Nagavali River
-
నాగావళి నదిపై మరో వంతెన
రాజాం: విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజల రాకపోకలకు వీలుగా నాగావళి నదిపై మరో వంతెన నిర్మించనున్నారు. రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలం వాల్తేరు గ్రామం వద్ద ఉన్న బలసలరేవు నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని ఇసుకలపేట రేవు మధ్య వంతెన నిర్మించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వంతెన నిర్మాణానికి ఏడాదిన్నరగా ఆర్అండ్బీ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. తాజా గా ఫ్రీ ఎస్టిమేట్ నిర్వహించి అవసరమైన నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల చొరవతో నిధులు మంజూరుకావడంతో వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. 50 గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య ప్రయాణ దూరం తగ్గనుంది. నెలరోజలుగా కొలతలు నదిపై వంతెన నిర్మాణానికి సంబంధించి రూ.15 లక్షల వ్యయంతో అంచనా సర్వేను కోస్టల్ ల్యాండ్ సర్వే ఏజెన్సీ నిర్వహించింది. వంతెన నిర్మాణ ప్లానింగ్‌ను, అంచనా వ్యయాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగించింది. రూ.87 కోట్లను ప్రభుత్వం మజూరు చేయడంతో ఆర్‌అండ్‌బీశాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్లాన్ ప్రకారం నదికి ఇరువైపులా రోడ్డు చదును చేయడం, పిల్లర్లకు అనువైన ప్రదేశాలను నిర్ధారిస్తున్నారు. రోడ్డు సౌకర్యం, భవిష్యత్ వినియోగం, నదిలో మట్టి నమూనాలు సేకరణ, ఎంత లోతులో గ్రావెల్ ఉందనే అంశాలుపై పూర్తి వివరాలు సేకరించామని, ఈ నెలాఖరులోగా సీఎం జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా వంతెన పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్అండ్బీ జేఈ ఆంజనేయులు తెలిపారు. వంతెన నిర్మాణం పూర్తయితే సంతకవిటి నుంచి ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాలకు రహదారి సౌకర్యం కలగడంతో పాటు రెండు జిల్లాలను కలిపేవారధిలా మారనుంది. సంతకవిటి మండలంలో నాగావళి నదిపై రెండో వంతెనగా లెక్కల్లోకి వస్తుంది. 560 మీటర్ల పొడవున వంతెన నిర్మాణం కానుంది. 1998–99 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మిస్తామంటూ హామీ ఇచ్చింది. అప్పట్లో రూ.90 లక్షలు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించి నా పనులు చేయలేదు. 2017లో ఏడాదిన్నర పాటు వాల్తేరుతో పాటు పరిసర గ్రామాల ప్రజలు దీక్షలు చేసినా పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతీయుల వంతెన కలను నెరవేర్చుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రమాదాలకు చెక్ వాల్తేరు వద్ద నాగావళి నదిని దాటి వందలాదిమంది ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. నది ఉద్ధృతంగా ప్రవహించినప్పుడు నాటు పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా ఉంటున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల కృషితో వంతెన కల సాకారమవుతోంది. ఈప్రాంత ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారు. – సిరిపురపు జగన్మోహనరావు, జెడ్పీ వైస్ చైర్మన్, హొంజరాం అందరి సహకారంతో ప్రజలు సమస్యలు పరిష్కరించడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గతంలో అర్ధాంతరంగా ఉండిపోయిన వంతెనలు, రోడ్లు కూడా పూర్తిచేస్తాం. వాల్తేరు వద్ద బలసలరేవు వంతెన నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తాం. అందరి సహకారంతో వంతెన నిర్మాణం సాకారంకానుంది. – కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే కష్టాలు తీరుతాయి.. ఇసుకలపేట నుంచి అటు శ్రీకాకుళం, ఇటు ఆమదాలవలస చాలా దగ్గర. మధ్యలో నాగావళి నది ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నరకయాతన పడేవారు. వంతెన నిర్మాణంతో ఆ కష్టాలన్నీ తీరుతాయి. మా గ్రామంతో పాటు పరిసర గ్రామాలు ప్రజలు, వంతెన సాధన కమిటీ తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – గురుగుబెల్లి స్వామినాయుడు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్, వాల్తేరు -
గోదావరి, కృష్ణాలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/చింతూరు/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల): పరీవాహక ప్రాంతాల(బేసిన్)లో వర్షాలు తగ్గడంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39.8 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల నుంచి విడుదల చేస్తున్న ప్రవాహంలో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13,05,222 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడి నుంచి గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 12,94,222 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు కృష్ణాలో వరద ప్రవాహం తగ్గింది. కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రపై ఉన్న తుంగభద్ర డ్యామ్, భీమాపై ఉన్న ఉజ్జయిని డ్యామ్‌లు నిండుగా ఉండటంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు.ప్రస్తుతం శ్రీశైలంలో 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 2,25,787 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువ ద్వారా 9,104, ఎడమ కాలువ ద్వారా 8,108, ఏఎమ్మార్పీ ద్వారా 2,400, వరద కాలువ ద్వారా 400, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 32,195 క్యూసెక్కులు, స్పిల్ వే 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,73,580 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 586 అడుగుల్లో 301.1 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. సాగర్ నుంచి వదులుతున్న జలాల్లో పులిచింతలలోకి 2,01,752 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే 5 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 1,31,213 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రం ద్వారా 8 వేలు వెరసి 1,39,213 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 169.71 అడుగుల్లో 37.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,36,531 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,901 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 1,23,630 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళి పోటాపోటీ: వంశధార, నాగావళి నదులు పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజ్‌లోకి 48,583 క్యూసెక్కులు వస్తున్నాయి. ఆయకట్టుకు 1,665 క్యూసెక్కులు, కడలిలోకి 38,307 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్‌లోకి 23,330 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 21,256 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
నదుల అనుసంధానం.. ఓ భగీరథయత్నం
సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం అంటే.. ఎవరో కట్టిన కాలువలో నాలుగు చెంబుల నీళ్లు ఎత్తిపోయడమా.. ఆ కాలువలో వర్షపు నీటిని చూపించి రెండు నదులను అనుసంధానించేశామంటూ కోట్లు ఖర్చుపెట్టి ఈవెంట్లు చేయడమా... వేర్వేరు మార్గాలలో పయనించే రెండు నదులను అనుసంధానించడం ఓ భగీరథయత్నం.. ఇందుకు నిధులు మాత్రమే కాదు నిబద్ధత, దృఢ దీక్ష కూడా అవసరమే. పాలకులకు అవి ఉన్నప్పుడే అనుసంధాన యత్నాలు ఫలిస్తాయి. రెండు కాదు.. మూడు కాదు రాష్ట్రంలో మొత్తంగా ఆరు చోట్ల నదుల అనుసంధానం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రం పరిధిలోని నదుల అనుసంధానం పనులను వేగవంతం చేస్తూనే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ వంటి అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంపైనా కేంద్రంతో కలిసి కసరత్తు చేస్తోంది. నదుల అనుసంధానం అంటే ఇదీ.. నదుల అనుసంధానానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఒక నదిపై బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి వరద జలాలను మరో నదిపై నిర్మించే బ్యారేజీలోకి తరలించినప్పుడే ఆ రెండు నదులు అనుసంధానం చేసినట్లు లెక్క. గోదావరి నదిపై ఎలాంటి బ్యారేజీ నిర్మించకుండా..దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన పోలవరం కుడి కాలువ మీదుగా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి 2016లో గోదావరి జలాలను తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసినట్లు నాటి సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని అప్పట్లో సీడబ్ల్యూసీ ఖండించడం గమనార్హం. రూ.145.34 కోట్లతో వంశధార–నాగావళి అనుసంధానం నాగావళి నదిలో వరద ఆలస్యంగా రావడం, నారాయణపురం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఖరీఫ్‌లో ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో హిరమండలం రిజర్వాయర్‌కు తరలించిన వంశధార నీటిని, ఆ రిజర్వాయర్ మట్టికట్ట 5.6 కి.మీ వద్ద నుంచి 33.583 కి.మీల పొడవున హెచ్చెల్సీ(హైలెవల్ కెనాల్)ను తవ్వి రోజుకు 600 క్యూసెక్కులను నారాయణపురం ఆనకట్టకు ఎగువన నాగావళి నదిలోకి పోయడం ద్వారా ఆ రెండు నదులను అనుసంధానం చేసి, ఆయకట్టును సస్యశ్యామలం చేసే పనులను రూ.145.34 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే 31.30 కి.మీ పొడవున హెచ్చెల్సీ తవ్వకం పనులను పూర్తి చేసింది. కేవలం 2.283 కి.మీల కాలువ తవ్వకం పనులు మాత్రమే మిగిలాయి. వాటిని ఖరీఫ్ నాటికి పూర్తి చేసి.. వంశధార–నాగావళి అనుసంధానాన్ని సాకారం చేయనున్నది. దీని వల్ల నారాయణపురం ఆనకట్ట కింద 39,179 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు హెచ్చెల్సీ కింద కొత్తగా ఐదు వేల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం నుంచి గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు అనుసంధానం ► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి అనుసంధానం.. తెలుగుంగ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా(శ్రీశైలం రిజర్వాయర్)–పెన్నా (సోమశిల రిజర్వాయర్)ను ఇప్పటికే అనుసంధానం చేశారు. సోమశిల వరద కాలువ 12.52 కి.మీ నుంచి రోజుకు 2,500 క్యూసెక్కులను తరలించి.. చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో పోయడం ద్వారా కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి నదులను అనుసంధానం చేసే పనులను ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టింది. ఈ అనుసంధానం ద్వారా 1.23 లక్షల ఎకరాలకు నీళ్లందించనున్నారు. స్వర్ణముఖి నది పెన్నా ఉప నది. కృష్ణా–పెన్నా–పాపాఘ్ని అనుసంధానం.. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం కింద 2009 నాటికే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా–పెన్నా నదులను అనుసంధానం చేశారు. పెన్నా ఉప నది అయిన పాపాఘ్ని పరీవాహక ప్రాంతం పూర్తిగా వర్షాభావ ప్రాంతంలో ఉంది. దీని వల్ల పాపాఘ్నిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గాలేరు–నగరి ద్వారా శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా నదీ వరద జలాలు.. గాలేరు–నగరి ప్రధాన కాలువ 56 కి.మీ వద్ద నుంచి జలాలను ఎత్తిపోసి.. పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్‌లోకి తరలించే పనులను చేపట్టారు. దీని ద్వారా 26 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కృష్ణా–వేదవతి అనుసంధానం.. కృష్ణా ఉప నది అయిన వేదవతిపై అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్టును 1956లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. టీడీపీ సర్కార్ హయాంలో కర్ణాటకలో వేదివతిపై చెక్ డ్యామ్‌లు నిర్మించడంతో బీటీపీలోకి చుక్క నీరు చేరడం లేదు. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే నీటిని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీలోకి ఎత్తిపోయడం ద్వారా కృష్ణా–వేదవతి నదుల అనుసంధానం పనులను రూ.968 కోట్లతో చేపట్టింది. దీని ద్వారా బీటీపీ కింద 12 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు వర్షాభావ ప్రాంతంలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో చెరువులను నింపడం ద్వారా మరో 10,323 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కసరత్తు... గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. జానంపల్లి నుంచి గోదావరి–కృష్ణా(నాగార్జునసాగర్)–పెన్నా(సోమశిల)–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం చేసేలా ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) రూపొందించిన ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను చెబుతూ.. తక్కువ వ్యయంతో గరిష్టంగా వరద జలాలను ఒడిసి పట్టి.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలనూ సిద్ధం చేయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశాక.. వాటిని ఎన్‌డబ్ల్యూడీఏకు పంపి.. పనులు చేపట్టాలని నిర్ణయించారు. కేసీ కెనాల్‌తోనే నదుల అనుసంధానానికి నాంది.. తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో సుంకేశుల వద్ద ఆనకట్ట నిర్మించి, అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లాలో పెన్నా నదిని అనుసంధానిస్తూ కేసీ కెనాల్ తవ్వకం పనులను 1863లో ప్రారంభించిన డచ్ సంస్థ 1870 నాటికి పూర్తి చేసింది. ఈ కాలువను నౌకా మార్గంగా వినియోగించుకుని వ్యాపారం చేసేది. వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ కాలువను 1882లో ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ సంస్థ నుంచి రూ.3.02 కోట్లకు కొనుగోలు చేసింది. సర్ ఆర్ధర్ కాటన్ ప్రతిపాదన మేరకు కేసీ కెనాల్‌ను 1933లో సాగునీటి వనరుగా మార్చింది. ఈ కాలువ కింద ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. దేశంలో కేసీ కెనాల్ ద్వారానే నదుల అనుసంధానం చేయడం ప్రథమం కావడం గమనార్హం. కేసీ కెనాల్ స్ఫూర్తితోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినట్లు ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది. తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా తుంగభద్రపై తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా తుంగభద్ర జలాలను పెన్నాపై నిర్మించిన మధ్య పెన్నార్ ప్రాజెక్టులోకి.. అక్కడి నుంచి చిత్రావతిపై నిర్మించిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి తరలించేలా ప్రణాళిక రూపొందించి.. పనులు ప్రారంభించారు. ఈ పనులు 2009 నాటికి పూర్తయ్యాయి. దీని ద్వారా తద్వారా తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం పనులను 2009 నాటికి దివంగత సీఎం వైఎస్ పూర్తి చేశారు. దీని ద్వారా 1,90,035 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. నదుల అనుసంధానానికి రాష్ట్రమే స్ఫూర్తి.. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడం కోసం కృష్ణా నది నుంచి తన కోటాలో నుంచి ఐదు టీఎంసీల చొప్పున కేటాయించేందుకు ఫిబ్రవరి 15,1976న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలు అంగీకరించాయి. ఈ నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తరలించేలా అక్టోబర్ 27, 1977న ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. చెన్నైకి తాగునీటిని అందించడంతోపాటు 29 టీఎంసీల కృష్ణా వరద జలాలు, 30 టీఎంసీల పెన్నా వరద జలాలను ఒడిసి పట్టి.. కర్నూల్, వైఎస్సార్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టేందుకు 1978లో ప్రభుత్వం సర్వే పనులను చేపట్టింది. ఈ పనులను 2009 నాటికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. తెలుగుగంగలో భాగంగా కృష్ణా(శ్రీశైలం)–పెన్నా(సోమశిల)–పూండి రిజర్వాయర్(తమిళనాడు)ను అనుసంధానం చేశారు. దేశంలో అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి ఈ పథకమే స్ఫూర్తి అని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి.. బీడు భూములకు మళ్లించి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా నదులను అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్రం పరిధిలోని ఆరు అనుసంధానాల పనులను చేపట్టాం. వంశధార–నాగావళి, గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు, కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి, కృష్ణా–పెన్నా–పాపాఘ్ని, కృష్ణా–వేదవతి అనుసంధానం పనులను వేగవంతం చేశాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి అత్యధిక ప్రయోజనం చేకూరేలా గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానం చేయడంపై కసరత్తు చేస్తున్నాం. నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
మార్చి నాటికి నాగావళిలోకి వంశధార పరవళ్లు
సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం ద్వారా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి ఆయకట్టుకు నీళ్లందించే పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా రూ.145.34 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘వంశధార-నాగావళి’ నదుల అనుసంధానం పనులను మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా నారాయణపురం ఆనకట్ట కింద 39,179 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు హైలెవల్ కెనాల్ ద్వారా కొత్తగా ఐదు వేల ఎకరాలకు నీళ్లందించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించింది. ఏటా 100 టీఎంసీలు వృథా గత మూడు దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే గొట్టా బ్యారేజీ నుంచి ఏటా సగటున వంద టీఎంసీల వంశధార జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. నాగావళి నదిలో వరద ఆలస్యంగా రావడం, నారాయణపురం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే వంశధార ప్రాజెక్టు స్టేజ్-2.. ఫేజ్-2లో కాట్రగడ్డ సైడ్ వియర్ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు తరలించిన వంశధార నీటిని, ఆ రిజర్వాయర్ మట్టికట్ట వద్ద నుంచి హెచ్చెల్సీ (హైలెవల్ కెనాల్) తవ్వి రోజుకు 600 క్యూసెక్కులను నారాయణపురం ఆనకట్టకు ఎగువన నాగావళి నదిలోకి పోయడం ద్వారా ఆ రెండు నదుల అనుసంధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ► హిరమండలం రిజర్వాయర్ నుంచి తవ్వాల్సిన 33.583 కి.మీ.ల హెచె్చల్సీ పనులకు గాను 25 కి.మీ.ల మేర తవ్వకం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన 8.583 కి.మీ.ల కాలువ పనులు పూర్తి చేయడానికి 4,87,740 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉండగా.. అధికారులు పనులు వేగవంతం చేశారు. ► హెచ్చెల్సీలో అక్విడెక్టులు, అండర్ టన్నెల్స్ (యూటీ) బ్రిడ్జిలు వంటివి 66 నిర్మాణాలను చేపట్టాలి. ఇందులో ఇప్పటికే 31 నిర్మాణాలను పూర్తి చేశారు. మిగిలిన 35 నిర్మాణాలను పూర్తి చేయాలంటే 49,608 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు చేయాల్సి ఉండగా ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ► వచ్చే ఖరీఫ్‌లో నారాయణపురం ఆనకట్టకు నీళ్లందించడం ద్వారా రైతులకు నదుల అనుసంధానం ఫలాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఉల్లిభద్ర పరిసరాల్లో ఏనుగులు
విజయనగరం, గరుగుబిల్లి : నాగావళి నదీతీర గ్రామాలలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఆదివారం ఉదయానికి గొట్టివలస, తులసిరామినాయుడువలస మీదుగా ఉల్లిభద్ర పరిసరాల్లోకి చేరుకున్నాయి. సాయంత్రానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల పరిసరాల్లో దర్శనమిచ్చాయి. వారం రోజుల నుంచి మండలంలోని సంతోషపురం, సుంకి, పిట్టలమెట్ట, నాగూరు, గిజబ, తోటపల్లి, రావివలస, గొట్టివలస, తదితర గ్రామాలలో సంచరిస్తూ అరటి, జొన్న, కూరగాయల పంటలను నాశనం చేశాయి. -
నాగావళికి వంశధార
సాక్షి, అమరావతి: వంశధార– నాగావళి అనుసంధానం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రెండు నదులను అనుసంధానం చేసి 42,053 ఎకరాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి.. జాతికి అంకితం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో బూర్జ మండలం నారాయణపురం వద్ద నాగావళి నదిపై 1959లో ఆనకట్ట నిర్మించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కుడి కాలువ కింద 18,362, ఎడమ కాలువ కింద 18,691 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే నాగావళిలో వరద ప్రవాహం సెప్టెంబరు నాటికే తగ్గుముఖం పడుతుండడం వల్ల ఆయకట్టు పంటలకు చివరలో నీళ్లందక ఎండిపోతున్నాయి. వంశధార వరద జలాల మళ్లింపే సమస్యకు పరిష్కారంగా భావించిన ప్రభుత్వం ఆ దిశగా పనులను వేగవంతం చేసింది. అనుసంధానం పనులు చకచకా.. ► వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో భాగంగా వంశధార నదిపై కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ నిర్మించి అక్కడి నుంచి వరద కాలువ ద్వారా సింగిడి, పారాపురం రిజర్వాయర్ల మీదుగా హిరమండలం రిజర్వాయర్‌కు వరద జలాలు తరలించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ► హిరమండలం రిజర్వాయర్ నుంచి 600 క్యూసెక్కుల సామర్థ్యంతో 33.583 కిమీల పొడవున హైలెవల్ కెనాల్ తవ్వి వంశధార జలాలను నారాయణపురం ఆనకట్ట జలవిస్తరణ ప్రాంతంలో నాగావళి నదిలోకి పోయడం ద్వారా రెండు నదులను అనుసంధానం చేసే పనులు చేపట్టారు. ► హైలెవల్ కెనాల్ కింద కొత్తగా ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు నారాయణపురం ఆనకట్ట కింద 37,053 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఈ ఏడాదే ప్రారంభానికి సిద్ధం ► రూ.84.90 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో హైలెవల్ కెనాల్ తవ్వకం 25 కి.మీ.ల పూర్తయ్యాయి. 8.583 కి.మీ.ల పనులు చేపట్టాల్సి ఉంది. 66 నిర్మాణాలకునూ 31 పూర్తికాగా 35 పనులు చేపట్టాలి. ► ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన రూ.50 కోట్లను విడుదలకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ► ఈ డిసెంబర్‌లోగా పనులను పూర్తి చేసి.. జాతికి అంకితం చేయాలని సర్కార్ నిర్ణయించింది. -
చిన్ని రాజు చదువు చదువు
నాగావళి పర్వత శ్రేణులను ఆనుకుని ఒక అందమైన అడివి వుంది. ఆ అడివిలో పెద్ద పెద్ద మర్రి, టేకు, మద్దిలాంటి వృక్షాలు ఉన్నాయి. మామిడి, నేరేడు, జామ, వెలగ లాంటి పండ్ల చెట్లు ఉన్నాయి. పర్వత శ్రేణుల నుంచి వచ్చిన జలపాతాలు సరస్సులుగా, సెలయేర్లుగా ఆ అడివిలో అక్కడక్కడ నిర్మితమై ఎంతో ప్రకృతి శోభను తెచ్చాయి. ఆ అడవికి సంజయుడు అనే మృగరాజు రాజుగా వున్నాడు. సంజయుని పాలనలో అన్ని జంతువులూ ఏ భయం లేకుండా నివసిస్తున్నాయి. కానీ మహారాజుకు సంతానం లేదనే బాధ అందరిలోనూ ఉంది. కొంత కాలానికి రాజుకు మగ సంతానం కలిగింది. మృగరాజు, భార్య సివంగి ఎంతో సంతోషించారు. అడవిలో జంతువులన్నీ పండుగ చేసుకున్నాయి. నామకరణం, పుట్టినరోజులు ఇలా చిన్న మృగరాజుకు జరిపాక, ఇక చిన్ని మృగరాజుకు చదువు నేర్పించాలని తలచాడు సంజయ మృగరాజు. కానీ లేక లేక కలిగిన సంతానం అతి గారం వలన చిన్ని మృగరాజు పెంకిగా తయారయ్యాడు. చిన్ని మృగరాజుకు విద్య నేర్పడానికి అడివిలో తెలివైన ఏనుగు, లేడి, ఓ కుందేలు, నక్క నియమించబడ్డాయి. అవి ఎంతో ఓర్పుగా చిన్ని మృగరాజుకు పాఠాలు చెప్పసాగాయి. అయితే చిన్ని మృగరాజు వింటేగా! ఏనుగు పైకెక్కి కూర్చోడం, నక్కను ఏడిపించడం, కుందేలును కొట్టడం లాంటి పనులు చేస్తూ .. అసలు పాఠాలు వినేవాడు కాదు. దాంతో అవి అన్నీ రాజుని కలిసి చిన్ని రాజుకు పాఠాలు చెప్పడం మావల్ల కాదని చెప్పేసాయి.సంజయ రాజుకు మరలా విచారం పట్టుకుంది. తాను రాజుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తన తరువాత తన కొడుకు కూడా అలాగే అవ్వాలని తలచినా, చిట్టి మృగరాజు ఇలా తయారవడం బాధ కలిగించింది. అప్పుడు ఆ అడివిలో ఉండే ఒక కోతి రాజును కలసి ‘మహారాజా! మీ కుమారుని కోసం మీరు బెంగ పెట్టు కోవద్దు. ఒక ఆరు నెలలు చిన్ని రాజుని నాకు వదలి పెట్టండి. నేను ప్రయోజకుని చేసి మీకు అప్పగించుతాను’ అంది. ఏ పుట్టలో ఏ పాము వుందో .. మిగిలిన జంతువులు కూడా రాజుకు, కోతితో చిన్ని రాజుని పంపండి. అంతగా కాకపోతే అప్పుడే వేరొక మార్గం ఆలోచిద్దాం అన్నాయి. విధిలేని పరిస్థితిలో రాజు, చిన్ని రాజును కోతికి అప్పగించాడు. ‘‘నువ్వా .. నాకు పాఠాలు చెప్పేది’’ అన్నాడు చిన్ని రాజు. ‘‘పాఠలా .. మరేమన్నానా .. నాకే ఏమీ రావు. ఇక మీకు చెప్పేది ఏమున్నది. నేనలా అనక పోతే మిమ్మలి వేరొక ఆడవికి పంపే ఆలోచనలో వున్నారు మహారాజు .. అందుకే ఇలా చెప్పాను. ఈ ఆరు నెలలూ మన మిద్దరం ఆడుతూ పాడుతూ గడిపేద్దాము. తరువాత సంగతి తరువాత’’ అంది కోతి.కోతి మాటలు చిన్ని రాజుకు బాగా నచ్చాయి. రెండూ కలసి అడివి లోకి పోయాయి. చెట్లు ఎక్కాయి. ఉయ్యాలలు ఊగాయి. సరస్సులలో స్నానాలు చేశాయి. చిన్నిరాజుకి కోతి బాగా నచ్చేసింది. ఇలా వారంలో ఆరు రోజులు గడిచాయి. అప్పుడు కోతి ‘‘చిన్ని రాజా మనం అప్పుడే ఆరు రోజులు ఆట పాటలతో కాలం గడిపాము. రేపు మహారాజు ‘మా చిన్ని రాజుకు నీవు ఏం నేర్పావు’ అంటే నేనేమీ చేప్పగలను.నేనేమీ చెప్పలేదు అంటే నా నుండి నిన్ను దూరం చేసి వేరే ఆడవికి పంపుతారు. కనుక ఈ ఒక్క రోజు నేను చెప్పిన పాఠం విని రేపు అందరి ముందు చెప్పేయి దానితో ఈ గండం గడుస్తుంది.తరవాత నుండి మరలా మామూలే .. మన ఆటలు.. పాటలు’’ అంది కోతి. కోతి చెప్పింది కూడా నిజమే అని తలచాడు చిన్ని రాజు. బుద్ధిగా కోతి నేర్పిన పాఠాలు నేర్చుకున్నాడు . పద్యాలు వల్లె వేశాడు. మరుసటి రోజు కోతి , చిన్ని రాజుని తీసుకుని సభకు వెళ్లింది. జంతువులన్నీ కోతి పని అయిపోయింది. ఈ వారం రోజులూ అది చిన్ని రాజుతో ఆడిన ఆటలు పాటలు అన్నీ చూశాయి. పెద్ద పెద్ద గురువులు చెప్పలేనిది తగుదునమ్మా అనుకుంటూ .. నేను పాఠం చెబుతానని తయారయింది అనుకున్నాయి. మహారాజు సంజయుడు చిన్ని రాజుని పక్కన కూర్చో బెట్టుకుని ‘‘చిన్నా .. నీవేమీ నేర్చుకున్నావు మీగురువు నీకేమి నేర్పారు?’’ అని అడిగాడు. ముందురోజు నేర్చుకున్న పద్యాలను పాడాడు చిన్ని మృగరాజు. ఎవరైనా మీదకు వస్తే ఎలా తప్పించుకోవాలో చేసి చూపాడు. మాటు వేసే వేటాడే పద్ధతులు చూపించాడు. ‘‘శహబాష్..’’ అంటూ చప్పట్లు కొట్టాడు మృగరాజు. కోతికి అనేక బహుమానాలు ఇచ్చాడు. ‘‘మహారాజా! .. ఇది కొంత మాత్రమే. నాకు ఇచ్చిన ఆరు నెలల గడువులో మీ చిన్ని రాజుని మీ అంత వాడిగా చేస్తాను’’ అంది కోతి. మిగిలిన జంతువులు కూడా కోతిని ప్రశంసించాయి. అక్కడ నుండి సెలవు తీసుకుని చిన్ని రాజుని తీసుకుని సెలయేరు దగ్గరకు పోయింది కోతి. ‘‘ చిన్నిరాజా..! ఈ చదువులతో .. విసుగు వచ్చింది. పద కాసేపు అదువుకుందాం అంది. రెండూ కలసి బాగా ఆడుకున్నాయి. వారం తరువాత ‘‘ఈసారి చదువుకు రెండూ రోజులు కేటాయిద్దాము’’ అంది కోతి. మరలా ఆ రెండు రోజులు చదువులో పడిపోయాడు చిన్నిరాజు.మరలా రాజు దగ్గర సభలో ఈసారి రెట్టించిన ఉత్సాహంతో పాఠాలు వినిపించాడు. మహారాజు , అన్నీ జంతువులు చిన్ని రాజుని, కోతిని తెగ పొగిడాయి. చిన్ని రాజుకు చాలా గర్వంగా అనిపించింది. అప్పుడు అంది కోతి ‘‘ చిన్ని రాజా! వారం లో రెండురోజులు చదివితేనే నీ కింత ఆదరణ లబిస్తోంది కదా! నువ్వు వారంలో ఒకరోజు ఆడుకుని మిగిలిన రోజులు చదువుకుంటే ఎంత గొప్పవాడివి అవుతావో ఊహించు’’ అంది. ‘‘అంతే కాదు నీకు మొదట విద్యా నేర్పడానికి వచ్చిన గురువులు చాలా తెలివైన వారు, వారి దగ్గర నేర్చుకుంటే నీకు చదువు ఇంకా బాగా వస్తుంది. పైగా నీవు ఈ అడవికి కాబోయే మహారాజువి.నిన్ను చూసి మిగిలివారు నేర్చు కోవాలి తెలిసిందా’’ అంది. కోతి మాటలతో చిన్ని రాజు జ్ఞానోదయం అయ్యింది. రాజుతో చెప్పి పెద్ద గురువుల దగ్గర విద్య నేర్చుకుంటానని తెలిపింది. ఆరోజు నుండి అందరితో వినయంగా వుంటూ ఆనతి కాలంలోనే అన్ని విద్యలూ నేర్చుకుంది. తనను మంచి మార్గంలో నిలిపిన కోతితో ఎప్పుడూ స్నేహంగా వుంటూ మంచి యువరాజుగా పేరు తెచ్చుకుంది. - కూచిమంచి నాగేంద్ర -
భారీ వర్షాలు : నీటిలో చిక్కుకున్న రైలు
సాక్షి, విజయనగరం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశా తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రా, ఓడిశా సరిహద్దుల్లో రహదారులకు సమాంతరంగా నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాయఘడ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి భువనేశ్వర్ నుంచి వెళ్లుతున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు వరద నీటిలో చిక్కుకుపోయింది. రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపైకి భారీగా వరద నీరు చేరింది. రైలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సింగిపురం, టికిరి స్టేషన్ల మధ్య మరో ట్రైన్, ఇంటర్సిటీ చిక్కుకోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కూలిన వంతెన ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయగడ జిల్లా సులిపోదర గ్రామంలో గోడ కూలి భార్య భర్త మృతి చెందారు. మరో వైపు రాయఘడ జిల్లా జిమిడిపేట వద్ద వరద ఉధృతికి వంతెన కూలిపోయింది. భారీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. పలుచోట్ల రైలు పట్టాల మీదుగా మూడు అడుగుల ఎత్తులో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. బోల్తా పడ్డ పడవ భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళిలో గల ఉమిలాడ బీచ్‌లో వేటకు వెళ్లిన పడవ బోల్తాపడింది. వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. దీంతో సహాయక చర్యలు చేట్టిన ఉమిలాడ గ్రామస్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురు మత్స్యకారులు కాపాడారు. వారిని వెంటనే నరసన్న పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. పడవ బోల్తాపై ముఖ్యమంత్రి ఆరా శ్రీకాకుళంలో పడవ బోల్తా సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు ముమ్మురం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తుఫానులు వస్తున్న సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండ అప్రమత్తం చేయాలని సూచించారు. ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగవళి నది పొంగిపొర్లుతోంది. వరద ఉధృతి పెరుగుతుండడంతో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో భారీ వర్షాల నేపథ్యంలో పార్వతీపురం ఐటిడిఏ హెల్స్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎదైనా సహాయం, సమాచారం కోసం 08963221152 హెల్స్ లైన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
భారీ వర్షాలు : కూలిన వంతెన
-
పండగకు వచ్చి పరలోకాలకు
రాయగడ: సంక్రాంతి పండగకు బంధువుల ఇంటికి వచ్చిన ఒక కుటుంబం నాగావళినదిపై గల రోప్‌వేను చూసేందుకు వెళ్లి నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఈ ప్రమాదకర సంఘటన కనుమపండగ రోజు జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం రాయగడలోని బంధువుల ఇంటికి వచ్చి మజ్జిగౌరి దర్శనం చేసుకున్న అనంతరం పర్యాటకస్థలమైన రోప్ వే బ్రిడ్జిని చూసేందుకు వెళ్లి నాగావళి నదిలో దిగడంతో ప్రమాదవశాత్తు కాలు జారి మునిగిపోయి గల్లంతయ్యారు. గల్లంతైన వారిని జె.శాంతి(30) అఖిల్(8), ఇందు(6)లుగా గుర్తిం చారు. ఈ విషాద సంఘటన సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు, చెక్కగుడ ప్రాంతపు ప్రజలు, యువకులు ఘటనాస్థలానికి వెళ్లి ప్రమాదానికి గురైన వారిలో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఇంకొకరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని రాయగడ ఐఐసీ ఆర్.కె.పాత్రో తెలియజేశారు. మృతుల కుటుంబసభ్యుల రోదనతో ఘటనా స్థలం దద్దరిల్లింది. ఇది ప్రమాదకరమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎవరూ వెళ్లకూడదు. అని బోర్డులు అక్కడ ఉన్నప్పటికీ ప్రజలు ఇష్టానుసారం నాగావళి నదిలోకి దిగి తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. -
నాగావళిలో తల్లి మృతి, కుమారుడు గల్లంతు
విజయనగరం: స్నానం చేసేందుకు నదిలోకి దిగిన ముగ్గురు కుటుంబ సభ్యుల్లో తల్లి మృతిచెందగా కుమారుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఒరిస్సా రాయగడ మజ్జిగౌరీ అలయం వద్ద జరిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన శాంతి అనే మహిళ తన కుమార్తె ఇందు, కుమారుడు అఖిల్‌తో కలిసి స్నానం చేసేందుకు నాగావళి నదికి వెళ్లింది. నీట మునిగి శాంతి మృతిచెందగా అఖిల్ గల్లంతయ్యాడు. ఇందు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అఖిల్ కోసం గాలింపు చేపట్టారు. -
ప్రాణం తీసిన సరదా
సాక్షి, విజయనగరం: సెల్ఫీల మోజులో పడి ప్రతి రోజు ఎక్కడోఅక్కడ ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పుతున్నారనే వార్తలు వింటూనే ఉన్నాం. అయినా యువతీ యువకులు తమ విపరీత పోకడలను వదులు కోవడం లేదు. తీగ వంతెనపై నిల్చొని సెల్ఫీ దిగడానికి యత్నించిన ఇద్దరు యువతులు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందారు. ఈ సంఘటన ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని రాయఘడ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. విశాఖపట్నంకు చెందిన 9 మంది బృందం విహారయాత్ర నిమిత్తం రాయఘడ జిల్లాలోని మజ్జిగౌరమ్మ ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో అమ్మవారి దర్శన అనంతరం దేవాలయం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న తీగ వంతెన వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ నిల్చొని సెల్ఫీలకు ఫోజులిస్తున్న జ్యోతి(27), ఎస్ దేవి(21) ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. వారిని రక్షించడానికి యత్నించినా లాభంలేకపోయింది. గజ ఈతగాళ్ల సాయంతో ఇద్దరు యువతుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ తొమ్మిది మంది విశాఖ నగరంలోని వైభవ్ జ్యూయలర్స్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. -
విద్యార్థిని మింగిన ‘నాగావళి’
శ్రీకాకుళం సిటీ: కుమారుడిపై కన్నవారు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. నాగావళి నదిలో ఈతకు దిగిన యువకుడిని మృత్యువు కాటేసింది. తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన జంపాన హరికృష్ణ చౌదరి (23 శ్రీకాకుళం సమీపంలోని పాత్రునివలస వద్ద ఉన్న శ్రీసాయి డెంటల్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న జయశంకర్‌తో కలిసి హరికృష్ణ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీకాకుళం నగరాన్ని ఆనుకొని ఆదివారంపేట వద్ద ఉన్న నాగావళి నదిలో ఈతకు వెళ్లాడు. అయితే జయశంకర్‌కు ఈత రాకపోవడంతో నది ఒడ్డునే ఉండిపోయాడు. హరికృష్ణచౌదరి నదిలోకి దిగి ఈత కొడుతూ స్నానం చేశాడు. అయితే కొద్దిసేపటి తరువాత కనిపించకపోవడంతో నది పక్కన ఉన్న జయశంకర్ ఆందోళనకు గురయ్యాడు. అక్కడి నుంచి కళాశాలకు చేరుకొని తోటి విద్యార్థులకు, కళాశాల యాజమాన్యానికి విషయాన్ని తెలియజేశాడు. రెండో పట్టణ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే రాత్రి వేళ కావడంతో ఎవరూ ఏం చేయలేకపోయారు. సీఐ ఎం తిరుపతిరావు, ఎస్ఐ ప్రసాద్‌లు బుధవారం ఉదయం ఈతగాళ్ల సాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టగా హరికృష్ణచౌదరి శవమై కనిపించాడు. సమాచారాన్ని గుంటూరు జిల్లాలో ఉంటున్న అతని తల్లిదండ్రులకు పోలీసులు తెలియజేశారు. హరి కృష్ణ మృతితో తోటి విద్యార్థులు తీవ్ర విషా దానికి గురయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించామని, మృతుడి మేనమామ ఎం.వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. -
ఉపశమనం: శాంతించిన నాగవల్లి
ఒడిశాలో భారీ వర్షాలతో పోటెత్తిన నాగావళి నది సోమవారం సాయంత్రానికి కాస్త శాంతించింది. దీని వరద ప్రవాహం జిల్లా కేంద్రాన్ని సోమవారం తెల్లవారుజామునే చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేసింది. ఆదివారం రాత్రి భామిని ప్రాంతంలో ఓ వృద్ధుడు నాగావళి నదిలో గల్లంతయ్యాడు. మరోవైపు వంశధార నదిలోనూ వరద ప్రవాహం పెరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా చెదురుమదురు నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. ఒక్కరోజునే జిల్లా మొత్తంమీద వెయ్యి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడనం మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను మంగళవారం కూడా కొనసాగించాలని జిల్లా కలెక్టరు కె.ధనుంజయరెడ్డి ఆదేశాలిచ్చారు. ఈ వరదతో వెయ్యి ఎకరాల్లోని వరినాడు మడులు, వెదలు నీటమునిగాయి. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: అల్పపీడనం ప్రభావంతో గత శనివారం రాత్రి నుంచి ఒడిశాలో భారీ వర్షాలు పడటంతో నాగావళి నది పోటెత్తిన సంగతి తెలిసిందే. తోటపల్లి ప్రాజెక్టు వద్ద రికార్డు స్థాయిలో వరదనీరు చేరడంతో (ఇన్‌ఫ్లో) జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే నదీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలకు సిబ్బందిని పంపించారు. ఆదివారం ఒడిశాతో పాటు విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసిన వరద సోమవారం తెల్లవారుజామున శ్రీకాకుళం నగరాన్ని చుట్టుముట్టింది. అయితే నాగావళి నది సోమవారం సాయంత్రానికి శాంతించింది. వరద ప్రవాహం క్రమేపీ తగ్గుముఖం పట్టింది. నాగావళి ఒడ్డున ఉన్న జిల్లాకేంద్రం శ్రీకాకుళంలోని తురాయిచెట్టు వీధిలో పలు ఇళ్లల్లోకి వరదనీరు చొరబడింది. జిల్లా కలెక్టరు కె.ధనుంజయ్‌రెడ్డి, జాయింట్ కలెక్టరు కేవీఎన్ చక్రధరబాబు, ఎస్పీ త్రివిక్రమ వర్మ తదితర అధికారులంతా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అలాగే ఆంధ్రా ఒడిశా సరిహద్దులో మహేంద్రగిరి గిరి కొండల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఉధృతంగా వచ్చి పలాస మండలం కందిరిగాం, బ్రాహ్మణతర్ల, పెదంచల, వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి, బెండి గేటు, బెండి నుంచి సముద్రపు పొరలోకి వచ్చింది. నాగావళిలోకి తగ్గిన వరద... తోటపల్లి ప్రాజెక్టు నుంచి నాగావళి నదిలోకి అవుట్ ఫ్లో ఆదివారం అర్ధరాత్రి లక్ష క్యూసెక్కుల నీరు ఉంది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు 25 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఉదయం 5 గంటలకు ఇన్‌ఫ్లో 13 వేల క్యూసెక్కులు మాత్రమే ఉండటంతో ఎనిమిది గేట్లలో ఐదు గేట్లు మూసేసి అవుట్ ఫ్లో 7,500 క్యూసెక్కులకు తగ్గించారు. సాయంత్రం 5 గంటలకు ఇన్‌ఫ్లో 8,500 ఉండగా, అవుట్ ఫ్లో 7,300 క్యూసెక్కులు ఉంది. తోటపల్లి ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం లెవెల్ 105 మీటర్లు కాగా ప్రస్తుతం 103.80 మీటర్లు లెవెల్ ఉంది. దిగువన నారాయణపురం ఆనకట్ట వద్ద సోమవారం ఉదయం ఆరు గంటలకు 97,750 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదయ్యింది. పది గంటల నుంచి తగ్గుముఖం పట్టింది. సాయంత్రం ఆరు గంటల సమయానికి 12,300 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ఇక నారాయణపురం ఆనకట్ట వద్ద సోమవారం ఉదయం 97,750 క్యూసెక్కుల వరద నీరు పోటెత్తింది. 11 గంటల సమయానికి 21,350 క్యూసెక్కులకు, మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 13,300 క్యూసెక్కులకు నీటి ప్రవాహం తగ్గింది. శ్రీకాకుళం పాత వంతెన వద్ద ఉదయం ఆరు గంటల సమయంలో 71,890 క్యూసెక్కుల నీటి ప్రవాహం పోటెత్తింది. 11 గంటల సమయంలో 90,400 క్యూసెక్కులు రావడంతో ఒక్కసారిగా శ్రీకాకుళం నగర ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 42 వేల క్యూసెక్కులకు నాగావళి వరద ఉద్ధృతి కాస్త తగ్గింది. సాయంత్రానికి కాస్త శాంతించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. నిలకడగా వంశధార... జిల్లాలోని మరో ప్రధాన నది వంశధారలోనూ వరద ఉద్ధృతి సోమవారం సాయంత్రానికి నిలకడగా ఉంది. వంశధార నదిలో భామిని మండలం తాలాడ గ్రామానికి కొల్ల గోపాలం (65) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కూరగాయల కొనుగోలు నిమిత్తం ఆదివారం సాయంత్రం ఒడిశా సరిహద్దులో నాగావళిని దాటి వెళ్లాడు. రాత్రి తిరుగు ప్రయాణంలో వరద ఉద్ధృతిని అంచనా వేయలేక నదిలోకి దిగాడు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ప్రస్తుతం నదిలో రెవెన్యూ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వంశధార నదీపరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో అక్కడక్కడా వరదనీరు ప్రవేశించింది. సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. వంశధార నదిపైనున్న గొట్టా బ్యారేజీ వద్ద సోమవారం ఉదయం ఆరు గంటలకు 27 వేల క్యూసెక్కుల నీటిప్రవాహం ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 34 వేల క్యూసెక్కులకు పెరిగింది. రెండు గంటలకు 31 వేల క్యూసెక్కులకు తగ్గింది. సాయంత్రానికి మరికాస్త తగ్గింది. 27,866 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. కొనసాగుతున్న అప్రమత్తత... బంగాళాఖాతంలో అల్పపీడనం దృష్ట్యా కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను మంగళవారం కూడా కొనసాగించాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఒకవేళ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఒడిశాలో మళ్లీ భారీ వర్షాలు ఉంటే నాగావళి, వంశధార నదుల్లో వరద పోటెత్తే ప్రమాదం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత కొనసాగుతోంది. సుమారు వెయ్యి ఎకరాల్లో నష్టం... నాగావళి వరద ప్రభావంతో జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాల్లో వరినారు మడులు, ఎదలకు నష్టం వాటిల్లింది. ఆమదాలవలస, పొందూరు మండలాల పరిధిలో నెల్లిమెట్ట, సింగూరు, బొడ్డేపల్లి గ్రామాల్లో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఎద పొలాలు, నారుమడుల్లో వరద నీరు చేరింది. వంగర మండలం సంగాంలోని శివాలయం వరదల కారణంగా నీట మునిగింది. రేగిడి మండలం కె. వెంకటాపురం గ్రామంలోకి నాగావళి వరద నీరు చేరింది. సంతకవిటి మండలం కేఆర్ పురం రంగారాయపురం గ్రామాల మధ్య నది గట్టు కోతకు గురైంది. వీరఘట్టం మండలం పరిధి చిదిమి, పాలమెట్ట రహదారి వర్షాల కారణంగా చిద్రమైంది. గోపాలపురంలో 30 ఎకరాల పైబడి నారుమడులు నీటమునిగాయి. ఇచ్ఛాఫురం మండలం బాహుదానది పరివాహక పారంతాల్లో పంట పొలాల్లోకి వర్షం నీరు చేరింది. వర్షాల కారణంగా పలాస మండలం అల్లుకోల, రెంటికోట, వరదరాజపురం, గరుడకండి, సరియాపల్లి, పూర్ణభద్ర, అమలుకుడియ గ్రామాల్లోని పంట పొలాల్లోకి నీరు చేరింది. సీఎం హామీ ఇచ్చినా... ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చినా జిల్లా కేంద్రంలో చిన్న రోడ్డు పని కూడా కాలేదని వరద బాధితురాలొకరు మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణను నిలదీశారు. శ్రీకాకుళం నగరంలోని తురాయిచెట్టు వీధిలో ముంపు ప్రాంతాన్ని సోమవారం ఉదయం పరిశీలనకు వెళ్లిన ఆయనను వరద బాధితులు నిలదీశారు. నాగావళి నది గట్టును ఆనుకొని ఉన్న తురాయిచెట్టు వీధి రోడ్డును ఎత్తు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. హుదూద్ తుపాను తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలనకు వచ్చిన సందర్భంలో భరోసా ఇచ్చారు. కానీ దాదాపు మూడేళ్లు అయిపోతున్నా రోడ్డు ఎత్తుచేసే పని మాత్రం జరగలేదు. దీంతో నాగావళి నది వరదనీరు సోమవారం తెల్లవారుజామున తురాయిచెట్టు వీధిలోకి చొరబడింది. రోడ్డుపై మోకాలు లోతున, ఇళ్లలో రెండు అడుగల ఎత్తున నీరు చేరింది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వారిని ఉదయం మాజీ మంత్రి గుండ పరామర్శకు వచ్చారు. రోడ్డు ఎత్తు చేసి ఉంటే ఇప్పుడు వరద ముప్పు తప్పేదని స్థానిక మహిళ ఒకరు ఆయనను నిలదీశారు. నిధులున్నాయని, త్వరలోనే పని ప్రారంభిస్తామని గుండ సర్ధి చెప్పాలని ప్రయత్నించినా స్థానికులు శాంతించలేదు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని, హామీలే తప్ప పనులు కనిపించట్లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. -
తగ్గిన వరద
నాగావళి శాంతించింది. వరద ఉధృతి తగ్గింది. కానీ జిల్లాలో వరుణుడి ప్రతాపం ఎక్కువైంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లాపై పడింది. ఆగకుండా ఒక మోస్తరునుంచి... భారీ వర్షాలు కురుస్తుండటంతో... మళ్లీ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మరో రెండురోజులపాటు వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. విజయనగరం గంటస్తంభం: బంగాళాఖాతంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఏర్పడిన అల్పపీడన ప్రభావం తో ఒడిశాలో రెండురోజులపాటు భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల నాగావళి ఉప్పొంగి విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలను ఆదివారం ముంచెత్తింది. తోటపల్లి ప్రాజెక్టు నుంచి నీరు భారీగా విడుదల చేసి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడంతో ఒక విధంగా నష్టనివారణకు తోడ్పడ్డారు. మొత్తమ్మీద ఒడిశాలో ఇప్పుడు వర్షాలు తగ్గడంతో నాగావళి నీటి ప్రవాహం తగ్గింది. నీటమునిగిన పల్లెలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఆదివారం నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పూర్ణపాడు, కళ్లికోట, దుగ్గి, గుణానపురం, బాసంగి, గుంప, దుమ్మలపాడు తదితర గ్రామాల్లో నీరు చేరిన విషయం విదితమే. అక్కడ 22ఇళ్లు కూడా ఖాళీ చేయించారు. తోటపల్లికి ఉన్న ఎనిమిది గేట్లు ఎత్తేసి లక్ష క్యూసెక్కులకుపైగా నీటిని కిందకు విడుదల చేశారు. సోమవారం ఇన్‌ఫ్లో తగ్గడంతో ఆరుగేట్లు దించేసి కేవలం రెండు గేట్లు ద్వారా మాత్రమే నీటిని కిందకు పంపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా నుంచి ఆంధ్రాతీరంవైపు కదులుతుండడంతో జిల్లాలో వర్షాలు జోరందుకున్నాయి. మొన్నటి వరకు కొన్ని ప్రాంతాలకే పరిమితమైనా సోమవారం జిల్లా వ్యాప్తంగా కురిశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆగకుండా జల్లులు పడటం విశేషం. మంగళవారం మరింత ఎక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం కురిసిన వర్షాలకు జనజీవనానికి తీవ్ర ఇబ్బంది కలిగింది. అప్రమత్తమైన అధికారులు అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు ప్రభావం తోడు కావడంతో జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పార్వతీపురం డివిజన్ కంటే విజయనగరం డివిజన్‌లోనే ఎక్కువగా ఉంటాయని కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం వరకు వర్షాలు ఉంటాయని, తర్వాత బంగాళాఖాతంలో పరిస్థితిని బట్టి మార్పులు ఉంటాయని తెలిపారు. వర్షాలు ఉధృతం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ వివేక్‌యాదవ్ జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. మంగళవారం «భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, రోడ్లు, భవనాలు, పౌరసరఫరాలు, ఇతర కీలక శాఖలన్నింటినీ అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఎలాంటి ఆపద సంభవించినా వెంటనే సహాయక చర్యలందించేందుకు కలెక్టరేట్‌తోపాటు రెండు ఆర్డీవో కార్యాలయాలు, 34 మండలాల తహసీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. 24గంటలు పని చేసే విధంగా అధికారులు, సిబ్బందిని నియమించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆదివారం నాగావళి వరద ఉధృతకారణంగా చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రప్పించిన 30మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఇక్కడే ఉంచారు. తీరప్రాంతంలో మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అక్కడ అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూంలు: కలెక్టరేట్: 08922 236947 టోల్‌ఫ్రీ నెం: 1077(బీఎస్ఎన్ఎల్ నుంచి మాత్రమే) విజయనగరం ఆర్డీవో కార్యాలయం: 08922 276888 పార్వతీపురం ఆర్డీవో కార్యాలయం: 08963 221006 డి.సెక్షన్ : 9440178300 ఎస్.ఎన్.మూర్తి. డీఆర్వో: 9491012012 -
శాంతించిన నాగావళి!
♦ తోటపల్లి బ్యారేజీ 8గేట్లు మూసివేత ♦ శ్రీకాకుళం జిల్లాకు తప్పిన వరద ముప్పు శ్రీకాకుళం: గత మూడు రోజులుగా ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి నదికి పోటెత్తిన వరద తగ్గుముఖం పట్టింది. ఆదివారం ప్రమాదస్థాయిలో ప్రవహించిన నాగావళి ఉధృతి ప్రస్తుతం కాస్త తగ్గింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి నాగావళి ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తోటపల్లి బ్యారేజీ 8 గేట్లు మూసివేశారు. కేవలం 7 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నారాయణపురం వద్ద 97 వేల క్యూసెక్కుల నీరు, శ్రీకాకుళం వద్ద 69 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షం ఇంకా భారీగా కురుస్తుండడంతో వరద పెరిగే అవకాశముందని, శ్రీకాకుళం జిల్లాకు మాత్రం వరద ముప్పు తప్పినట్టేనని జలవనరుల శాఖ బొబ్బిలి ఇంఛార్జి ఎస్ఈ నాగేశ్వరరావు చెప్పారు. అప్రమత్తతతో తప్పిన ముప్పు.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని రంగారాయపురం గ్రామం వద్ద నారాయణపురం ఆనకట్టకు గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగావళి నదిలోకి కూడా భారీగా వరద నీరు చేరింది. వీటికితోడు తోటపల్లి ప్రాజెక్టు వద్ద 80,400 క్యూసెక్కుల నీటిని ఆదివారం రాత్రి నదిలోకి విడిచిపెట్టారు. దీంతో ఒక్కసారిగా నాగావళి నదిలో వరద పెరిగి ఆనకట్టకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 1200 క్యూసెక్కులుగా ఉన్న వరద రాత్రి పది గంటల సమయంలో 40వేల క్యూసెక్కులకు చేరుకుంది. తోటపల్లి ప్రాజెక్టునీరు, మడ్డువలస నీరు రావడంతో 98 వేల క్యూసెక్కుల నీరు ఆనకట్టకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 90 వేల క్యూసెక్కులపైబడి నీరు వస్తుండడంతో రేగిడి మండలంలో తునివాడ, సంకిలి, బొడ్డవలస, ఖండ్యాం, పుర్లి, కొమెర తదిర గ్రామాలతోపాటు సంకతవిటి మండలంలో కొత్తూరు రామచంద్రాపురం, పోతులజగ్గుపేట, మేడమర్తి, తమరాం, పోడలి, చిత్తారిపురం తదితర నదీతీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని గుర్తించిన అధికారులు వెంటనే ఆయా గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన కొద్ది సేపటికే వరద ఈ గ్రామాలను ముంచెత్తింది. అధికారుల అప్రమత్తత కారణంగా ముప్పు తప్పిందని స్థానికులు తెలిపారు. -
ఉగ్ర నాగావళి
♦ తోటపల్లికి వరద పోటు ♦ చరిత్రలో మొదటిసారి లక్ష క్యూసెక్కుల నీటి విడుదల ♦ అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం నాగావళిలో భారీగా పెరిగిన నీటి ప్రవాహం నాగావళి ఉగ్రరూపం దాల్చింది. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద నీరు పోటెత్తుతోంది. ఇరవై ఏళ్ల తర్వాత తోటపల్లి ప్రాజెక్టులోకి అంత భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు వద్ద ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుండగా.. నదీ తీర ప్రాంత వాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వీరఘట్టం: అల్పపీడనం కారణంగా ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ఫలితంగా ఆదివారం నాగావళి నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా పెరిగింది. ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్ద 103.80 మీటర్ల లెవెల్ ఉన్న నీటి ప్రవాహం మధ్యాహ్నం 2 గంటలకు 104.1 మీటర్లకు చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు గరిష్ట స్థాయి 105 మీటర్లకు చేరింది. దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు నాలుగు గేట్లు ఎత్తి 8వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. ఆ తర్వాత గంటగంటకూ నీటి ఉద్ధృతి పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ఎనిమిది గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ప్రాజెక్టు డీఈపాండు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలకు వరదనీరు చేరుకోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు ఇంకా పోటెత్తే అవకాశం ఉన్నందున సిబ్బందిని అప్రమత్తం చేశామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. 20 ఏళ్ల తర్వాత తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఇంత ప్రమాద స్థాయిలో వరదనీరు ఎప్పుడూ చేరలేదని అధికారులు అంటున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో వరద వస్తోందని రిటైర్డ్ నీటి పారుదల శాఖ అధికారులంటున్నారు. కడకెల్ల, కిమ్మి, పనసనందివాడ గ్రామాల వద్ద నాగావళి పరవళ్లు తొక్కుతుండడంతో సమీప గ్రామ ప్రజలు ప్రవా హాన్ని చూసేందుకు బారులు తీరుతున్నారు. ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారి లక్ష క్యూసెక్కుల నీటిని కిందికి విడిచిపెట్టారు. యంత్రాంగం అప్రమత్తం నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరుగుతుందని తెలియడంతో వీరఘట్టం రెవెన్యూ సిబ్బంది డిప్యూటీ తహసీ ల్దార్ బి.సుందరరావు, ఆర్ఐ రమేష్‌కుమార్, సన్యాసిరా వు, సీనియర్ అసిస్టెంట్ షణ్ముఖరావు, పాలకొండ సీఐ సీహెచ్ సూరినాయుడులు నాగావళి నదీ తీర ప్రాంతాలైన కడకెల్ల, కిమ్మి, పనసనందివాడ గ్రామాల వద్ద నీటి ప్రవా హాన్ని పరిశీలించారు. ప్రజలను అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోకి వెళ్లవద్దని సూచించారు. నాటు పడవలను నదిలో నడపవద్దని జాలర్లను హెచ్చరించారు. తీరప్రాంతమైన బిటివాడలో వీఆర్ఓ అందుబాటులో లేకపోవడంతో ఆ గ్రామస్తులు ఆర్డీఓ గున్నయ్యకు ఫిర్యాదు చేశారు. ఆయన గ్రామాన్ని సందర్శించారు. వంగర మండలం శివ్వాం నుంచి 25 మంది నాటు పడ వపై వీరఘట్టం మండలం పాలమెట్టకు బయల్దేరారు. నీటి ప్రవాహ ఉద్ధృతిని గమనించిన స్థానికులు వారిని వారించడంతో అంతా మళ్లీ వెనక్కి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. వంశధారలోకి వరద నీరు హిరమండలం: వంశధార నదిలో నీటిప్రవాహం పెరిగిం ది. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తుండడంతో గొట్టా బ్యారేజీ వద్ద 37.70 మీటర్ల నీటి నిల్వ ఉంది. 2500వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో పాటు మహేంద్రతనయ నుంచి నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం సాయంత్రం నాటికి 17 గేట్లు పైకెత్తి 5863 క్యూసెక్కుల నీరు దిగువకు విడిచి పెట్టారు. కుడిఎడమ కాలువలకు 146 క్యూసెక్కులు, 357క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు డీఈ ప్రభాకర్ తెలిపారు. అర్ధరాత్రికి మరో 15 వేలు క్యూసెక్కుల నీరు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వరదలపై మంత్రి కళా ఆరా శ్రీకాకుళం పాతబస్టాండ్: నాగావళి నది వరద ప్రవాహంపై రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి కళా వెంకటరావు ఆరా తీశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కె. ధనుంజయ రెడ్డికి ఆయన అమరావతి నుంచి ఫోన్ చేసి మాట్లాడారు. వీరఘట్టం నుంచి శ్రీకాకుళం వరకు సుమారు 10 మండలాల్లో 110 గ్రామాల వరకు ఈ వరద ప్రమాదం ఉంటుందని మంత్రి కలెక్టర్‌కు చెప్పారు. ఈ ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. నాగావళికి వరద ముప్పు శ్రీకాకుళం పాతబస్టాండ్, పీఎన్ కాలనీ: జిల్లాలోని ప్రధాన నదులు నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు రానుంది. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్నడూ లేనంత భారీగా నదుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే నాగావళి నది విజయనగరం జిల్లా తోటపల్లి వద్ద ఉగ్రరూపం దాల్చింది. సోమవారం నాటికి నారాయణపురం, తర్వాత శ్రీకాకుళంను వరద నీరు తాకే అవకాశం ఉంది. జిల్లాలో కూడా వానలు కురవడంతో వరద ముప్పు తప్పదని అధికారులంటున్నారు. పెరిగిన నీటి మట్టం నాగావళి నదిలో ఆదివారం సాయంత్రం నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఒడిశాలో వర్షాలు తగ్గకపోవడంతో ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉంది. వరద ప్రవాహం సుమారుగా రాత్రి 8 గంటలకు వీరఘట్టంకి చేరే అవకాశాలు ఉన్నాయి. నారాయణపురానికి సుమారుగా 10 గంటలకు చేరే అవకాశం ఉందని నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం పట్టణానికి ఈ వరద రాత్రి ఒంటి గంటకు చేరనుంది. దీంతో నదీ తీరంలో ఉన్న వీరఘట్టం, పాలకొండ, రేగిడి, సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల, వంగర, బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం మండలాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక మడ్డువలస నుంచి 50వేల క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. వంశధారకు తప్పని ముప్పు వంశధారకు కూడా వరద ప్రభావం ఉంది. ఈ నది క్యాచ్మెంట్ ఏరియాలు కూడా ఒడిశాలోనే ఉండడంతో వరద ముప్పు తప్పదని అధికారులంటున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రానికి 15 వేలు క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నదికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున, ఈ నదీ తీర ప్రాంతాల్లో ఉన్న 15 మండలాల అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు అప్రమత్తం నాగావళి, వంశధార వరద ముప్పు ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ కె.ధనుంజయరెడ్డి ఇప్పటికే తీర ప్రాంత తహసీల్దార్లకు స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి తగు సూచనలు చేయాలని చెప్పారు. రెవెన్యూతో పాటుగా విపత్తులు, పోలీస్, పంచయితీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. వరద ముప్పు ఉన్న గ్రామాల్లో దండోరా వేయించి, వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ రాజాం / రేగిడి : సంతకవిటి మండలంలోని రంగారాయపురం గ్రామం వద్ద నారాయణపురం ఆనకట్టకు గతంలోలేని విధంగా వరద తాకిడి ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగావళిలో వరద చేరుతుంది. దీనికితోడు తోటపల్లి ప్రాజెక్టు వద్ద 80,400 క్యూసెక్కుల నీటిని ఆదివారం రాత్రి నదిలోకి విడిచిపెట్టారు. దీంతో ఒక్కసారిగా నాగావళి నదిలో వరద పెరిగి ఆనకట్టకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 1200 క్యూసెక్కులు ఉన్న నీరు రాత్రి పది గంటల సమయంలో 40వేల క్యూసెక్కులకు చేరుకుంది. తోటపల్లి ప్రాజెక్టునీరు, మడ్డువలస నీరు రావడంతో 98 వేల క్యూసెక్కుల నీరు ఆనకట్టకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 90 వేల క్యూసెక్కులపైబడి నీరు వస్తుండడంతో రేగిడి మండలంలో తునివాడ, సంకిలి, బొడ్డవలస, ఖండ్యాం, పుర్లి, కొమెర తదిర గ్రామాలతోపాటు సంకతవిటి మండలంలో కొత్తూరు రామచంద్రాపురం, పోతులజగ్గుపేట, మేడమర్తి, తమరాం, పోడలి, చిత్తారిపురం తదితర నదీతీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు. వరదలపై పోలీస్ యంత్రాంగం అప్రమత్తం శ్రీకాకుళం సిటీ: నాగావళి వరదల నేపథ్యంలో జిల్లాలో పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఎస్పీ త్రివిక్రమ వర్మ పేర్కొన్నారు. ఆయన ఆదివారం రాత్రి సాక్షితో మాట్లాడారు. కలెక్టర్‌తో పరిస్థితులపై చర్చించామని చెప్పారు. 90 వేల క్యూసెక్కులు ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల పరిధిలో ఉన్న వీరఘట్టం, ఆమదాలవలస, మందస, సంతబొమ్మాళి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, బూర్జ తదితీర పోలీస్ యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. అప్రమత్తంగా ఉండండి హిరమండలం: వంశధార నదికి గొట్టా బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుందని, తీర ప్రాంత వాసులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గొట్టా బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రానికి 5వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని, అర్ధరాత్రి సమయానికి మరో 15 వేల క్యూసెక్కులు పెరిగే అవకాశం ఉందనిచ నదీతీర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వీఆర్ఏ, వీఆర్వోలకు సమాచారం అందించాలని కోరారు. -
ఉగ్ర నాగావళి
♦ ఒడిశాలో భారీ వర్షాలు ∙ఉగ్రరూపం దాల్చిన నాగావళి ♦ కొట్టుకుపోయిన రైల్వే వంతెన ♦ జలదిగ్బంధంలో విజయనగరం జిల్లాలోని నదీతీర గ్రామాలు ♦ తోటపల్లికి వరద పోటు ♦ 8 గేట్లు ఎత్తివేత ♦ కూనేరు వద్ద జాతీయ ♦ రహదారిపైకి వరద నీరు ♦ ఆంధ్రా–ఒడిశాకు నిలిచిన రాకపోకలు ♦ సమీక్షిస్తున్న అధికార యంత్రాంగం ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. తీర ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద నీరు తాకిడికి తెరువళ్లి రైల్వే వంతెన కొట్టుకుపోవడం, కూనేరు వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో ఒడిశా–ఆంధ్రాలకు రైళ్లు, వాహన రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. తోటపల్లికి వరద నీరు పోటెత్తడంతో 8 గేట్లు ఎత్తేశారు. వరి ఆకు, వెద పొలాలు నీట మునిగాయి. నీటి ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండడంతో నదీతీర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొమరాడ/జియ్యమ్మవలస/పార్వతీపురం టౌన్/కురుపాం/గరుగుబిల్లి: ఒడిశాలోని రాయగడ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళికి వరద నీరు పోటెత్తింది. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. విజయనగరం జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో ఒడిశా–రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశాలోని ఇంద్రావతి డ్యామ్ గేట్లు కొట్టుకుపోవడంతో వరద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. రాయగడ నుంచి తెరువల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న వంతెన కొ ట్టుకుపోయింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లను దారిమళ్లించారు. నీట మునిగిన పల్లెలు.. విజయనగరం జిల్లాలోని పలు పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కూనేరు వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో వాహనరాకపోకలు నిలిచిపోయాయి. కొమరాడ మండలంలోని పూర్ణపాడు, కళ్లికోట, దుగ్గి, గుణానపురం, నిర్వాసిత గ్రామమైన జియ్యమ్మవలస మండలం బాసంగిలోకి వరద నీరు చొరబడింది. కోటిపాం పంచాయతీ గుంప వద్ద ఉన్న శివాలయం నీటమునిగింది. బాసంగి గ్రామంలోని 385 కుటుంబాలకు, 250 మందికి మాత్రమే ఇళ్లపట్టాలు ఇచ్చారని, పల్లెను విడిచిపెట్టే పరిస్థితి లేకపోవడం వల్లే వరదనీటిలో చిక్కుకుపోయామంటూ గ్రామస్తులు గగ్గోలు పెట్టారు. బాసంగికి వచ్చిన తహసీల్దార్ భాస్కరరావు, ఇతర అధికారులను నిలదీశారు. గ్రామస్తులందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తోటపల్లికి వరద పోటు నాగావళి నదిపై నిర్మించిన తోటపల్లి ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. మధ్యాహ్నం 2 గం టలకు ఇన్‌ఫ్లో 1500 క్యూసెక్కులు కాగా, ఎనిమిదిగేట్లు నుంచి 21,965 క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెట్టారు. సాయంత్రం 4 గంటలకు ఇన్‌ఫ్లో 22 వేల 500 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 29, 825, సాయంత్రం 5 గంటలకు ఇన్‌ఫ్లో 48,500, అవుట్ ఫ్లో 49,689 క్యూసెక్కులు, రాత్రి 11 గంటలకు ఇన్‌ఫ్లో 1, 35వేల క్యూసెక్కులుకాగా, లక్ష క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నట్టు గరుగుబిల్లి తహసీల్దార్ రాధాకృష్ణ, ఎంపీడీవో పార్వతి, ప్రాజెక్టు అధికారులు ఎస్.పండు, సత్యంలు తెలిపారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం నాగావళిలో వరద నీరు పెరుగుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పార్వతీపురం ఆర్డీవో సుదర్శన దొర నాగావళి పరీవాహక పాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కూనేరు వద్ద నాగావళి నది ప్రవాహ ఉద్ధృతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. వరద ఉద్ధృతి పెరిగితే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు. వీఆర్వో, సెక్రటరీలను అప్రమత్తం చేశారు. సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు దినకర్, పాపారావు, సిబ్బంది లోతట్టు గ్రామాలకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. వరద నీటిలో చేపలు వేటాడే వారిని నిలువరించారు. పార్వతీపురం ఐటీడీఏలో కంట్రోల్‌రూం ఏర్పాటు పార్వతీపురం టౌన్: నాగావళి నదీ తీర గ్రామా ల ప్రజల కోసం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటుచేశారు. ప్రమాద సమయంలో ఫోన్: 08963221152 నండర్కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. పూర్ణపాడు, దుగ్గి గ్రామాలు ముంపునకు గురయ్యాయని, ఆయా గ్రామాల ప్రజలకు కంట్రోల్ రూమ్ నుంచి సహాయం అందిస్తామని ఐటీడీఏ వర్గాలు తెలిపాయి. -
విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
శ్రీకాకుళం: స్కూలు విద్యార్థులతో వెళ్తున్న పడవకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం రంగరాయపురం వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సంతకవిటి గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు నాగావళి ఆవలి ఒడ్డున ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆ క్రమంలో శనివారం ఉదయం వారు బయలుదేరిన పడవకు నారాయణపురం అడ్డుకట్ట సమీపంలో దట్టంగా ఉన్న గుర్రపుడెక్క ఆకు అడ్డుపడింది. పడవ ముందుకు సాగలేదు. దీంతో పడవ మునిగిపోయే ప్రమాదంలో పడింది. ఈ దశలో సరంగులు అప్రమత్తమై పడవను వెనక్కి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. -
నాగావళి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
-
నాగావళి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం కొత్త సంవత్సరం సెలవు రోజు కావడంతో ఐదుగురు స్నేహితులు నాగావళి గోల్కొండ రేవులో స్నానానికి వెళ్లారు. ముందుగా ఇద్దరు నదిలోకి దిగగా.. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతూ కేకలు వేశారు. దీంతో ఒడ్డున ఉన్నవారిలో మరొకరు నదిలో వారిని కాపాడే ప్రయత్నంలో అతడు కూడా గల్లంతయ్యాడు. దీంతో మిగిలిన ఇద్దరు విద్యార్థులు భయంతో అక్కడ నుంచి పారిపోయారు. గల్లంతైన ముగ్గురిలో ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన సోదరులు లోకేష్(14), రాకేష్(13) తో పాటు ముంగవారితోటకు చెందిన హేమచంద్ర (14) ఉన్నారు. విద్యార్థుల గల్లంతుతో స్థానికంగా విషాదం నెలకొంది. -
ఎడారిలా నాగావళి
బూర్జ: నాగావళి నది ఎడారిని తలపిస్తుంది. చుక్కనీరులేని పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితి కారణంగా నది ఇంకిపోయింది. ప్రతి ఏడాది ఆగస్టులో నది ఉగ్రరూపం దాల్చేది. అటువంటిది ఈ ఏడాది నదిలో ఇసుకతిన్నెలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో విశిష్ట ప్రాధాన్యం సంచరించుకున్న నాగావళి నది నిండుకుంది. దీంతో ఆయకట్టు రైతులు ఈ ఏడాది ఖరీఫ్ వరి సాగుచేసేందుకు చుక్కనీరు అందించే పరిస్థితి కనిపించటంలేదు. ఏటా ఈ సమయానికి నదీతీరంలో ఉన్న ప్రాంతంలో ఉభాలు పూర్తయ్యేవి. ఈ ఏడాది నాట్లు పడక పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బూర్జ, ఆమదాలవలస, పొందూరు, సంతకవిటి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, మండలాలకు చెందిన 107 గ్రామాల్లోని 12 వేల మంది రైతులకు సంబంధించి 36,830 ఎకరాలకు ఏటా సాగునీరు అందించేది. ఈ ఏడాది 1000 ఎకరాలకు కూడా సాగునీరు అందే పరిస్థితి లేదు. నదిలో నీరు లేకపోవడంను చూసి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయానికి నారాయణపురం ఆనకట్టవద్ద గళగళ ప్రవహించే గంగమ్మ నదిలో కానరాకుండా పోయింది. వరుణుడు కూడా కరుణించే పరిస్థితి కనిపించటంలేదు. ప్రతి రోజు మేఘాలు ఊరిస్తున్నాయి తప్ప చినుకులు కూడా పడటంలేదు. నిత్యం రైతులు ఆకాశం వంక చూస్తు నీరుగారిపోతున్నారు. నాగావళి నదిలో నారాయణపురం ఆనకట్టను 7,774 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించారు. అయితే ప్రస్తుతం ఆనకట్ట వద్ద 200 కూసెక్కులు నీరు ఉంది. ఈ పరిస్థితికి నీటిపారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త లేకపోవటం కూడా ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు. నీరు నిల్వ చేసి ఉంటే ప్రస్తుతం ఖరీఫ్ దమ్ములు చేసుకునేందుకు ఇబ్బందులు ఉండేవి కావని వాపోతున్నారు. నదిలో నీరు లేక, వర్షాలు పడకపోవడంతో దమ్ములు చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకుంటే ఈ ఏడాది ఖరీఫ్ పంట కష్టమేనని అంటున్నారు. గత ఏడాది హుద్‌హుద్ తుపానుతో పంట కోల్పోయామని, ఈ ఏడాది అనావృష్టితో పంట చేతికందే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో వలసలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం
పాలకొండ: రేగిడి మండలం సంకిలి గ్రామం వద్ద రెండ్రోజుల కిందట నాగావళి నదిలో గల్లంతైన రాజాం మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన యువకుడు కోనాడ తిరుపతిరావు (22) మృతదేహం లభ్యమైంది. పాలకొండ మండలం అంపిలి గ్రామ పరిసరాల నాగావళి నదిలో మృతదేహం ఉండటాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై ఎల్.చంద్రశేఖర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండ నగర పంచాయతీ సమన్వయకర్త పల్లా కొండలరావులు మృతదేహం వద్దకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం బాగా కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో నది ఒడ్డునే శవపంచనామ, పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంపై గాయాలైనట్టు ప్రాథమికంగా గుర్తించారు. కేసును రేగిడి పోలీసులకు రిఫర్ చేయనున్నట్టు పాలకొండ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. యువకుని మృతిపై దర్యాప్తు రేగిడి : రాజాం నగర పంచాయతీ బుచ్చెంపేటకు చెందిన యువకుడు కోరాడ తిరుపతి నాగవళి నదిలో గల్లంతై మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిరావుతోపాటు మంగళాపురానికి చెందిన వడ్డాది వినోద్, పొనుగుటివలసకు చెందిన పూతిక సింహాచలంలు కూడా నదిలో స్నానానికి వెళ్లారు. తిరుపతిరావు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడా, ఇంకేమైనా సంఘటన జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎన్.కామేశ్వరరావు విలేకరులకు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వాస్తవం వెలుగు చూస్తుందన్నారు. -
గాలింపు ముమ్మరం
రేగిడి : మండల పరిధిలోని సంకిలి నాగావళి నదిలో రాజాం మండలం బుచ్చెంపేటకు చెందిన కోరాడ తిరుపతిరావు ఆచూకీ కోసం అధికారుల పర్యవేక్షణలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతిరావు ఈ నెల 24న గల్లంతైన విషయం విదితమే. గురువారం తెల్లవారు నుంచే ఎస్సై ఎన్.కామేశ్వరరావు, సిబ్బందితోపాటు సంఘటన స్థలం వద్దే ఉండి గాలింపు చర్యలను చేపట్టారు. ఏ ప్రాంతంలో సంఘటన జరిగిందో తెలుసుకునేందుకు మంగళవాపురానికి చెందిన వడ్డాది వినేద్, పొనుగుటివలసకు చెందిన పూతిక సింహాచలంలను కూడా ఆ ప్రాంతానికి తీసుకువెళ్లారు. గ్రామానికి చెందిన సుమారు 300 మంది వరకు నదివద్దకు వచ్చి తిరుపతిరావు ఆచూకీ లభ్యంకాకపోవడంతో ఆందోళన చెందారు. ఒక వ్యక్తి నదిలో గల్లంతైనప్పటికీ ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. ఫైర్ సిబ్బంది, 108 సిబ్బంది సంఘటన స్థలం వద్దకు రాలేదని వాపోయారు. తహశీల్దార్ బి.సూరమ్మ కూడా నది వద్దకు వెళ్లి ఎస్సైతో మాట్లాడి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. నది దిగువ భాగంలోనూ గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటీవల హుద్‌హుద్ తుపాను ప్రభావంతో వచ్చిన వరదకు పాతవంతెన వద్ద పూర్తిగా కోతకు గురికావడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఇక్కడ జీఎంఆర్ ఐటీ విద్యార్థి స్నానానికి వెళ్లి మృతిచెందిన విషయం తెలిసిందే. గజ ఈతగాళ్లను రప్పించండి రేగిడి: సంకిలి నాగావళి నదిలో తిరుపతిరావు గల్లంతయిన విషయాన్ని తెలుసుకున్న ఎంఎల్ఎ కంబాల జోగులు గురువారం సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. సంఘటన ఎలా జరిగిందీ స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఎస్ఐ కామేశ్వరరావు, తహశీల్దార్ బి.సూరమ్మ తదితర అధికారులను ఆదేశించారు. సంకిలి బ్రిడ్జి నుంచి బొడ్డవలస వరకూ తీరం వెంబడి ఎంఎల్ఎ నడుచుకుంటూ వెళ్ళి నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. ఆయనవెంట సంకిలి సర్పంచ్ రాయపురెడ్డి కృష్ణారావు తదితరులు ఉన్నారు. -
నది దాటడమే పెద్ద 'పరీక్ష'
విజయనగరం : విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు నాగావళి నది దాటితేగాని పరీక్ష రాయలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 9.30 గంటల లోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవలసి ఉండడంతో నదికి ఆవతలివైపు ఉన్న విద్యార్థినీ విద్యార్థులు గురువారం అష్టకష్టాలు పడ్డారు. నది అవతల గల కొట్టు, తొడుము, కెమిశిల, శిగవరం, మాతలంగి, దలాయిపేట, నిమ్మలపాడు తదితర గ్రామాలకు చెందిన దాదాపు 120 మంది విద్యార్థులు నది ఇవతల వైపు ఉన్న కొమరాడ పాఠశాలలో చదువుతున్నారు. మధ్యలో నాగావళి నది ఉన్నా వీరికి కొమరాడ దగ్గరగా ఉండడంతో స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. నదిలో నుంచి వస్తే కిలోమీటరు దూరం ప్రయాణిస్తే చాలు విద్యార్థులు ఓ కిలోమీటరు నడిచి పాఠశాలలకు చేరుకోవచ్చు. అదే చుట్టూ తిరిగి రావాలంటే 90 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవలసి ఉంటుంది. సదరు గ్రామాలకు చెందిన విద్యార్థులకు కొమరాడలోని సాంఘిక సంక్షేమ పాఠశాల , గురుకుల బాలుర పాఠశాలలను పరీక్ష కేంద్రాలను కేటాయించారు. నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో విద్యార్థులు కొంత కష్టపడైనా సమయానికి కేంద్రాలకు చేరుకున్నారు. ఒకవేళ ఒడిశాలో వర్షాలు కురిస్తే నాగావళిలో నీటి ప్రవాహం పెరుగుతుంది. వీరు మధ్యలో ఉండగా నీటి ప్రవాహం పెరిగితే పరిస్థితి చెప్పనక్కరలేదు. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నది దాటాల్సిన పరిస్థితి నెలకొంది. నది ఆవలి నుంచి కొమరాడ వచ్చేసరికి సుమారు గంటన్నర సమయం పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా విద్యార్థులకు ఈ కష్టాలు తప్పడంలేదని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. -
తీరానికి గుండె కోత
పాలకొండ:వర్షాకాలంలో నాగావళి నది ప్రవాహం వల్ల ప్రతి ఏటా రెండు నుంచి మూడు మీటర్ల మేరకు తీరం కోతకు గురవుతోంది. నదికి ఎడమ వైపు ఉన్న పాలకొండ, బూర్జ మండలాల పరిధిలో పలు గ్రామాలను తాకుతోంది. ఇదే పరిస్థితి మరి కొన్నాళ్లు కొనసాగితే వరదలు వచ్చినప్పుడు గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడుతుంది. నదిలో ఓ వైపు ఇసుక తవ్వేస్తుండటంతో నీటి ప్రవాహం ఒకవైపునకే మళ్లిపోతూ తీరాన్ని కోతకు గురి చేస్తోంది. కొత్తగా అన్నవరం, అంపిలి, గోపాలపు రం, అల్లెన తదితర గ్రామాల వద్ద ఇసుక రీచులు ఏర్పా టు చేయనుండటంతో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తోటపల్లి రిజర్వాయర్ నుంచి శ్రీకాకుళం వరకు నాగావళి ప్రవహిస్తోంది. గతంలో నది మధ్య భాగం నుంచే ప్రవాహం కొనసాగేది. వరదల సమయంలో ఇసుక మేటలు వేయడంతో కాలక్రమంలో వీటిని అధికారులు ఇసుక రీచులుగా గుర్తించి తవ్వకాలకు అనుమతిస్తున్నారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో లోతు పెరిగి నదీ గమనం అటు మళ్లిపోతోంది. ఈ క్రమంలో నదికి ఎడమ వైపున ఉన్న వీరఘట్టం మండలంలో 12 గ్రామాలు, పాలకొండ మండలంలోని 8 గ్రామాలు, బూర్జ మండలంలో 6 గ్రామాలు, ఆమదాలవలస మండలంలో 14 గ్రామాల సమీపంలోకి ప్రవాహం చేరుకుంది. ప్రతి ఏటా కోత పెరుగుతూ గ్రామాలకు, నదికి మధ్య ఉన్న దూరం తరిగిపోతుండటంతో వరద ముప్పు పెరుగుతోంది. రీచులతో అనర్థాలు ఇసుక తవ్వకాల కోసం ప్రభుత్వం ఈ నాలుగు మండలాల పరిధిలో సుమారు 15 రీచులను గుర్తించింది. వీటిలో ఇసుక తవ్వకాలు చేపడితే నదీ వేగం మరింత పెరిగి పూర్తిగా గ్రామాలను ఆనుకొని ప్రవహించే ప్రమాదం ఉంది. ఈ భయంతోనే నదీ తీర గ్రామాల ప్రజలు ఇసుక రీచుల వేలాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వరద ప్రమాదానికి అతి సమీపంలో ఉన్నామని, ఇప్పుడున్న ఇసుక దిబ్బలను కూడా తవ్వేస్తే గ్రామాలు కొట్టుకుపోతాయని అంపిలి గ్రామానికి చెందిన లోలుగు విశ్వేశ్వరరావు, గండి రామినాయుడు తదితరులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్టు వివరించారు. భూముల్లో ఇసుక మేటలు మరోవైపు నదికి కుడి భాగంలో ఉన్న రేగిడి మండలం సంకిలి, బొడ్డవలస గ్రామాల వద్ద పంట పొలాల్లో ఇసుక మేటలు వేస్తున్నాయి. గతంలో చెరుకు, వేరుశనగ పంటలు పండే పొలాలు ఇసుక దిబ్బలుగా మారిపోయాయి. ఇసుక తవ్వకాల వల్ల వరదల సమయాల్లో ప్రవాహం దిశ మారి పంట పొలాల పైకి వస్తోందని, ఇసుక మేటలు పేరుకుపోయి భూములు నిస్సారమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిన కరకట్టల నిర్మాణాలు వరద ప్రవాహాన్ని అడ్డుకొనేందుకు నిర్మించ తలపెట్టిన కరకట్టల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోవడం సమస్యను మరింత జఠిలం చేస్తోంది. అత్యంత ప్రమాదకరంగా ఉన్న అంపిలి, అన్నవరం, గోపాలపురం గ్రామాల మధ్య కనీసం గట్ల నిర్మాణం కూడా చేపట్టలేదు. దీని ప్రభావంతో నదిలో ప్రవాహం 60 వేల క్యూసెక్కులు దాటితే నదీ తీర గ్రామాలు మునిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
నాగావళి పరవళ్లు
వీరఘట్టం, గరుగుబిల్లి: వరద నీటితో నాగావళి నది పోటెత్తుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఎగువన ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు దిగువనున్న తోటపల్లి బ్యారేజీకి చేరుతోంది. నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో తోటపల్లి ప్రాజెక్టు అధికారులు నదిలోకి నీటిని విడిచిపెడుతున్నారు. ఆదివారం రాత్రి సమయానికి ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేసి 37 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఉదయం వరకు బ్యారేజీ వద్ద నాగావళి నదిలో 5050 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా.. మధ్యాహ్నం ఒంటిగంటకు 28 వేల క్యూసెక్కులకు, సాయంత్రం ఆరు గంటలకు 42 క్యూసెక్కులకు పెరిగింది. బ్యారేజీ గరిష్ట నీటిమట్టం 105 మీటర్లు కాగా సాయంత్రానికి 102 మీటర్లకు, రాత్రికి 102.7 మీటర్లకు పెరిగింది. నీటి ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు దిగువకు వదిలే నీటి పరిమాణాన్ని కూడా క్రమంగా పెంచుతున్నారు. మధ్యాహ్నం బ్యారేజీ నుంచి 35వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంత్రం 37వేల క్యూసెక్కులకు, రాత్రి 40,752 క్యూసెక్కులకు పెంచారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఏఈ శివశంకర్, తదితరులు పర్యవేక్షిస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీఆర్ఓలకు సూచించారు. పాలకొండ మండల వాసులకు ముంపు భయం ! పాలకొండ: తోటపల్లి గేట్లు ఎత్తివేతతో పాలకొండ మండలం చినమంగళాపురం, గొట్టమంగళాపురం, ఎరకరాయపురం,గోపాలపురం,అంపిలి,అన్నవరంతో పాటు బూర్జ మండలం ఏటి ఒడ్డు పర్తా, అల్లిన,కిలంతర,లక్కుపురం,జిబిపురం,అగ్రహారం,కాఖండ్యాం,లాభాం,గుత్తావల్లి,నారాయణపురం గ్రామాలకు ముంపు ప్రమాదం ఉండడంతో ఆయా గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే పాలకొండ మండలం అన్నవరం, బూర్జ మండలం, కాఖండ్యాం వద్ద నిర్మించిన కరకట్లు పూర్తిగా కరిగిపోవడం వల్ల గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. -
స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలుర గల్లంతు
తాలాడ(సంతకవిటి)/వంగర, న్యూస్‌లైన్: చుట్టపు చూపునకు వచ్చిన యువకుడు మడ్డువలస కాలువలో స్నానానికి దిగి గల్లంతుకాగా, నాగావళి నదికి స్నానం కోసం వెళ్లిన మరో బాలుడు కొట్టుకుపోయిన ఘటనలు సంతకవిటి మండలం తాలాడ, వంగర మండలం శివ్వాం గ్రామం వద్ద బుధవారం చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే... పొందూరుకు చెందిన బుడుమూరు షణ్ముఖరావు (14) అనే బాలుడు తాలాడ గ్రామంలోని తన బావగారైన మల్లేశ్వరరావు ఇంటికి ఈనెల 1న వచ్చాడు. ఉదయం తోటి పిల్లలతో కలసి మడ్డువలస కాలువలో స్నానానికి వెళ్లాడు. కాలువలో దిగుతుండగా కాలు జారడం, ఈత రాకపోవడంతో ఉన్న ఫలంగా కొట్టుకుపోయాడు. తోటి పిల్లలు విషయూన్ని బంధువులకు చెప్పడంతో పరుగున వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న షన్ముఖరావు తల్లిదండ్రులు గున్నమ్మ, అప్పారావులు తాలాడకు చేరుకుని భోరున విలపిస్తున్నారు. వీరికి షన్ముఖరావుతో పాటు మరో కుమారుడు ఉన్నాడు. బాలుడి గల్లంతైన విషయంపై సంతకవిటి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. బాలుడి కోసం గ్రామస్తులందరూ కలిసి గాలిస్తున్నారు. కాలుజారి.. వంగర మండలం శివ్వాం గ్రామానికి చెందిన దమరసింగి ప్రవీణ్(15) గ్రామ సమీపంలోని నాగావళి నదిలో స్నానాలు రేవు వద్ద స్నానం చేస్తుండగా కాలుజారి నదిలో కొట్టుకుపోయాడు. దీనిని గమనించిన కొంతమంది చిన్నారులు కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి గాలించినా ఫలితం లేదు. ప్రవీణ్ తల్లి పొట్టకూటికోసం వలస వెళ్లడంతో అమ్మమ్మ, తాతయ్య బిల్లాన ఆదమ్మ, పకీరు వద్ద ఉంటూ చదువుతున్నాడు. ప్రవీణ్ జాడతెలియక పోవడంతో వృద్ధులిద్దరూ నది ఒడ్డుకు చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి కోసం గ్రామానికి చెందిన యువకులు గాలిస్తున్నారు.