సాక్షి, హైదరాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పుస్తకాల పంపిణీకి సర్వం సన్నద్ధమైంది. అర్హత ఉన్న రైతులకు పట్టాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. ఆ జిల్లాల్లో అర్హులైన గిరిజన రైతులకు పట్టాలను పంపిణీ చేస్తారు.
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంబోత్సవం అనంతరం పట్టాల పంపిణీ చేసి అక్కడ జరిగే బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తారు. వాస్తవానికి పట్టాల పంపిణీ ఈనెల 24న ప్రాథమికంగా ఖరారు చేసినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఈనెల 30కి మార్చారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం ప్రకటన విడుదల చేశారు.
1,50,012 మంది రైతులకు 4,50,601 ఎకరాలు..
పోడుభూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి గిరిజనులు, ఆదివాసీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు అర్హతలను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,50,012 మంది రైతులు 4,50,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు గుర్తించారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు దర ఖాస్తులు సమర్పించారు.
ఈ లెక్కన ఒక్కో రైతు సగటున 3 ఎకరాలు సాగు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో 24972 మంది రైతులు, ఆసిఫాబాద్ జిల్లాలో 15,254 మంది రైతులు దరఖాస్తులు సమ ర్పించారు. ఈ రైతులకు పట్టా పాసుపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పట్టాలను అందించిన తర్వాత ఇతర జిల్లాల్లో సంబంధిత జిల్లా మంత్రులు కూడా అదేరోజు పట్టాల పంపిణీ చేస్తారు. పోడు సమస్యకు పరిష్కారం చూపాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి గిరిజనులు కృతజ్ఞతులై ఉంటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment