Rules Of Assignment Have Been Revised By AP State Government - Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లంక భూములకు డి పట్టాలు

Published Sun, Jan 1 2023 7:41 AM | Last Updated on Sun, Jan 1 2023 10:22 AM

Rules of Assignment have been Revised by AP State Government - Sakshi

సాక్షి, అమరావతి:  కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలోని లంక భూములకు డి పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ, బీ కేటగిరీలుగా గుర్తించిన లంక భూములకు సంబంధించి వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వడంతోపాటు సి కేటగిరీలో ఉన్న భూములకు ఐదేళ్ల లీజు పట్టాలు ఇవ్వనుంది. ఈ మేరకు లంక భూముల అసైన్డ్‌ నిబంధనలను సవరిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌ జీఓ జారీ చేశారు.

కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని ఒండ్రు మట్టి ఒక దగ్గర చేరి ఉన్న భూములు కాలక్రమేణా సాధారణ భూములుగా మారి సారవంతంగా ఉండడంతో రైతులు (శివాయి జమేదార్లు) వాటిని సాగు చేసుకుంటున్నారు. ఏ, బీ కేటగిరీ భూముల్లోని కొందరికి గతంలో డి పట్టాలిచ్చారు. మునిగిపోయే అవకాశం ఉండడంతో సీ కేటగిరీ భూములకు పట్టాలివ్వకుండా ఒక సంవత్సరం లీజుగా ఇచ్చారు. వాటినే లీజు పట్టాలుగా పిలుస్తారు.   

ఎంజాయ్‌మెంట్‌ సర్వే ద్వారా పట్టాలు 
పూర్వపు తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ మూడు కేటగిరీల్లో ఉన్న లంక భూములను సాగు చేసుకుంటున్న చాలా మందికి పట్టాలు లేవు. అలాంటి వారిని గుర్తించి నిబంధనల ప్రకారం పట్టాలివ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంజాయ్‌మెంట్‌ సర్వే నిర్వహించి ఏ, బీ కేటగిరీల్లోని భూములకు ఆమోదంతో పట్టాలివ్వనుంది. సీ కేటగిరీ కింద ఉన్న భూములకు గతంలో ఇచ్చే సంవత్సరం లీజును ఐదేళ్లకు పొడిగించి ఇవ్వనున్నారు.

అసైన్‌మెంట్‌ కమిటీల ఆమోదంతో పట్టాలిచ్చే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. లంక భూముల్లో సీజీఎఫ్‌ (కో–ఆపరేటివ్‌ జాయింట్‌ ఫార్మింగ్‌) సొసైటీలు ఉండేవి. మిగిలిన ప్రాంతాల్లోని సీజీఎఫ్‌ఎస్‌ భూములకు పట్టాలిచ్చినా, లంక భూముల్లోని సీజీఎఫ్‌ఎస్‌ భూములకు మాత్రం ఇవ్వలేదు. ఈ సొసైటీలు రద్దయ్యే పరిస్థితుల్లో వాటి కింద ఉన్న అర్హులను గుర్తించి తాజాగా పట్టాలివ్వాలని నిర్ణయించారు. గతంలో ఇచ్చిన పట్టాలు, అడంగల్‌లో నమోదైన పట్టాదారులకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు డి పట్టాలివ్వాలని జీవోలో స్పష్టం చేశారు.   

10 వేల మందికి మేలు 
లంక భూముల కేటగిరీలను మార్చేందుకు తాజాగా అవకాశం కల్పించారు. జాయింట్‌ కలెక్టర్, ఆర్డీఓ, రివర్‌ కన్సర్వేటర్‌ (ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌)లతో ఉన్న కమిటీ కేటగిరీ మార్పుపై వచ్చే దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్‌ సిఫారసు చేస్తారు. ఈ సిఫారసుల ఆధారంగా జిల్లా కలెక్టర్‌ దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు నిబంధనలను సవరించారు. దీనివల్ల సుమారు 10 వేల మంది లంక భూముల రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. అర్హులకు పట్టాలివ్వగా మిగిలిన భూముల్లో 50 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ రైతులకు, మిగిలిన 50 శాతం భూమిలో మూడింట రెండొంతుల (2/3) భూమిని బీసీ రైతులకు, మిగిలిన (1/3) భూమిని నిరుపేద రైతులకు పంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఏ కేటగిరీ: గట్టుకు దగ్గరగా ఉండి, వరద వచ్చినా కొట్టుకుపోని భూమి 
బీ కేటగిరీ: ఏ కేటగిరీ భూమికి ఆనుకుని, కొంత నదిలోకి ఉన్న భూమి 
సీ కేటగిరీ: ఏ, బీ కేటగిరీకి ఆనుకుని నదిలోకి ఉండి.. వరదలు వస్తే పూర్తిగా మునిగిపోయే భూమి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement