోర్డులు తదుపరి కార్యాచరణను మొదలు పెట్టే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అత్యవసర భేటీ అసంపూర్ణమే..
ఈ నెల 3న బోర్డులు ఉమ్మడిగా నిర్వహించిన సమన్వయ కమిటీ భేటీకి దూరంగా ఉన్న తెలంగాణ, సోమవారం నాటి అత్యవసర బోర్డుల భేటీకి కూడా దూరంగా ఉంది. సోమవారం ఉదయం 11 గంటలకు జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌ల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ తరఫున జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో బోర్డులకు సిబ్బంది నియామకం, నిధుల విడుదల, బోర్డు స్వరూపం తదితరాలపై చర్చించారు. ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం, అనుమతుల్లేని ప్రాజెక్టులు, సీఐఎస్‌ఎఫ్ భద్రత, విద్యుదుత్పత్తి వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపకల్పనకు ఏపీ సహకారాన్ని బోర్డులు కోరాయి.
గెజిట్‌లో పేర్కొన్న మేరకు అన్ని నివేదికలు, వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. దీనిపై స్పందించిన ఏపీ షెడ్యూల్–2, 3లో పేర్కొన్న కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని తెలిపింది. వీటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని పేర్కొంది. దీంతో కేంద్రానికి నివేదించే అంశాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని బోర్డులు పేర్కొన్నాయి. బోర్డుల నిర్వాహక వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించాలని కోరగా అందుకు ఏపీ అంగీకరించింది. అనంతరం బోర్డులు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి. తెలంగాణ సభ్యులు ఎవరూ ఈ భేటీకి హాజరు కాలేదని తెలిపాయి. వివిధ అంశాలపై ఏపీ అధికారుల స్పందనను తెలియజేశాయి. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్ బలగాలతో భద్రత అంశంపై కేంద్ర హోంశాఖతో కేంద్ర జల్‌శక్తి శాఖ చర్చిస్తోందని తెలిపాయి. నిర్దిష్ట గడువులకు అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ అమలుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరాయి.
గెజిట్ అమలుకు సహకరిస్తాం: ఏపీ
బోర్డులకు సంబంధించి వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. అక్టోబర్ 14 నుంచి నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని, దీనికి తగ్గట్టుగా ప్రాజెక్టుల వివరాలు బోర్డులకు అందిస్తామన్నారు.