రాష్ట్రంలో వచ్చే రెండున్నర దశాబ్దాల్లో ఉచిత విద్యుత్‌కు ఢోకా లేదు | State Energy Secretary Srikanth Nagulapalli Review Meeting Electrical condition | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో వచ్చే రెండున్నర దశాబ్దాల్లో ఉచిత విద్యుత్‌కు ఢోకా లేదు

Published Sun, Nov 7 2021 9:54 PM | Last Updated on Sun, Nov 7 2021 10:01 PM

State Energy Secretary Srikanth Nagulapalli Review Meeting Electrical condition - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు పగటిపూటే 9 గంటపాటు విద్యుత్‌ను వచ్చే 25 ఏళ్లపాటు ఇవ్వడానికే కేంద్ర ప్రభుత్వం సంస్థ 'సెకీ'తో ఒప్పందానికి నిర్ణయించామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు. ఈ ఒప్పందం రైతుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వచ్చే రెండున్నర దశాబ్దాల్లో ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఢోకా లేకుండా చక్కటి భరోసా నిస్తుందని ఆయన వివరించారు. విజయవాడ ఆర్‌ అండ్‌ బీ భవనంలో ఆదివారం విద్యుత్‌ పరిస్థితిపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను శ్రీకాంత్‌ వివరించారు. 

ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (జీఎస్‌ఈఎల్‌) ద్వారా రాబోయే 25 సంవత్సరాల వరకూ రైతులకు ఉచిత విద్యుత్‌ అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం  చర్యలు చేపట్టిందని అన్నారు. వ్యవసాయానికి అందించే విద్యుత్‌ యూనిట్‌ ప్రస్తుతం సగటున  4 రూపాయల 36పైసలకు కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. సెకీతో ఒప్పందం కారణంగా ఈ కరెంటు రూ.2.49 పైసలకే వస్తుందని, తద్వారా యూనిట్‌మీద 
దాదాపు రూ.1.87పైసలు ఆదా అవుతుందన్నారు. ఈ లెక్కన  ఏడాదికి రూ.2,400 కోట్లు  వరకూ ప్రభుత్వానికి ఆదా అవుతుందని శ్రీకాంత్‌ వెల్లడించారు.10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ను కలుపుకొని వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు నిరాటంకంగా విద్యుత్‌ ను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ద్వారా పిలిచిన టెండర్లలో మినిమం బిడ్‌ యూనిట్‌ 2 రూపాయల 49 పైసలకు కోట్‌ అయ్యిందని శ్రీకాంత్‌ తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్టం ప్రకారమే సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆప్‌ ఇండియా (సెకీ) ఆంధ్రప్రదేశ్‌ కు 2 రూపాయల 49 పైసలకు ఆఫర్‌ ఇచ్చిందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని శ్రీకాంత్‌ అన్నారు. తమిళనాడు ప్రభుత్వం గడిచిన సెప్టెంబర్‌ లోనే సెకీ నుంచి యూనిట్‌ 2 రూపాయల 61 పైసలకు సోలార్‌ విద్యుత్‌ ను కొనుగోలు చేసిందని.. అంతకంటే తక్కువగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ అంగీకరించిందన్నారు. డిస్కంలపై పడే నెట్‌ వర్క్‌ ఛార్జెస్‌ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి విద్యుత్‌ ను కొనుగోలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుందని, శ్రీకాంత్‌ తెలిపారు. 

విద్యుత్‌ కొనుగోళ్ల అంశం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ తర్వాతనే ఈఆర్‌సీకి ప్రతిపాదిస్తుందని ఆయన అన్నారు. ఈఆర్‌సీ ఆమోదం అనంతరమే సెకీతో ఒప్పందం అని స్పష్టంచేశారు.2014 నుంచి పీపీఏ ఒప్పందాలలో భాగంగా చేంజ్‌ ఆఫ్‌ లా ప్రకారం విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులు మీద పన్నులు పెరిగినా, తగ్గినా కొనుగోలుదారుడే (ప్రభుత్వం, డిస్కంలు) భరిస్తారన్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని టెండర్లలో ఇదే నిబంధన అమల్లో ఉందని, దీన్ని మార్చడానికి వీల్లేదని, కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రసిటీ చట్టం ప్రకారం దీన్నొక నిబంధనగా నోటిఫై చేశారన్నారు.

2014 నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలలో ఇప్పుడు సెకీ ఇచ్చిన ఆఫరే అతి తక్కువని తెలిపారు. అలాగే ఐఎస్టీఎస్‌ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చిందని వెల్లడించారు.సెకీ నుంచి సౌర విద్యుత్‌ ను కొనుగోలు చేయడంవల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. ఎవాక్యులేషన్‌ లైన్ల ఖర్చు భారం ఉండదన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం 2వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఎవాక్యులేషన్‌ లైన్లు వేయవలసి ఉంటుందని శ్రీకాంత్‌ అన్నారు. 

రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్లైతే.. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నాసరే.. అది ఒన్‌టైంకే పరిమితమవుతుందని తెలిపారు. కాని, కేంద్ర గ్రిడ్‌కు చెల్లించాల్సిన ఛార్జీలు, 25 సంవత్సరాలు పాటు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన ఉంటుందని ఈరూపేణా చాలా కోల్పోతామని వెల్లడించారు. అలాగే బయట ప్రాజెక్టు నుంచి కొనుగోలు వల్ల  మనం పెట్టాల్సిన ఎవాక్యులేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఖర్చు కూడా సెకీతో ఒప్పందం కారణంగా మిగులుతుందని, ఈ రకంగా  
రూ.2,260 కోట్లు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆదా చేసుకోగలుగుతుందని శ్రీకాంత్‌ తెలిపారు. 

సెకీ విద్యుత్‌ వల్ల మనం భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే వేరే ప్రాజెక్టులకు ఈ భూమి ఉపయోగించుకోవచ్చని.. దాని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.రాష్ట్రంతో పోలిస్తే.. రాజస్థాన్‌లో సూర్యుడు ఎక్కవ సేపు ప్రకాశిస్తాడని, ఇక్కడితో పోలిస్తే గంటన్నర సేపు అధిక వ్యవధి సూర్యరశ్మి ఉంటుందని, అందుకే అక్కడ ఉత్పత్తి అధికంగా ఉంటుందన్నారు. అందువల్ల అదనంగా గంటన్నరపాటు సాయంత్రం పీక్‌లో సెక్‌ నుంచి వచ్చే విద్యుత్‌ ఉపయోగపడుతుందన్నారు. ఎక్సేంఛీ నుంచి కొనుగోలు చేస్తే సాయంత్రం పూట పీక్‌ అవర్‌ కరెంటు ధరలు అధికంగా ఉంటాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement