సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ తీరంలో ఉన్న లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎనిమిది జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19 వేల మందికిపైగా ఈ పట్టాలు ఇవ్వనుంది. మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేయడమే తరువాయి. ఆ తర్వాత పట్టాల పంపిణీ ప్రారంభం కానుంది.
రాష్ట్రంలోని నిరుపేదలకు 54 వేల ఎకరాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్న విషయం తెలిసిందే. ఆ భూములతోపాటే లంక భూములను సాగుచేసుకుంటున్న రైతులకు డి–పట్టాలు ఇవ్వనున్నారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఒండ్రు మట్టి ఒక దగ్గర చేరి కాలక్రమేణా సాధారణ భూములుగా మారి సారవంతంగా ఉండడంతో రైతులు వాటిని సాగుచేసుకుంటారు.
ఈ భూములను మూడు కేటగిరీలుగా విభజించారు. గట్టుకు దగ్గరగా ఉండి వరద వచ్చినా కొట్టుకుపోని భూమిని ఏ–కేటగిరీగా.. వీటికి ఆనుకుని కొంత నదిలోకి ఉన్న భూమిని బి–కేటగిరీగా.. ఏ, బీ కేటగిరీకి ఆనుకుని వరదలొస్తే పూర్తిగా మునిగిపోయే భూమిని సీ–కేటగిరీగా విభజించారు.
గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు..
కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని ఈ మూడు కేటగిరీల్లో లంక భూములను సాగుచేసుకుంటున్న అనేకమంది రైతులకు పట్టాల్లేవు. తమకు పట్టాలివ్వాలని అక్కడి రైతులు అనేక ఏళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. కానీ, గత ప్రభుత్వాలు వారి అభ్యర్థనలను పట్టించుకోలేదు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సిద్ధమైంది. వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలిచ్చేందుకు వీలుగా లంక భూముల అసైన్డ్ నిబంధనలను సవరించింది. ఈ నిబంధనల ప్రకారం దరఖాస్తులు తీసుకోగా ఎనిమిది జిల్లాల నుంచి 19,282 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం.. 9,062.39 ఎకరాలకు సంబంధించిన 19,176 దరఖాస్తులను అర్హమైనవిగా తేల్చింది.
ఎ–కేటగిరీలో 475.93 ఎకరాలను 1,178 మందికి.. బి–కేటగిరీలో 848.22 ఎకరాలను 2,333 మందికి.. సి–కేటగిరీలో 7,738.25 ఎకరాలను 15,665 మందికి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు అసైన్‌మెంట్ కమిటీలు ఆమోదం కూడా తెలిపాయి. ఈ భూములకు జిల్లా కలెక్టర్ సంతకంతో పట్టాలు ఇవ్వనున్నారు. సాధారణ వ్యవసాయ భూముల పంపిణీలో ఇచ్చే పట్టాలపై తహశీల్దార్ సంతకం ఉంటుంది. కానీ, ఇవి లంక భూములు కావడంతో కలెక్టర్ సంతకాలతో ఇవ్వాలని నిర్ణయించారు. అత్యధికంగా కృష్ణాజిల్లాలో 3,570 ఎకరాలను 6,257 మందికి పట్టాలు ఇవ్వనున్నారు. అతిత్వరలో వీటిని రైతుల చేతికి అందనున్నాయి.
కేటగిరీల మార్పునకు కసరత్తు
అలాగే, నిబంధనలకు అనుగుణంగా లంక భూముల కేటగిరీలను మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. సి–క్లాస్ నుంచి బి–క్లాస్‌కి మార్చాలని 2,628 ఎకరాలకు సంబంధించి అర్జీలు వచ్చాయి. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, రివర్ కన్జర్వేటర్ (ఇరిగేషన్ ఈఈ)లతో ఏర్పాటైన కమిటీలు వాటిలో నిబంధనల ప్రకారం సుమారు 1,370 ఎకరాల కేటగిరీ మార్చేందుకు అనుమతిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment