కృష్ణపట్టె భూములను చెరబట్టిన అక్రమార్కులు
నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలో 3,900 ఎకరాలకు బోగస్ పట్టాలు
రాజకీయ నేతల అండదండలు, అధికారుల సహకారంతో భారీగా అక్రమాలు
ప్రైవేటు, ప్రభుత్వ భూములకు సంబంధించి ధరణిలో అనర్హుల పేర్లు నమోదు
వారికి ఏటా రూ.3.5 కోట్ల చొప్పున రైతుబంధు..
ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, బ్యాంకు రుణాలు కూడా..
భూములు స్వా«దీనంలో ఉండి, వ్యవసాయం చేస్తున్నవారికి అందని పథకాలు
భూసమస్యలపై పైలట్ ప్రాజెక్టులో బయటపడిన బాగోతం
పూర్తిస్థాయిలో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు క్షేత్రస్థాయిలో సర్వే
తిరుమలగిరి (సాగర్) మండలంలోని గోడుమడకకు చెందిన ఈయన పేరు బారు శివయ్య. ఆయనకు చింతలపాలెం రెవెన్యూ శివార్లలోని సర్వే నంబర్ 14లో 4.30 గుంటల భూమి ఉంది. తాతల కాలం నుంచీ వారే ఆ భూమిని సాగుచేసుకుంటున్నారు. నేటికీ రికార్డుల్లో పేరు లేకపోవడంతో పట్టాదారు పాసుపుస్తకం అందలేదు. కానీ కొందరు ఈ భూమికి సంబంధించి అక్రమంగా పట్టాలను చేయించుకుని రైతుబంధు, రైతుబీమా పథకాలు పొందుతున్నారు. బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారు. భూమి తమ స్వాదీనం (కబ్జా)లో ఉన్నా.. తమకు పాస్ పుస్తకం లేక ప్రభుత్వ పథకాలు అందడం లేదని శివయ్య వాపోయారు.
..ఈయన ఒక్కరి భూమే కాదు. కేవలం ప్రైవేటు వ్యక్తుల అదీనంలోని స్థలాలే కాదు.. వేల ఎకరాల ప్రభుత్వ భూములను కూడా అక్రమార్కులు చెరబట్టారు. భూమిని ఏళ్లకేళ్లుగా సాగుచేసుకుంటున్నవారు పట్టాలు లేక, హక్కుల్లేక ప్రభుత్వ పథకాలకు దూరమైతే... కొందరు అవే భూములపై నకిలీ పట్టాలు సృష్టించి, ప్రభుత్వం నుంచి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల సొమ్మును కాజేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రభుత్వ భూములకే బోగస్ పట్టాలు సృష్టించేశారు. కృష్ణపట్టె ప్రాంతమైన నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలో తాజాగా బయటపడిన బాగోతమిది.
అక్రమార్కులు ఈ మండలంలో 3,900 ఎకరాలకు బోగస్ పట్టాలు సృష్టించినట్టు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. తద్వారా ఏటా రూ.3.5 కోట్ల చొప్పున గత పదేళ్లలో రూ.35 కోట్లకుపైగా రైతుబంధు రూపంలోనే పొందినట్టు అధికారులు భావిస్తున్నారు. బోగస్ పట్టాలతో రైతుబీమా, బ్యాంకుల్లో రుణాలు పొందినట్టు తేల్చారు. సమీపంలోని దామరచర్ల మండలంలోనూ వేల ఎకరాల ప్రభుత్వ భూములు బోగస్ పట్టాలతో కబ్జా అయినట్టు రెవెన్యూ యంత్రాంగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ముడుపులకు అలవాటుపడిన అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ అక్రమాలు సాగాయని అంటున్నారు.
– సాక్షి ప్రతినిధి, నల్లగొండ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ధరణి సమస్యలతో రైతులు ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో పరిష్కార మార్గాలపై సర్కారు దృష్టి పెట్టింది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా లోని తిరుమలగిరి (సాగర్) మండలంలో నెలకొన్న పరిస్థితిని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ప్రభుత్వం తిరుమలగిరి (సాగర్) మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. భూముల సమస్య లపై విచారణ చేపట్టింది.
అధికారులు ప్రాథమిక విచారణలోనే 3,900 ఎకరాలకు కొందరు బోగస్ పట్టాలు సృష్టించినట్టు గుర్తించారు. మండలంలోని చింతలపాలెం గ్రామంలోని 12, 222, 158, 162, 223 సర్వే నంబర్లలో, తిమ్మాయి పాలెం గ్రామంలోని 38, 39, 60, 70, 74 సర్వే నంబర్లలో అక్రమ పట్టాలు ఉన్నట్టు తేల్చారు. వీటితోపాటు తునికినూతల గ్రామంలో సర్వే నంబర్ 45, నెల్లికల్ గ్రామంలో 424 సర్వే నంబర్, జమ్మలకోట గ్రామంలో 28 సర్వేనంబర్లలో అక్రమంగా పట్టాలు పొందినట్టు గుర్తించారు.
చింతలపాలెం, తిమ్మాయిపల్లి రెండు గ్రామాల్లోనే 2,800 ఎకరా లకు నకిలీ పట్టాలు సృష్టించినట్టు తేలడం గమనార్హం. ప్రభుత్వ భూములనూ బోగస్ పట్టాలతో చెరబట్టినట్టు గుర్తించారు. దీంతో ఈ అక్రమాలను పూర్తిస్థాయిలో నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 14 రెవెన్యూ, సర్వే బృందాల ఆధ్వర్యంలో 80 మందికిపైగా సిబ్బంది తో క్షేత్రస్థాయి సర్వేకు శ్రీకారం చుట్టింది.
నకిలీ స్వాతంత్య్ర సమరయోధుల పేరిట పట్టాలు
దామరచర్ల మండలంలోని సర్వే నంబర్లు 686, 691, 1100, 735, 655, 621, 690, 714తోపాటు మరో 33 సర్వే నంబర్లలో 4,542 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములపై కబ్జాదారు ల కన్ను పడింది. దీంతో భూబకాసురులకు.. స్వాతంత్య్ర సమరయోధులు గుర్తుకొచ్చారు. నకిలీ సమర యో ధులను సృష్టించి, తమ చేతివాటం ప్రదర్శించి, అధికారులను మచి్చక చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను దోచేశారు. వాటిపైనే ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది.
60 ఏళ్లుగా సేద్యం చేస్తున్నా.. హక్కులు తొలగించారు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మా గ్రామం ముంపునకు గురికావడంతో చిన్నాయిపా లెం తండాలో పునరావా సం కల్పించారు. 1962లో అప్పటి ప్రభుత్వం పట్టాలు అందజేసింది. 60 ఏళ్లుగా అక్కడే సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నాం. ధరణికి ముందు వరకు బ్యాంకులో రుణాలు పొందాం. 2016 భూప్రక్షాళన సమయంలో మా భూములను పార్ట్–బీలో చేర్చడంతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదు. అప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. బ్యాంకు రుణం తీసుకునే అవకాశం లేకుండాపోయింది.
– రమావత్ హనుమ, చెన్నాయపాలెం
మొత్తం రీసర్వే.. అక్రమ పట్టాల తొలగింపే లక్ష్యం
తిరుమలగిరి సాగర్ మండలంలోని అన్ని భూములపై రీసర్వే చేస్తున్నాం. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. 100 ఎకరాల భూమి ఉంటే రికార్డుల్లో 200 ఎకరాలకు పేర్లు ఉన్నాయి. భూమి స్వా«దీనంలో ఉన్న వారి పేర్లు ధరణిలో లేవు. ధరణిలో పేర్లు ఉన్నవారి స్వాదీనంలో భూములు లేవు. ఎవాక్యూ ప్రాపర్టీని కబ్జా చేసి పట్టాలు సృష్టించారు. అటవీ భూముల హద్దుల సమస్యలు ఉన్నాయి.
వాటన్నింటినీ తేల్చి.. అర్హులకు పట్టాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ఈ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మండలంలోని ప్రతి సర్వే నంబరులోనూ విస్తృత సర్వే చేస్తున్నాం. ఆ భూమి ఎవరిదని తేల్చి, నకిలీ పట్టాలను రద్దు చేసి.. కబ్జాలో ఉన్న అసలైన అర్హుల పేరిట పట్టాలు ఇచ్చి, న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నాం.
– నారాయణరెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment