AP CM YS Jagan Comments On Employees Welfare At Camp Office, Details Inside - Sakshi
Sakshi News home page

మీ చిరునవ్వుల్లో సకల సంతోషాలు

Published Wed, Jun 14 2023 4:01 AM | Last Updated on Wed, Jun 14 2023 9:55 AM

CM YS Jagan Comments On Employees Welfare At Camp Office - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సత్కరిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు

‘‘ఉద్యోగులను సంతోషంగా ఉంచేందుకు నా తరపు నుంచి ప్రతి కార్యక్రమాన్ని మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నా. ఈ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నా..’’
– ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: ఉద్యోగులు సంతోషంగా ఉంటే డెలివరీ మెకానిజం బాగుంటుందని, తద్వారా ప్రజలు సంతోషంగా ఉంటారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కొందరు రాజ­కీయ కారణాలతో చెప్పే అంశాలను ఉద్యో­గులు విశ్వసించనక్కరలేదని, నా మనసు ఎప్పుడూ మీకు మంచి చేయడం కోసమే ఉంటుందని..అన్నింటినీ పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ నెల 7వ తేదీన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కొత్తగా జీపీఎస్‌ తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ విలీనం, 12వ పీఆర్సీ ఏర్పాటు సహా ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న పలు నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపాయి. ఈమేరకు ఏపీ జేఏసీ అమరావతితో సహా పలు ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలనుద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు. 

నిర్ణయాలన్నీ 60 రోజుల్లోగా అమల్లోకి 
ఉద్యోగులకు సంబంధించి కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలన్నీ 60 రోజుల్లోగా పూర్తిగా అమల్లోకి రావాలని, ఈ విషయంలో ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. డైలీవేజ్‌ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్‌ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
 

ఉభయులకూ ప్రయోజనకరంగా జీపీఎస్‌ 
సమస్యలను అలాగే వదిలేయకుండా ప్రతి ఒక్క అంశానికీ పరిష్కారం చూపేందుకు తొలిసారిగా ఈ ప్రభుత్వమే ప్రయత్నిస్తోందని సీఎం చెప్పారు. ఉద్యోగులకు మంచి జరగాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి జరగాలనే ఆలోచన చేశామన్నారు. దాదాపు రెండేళ్లు కసరత్తు చేసిన తరువాత ఉభయులకూ ప్రయోజకరంగా ఉండేలా జీపీఎస్‌ను రూపొందించామని వెల్లడించారు.

భవిష్యత్తు తరాలూ చెప్పుకునేలా..
ఇదంతా అయ్యే పని కాదని 2003లో ప్రభుత్వాలు చేతులెత్తేశాయన్నారు. ఆ పరిస్థితి తలెత్తకుండా, ఉద్యోగులు రోడ్డు మీదకు రాకూడనే ఉద్దేశంతో ఎంతో ఆలోచన చేశామని తెలిపారు. ఆ రోజు వైఎస్‌ జగన్‌ ఉద్యోగులకు మంచి చేశారని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి చేశారనే మాట భవిష్యత్తు తరంలో కూడా వినిపించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
 
బేసిక్‌ వేతనంలో కనీసం 50 శాతం పెన్షన్‌ వచ్చేలా
ఉద్యోగులు ఈ రోజు తీసుకుంటున్న జీతం బేసిక్‌లో కనీసం 50 శాతం పెన్షన్‌గా వచ్చేలా  జీపీఎస్‌ రూపొందించడంతోపాటు ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్‌లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. రిటైరైన ఉద్యోగుల జీవన ప్రమాణాలు స్ధిరంగా కొనసాగేలా గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌ను తీసుకొచ్చామన్నారు.

జీపీఎస్‌ దేశానికే రోల్‌ మోడల్‌ 
అధికారంలోకి వచ్చాక 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను నియమించామని, భవిష్యత్తులో వారి నుంచి వైఎస్‌ జగన్‌ తమకు మంచి చేశాడన్న మాట రావాలే కానీ మరో మాట రాకూడదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉద్యోగులకు మంచి జరగాలని చిత్తశుద్ధితో కృషి చేశామని, ఇంత సిన్సియర్‌గా పరిష్కారం వెతికిన పరిస్ధితి రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు.

భవిష్యత్‌లో జీపీఎస్‌ దేశానికే రోల్‌ మోడల్‌ అవుతుందన్నారు. ఈ పథకం ఉద్యోగులకు మేలు చేస్తుందని, వారికి అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులదని పేర్కొంటూ మిమ్మల్ని పూర్తిగా భాగస్వాములుగా చేసుకున్నామని, మీ మొహంలో చిరునవ్వు ఉంటేనే బాగా పని చేయగలుగుతారని, ప్రజలూ సంతోషంగా ఉంటారని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement