patta document
-
Telangana: బోగస్ కృష్ణ‘పట్టా’!
తిరుమలగిరి (సాగర్) మండలంలోని గోడుమడకకు చెందిన ఈయన పేరు బారు శివయ్య. ఆయనకు చింతలపాలెం రెవెన్యూ శివార్లలోని సర్వే నంబర్ 14లో 4.30 గుంటల భూమి ఉంది. తాతల కాలం నుంచీ వారే ఆ భూమిని సాగుచేసుకుంటున్నారు. నేటికీ రికార్డుల్లో పేరు లేకపోవడంతో పట్టాదారు పాసుపుస్తకం అందలేదు. కానీ కొందరు ఈ భూమికి సంబంధించి అక్రమంగా పట్టాలను చేయించుకుని రైతుబంధు, రైతుబీమా పథకాలు పొందుతున్నారు. బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారు. భూమి తమ స్వాదీనం (కబ్జా)లో ఉన్నా.. తమకు పాస్ పుస్తకం లేక ప్రభుత్వ పథకాలు అందడం లేదని శివయ్య వాపోయారు...ఈయన ఒక్కరి భూమే కాదు. కేవలం ప్రైవేటు వ్యక్తుల అదీనంలోని స్థలాలే కాదు.. వేల ఎకరాల ప్రభుత్వ భూములను కూడా అక్రమార్కులు చెరబట్టారు. భూమిని ఏళ్లకేళ్లుగా సాగుచేసుకుంటున్నవారు పట్టాలు లేక, హక్కుల్లేక ప్రభుత్వ పథకాలకు దూరమైతే... కొందరు అవే భూములపై నకిలీ పట్టాలు సృష్టించి, ప్రభుత్వం నుంచి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల సొమ్మును కాజేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రభుత్వ భూములకే బోగస్ పట్టాలు సృష్టించేశారు. కృష్ణపట్టె ప్రాంతమైన నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలో తాజాగా బయటపడిన బాగోతమిది. అక్రమార్కులు ఈ మండలంలో 3,900 ఎకరాలకు బోగస్ పట్టాలు సృష్టించినట్టు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. తద్వారా ఏటా రూ.3.5 కోట్ల చొప్పున గత పదేళ్లలో రూ.35 కోట్లకుపైగా రైతుబంధు రూపంలోనే పొందినట్టు అధికారులు భావిస్తున్నారు. బోగస్ పట్టాలతో రైతుబీమా, బ్యాంకుల్లో రుణాలు పొందినట్టు తేల్చారు. సమీపంలోని దామరచర్ల మండలంలోనూ వేల ఎకరాల ప్రభుత్వ భూములు బోగస్ పట్టాలతో కబ్జా అయినట్టు రెవెన్యూ యంత్రాంగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ముడుపులకు అలవాటుపడిన అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ అక్రమాలు సాగాయని అంటున్నారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండసాక్షి ప్రతినిధి, నల్లగొండ: ధరణి సమస్యలతో రైతులు ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో పరిష్కార మార్గాలపై సర్కారు దృష్టి పెట్టింది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా లోని తిరుమలగిరి (సాగర్) మండలంలో నెలకొన్న పరిస్థితిని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ప్రభుత్వం తిరుమలగిరి (సాగర్) మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. భూముల సమస్య లపై విచారణ చేపట్టింది. అధికారులు ప్రాథమిక విచారణలోనే 3,900 ఎకరాలకు కొందరు బోగస్ పట్టాలు సృష్టించినట్టు గుర్తించారు. మండలంలోని చింతలపాలెం గ్రామంలోని 12, 222, 158, 162, 223 సర్వే నంబర్లలో, తిమ్మాయి పాలెం గ్రామంలోని 38, 39, 60, 70, 74 సర్వే నంబర్లలో అక్రమ పట్టాలు ఉన్నట్టు తేల్చారు. వీటితోపాటు తునికినూతల గ్రామంలో సర్వే నంబర్ 45, నెల్లికల్ గ్రామంలో 424 సర్వే నంబర్, జమ్మలకోట గ్రామంలో 28 సర్వేనంబర్లలో అక్రమంగా పట్టాలు పొందినట్టు గుర్తించారు. చింతలపాలెం, తిమ్మాయిపల్లి రెండు గ్రామాల్లోనే 2,800 ఎకరా లకు నకిలీ పట్టాలు సృష్టించినట్టు తేలడం గమనార్హం. ప్రభుత్వ భూములనూ బోగస్ పట్టాలతో చెరబట్టినట్టు గుర్తించారు. దీంతో ఈ అక్రమాలను పూర్తిస్థాయిలో నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 14 రెవెన్యూ, సర్వే బృందాల ఆధ్వర్యంలో 80 మందికిపైగా సిబ్బంది తో క్షేత్రస్థాయి సర్వేకు శ్రీకారం చుట్టింది. నకిలీ స్వాతంత్య్ర సమరయోధుల పేరిట పట్టాలు దామరచర్ల మండలంలోని సర్వే నంబర్లు 686, 691, 1100, 735, 655, 621, 690, 714తోపాటు మరో 33 సర్వే నంబర్లలో 4,542 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములపై కబ్జాదారు ల కన్ను పడింది. దీంతో భూబకాసురులకు.. స్వాతంత్య్ర సమరయోధులు గుర్తుకొచ్చారు. నకిలీ సమర యో ధులను సృష్టించి, తమ చేతివాటం ప్రదర్శించి, అధికారులను మచి్చక చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను దోచేశారు. వాటిపైనే ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది.60 ఏళ్లుగా సేద్యం చేస్తున్నా.. హక్కులు తొలగించారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మా గ్రామం ముంపునకు గురికావడంతో చిన్నాయిపా లెం తండాలో పునరావా సం కల్పించారు. 1962లో అప్పటి ప్రభుత్వం పట్టాలు అందజేసింది. 60 ఏళ్లుగా అక్కడే సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నాం. ధరణికి ముందు వరకు బ్యాంకులో రుణాలు పొందాం. 2016 భూప్రక్షాళన సమయంలో మా భూములను పార్ట్–బీలో చేర్చడంతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదు. అప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. బ్యాంకు రుణం తీసుకునే అవకాశం లేకుండాపోయింది. – రమావత్ హనుమ, చెన్నాయపాలెంమొత్తం రీసర్వే.. అక్రమ పట్టాల తొలగింపే లక్ష్యం తిరుమలగిరి సాగర్ మండలంలోని అన్ని భూములపై రీసర్వే చేస్తున్నాం. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. 100 ఎకరాల భూమి ఉంటే రికార్డుల్లో 200 ఎకరాలకు పేర్లు ఉన్నాయి. భూమి స్వా«దీనంలో ఉన్న వారి పేర్లు ధరణిలో లేవు. ధరణిలో పేర్లు ఉన్నవారి స్వాదీనంలో భూములు లేవు. ఎవాక్యూ ప్రాపర్టీని కబ్జా చేసి పట్టాలు సృష్టించారు. అటవీ భూముల హద్దుల సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ తేల్చి.. అర్హులకు పట్టాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ఈ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మండలంలోని ప్రతి సర్వే నంబరులోనూ విస్తృత సర్వే చేస్తున్నాం. ఆ భూమి ఎవరిదని తేల్చి, నకిలీ పట్టాలను రద్దు చేసి.. కబ్జాలో ఉన్న అసలైన అర్హుల పేరిట పట్టాలు ఇచ్చి, న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నాం. – నారాయణరెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ -
17న నూజివీడుకు సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 17న నూజివీడుకు వెళ్లనున్నారు. అసైన్మెంట్భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారాయన. ఈ కార్యక్రమంలో 2003కు మందు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించడంతో పాటు కొత్త అసైన్మెంట్ భూములకు పట్టాల పంపిణీ జరగనుంది. ఇదీ చదవండి: బాబు– దత్తపుత్రుడికి సిగ్గు లేదు: సీఎం జగన్ -
9,000 ఎకరాల లంక భూములకు పట్టాలు.. ఏపీ ప్రభుత్వం సన్నాహాలు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ తీరంలో ఉన్న లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎనిమిది జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19 వేల మందికిపైగా ఈ పట్టాలు ఇవ్వనుంది. మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేయడమే తరువాయి. ఆ తర్వాత పట్టాల పంపిణీ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని నిరుపేదలకు 54 వేల ఎకరాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్న విషయం తెలిసిందే. ఆ భూములతోపాటే లంక భూములను సాగుచేసుకుంటున్న రైతులకు డి–పట్టాలు ఇవ్వనున్నారు. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఒండ్రు మట్టి ఒక దగ్గర చేరి కాలక్రమేణా సాధారణ భూములుగా మారి సారవంతంగా ఉండడంతో రైతులు వాటిని సాగుచేసుకుంటారు. ఈ భూములను మూడు కేటగిరీలుగా విభజించారు. గట్టుకు దగ్గరగా ఉండి వరద వచ్చినా కొట్టుకుపోని భూమిని ఏ–కేటగిరీగా.. వీటికి ఆనుకుని కొంత నదిలోకి ఉన్న భూమిని బి–కేటగిరీగా.. ఏ, బీ కేటగిరీకి ఆనుకుని వరదలొస్తే పూర్తిగా మునిగిపోయే భూమిని సీ–కేటగిరీగా విభజించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని ఈ మూడు కేటగిరీల్లో లంక భూములను సాగుచేసుకుంటున్న అనేకమంది రైతులకు పట్టాల్లేవు. తమకు పట్టాలివ్వాలని అక్కడి రైతులు అనేక ఏళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. కానీ, గత ప్రభుత్వాలు వారి అభ్యర్థనలను పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సిద్ధమైంది. వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలిచ్చేందుకు వీలుగా లంక భూముల అసైన్డ్ నిబంధనలను సవరించింది. ఈ నిబంధనల ప్రకారం దరఖాస్తులు తీసుకోగా ఎనిమిది జిల్లాల నుంచి 19,282 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం.. 9,062.39 ఎకరాలకు సంబంధించిన 19,176 దరఖాస్తులను అర్హమైనవిగా తేల్చింది. ఎ–కేటగిరీలో 475.93 ఎకరాలను 1,178 మందికి.. బి–కేటగిరీలో 848.22 ఎకరాలను 2,333 మందికి.. సి–కేటగిరీలో 7,738.25 ఎకరాలను 15,665 మందికి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు అసైన్మెంట్ కమిటీలు ఆమోదం కూడా తెలిపాయి. ఈ భూములకు జిల్లా కలెక్టర్ సంతకంతో పట్టాలు ఇవ్వనున్నారు. సాధారణ వ్యవసాయ భూముల పంపిణీలో ఇచ్చే పట్టాలపై తహశీల్దార్ సంతకం ఉంటుంది. కానీ, ఇవి లంక భూములు కావడంతో కలెక్టర్ సంతకాలతో ఇవ్వాలని నిర్ణయించారు. అత్యధికంగా కృష్ణాజిల్లాలో 3,570 ఎకరాలను 6,257 మందికి పట్టాలు ఇవ్వనున్నారు. అతిత్వరలో వీటిని రైతుల చేతికి అందనున్నాయి. కేటగిరీల మార్పునకు కసరత్తు అలాగే, నిబంధనలకు అనుగుణంగా లంక భూముల కేటగిరీలను మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. సి–క్లాస్ నుంచి బి–క్లాస్‌కి మార్చాలని 2,628 ఎకరాలకు సంబంధించి అర్జీలు వచ్చాయి. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, రివర్ కన్జర్వేటర్ (ఇరిగేషన్ ఈఈ)లతో ఏర్పాటైన కమిటీలు వాటిలో నిబంధనల ప్రకారం సుమారు 1,370 ఎకరాల కేటగిరీ మార్చేందుకు అనుమతిచ్చాయి. -
పోడు రైతులకు 30 నుంచి పట్టాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పుస్తకాల పంపిణీకి సర్వం సన్నద్ధమైంది. అర్హత ఉన్న రైతులకు పట్టాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. ఆ జిల్లాల్లో అర్హులైన గిరిజన రైతులకు పట్టాలను పంపిణీ చేస్తారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంబోత్సవం అనంతరం పట్టాల పంపిణీ చేసి అక్కడ జరిగే బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తారు. వాస్తవానికి పట్టాల పంపిణీ ఈనెల 24న ప్రాథమికంగా ఖరారు చేసినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఈనెల 30కి మార్చారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం ప్రకటన విడుదల చేశారు. 1,50,012 మంది రైతులకు 4,50,601 ఎకరాలు.. పోడుభూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి గిరిజనులు, ఆదివాసీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు అర్హతలను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,50,012 మంది రైతులు 4,50,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు గుర్తించారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు దర ఖాస్తులు సమర్పించారు. ఈ లెక్కన ఒక్కో రైతు సగటున 3 ఎకరాలు సాగు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో 24972 మంది రైతులు, ఆసిఫాబాద్ జిల్లాలో 15,254 మంది రైతులు దరఖాస్తులు సమ ర్పించారు. ఈ రైతులకు పట్టా పాసుపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పట్టాలను అందించిన తర్వాత ఇతర జిల్లాల్లో సంబంధిత జిల్లా మంత్రులు కూడా అదేరోజు పట్టాల పంపిణీ చేస్తారు. పోడు సమస్యకు పరిష్కారం చూపాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి గిరిజనులు కృతజ్ఞతులై ఉంటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. -
చెరువు మధ్యలో పట్టా మంజూరు చేస్తారా?
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తికి రెవెన్యూ అధికారులు చెరువు మధ్యలో పట్టా మంజూరు చేయడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరు కలెక్టర్, తిరుపతి ఆర్డీవో, రేణిగుంట తహసీల్దార్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పట్టా పొందిన చిరంజీవి అనే వ్యక్తికి కూడా నోటీసు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం, యర్రమరెడ్డి పాళ్యం గ్రామంలోని సాగునీటి చెరువును టి.చిరంజీవి అనే వ్యక్తి పూడ్చేస్తున్నారని, ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆ గ్రామానికి చెందిన గూలూరు జయరామయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కొండపర్తి కిరణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ చెరువు ఆక్రమణను అడ్డుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చిరంజీవి గతంలో పట్టా పొందారని, ఆ భూమినే ఇప్పుడు చదును చేసుకుంటున్నారని తెలిపారు. అది అతని సొంత భూమన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఫొటోలను చూస్తుంటే చెరువు మధ్యలో ఉన్న భూమిని చిరంజీవి చదును చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. చెరువు మధ్యలో పట్టా ఇవ్వడం ఏమిటని విస్మయం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది. -
ఉగాది రోజున 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
సాక్షి, అమరావతి: ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు సమకూర్చే లక్ష్యంలో భాగంగా వచ్చే ఉగాది రోజున 25 లక్షల మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ దస్తావేజులతో కూడిన పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని సీసీఎల్ఏ, ప్రభుత్వ ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఈ అంశంపై శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమం కోసం గ్రామాల వారీగా ప్రభుత్వ భూములు, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు ఇప్పటివరకూ 22 లక్షల వరకూ లబ్ధిదారుల గుర్తింపు పూర్తయ్యిందని, మిగిలిన లబ్ధిదారుల గుర్తింపును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు అనువుగా ఉన్న భూములేమిటనేది గుర్తించాలన్నారు. లిటిగేషన్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి కోర్టుకు అఫిడవిట్ సమర్పించి ఆ భూములను కూడా ఇళ్ల పట్టాలుగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే గుర్తించిన భూములన్నీ గ్రామాల వారీ మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాలను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో నిర్మిస్తున్న ఇళ్ల లబ్ధిదారుల వివరాలను, వివిధ పట్టణాభివృద్ధి సంస్థల వద్ద ఇళ్ల స్థలాలకు ఉద్దేశించిన భూముల వివరాలను కూడా సేకరించాలని కోరారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ ఇళ్ళ స్థలాలకై ప్రభుత్వ భూముల గుర్తింపులో భాగంగా గతంలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కేటాయించిన భూములను, భూదాన భూముల స్థితిగతులను కూడా తెలుసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక కమిషనర్ హరినారాయణ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం ఇప్పటివరకూ 23,180 ఎకరాల భూమిని గుర్తించామని, ఇంకా అవసరమైన భూమిని త్వరగా గుర్తించాలన్నారు. -
ప్రతి లబ్ధిదారుడికీ 1.5 సెంట్ల ఇంటి స్థలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికీ ఉగాది నాటికి 1.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు, పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆయన గృహ నిర్మాణ శాఖపై సమీక్షించారు. ‘ఇల్లు లేని వారు ఎవ్వరూ ఉండకూడదు. లబ్ధిదారుడు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదు. అన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు. వచ్చే సంవత్సరం నుంచి వైఎస్సార్ ఇళ్ల పథకం కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ‘గ్రామ వలంటీర్ల ద్వారా పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి. లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయంలోనే ప్రదర్శిస్తాం. పెన్షనర్ల జాబితా కూడా గ్రామ సచివాలయాల్లో బోర్డుపై ఉంచుతాం. ఆ జాబితా 365 రోజులు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి. దీనివల్ల సోషల్ ఆడిట్ నిరంతరం కొనసాగుతున్నట్టు ఉంటుంది. లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం, అవినీతికి తావులేదు. ఎవరైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మా పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే ఇల్లు ఇవ్వాల్సిందే. మేం చేసే మంచిని చూసి మాకు ఓటేయాలి అన్నదే మా సిద్ధాంతం. వ్యవస్థ మారాలి, ఆ తపనతోనే పని చేయండి’ అని అధికారులకు సూచించారు. అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ ఇళ్ల నిర్మాణం కోసం గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించాలని, అలా వీలుకాని చోట ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి పేదలకు ఇస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.‘ కొనుగోలు చేసిన భూమిని ప్లాట్ల రూపంలో విభజించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయాలి. కేవలం పట్టా ఇచ్చి, ఇంటి స్థలం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి లబ్ధిదారుడికి ఉండకూడదు. రాళ్లు పాతి, మార్కింగ్ వేసి పక్కాగా ఇంటి స్థలాన్ని అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. ఆధార్ కార్డుతో లింక్ చేసి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలి. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో చూడాలి. పట్టణాలు, నగరాల్లో భూమి లేకపోతే కొనుగోలు చేయండి. స్థలంలో ఫ్లాట్లు కట్టి లబ్ధిదారులకు ఇవ్వాలి. ఏ ఫ్లాట్ ఎక్కడ కడుతున్నారో ముందుగానే గుర్తించి పలానా ఫ్లాటు, పలానా వారికి వస్తుందని ముందుగానే కేటాయించండి. ఈ ఫ్లాట్ల లబ్ధిదారులకు భూమిలో అన్ డివైడెడ్ షేర్, దీంతోపాటు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి’ అని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం గృహ నిర్మాణ శాఖపై సమీక్షింస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘షేర్వాల్’ పేరుతో దోచేశారు.. షేర్వాల్ అనే పేరుతో ఇన్నాళ్లూ దోచేశారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. చదరపు అడుగు ఇంటి నిర్మాణానికి రూ.1100 అయ్యే ఖర్చును రూ.2,300కు పెంచి దోచేశారని చెప్పారు. ‘షేర్వాల్ అని పేరుపెట్టి పేదలమీద భారం వేసి ఇలా దోచేస్తే ఎలా? పేదలపై ప్రతి నెలా రూ.3 వేల భారం వేయడం భావ్యమా? ఉచితంగా ఇళ్లు ఇవ్వాల్సిందిపోయి.. పేదవాడి మీద రూ.3 లక్షల భారం వేయడం న్యాయమా? అర్బన్ హౌసింగ్‌లో కడుతున్న ఫ్లాట్లపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలి. అదే టెక్నాలజీ, అదే స్పెసిఫికేషన్స్‌తో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలి. కాంట్రాక్టర్లను వేధించడం ఉద్దేశం కాదు. మాకు ఎవరిపైనా కక్షలేదు. పేద వాడికి నష్టం రాకూడదు. 20 ఏళ్లపాటు నెలా నెలా డబ్బులు కట్టే పరిస్థితి ఆ పేదవాడికి ఉండకూడడు. లంచాల వల్ల బీదవాళ్లు నష్టపోకూడదన్నదే మా అభిప్రాయం. ఎక్కువ ప్రచారం చేసి, ఎక్కవ మంది రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనేలా ఎలిజిబిలిటీ క్రైటీరియాను తగ్గిద్దాం. పునాది స్థాయి దాటని, మంజూరైనా ప్రారంభం కాని ఫ్లాట్ల్ల విషయంలో ఏ టెక్నాలజీ అయినా అనుమతించాలి. ఈ నిర్ణయం వల్ల ఎంత ఆదా చేయగలమో చేయండి. రూరల్ అయినా, అర్బన్ అయినా నాణ్యత విషయంలో, సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దు. ప్రస్తుతం నడుస్తున్న ఇళ్ల నిర్మాణంలో అత్యవసరంగా పూర్తి చేయాల్సిన వాటిని గుర్తించాలి’ అని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సామాజిక, ఆర్థిక కుల గణనపై రీసర్వేకు ప్రధానికి లేఖ సామాజిక, ఆర్థిక కుల గణన సరిగా లేనందున కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో నష్టం జరుగుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రీసర్వే చేయాలని ప్రధానికి లేఖ రాద్దాం అని సీఎం పేర్కొన్నారు. సరిదిద్దిన డేటా ఆధారంగా ఇళ్లను కేటాయించాల్సిందిగా ప్రధాన మంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు. గ్రామ వలంటీర్ల సాయంతో డేటాను పూర్తిగా సేకరించి కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పట్టా భూములపై దౌర్జన్యం సరికాదు
నార్నూర్(ఆసిఫాబాద్): ఇరవై ఏళ్లుగా సాగు చేస్తున్న భూములపై ఆదివాసీలు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ నాగల్కొండ గిరిజనులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ముంజం సోముకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు జాదవ్ గుణవంతరావు, నాజమ్, రాథోడ్ రమేశ్ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం భూములు కొనుగోలు చేసుకుని అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భూములు మావి అంటూ కొందరు తమ పంటపొలాలను తొలగిస్తున్నారన్నారు. పట్టా భూములపై ఈ ర కంగా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించా రు. లంబాడాలు అంటే ఏమైనా ఇతర దేశం నుంచి వచ్చిండ్రా.. పాకి స్తాన్‌లో ఉన్న భారతీయులపై కూడా ఇంత దౌర్జన్యం లేదన్నారు. మా భూములపై పెత్తనం చెలాయించాలని చూస్తే ఉరుకునేది లేదన్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన వందలాది మంది పాల్గొన్నారు. -
‘పట్టా’ పరేషాన్
మణుగూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు పెట్టుబడి పథకం ఫలాలు పట్టాదారులకు మాత్రమే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టా ఉన్న రైతులకే పెట్టుబడి నగదును అందించేలా ప్రణాళిక రూపొందించడంతో కాస్తుదారులైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామసభల ద్వారా రైతుల అభిప్రాయాలు సేకరించేటప్పుడు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసంఘం చర్చల సమయంలో కేవలం పట్టాదారులనే లెక్కలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గల పట్టాదారు రైతులు (1బీలో నమోదైన పట్టాదారు మాత్రమే) ‘ఏ’ కేటగిరి కింద సుమారు 71.75 లక్షల మంది ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ప్రభుత్వం అంచనాకు వచ్చింది. పట్టాదారు రైతుల వివరాలు, సాగు విస్తీర్ణం తదితర వివరాలు నమోదు చేస్తుండటంతో ఈ పథకం కొంతమంది రైతులకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా గల 23 మండలాల్లో కాస్తుదారుల్లో కొనసాగుతున్న రైతులకు, కౌలుదారులకు, రెవెన్యూ, భూదాన సమితి, దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు ఎలాంటి సహాయం అందే అవకాశాలు లేవు. జిల్లాలో 50 శాతం భూములకే పట్టాలు.. జిల్లా వ్యాప్తంగా 3, 25, 182 ఎకరాల భూమి సాగులో ఉండగా 1,04, 616 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. సాగు భూమి(1/70 చట్టం పరిధిలో)లో 50 శాతం భూములకే పట్టాలు ఉన్నట్లు భూ ప్రక్షాళనలో అధికారులు గుర్తించారు. పలు రకాల ప్రభుత్వ (వ్యవసాయ) భూముల్లో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువగా పంటలు సాగు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ సాయం పట్టాదారులకే దక్కితే ఆర్థిక ఇబ్బందులు ఉండి, సరైన భూ హక్కులు లేని నిరుపేద రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. వారసత్వం, పసుపు కుంకుమ, విక్రయాలకు సంబంధించిన అంశాల ప్రక్షాళన విషయంలో లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. కానీ పలు రకాల ప్రభుత్వ భూములు సాగు చేసే బీద రైతులకు మాత్రం రెవెన్యూ రికార్డుల్లో స్థానం దక్కడం లేదు. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు దూరం అవుతుండగా, తాజాగా రైతు పెట్టుబడి సహాయానికి కూడా అర్హత లేకపోవడంతో సన్న, చిన్నకారు రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఏజెన్సీలో రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకం... రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత రైతులు పొందలేకపోతున్నారు. సుమారు 70, 80 సంవత్సరాలుగా (తరతరాలుగా) ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటూ జీవనాధారం కోసం నిరుపేద రైతులు ప్రభుత్వ భూములు(రెవెన్యూ, దేవాదాయ, భూదాన సమితి, అటవీ భూములు) సాగు చేసుకుంటున్నారు. కాగా ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో మైదాన ప్రాంతాలకు సంబంధించిన అంశాలనే పరిగణనలోకి తీసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో పొలాలు సాగు చేస్తున్న గిరిజనేతర రైతులకు తరుచూ అన్యాయం జరుగుతోంది. జిల్లాలో 23 మండలాల్లో (జిల్లా మొత్తం) గల భూములకు 1/70 చట్టం అమల్లో ఉండటం గమనార్హం. ప్రభుత్వం పకడ్భందీగా చేపట్టిన భూ ప్రక్షాళనలో కూడా గిరిజనేతర రైతులకు పేర్లు మార్చే అవకాశాలు లేవు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక శాతం భూముల్లో సాగుచేసే సన్న, చిన్నకారు గిరిజనేతర రైతులకు ప్రభుత్వ సహాయం అందటం లేదు. సాగు చేస్తున్న భూములకు పూర్తిస్థాయిలో హక్కులు లేక, కనీసం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా పొందే అవకాశం లేకపోవడంతో బీద రైతులు ఆవేదన చెందుతున్నారు. -
భూమి పట్టా చేయడంలేదని ఆత్మహత్యాయత్నం
సారంగాపూర్: కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. చిట్యాల గంగయ్య అనే వ్యక్తి 2001లో సర్వే నంబర్ 210లో ఎకరం భూమిని జితేందర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాడు. అతను చనిపోవడంవతో ఆ భూమి తమదేనని అతని కుటుంబ సభ్యులు అంటున్నారని, భూమి పట్టా చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అతను ఆత్మహత్యకు యత్నించాడు. ఇతనిని ఆస్పత్రికి తరలించారు. -
పట్టాల కోసం పోరుబాట
♦ కదం తొక్కిన జవహర్‌నగర్‌వాసులు ♦ ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ శామీర్‌పేట్ / జవహర్‌నగర్: ప్రభుత్వాలు మారినా పేదల జీవితాల్లో వెలుగులు లేవని ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్‌నగర్‌లోని ఇళ్లను క్రమబద్ధీకరించి, జీవో 58, 59ను అమలుపర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బాలాజీనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని ఎన్నో పోరాటాలు చేశారని.. నివసించే గూడు కోసం పోరాటం చేయాల్సి రావడం విచారకరమన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం జవహర్‌నగర్‌కు వలస వచ్చి భయంగుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. నివాసహక్కు కల్పించాలని ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు ఎక్కడ గుడిసె వేసుకుంటే అక్కడే పట్టాలిస్తామని ప్రకటనలు చేసి జీవో 58,59ను అమల్లోకి తెచ్చారని, జవహర్‌నగర్‌లో నివసించే పేదల ఇళ్లకు పట్టాలిచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్వయంగా చెప్పడం టీఆర్ఎస్ పాలనకు అద్దం పడుతోందన్నారు. పేదల ఇళ్లను క్రమబద్ధీకరించకుండా కాలయాపన చేయడమే కాకుండా మరోవైపు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మిగులు భూములను స్థానికుల అవసరాలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మేడ రవి, కన్వీనర్ మస్తాన్‌బీ, కో చైర్మన్లు జి.అనురాధ, శివబాబు, వి.కిరణ్, డాక్టర్ వెంపటి బాస్కర్, సునీత, ఎండీ జావెద్, కోశాధికారి జి.చంద్రమౌళి, మీడియా ప్రతినిధులు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, ఎస్కె మీరా, పాకాల డానియేల్, కోకన్వీనర్లు షేక్షావలి, సీహెచ్ బాలనర్సింహ, లక్ష్మీబాయి, రాజ్యలక్ష్మి, బి.మోహన్, అనంతలక్ష్మి, పాషామియా, పలు ప్రజా సంఘాల, కాలనీల నాయకులు పాల్గొన్నారు. -
తొమ్మిదేళ్ల పాపకు పట్టా..
మలక్‌పేట: సరూర్‌నగర్ మండల పరిధిలో బైరామల్‌గూడ్ పాత విలేజ్ సర్వేనంబర్ 11లో 90 గజాల ప్రభుత్వం స్థలంలో ( ఇంటినెంబర్ 7-2-74) పెర్రోజు కుమారస్వామి, భార్య లలిత, కుమార్తె నాగేశ్వరీదేవి(9) తో కలిసి నివాసం ఉంటున్నారు. 58 జీవో కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా అధికారులు కుమారస్వామి కుమార్తె నాగేశ్వరిదేవి పేరున పట్టా జారీ చేశారు . ఈ విషయంపై తహశీల్ధార్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. ప్రభుత్వ నిబంధనల మేరకు పట్టా గృహిణి పేరుమీదనే జారీ చేస్తున్నాం. అయితే ఆ కుటుంబానికి చెందిన మహిళ లేకపోవడం, లేదా ఆధార్ అనుసంధానం కాకపోవడంతో పాప ఆధార్‌కు లింక్ అవ్వడంతో పట్టా నాగేశ్వరీదేవి పేరు మీద పట్టా వచ్చి ఉంటుందన్నారు.