సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరిలపై రెండు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు.. జలాల వినియోగంలో వివాదాలను పరిష్కరించేందుకు జూలైలో అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ చెప్పారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లు రెండు రాష్ట్రాలు ఇప్పటికీ ఇవ్వకపోతే మీరేం చేస్తున్నారంటూ కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్‌లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీఆర్‌లు ఇవ్వాలని మరోసారి 2 రాష్ట్రాలకు లేఖలు రాయాలని.. ఆ లేఖలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎజెండా పంపాలని కోరాలని బోర్డుల చైర్మన్లను ఆదేశించారు. ‘అప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించకపోతే.. మీరే అపెక్స్ కౌన్సిల్‌కు ఎజెండా సిద్ధం చేసి పంపండి’అని బోర్డు చైర్మన్లకు దిశానిర్దేశం చేశారు.
ఆ అంశాల ఆధారంగా ఎజెండా..
కృష్ణా, గోదావరి నదులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు, నీటి వివాదాలపై బోర్డు చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్‌లతో గురువారం ఢిల్లీ నుంచి కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2014 జూన్ 2 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులు, కేంద్ర జలసంఘం నుంచి సాంకేతిక అనుమతి తీసుకోకుండా చేపట్టిన ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలని స్పష్టం చేశారు. ఇదే ప్రాతిపదికగా కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను రెండు రాష్ట్రాల నుంచి తీసుకుని.. వాటిని పరిశీలించి సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు పంపడంలో జాప్యం చేస్తున్నారంటూ బోర్డు చైర్మన్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశాల్లో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఈనెల 10లోగా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఆదేశించామని.. కానీ ఇప్పటికీ డీపీఆర్‌లు ఇవ్వలేదని యూపీ సింగ్‌కు బోర్డుల చైర్మన్లు వివరించారు. దీనిపై యూపీ సింగ్ స్పందిస్తూ.. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాల ని మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని ఆదేశించారు. అప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించకపోతే.. ఈ అంశాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు అపెక్స్ కౌన్సిల్‌కు ఎజెండా పంపకపోతే.. బోర్డు సమావేశాల్లో చర్చించిన అంశాలు, వివాదంగా మారిన ప్రాజెక్టుల ఆధారంగా ఎజెండాను సిద్ధం చేయాలని.. దాన్నే ప్రాతిపదికగా తీసుకుని అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తామని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్‌కు ఎజెండా పంపితే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి.. వారి వీలును బట్టి వచ్చే నెలలో ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment