జంక్షన్ల వద్ద మరింత భూసేకరణ | Regional Ring Road Interchanges Design Change Impact On Land Owners | Sakshi
Sakshi News home page

జంక్షన్ల వద్ద మరింత భూసేకరణ

Published Sat, Aug 27 2022 2:02 AM | Last Updated on Sat, Aug 27 2022 10:51 AM

Regional Ring Road Interchanges Design Change Impact On Land Owners - Sakshi

వారిద్దరు అన్నదమ్ములు.. రాష్ట్ర రహదారిని ఆనుకుని వారికి 15 ఎకరాల పొలం ఉంది. రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఆ రహదారిని క్రాస్‌ చేసే చోట నిర్మించే కూడలికి తొలుత 50 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు ప్రాథమిక అలైన్‌మెంటు రూపొందించారు. దీనివల్ల ఆ అన్నదమ్ములు తమ పొలంలో ఐదెకరాలు కోల్పోవాల్సి వస్తుందని తేలింది. అన్నదమ్ములు పోనీలే అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఆ జంక్షన్‌ను మరింత పెద్దదిగా నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో వారు తమ మొత్తం పొలం కోల్పోవాల్సి వస్తోంది.  

ఆయనో వ్యాపారి.. జాతీయ రహదారికి చేరువలో ఆయనకు కొంత ఖాళీ స్థలం, ఓ మిల్లు ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ క్రాస్‌ చేసే చోట నిర్మించే ఇంటర్‌ ఛేంజర్‌కు 63 ఎకరాలు కావాల్సి వస్తుందని అధికారులు తొలుత అంచనా వేశారు. ఈ మేరకు రూపొందించిన అలైన్‌మెంటులో ఆ వ్యాపారి స్థలం కూడా ఉంది. దీంతో తన మిల్లుకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆ స్థలం మినహాయించినా సరిపోతుందని భావించిన అధికారులు ఓ ప్లాన్‌ రూపొందించారు. కానీ తాజాగా విడుదలైన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఆయనకున్న ఖాళీ స్థలంతోపాటు మిల్లు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఇంటర్‌ ఛేంజర్ల డిజైన్‌ మారటం.. వాటికి చేరువగా ఉన్న భూ యజమానులపై పెద్ద ప్రభావాన్నే చూపుతోంది. కొత్తగా విడుదలైన గెజిట్‌ నోటిఫికేషన్లు వా­రికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముంద­నుకున్న ప్లాన్‌ను మారి ఉన్నట్టుండి కొత్త ప్లాన్‌ తెరపైకి రావటం, భారీగా భూ సమీకరణ చేయాల్సిన పరిస్థితి తలెత్తడమే ఇందుకు కారణం.

రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూ­సేకరణ కసరత్తును వేగవంతం చేసిన జాతీయ ర­హదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ).. ఇందుకోసం ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీఓల పరిధితో కూడిన ఎనిమిది క్లస్టర్లను ఏర్పాటు చేసిన విష­యం తెలిసిందే. వీటికి వేర్వేరుగా గెజిట్‌ నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉండగా.. గత ఏప్రిల్‌లో మూ­డు, రెండు రోజుల క్రితం నాలుగు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ల వివరాలు చూసి, జంక్షన్లకు చేరువగా ఉన్న కొందరు భూ యజమానులు లబోదిబోమంటున్నారు. 

11 చోట్ల ఇంటర్‌ ఛేంజర్లు 
రింగురోడ్డు ఉత్తరభాగంలో 11 చోట్ల ఇంటర్‌ ఛేంజ్‌ నిర్మాణాలు (జంక్షన్లు) రానున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ ఇతర రోడ్లను క్రాస్‌ చేసే చోట జంక్షన్లు నిర్మిస్తారు. ఒక్కో జంక్షన్‌ 50 నుంచి 60 ఎకరాలలో ఉండేలా తొలుత డిజైన్‌ చేశారు. వాటిని ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి సమర్పించారు. సాధారణంగా జంక్షన్ల వద్ద వాహనాలు 30 కి.మీ. వేగానికి పరిమితం కావాల్సి ఉంటుంది.

ఔటర్‌ రింగురోడ్డు కూడళ్లపై నిర్మించిన ఇంటర్‌ చేంజర్లను అలాగే డిజైన్‌ చేశారు. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే అయినందున ఇంటర్‌ ఛేంజర్లపై వాటి వేగం 50 నుంచి 60 కి.మీ. వరకు ఉండేలా చూడాలని తాజాగా నిర్ణయించిన అధికారులు ఇంటర్‌ ఛేంజర్ల డిజైన్‌లను మార్చారు. చాలా దూరం నుంచే మలుపు ఉండేలా చేయటంతో ఒక్కో జంక్షన్‌ విస్తీర్ణం 70 నుంచి 80 ఎకరాలకు పెరిగింది. ఈ మేరకు అక్కడ భూమిని సమీకరించాల్సి వచ్చింది. తాజాగా విడుదలైన గెజిట్లలో ఈ విషయం గుర్తించి, భూములు కోల్పోతున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.  

ఎనిమిదో గెజిట్‌ నోటిఫికేషనూ విడుదల 
ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ ప్రక్రియకు పచ్చజెండా ఊపే చివరి 8వ నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది. తూప్రాన్‌ ఆర్డీఓ పరిధిలో దాతర్‌పల్లె, గుండారెడ్డి పల్లె, ఇస్లాంపూర్, కిష్టాపూర్, నాగులపల్లె, నర్సంపల్లె, వట్టూరు, వెంకటాయపల్లె గ్రామాలకు సంబంధించిన 176.6176 హెక్టార్ల మేర భూమిని సేకరించేందుకు అనుమతినిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి సంబంధించిన 158.64 కి.మీ. నిడివితో రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ ప్రక్రియకు అనుమతినిస్తూ 3 ఏ గెజిట్‌ నోటిఫికేషన్లు అన్నీ విడుదల అయినట్టయింది.      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement