కృష్ణా, గోదావరి బోర్డులే బాస్‌లు! | 36 Projects In Krishna, 71 In Godavari Basins Under Purview of KRMB, GRMB | Sakshi
Sakshi News home page

Water Disputes: కృష్ణా, గోదావరి బోర్డులే బాస్‌లు!

Published Sat, Jul 17 2021 3:32 AM | Last Updated on Sat, Jul 17 2021 12:55 PM

36 Projects In Krishna, 71 In Godavari Basins Under Purview of KRMB, GRMB - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు తెరదించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం రాత్రి కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం(బేసిన్‌)లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది అక్టోబర్‌ 14 నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కృష్ణా బేసిన్‌లోని 36 ప్రాజెక్టులు, గోదావరి బేసిన్‌లో 71 ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి వస్తాయి.

ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌సహా చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ(ట్రాన్స్‌మిషన్‌ లైన్స్‌), ఆయకట్టుకు నీటి విడుదల చేసే ప్రాంతాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతలను బోర్డులే నిర్వహిస్తాయి. బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. ఈ మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, నిర్వహణ నియమావళిని ఖరారు చేస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 14 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.

అనుమతి తీసుకోకుండానే పూర్తి చేసినవి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను నోటిఫికేషన్‌లో పేర్కొన్నంత మాత్రాన వాటిని ఆమోదించినట్లు కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా చేపట్టిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులను ఆపివేయాలని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌ ప్రచురించిన రోజు నుంచి ఆర్నెల్లలోగా వాటికి అనుమతి తెచ్చుకోవాలని సూచించింది. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ఆ ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి బోర్డులు సమర్థంగా పని చేసేందుకు 60 రోజుల్లోగా ఒక్కో బోర్డు ఖాతాలో సీడ్‌ మనీ కింద ఒకేసారి రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కృష్ణా / గోదావరి బోర్డు ఛైర్మన్‌ ఆమోదంతో నిర్వహణ ఖర్చుల్ని విడుదల చేయాలని కోరిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని, ఒకవేళ చెల్లించడంలో విఫలమైతే బోర్డుల నిర్వహణలో  ఎదురయ్యే పరిణామాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలు ఇవీ..

విభజన చట్టం ప్రకారం..
విభజన చట్టం సెక్షన్‌–85(1) ప్రకారం నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా 2014 మే 28న కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ బోర్డులు అపెక్స్‌ కౌన్సిల్‌ పర్యవేక్షణలో పని చేస్తాయి. కృష్ణా, గోదావరి బోర్డుల ౖచైర్మన్‌లుగా రెండు రాష్ట్రాలకు చెందని వారినే నియమించాలి. రెండు రాష్ట్రాలకు చెందని వారినే బోర్డు సభ్య కార్యదర్శులుగా, చీఫ్‌ ఇంజనీర్లుగా నియమించాలి. కృష్ణా, గోదావరి బోర్డుల స్వరూపాన్ని నిర్ణయించుకునే అధికారం ఆ బోర్డులకే ఉంటుంది. గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురించిన రోజు నుంచి 30 రోజుల్లోగా బోర్డులు నిర్దేశించుకున్న స్వరూపం, వాటిలో పనిచేసేందుకు ఆయా  విభాగాల ఉద్యోగులను కేంద్రం నియమించాలి.

బోర్డుల పరిధి ఇదీ..
2020 అక్టోబర్‌ 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. విభజన చట్టం సెక్షన్‌–87(1) ప్రకారం రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని షెడ్యూల్‌–1, షెడ్యూల్‌–2, షెడ్యూల్‌–3లో పేర్కొన్న ప్రకారం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, బ్యారేజీలు, కాలువల వ్యవస్థలో విభాగాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ(ట్రాన్స్‌మిషన్‌ లైన్స్‌) బోర్డు పరిధిలోకి వస్తాయి. ప్రాజెక్టుల పరిధిలోని రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతోసహా అందరూ బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాలి. ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రత కల్పిస్తారు. ప్రాజెక్టుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. 

బోర్డులు తమ స్వాధీనంలోకి తీసుకునే షెడ్యూల్‌–1 ప్రాజెక్టులకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురితమైన రోజు నాటికి హైకోర్టు, సుప్రీం కోర్టు, ట్రిబ్యునళ్లలో ఏవైనా కేసులు విచారణలో ఉన్నా, భవిష్యత్‌లో కేసులు దాఖలైనా వాటికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. 
షెడ్యూల్‌–3 ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలి. 
ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు చేపట్టాలి.

గెజిట్‌ ప్రకారం అనుమతి లేనివంటే...?.
1.    బోర్డు అనుమతి తీసుకోనివి, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించని ప్రాజెక్టులు.
2.    కేంద్ర జల్‌ శక్తి శాఖ, కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలి ఆమోదించని సాగునీటి, బహుళార్ధసాధక, వరద నియంత్రణ ప్రాజెక్టులు.
3.    బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్, సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి ఆమోదించిన మేరకు కాకుండా మార్పు చేసిన నిర్మించినవి, నిర్మిస్తున్న ప్రాజెక్టులు.

బోర్డుల విధి విధానాలు ..
కృష్ణా, గోదావరి నదీ వివాదాల ట్రిబ్యునళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అనుసరించి నీటిని పంపిణీ చేయడం. è ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రెండు రాష్టాలకు పంపిణీ చేయడం.
కృష్ణా, గోదావరిపై రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను పరిశీలించి కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలికి బోర్డు పంపుతుంది. బోర్డుల పరిశీలనకు పంపని డీపీఆర్‌లను సీడబ్ల్యూసీ టీఏసీ పరిగణనలోకి తీసుకోదు. è ఏదైనా ఒక ప్రాజెక్టును బోర్డులకు ప్రతిపాదించినప్పుడు పరిధిపై వివాదం తలెత్తితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. దీనిపై నిర్ణయాధికారం కేంద్రానిదే.

ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత..
గతేడాది అక్టోబర్‌ 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యతిరేకించారు. ఈ క్రమంలో నదీ జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపాదనతో ఏకీభవిస్తూ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు తెరదించేలా కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీకి చర్యలు చేపట్టారు. బోర్డులు ఏర్పాటైన ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు కేంద్రం వాటి పరిధిని ఖరారు చేయడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement