నదుల అనుసంధానం.. ఓ భగీరథయత్నం | River Link System: River Linking Project In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నదుల అనుసంధానం.. ఓ భగీరథయత్నం

Published Mon, Jul 26 2021 8:44 AM | Last Updated on Mon, Jul 26 2021 8:45 AM

River Link System: River Linking Project In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం అంటే.. ఎవరో కట్టిన కాలువలో నాలుగు చెంబుల నీళ్లు ఎత్తిపోయడమా.. ఆ కాలువలో వర్షపు నీటిని చూపించి రెండు నదులను అనుసంధానించేశామంటూ కోట్లు ఖర్చుపెట్టి ఈవెంట్లు చేయడమా... వేర్వేరు మార్గాలలో పయనించే రెండు నదులను అనుసంధానించడం ఓ భగీరథయత్నం.. ఇందుకు నిధులు మాత్రమే కాదు నిబద్ధత, దృఢ దీక్ష కూడా అవసరమే. పాలకులకు అవి ఉన్నప్పుడే అనుసంధాన యత్నాలు ఫలిస్తాయి.  రెండు కాదు.. మూడు కాదు రాష్ట్రంలో మొత్తంగా ఆరు చోట్ల నదుల అనుసంధానం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది.  రాష్ట్రం పరిధిలోని నదుల అనుసంధానం పనులను వేగవంతం చేస్తూనే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ  వంటి అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంపైనా కేంద్రంతో కలిసి కసరత్తు చేస్తోంది.

నదుల అనుసంధానం అంటే ఇదీ.. 
నదుల అనుసంధానానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఒక నదిపై బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి వరద జలాలను మరో నదిపై నిర్మించే బ్యారేజీలోకి తరలించినప్పుడే ఆ రెండు నదులు అనుసంధానం చేసినట్లు లెక్క. గోదావరి నదిపై ఎలాంటి బ్యారేజీ నిర్మించకుండా..దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన పోలవరం కుడి కాలువ మీదుగా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి 2016లో గోదావరి జలాలను తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసినట్లు నాటి సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని అప్పట్లో సీడబ్ల్యూసీ ఖండించడం గమనార్హం. 

రూ.145.34 కోట్లతో వంశధార–నాగావళి అనుసంధానం 
నాగావళి నదిలో వరద ఆలస్యంగా రావడం, నారాయణపురం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఖరీఫ్‌లో ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2 ఫేజ్‌–2లో హిరమండలం రిజర్వాయర్‌కు తరలించిన వంశధార నీటిని, ఆ రిజర్వాయర్‌ మట్టికట్ట 5.6 కి.మీ వద్ద నుంచి 33.583 కి.మీల పొడవున హెచ్చెల్సీ(హైలెవల్‌ కెనాల్‌)ను తవ్వి రోజుకు 600 క్యూసెక్కులను నారాయణపురం ఆనకట్టకు ఎగువన నాగావళి నదిలోకి పోయడం ద్వారా ఆ రెండు నదులను అనుసంధానం చేసి, ఆయకట్టును సస్యశ్యామలం చేసే పనులను రూ.145.34 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే 31.30 కి.మీ పొడవున హెచ్చెల్సీ తవ్వకం పనులను పూర్తి చేసింది. కేవలం 2.283 కి.మీల కాలువ తవ్వకం పనులు మాత్రమే మిగిలాయి. వాటిని ఖరీఫ్‌ నాటికి పూర్తి చేసి.. వంశధార–నాగావళి అనుసంధానాన్ని సాకారం చేయనున్నది. దీని వల్ల నారాయణపురం ఆనకట్ట కింద 39,179 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు హెచ్చెల్సీ కింద కొత్తగా ఐదు వేల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధిని మరింత  వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

పోలవరం నుంచి గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు అనుసంధానం 
► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. 
►  పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్‌ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. 
►  పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. 
►  పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. 
►  పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్‌ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. 
►  పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది.

కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి అనుసంధానం.. 
తెలుగుంగ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా(శ్రీశైలం రిజర్వాయర్‌)–పెన్నా (సోమశిల రిజర్వాయర్‌)ను ఇప్పటికే అనుసంధానం చేశారు. సోమశిల వరద కాలువ 12.52 కి.మీ నుంచి రోజుకు 2,500 క్యూసెక్కులను తరలించి.. చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో పోయడం ద్వారా కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి నదులను అనుసంధానం చేసే పనులను ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టింది. ఈ అనుసంధానం ద్వారా 1.23 లక్షల ఎకరాలకు నీళ్లందించనున్నారు. స్వర్ణముఖి నది పెన్నా ఉప నది.  

కృష్ణా–పెన్నా–పాపాఘ్ని అనుసంధానం.. 
గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం కింద 2009 నాటికే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృష్ణా–పెన్నా నదులను అనుసంధానం చేశారు. పెన్నా ఉప నది అయిన పాపాఘ్ని పరీవాహక ప్రాంతం పూర్తిగా వర్షాభావ ప్రాంతంలో ఉంది. దీని వల్ల పాపాఘ్నిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గాలేరు–నగరి ద్వారా శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా నదీ వరద జలాలు.. గాలేరు–నగరి ప్రధాన కాలువ 56 కి.మీ వద్ద నుంచి జలాలను ఎత్తిపోసి.. పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్‌లోకి తరలించే పనులను చేపట్టారు. దీని ద్వారా 26 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు.  

కృష్ణా–వేదవతి అనుసంధానం.. 
కృష్ణా ఉప నది అయిన వేదవతిపై అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్టును 1956లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. టీడీపీ సర్కార్‌ హయాంలో కర్ణాటకలో వేదివతిపై చెక్‌ డ్యామ్‌లు నిర్మించడంతో బీటీపీలోకి చుక్క నీరు చేరడం లేదు. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే నీటిని జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి బీటీపీలోకి ఎత్తిపోయడం ద్వారా కృష్ణా–వేదవతి నదుల అనుసంధానం పనులను రూ.968 కోట్లతో చేపట్టింది. దీని ద్వారా బీటీపీ కింద 12 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు వర్షాభావ ప్రాంతంలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో చెరువులను నింపడం ద్వారా మరో 10,323 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు.
 
గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కసరత్తు... 
గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. జానంపల్లి నుంచి గోదావరి–కృష్ణా(నాగార్జునసాగర్‌)–పెన్నా(సోమశిల)–కావేరీ(గ్రాండ్‌ ఆనకట్ట) అనుసంధానం చేసేలా ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) రూపొందించిన ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను చెబుతూ.. తక్కువ వ్యయంతో గరిష్టంగా వరద జలాలను ఒడిసి పట్టి.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలనూ సిద్ధం చేయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశాక.. వాటిని ఎన్‌డబ్ల్యూడీఏకు పంపి.. పనులు చేపట్టాలని నిర్ణయించారు.

కేసీ కెనాల్‌తోనే నదుల అనుసంధానానికి నాంది.. 
తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో సుంకేశుల వద్ద ఆనకట్ట నిర్మించి, అక్కడి నుంచి వైఎస్సార్‌ జిల్లాలో పెన్నా నదిని అనుసంధానిస్తూ కేసీ కెనాల్‌ తవ్వకం పనులను 1863లో ప్రారంభించిన డచ్‌ సంస్థ 1870 నాటికి పూర్తి చేసింది. ఈ కాలువను నౌకా మార్గంగా వినియోగించుకుని వ్యాపారం చేసేది. వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ కాలువను 1882లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ డచ్‌ సంస్థ నుంచి రూ.3.02 కోట్లకు కొనుగోలు చేసింది. సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ ప్రతిపాదన మేరకు కేసీ కెనాల్‌ను 1933లో సాగునీటి వనరుగా మార్చింది. ఈ కాలువ కింద ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. దేశంలో కేసీ కెనాల్‌ ద్వారానే నదుల అనుసంధానం చేయడం ప్రథమం కావడం గమనార్హం. కేసీ కెనాల్‌ స్ఫూర్తితోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినట్లు ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది. 

తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం.. 
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా తుంగభద్రపై తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా తుంగభద్ర జలాలను పెన్నాపై నిర్మించిన మధ్య పెన్నార్‌ ప్రాజెక్టులోకి.. అక్కడి నుంచి చిత్రావతిపై నిర్మించిన చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి తరలించేలా ప్రణాళిక రూపొందించి.. పనులు ప్రారంభించారు. ఈ పనులు 2009 నాటికి పూర్తయ్యాయి. దీని ద్వారా  తద్వారా తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం పనులను 2009 నాటికి దివంగత సీఎం వైఎస్‌ పూర్తి చేశారు. దీని ద్వారా 1,90,035 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు.  

నదుల అనుసంధానానికి రాష్ట్రమే స్ఫూర్తి.. 
చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడం కోసం కృష్ణా నది నుంచి తన కోటాలో నుంచి ఐదు టీఎంసీల చొప్పున కేటాయించేందుకు ఫిబ్రవరి 15,1976న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలు అంగీకరించాయి. ఈ నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తరలించేలా అక్టోబర్‌ 27, 1977న ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. చెన్నైకి తాగునీటిని అందించడంతోపాటు 29 టీఎంసీల కృష్ణా వరద జలాలు, 30 టీఎంసీల పెన్నా వరద జలాలను ఒడిసి పట్టి.. కర్నూల్, వైఎస్సార్‌ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టేందుకు 1978లో ప్రభుత్వం సర్వే పనులను చేపట్టింది. ఈ పనులను 2009 నాటికి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారు. తెలుగుగంగలో భాగంగా కృష్ణా(శ్రీశైలం)–పెన్నా(సోమశిల)–పూండి రిజర్వాయర్‌(తమిళనాడు)ను అనుసంధానం చేశారు. దేశంలో అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి  ఈ పథకమే స్ఫూర్తి అని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. 

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం
సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి.. బీడు భూములకు మళ్లించి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా నదులను అనుసంధానం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్రం  పరిధిలోని ఆరు అనుసంధానాల పనులను చేపట్టాం. వంశధార–నాగావళి, గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు, కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి, కృష్ణా–పెన్నా–పాపాఘ్ని, కృష్ణా–వేదవతి అనుసంధానం పనులను వేగవంతం చేశాం. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రానికి అత్యధిక ప్రయోజనం చేకూరేలా గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానం చేయడంపై కసరత్తు చేస్తున్నాం. నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం.
– సి.నారాయణరెడ్డి, 
ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్, జలవనరుల శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement