అంచనాలకు మించి జల విద్యుదుత్పత్తి | Telangana Electricity Generating Corporation GENCO Generated Huge MU | Sakshi
Sakshi News home page

అంచనాలకు మించి జల విద్యుదుత్పత్తి

Published Wed, Oct 12 2022 2:26 AM | Last Updated on Wed, Oct 12 2022 2:26 AM

Telangana Electricity Generating Corporation GENCO Generated Huge MU - Sakshi

విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. జెన్‌కో కాసుల పంట పండింది. గత ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 10 వరకు భారీగా 3849.79 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) జల విద్యుదుత్పత్తి జరిపింది.

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. తెలంగాణ విద్యుదు త్పత్తి సంస్థ (జెన్‌కో) కాసుల పంట పండించింది. గత ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 10 వరకు భారీగా 3,849.79 మిలి­యన్‌ యూనిట్ల (ఎంయూ) జల విద్యు­దుత్పత్తి జరిపింది. అందులో 480.78 ఎంయూలను గడిచిన పది రోజుల్లోనే ఉత్పత్తి చేయడం విశేషం.

గతేడాది మాదిరే మంచి వర్షాలు కురిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 3,718.53 ఎంయూల ఉత్పత్తికి అవకాశముందని జెన్‌కో అంచనా వేయగా, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటికే 3,849 ఎంయూల ఉత్పత్తి జరగడం గమనార్హం. తొలి అర్ధ వార్షికం ముగిసే (సెప్టెంబర్‌ చివరి) నాటికే 3,369 ఎంయూల ఉత్పత్తి జరిగింది.

6,000 ఎంయూల ఉత్పత్తికి అవకాశం
కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల తదితర జలాశయాల్లో నిల్వ ఉన్న 578 టీఎంసీల జలాలతో 2,052 ఎంయూలు, గోదావరి బేసిన్‌లోని నిజాంసాగర్, పోచంపాడు తది­తర జలాశయాల్లో నిల్వ ఉన్న 137 టీఎంసీలతో 138 ఎంయూలు కలిపి మొత్తం 2,190 ఎంయూల జలవిద్యుత్‌ ఉత్పత్తికి అవకాశముందని జెన్‌కో అంచనాలు పేర్కొ­ం­­టున్నాయి.

సెప్టెంబర్‌తో నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిసినా, ఇంకా విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి. జలాశయాలన్నీ నిండి ఉండటంతో విద్యు­దుత్పత్తి ద్వారా వచ్చిన నీళ్లను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ జెన్‌కో రికార్డుస్థాయిలో 6,000 ఎంయూల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశముంది.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో..
900 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్కొక్కటీ 150 మెగావాట్ల సామ­ర్థ్యం కలిగిన 6 యూనిట్లు ఉండగా, ఐదు యూనిట్లు మాత్రమే ఉత్పత్తికి లభ్యంగా ఉన్నాయి. రెండేళ్ల కింద జరిగిన అగ్ని­ప్రమా­దంలో కాలిపోయిన ఓ యూనిట్‌ పునరుద్ధరణ ఇంకా పూర్తికాలేదు. ఇక్కడి నుంచి 100% స్థాపిత సామర్థ్యంతో విద్యు­దుత్పత్తి చేయడానికి 45 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో అవసరం. ఇప్పటికే శ్రీశైలంలో నిల్వ ఉన్న 214 టీఎంసీల జలాలతో 1,009 ఎంయూల జల విద్యుదుత్పత్తి చేయొచ్చని జెన్‌కో అంచనా వేసింది. కొనసాగుతున్న ఇన్‌ఫ్లోను పరిగణనలోకి తీసుకుంటే ఉత్పత్తి మరింత పెరగనుంది.

►815.6 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన నాగార్జునసాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో 100శాతం ఉత్పత్తి చేసేందుకు 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో అవసరం. జలాశయంలో నిల్వ ఉన్న 311 టీఎంసీలతో 987 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి అవకాశం ఉంది.

డిస్కంలకు భారీ ఊరట
తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలను.. ఈ ఏడాది జల విద్యుత్‌ కొంత వరకు ఆదుకుంది. చౌక ధరకు లభించే జల విద్యుత్‌ భారీ మొత్తంలో ఉత్పత్తి కావడంతో డిస్కంలపై విద్యుత్‌ కొనుగోళ్ల భారం కొంత తగ్గింది. 2022–23లో మొత్తం 3,561 ఎంయూల జలవిద్యుత్‌ కొనుగోళ్లు చేసేందుకు డిస్కంలకు విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిచ్చింది.

ఇందుకు రూ.1,307 కోట్లను ఫిక్స్‌డ్‌ చార్జీలుగా జెన్‌కోకు చెల్లించాలని ఆదేశించింది. జలవిద్యుత్‌కు వేరియ­బుల్‌ చార్జీలేమీ ఉండవు... అంతే వ్యయానికి అదనంగా ఉత్పత్తైన జల విద్యుత్‌ను సైతం డిస్కంలకు జెన్‌కో సరఫరా చేయాల్సి ఉంటుంది. దీంతో కనీసం రూ.వెయ్యి కోట్లకు పైగా రాష్ట్ర డిస్కంలకు ఆదా కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement