కలలో సైతం ఊహించని భూ సంస్కరణలివి. భారతదేశ సామాజిక చరిత్రలో ఇది మేలి మలుపు. బహుశా ఇప్పటిదాకా ఈ రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేసిన దాఖలాలు ఎక్కడా ఉండకపోవచ్చు. ప్రధానంగా దళిత వర్గాల స్థితిగతుల్లో వేగవంతంగా మార్పు కనిపించడం ఖాయం. బహిరంగ సభల్లో సీఎం జగన్ ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ’ అని చెప్పే మాటలు ఆయన హృదయాంతరాల్లోంచి వచ్చేవేనని రుజువైంది.
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా భూములకు సంబంధించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సాహసోపేతంగా తీసుకున్న ఐదు నిర్ణయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదల తల రాతలు మార్చనున్నాయి. ప్రధానంగా దళితుల పాలిట ఐదు వరాలుగా భావించవచ్చు. నిరుపేద దళితులకు సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని కల్పించడమే లక్ష్యంగా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఐదు కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు. అసైన్డ్ భూముల రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాలనే చరిత్రాత్మక నిర్ణయంతో 15.21 లక్షల మంది రైతులు లబ్ధి పొందితే అందులో అత్యధికులు దళిత వర్గానికి చెందిన వారే.
రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత భూమి లేని నిరుపేదలకు భూముల పంపిణీకి శ్రీకారం చుట్టడం ద్వారా ఎక్కువ లబ్ధి పొందబోతున్నదీ దళిత సోదరులే. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న లంక భూములకు డి పట్టాలు ఇవ్వడం ద్వారా దళితులు, ఇతర వర్గాల వారి కష్టాలకు ప్రభుత్వం చరమగీతం పాడింది. భూమి కొనుగోలు పథకం కింద దళితులకు ఇచ్చిన భూములపై పూర్తి హక్కులు కల్పించి వారికి మేలు చేకూర్చుతోంది. శ్మశాన వాటికలు లేని దళిత వాడ ఉండకూడదనే లక్ష్యంతో ఎవరూ అడగకుండానే 1,700 గ్రామాల్లో వాటి ఏర్పాటుకు 1,050 ఎకరాలు కేటాయించింది. వీటన్నింటి వల్ల 16 లక్షల మంది దళితులు, ఇతర పేద వర్గాల బతుకు చిత్రాలు మారనున్నాయి.
ఇన్నాళ్లూ కాగితాలపైనే విలువ
అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంతో అనేక సంవత్సరాలుగా భూమి ఉన్నా లేనట్లే జీవిస్తున్న లక్షలాది మంది దళిత, పేద రైతులకు మేలు జరగనుంది. ప్రభుత్వం నుంచి భూమిని పొంది 20 ఏళ్లు పూర్తయితే ఆ అసైన్‌మెంట్‌దారులు.. వారు లేకపోతే వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. అసైన్డ్ భూముల చరిత్రలో ఇదొక గొప్ప నిర్ణయం. స్వాతం్రత్యానికి ముందు, తర్వాత.. భూమి లేని నిరుపేదలకు జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వాలు భూమిని ఇచ్చేవి. ఇలా భూమి పొందే వారిలో ఎక్కువ మంది దళితులే ఉండేవారు.
వారికి ప్రభుత్వాలు అసైన్ (ఇచ్చిన) చేసిన భూములను వారు సాగు చేసుకోవడమే తప్ప వాటిపై వారికి ఎటువంటి హక్కులు ఉండవు. అసైన్డ్ చట్టాల ప్రకారం ఆ భూములను అమ్మడం, కొనడం నిషేధం. ఏదైనా అవసరం వచ్చి తనకున్న అసైన్డ్ భూమిలో కొంత భాగాన్ని అమ్ముదామంటే సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఆ భూముల రిజి్రస్టేషన్ జరగదు. దీంతో ఇతర భూములకు, అసైన్డ్ భూములకు చాలా తేడా ఏర్పడింది. అవసరాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో సాదా బైనామాల పద్ధతిలో కాగితాల మీద రాసుకుని కొందరు తమ భూములను ఉన్న విలువ కంటే చాలా తక్కువకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులు
► తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని అసైన్డ్ రైతులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారు. స్వాతం్రత్యానికి ముందు.. 1954లో ఇచ్చిన భూములపై సంబంధిత రైతులకు యాజమాన్య హక్కులు కల్పించే అవకాశం ఇచ్చారు. కానీ అది కూడా అమలులోకి రాలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి భూములపై యాజమాన్య హక్కులు కల్పించే ప్రక్రియను ప్రారంభించింది.
► 1954 తర్వాత అసైన్‌మెంట్ చేసిన భూములపైనా యాజమాన్య హక్కులు ఇవ్వాలనే అభ్యర్థనపై గత ప్రభుత్వాలు చర్చించడం, కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కూడా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించే విషయంపై ఒక కమిటీ నియమించి చేతులు దులుపుకుంది.
► వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 13 మంది దళిత, గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులుగా 2022 ఆగస్టు 30న ప్రజాప్రతినిధుల కమిటీని నియమించి దీనిపై నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ కమిటీ కర్ణాటక, తమిళనాడులో అసైన్డ్ భూములపై హక్కులు ఇవ్వడంతో ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్డ్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను పరిశీలించింది.
► వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మన రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత లబ్ధిదారులు.. వారు లేకపోతే వారి వారసులు వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇందుకు రాష్ట్రం మంత్రివర్గ ఆమోదం తెలిపింది.
► అసైన్డ్ రైతుల్లో దాదాపు 70 శాతం మంది దళితులు ఉంటారని అంచనా. ఆ తర్వాత బీసీ, ఎస్టీ, మైనార్టీ రైతులకూ మేలు జరుగుతుంది. అదే సమయంలో ఎవరైనా 20 ఏళ్లకు ముందే పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ భూములపై వారికి ఎటువంటి హక్కులు రావు.
54,129.45 వేల ఎకరాల్లో దళితులకే ఎక్కువ
► సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో నిరుపేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల దళితులకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది. భూమి లేని నిరుపేదల్లో వారే ఎక్కువగా ఉన్నారు. 23 జిల్లాల్లో 54,129.45 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచనున్నారు. 46,935 మందికి భూములివ్వడానికి ఎంపిక చేయగా అందులో దళితులే ఎక్కువ.
► వ్యవసాయ కూలీలుగా, ఇతర పనులు చేసుకుంటూ జీవించే వారిని ప్రభుత్వం రైతులుగా మార్చనుంది. రాష్ట్రంలో చివరిసారిగా 2013లో భూ పంపిణీ జరిగింది. తక్కువ భూమి అయినా పేదలకివ్వడం అదే చివరిసారి. ఆ తర్వాత భూ పంపిణీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. పేదలు మాత్రం తమ జీవనోపాధికి కొంత భూమి ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎవరూ అడగకుండానే దళితులు, ఇతర వర్గాల్లోని నిరుపేదలకు మేలు చేయాలనే సంకల్పంతో భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు.
లంక భూముల్లో 80 శాతం వీరివే
► లంక భూములకు డీకేటీ పట్టాలివ్వాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల 8 జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19,176 మంది రైతులకు పట్టాలు దక్కనున్నాయి. వారిలో అత్యధికులు దళిత రైతులే.
► కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో మూడు కేటగిరీల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న అనేక మంది రైతులకు పట్టాలు లేవు. తమకు పట్టాలు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం దళిత రైతుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. సి కేటగిరీలోని కొన్ని భూములకు ఐదేళ్ల లీజుకు ఇవ్వనుంది.
అప్పు మాఫీతో భూమి చేతికొచ్చింది
► భూమి కొనుగోలు పథకం ద్వారా భూములు పొందిన దళిత రైతుల కష్టాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చరమగీతం పాడింది. ఆ భూములపై రుణాలను మాఫీ చేస్తోంది. రుణాలు చెల్లించినా నిషేధిత జాబితాలో కొనసాగుతున్న భూములకు సైతం విముక్తి కల్పిస్తోంది. ఈ రెండు నిర్ణయాల వల్ల మొత్తం 22 వేల మందికిపైగా రైతులకు వారి భూములపై సంపూర్ణ హక్కులు లభించనున్నాయి.
► భూమి లేని దళిత రైతుల జీవనోపాధి కోసం గతంలో రాష్ట్ర ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూములను కొనుగోలు చేసి అర్హులకు ఇచ్చింది. ఆ భూములపై ఇచ్చిన రుణాలను కొందరు తిరిగి చెల్లించినా, కొందరు చెల్లించలేకపోయారు. దీంతో 16,213.51 ఎకరాలకు సంబంధించి 14,223 మంది రైతుల భూముల పత్రాలు తనఖాలో ఉన్నాయి.
► ఇప్పుడు ఆ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి భూములపై దళిత రైతులకు పూర్తి హక్కులు కల్పించింది. ఎలాంటి రుసుం తీసుకోకుండా వాటిని దళిత మహిళా రైతుల పేరుతో రిజిష్టర్ డాక్యుమెంట్లుగా ఇవ్వనున్నారు.
► రుణాలు చెల్లించి తాకట్టు నుంచి విడిపించుకున్న రైతుల భూములు కూడా నిషేధిత జాబితాలోనే కొనసాగుతున్నాయి. ఆ భూములను 22 (ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం చెల్లించాల్సిన రిజి్రస్టేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను ప్రభుత్వం మినహాయించింది. దళిత రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే భూములపై హక్కులు లభిస్తాయి.
నెరవేరిన దశాబ్దాల కల
► రాష్ట్రంలో దళిత వాడలకు స్మశాన వాటికల సమస్య లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. శ్మశాన వాటికలు లేని దళిత వాడల్లో వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 17,564 రెవెన్యూ గ్రామాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్లు 1,900కు పైగా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవని నివేదిక ఇచ్చారు. 1,700 గ్రామాల్లో వాటి ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ గ్రామాల్లో జనాభాను బట్టి అర ఎకరం లేదా ఎకరం కేటాయించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్‌కు అప్పగించింది.
► మొత్తంగా 1,700 గ్రామాల్లో 1,050.08 ఎకరాలను శ్మశాన వాటికలకు కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దళిత వాడల్లో ఎన్నో దశాబ్దాలుగా ఈ సమస్య నలుగుతోంది. తమకు శ్మశాన వాటికలు కావాలని ఎస్సీలు.. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులను ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా, ఏ ప్రభుత్వం దానిపై ఇంత వరకు చిత్తశుద్ధితో దృష్టి పెట్టలేదు. మొట్టమొదటిసారిగా సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై దృష్టి సారించి, 1050 ఎకరాలు కేటాయించారు. అతి త్వరలో ఆయా గ్రామాల్లో వారికి శ్మశాన వాటికలు ఏర్పాటు కానున్నాయి.
పెరగనున్న రైతుల స్థితిగతులు
సీఎం జగన్ నిర్ణయాలతో రైతుల చేతిలో ఉన్న భూముల విలువ పెరిగింది. తద్వారా ఆయా రైతుల స్థితిగతులు, ఆదాయ హోదాలు పెరుగుతున్నాయి. అత్యవసర కాలంలో తనకంటూ విలువైన ఆస్తి ఉందంటూ ఆ భూముల్ని చూసుకుని మురిసిపోయే పరిస్థితులొచ్చాయి. ఈ సంస్కరణల వల్ల రాష్ట్ర జీడీపీ కూడా పెరుగుతుంది. దాదాపు 22 లక్షల మంది బడుగు, బలహీన వర్గాల వారికి ప్రయోజనం.
– కె. నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి)
భూ సంస్కరణలు సీఎం జగన్‌కే సాధ్యం..
అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులపై సీఎం జగన్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. సామాజిక న్యాయ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు అధిక ప్రయోజనం. అంబేడ్కర్ ఆశయసాధనకర్తగా సీఎం వైఎస్ జగన్ తెలుగుజాతి ఉన్నంతవరకు మిగిలిపోతారు. ఈ కాలంలో అంటరానితనంపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పక తప్పదు.
– పీడిక రాజన్న దొర, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ మంత్రి)
అంటరానితనంపై సవాల్
పేదలకు మేలు చేసే విషయాలపై గత పాలకులు సగం సగం నిర్ణయాలే తీసుకున్నారు. సీఎం జగన్ మాత్రం చిత్తశుద్ధితో అసైన్డ్ భూములపై నిర్ణయం తీసుకున్నారు. అంటరానితనంపై ప్రభుత్వ పరిపాలన సవాల్ విసిరినట్లు ఉంది. నాలుగేళ్ల పాలనలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సీఎం తన విశ్వరూపం చూపారు.
– పినిపె విశ్వరూప్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
చరిత్రాత్మక నిర్ణయం
అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం చరిత్రాత్మక నిర్ణయం. ఎంతటి కష్టమొచ్చినా ఇన్నాళ్లూ అసైన్డ్ భూములను అమ్ముకోడానికి వీలు లేని పరిస్థితి. ఇకపై ఆ బెంగ తీరనుంది. దీనివల్ల 15.21 లక్షల మంది పేదలకు చెందిన 27.41 లక్షల ఎకరాల భూమిని పేదలు అమ్ముకోడానికి అవకాశం కలుగుతోంది. వాళ్లకు హక్కులు కల్పిస్తే వారి జీవితాలు బాగు పడతాయనే ఆలోచనే గొప్ప మార్పునకు నాంది.
– మేరుగు నాగార్జున, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి
దేశంలో గొప్ప భూ సంస్కరణ
అసైన్డ్ భూములపై దళితులకు సర్వహక్కులు కల్పించడం దేశంలోనే గొప్ప భూ సంస్కరణ. 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపై ఉన్న ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించడం నిజంగా గొప్ప విషయం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి భూ సంస్కరణ జరగలేదు. భూములపై హక్కు కల్పించడం అంటే వారి హోదాను పెంచడమన్న విషయాన్ని విపక్షాలు గుర్తించాలి.
– ఆదిమూలపు సురేష్, పురపాలక శాఖ మంత్రి
సీఎం జగన్‌కు సెల్యూట్
అసైన్డ్ భూములపై సంస్కరణలు పేద రైతుల హోదాను పెంచే మహత్తర నిర్ణయంగా భావించాలి. దళిత ప్రజాప్రతినిధులమంతా సీఎం జగన్‌కు సెల్యూట్ చేస్తున్నాం. ఈ భూ సంస్కరణల ద్వారా 15.21 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. భూ రీసర్వే ద్వారా ఇప్పటికే 19 లక్షల మ్యుటేషన్లు జరిగాయి.
– నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ బాపట్ల ఎంపీ
గొప్ప ఫలితాలు ఖాయం
వైఎస్ జగన్ ప్రభుత్వం విలువ లేకుండా ఉన్న భూములపై ఆంక్షలు తొలగించి, వాటిపై అనుభవదారులకు సర్వ హక్కుల్ని కల్పించింది. తద్వారా పేద రైతుల సామాజిక హోదాను పెంచే దిశగా అడుగులు ముందుకు వేసింది. ప్రభుత్వ ఆస్తులు, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఆస్తుల్ని వేర్వేరుగా రికార్డుల్లో చేర్చి, వివాదాలను పరిష్కరిస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి భూ హక్కుల సంస్కరణలు గొప్ప ఫలితాల్ని ఇవ్వనున్నాయి.
– తానేటి వనిత, రాష్ట్ర హోం శాఖ మంత్రి
రైతు హోదాను పెంచే మహత్తర నిర్ణయం
20 ఏళ్లపాటు అనుభవమున్న భూమిపై సర్వహక్కులు కల్పించటం, ఆంక్షలు ఎత్తివేత సహసోపేత నిర్ణయం. ఒక మేజర్ సంస్కరణ తీసుకు రావాలని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచించారు. 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపై ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించారు. రైతుకు తన భూమిపై హక్కు ద్వారా తన హోదాను పెంచే నిర్ణయంగా భావించాలి.
– మేకతోటి సుచరిత, మాజీ మంత్రి
దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం
సీఎం వైఎస్ జగన్ సామాజిక బాధ్యతతో తీసుకున్న ఈ నిర్ణయం భారత సామాజిక న్యాయ చరిత్రలో సువర్ణ అధ్యాయం. అసైన్డ్ భూములకూ ఇక మంచి ధర వస్తుంది. ఆయా రైతుల స్థితిగతులు, ఆదాయ హోదాలు పెరుగుతాయి. విలువైన ఆస్తి అని వారు సంబరపడుతున్నారు.
– జూపూడి ప్రభాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారు
Comments
Please login to add a commentAdd a comment