నాగావళి నదిపై మరో వంతెన  | Another Bridge On Nagavali River | Sakshi
Sakshi News home page

నాగావళి నదిపై మరో వంతెన 

Published Fri, Feb 3 2023 11:08 AM | Last Updated on Fri, Feb 3 2023 12:12 PM

Another Bridge On Nagavali River - Sakshi

రాజాం: విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజల రాకపోకలకు వీలుగా నాగావళి నదిపై మరో వంతెన నిర్మించనున్నారు. రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలం వాల్తేరు గ్రామం వద్ద ఉన్న బలసలరేవు నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని ఇసుకలపేట రేవు మధ్య వంతెన నిర్మించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వంతెన నిర్మాణానికి ఏడాదిన్నరగా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. తాజా గా ఫ్రీ ఎస్టిమేట్‌ నిర్వహించి అవసరమైన నిధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల చొరవతో నిధులు మంజూరుకావడంతో వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. 50 గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య ప్రయాణ దూరం తగ్గనుంది.  

నెలరోజలుగా కొలతలు  
నదిపై వంతెన నిర్మాణానికి సంబంధించి  రూ.15 లక్షల వ్యయంతో అంచనా సర్వేను కోస్టల్‌ ల్యాండ్‌ సర్వే ఏజెన్సీ నిర్వహించింది. వంతెన నిర్మాణ ప్లానింగ్‌ను, అంచనా వ్యయాన్ని ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించింది. రూ.87 కోట్లను ప్రభుత్వం మజూరు చేయడంతో ఆర్‌అండ్‌బీశాఖ ఇంజినీరింగ్‌ అధికారులు ప్లాన్‌ ప్రకారం నదికి ఇరువైపులా రోడ్డు చదును చేయడం, పిల్లర్లకు అనువైన ప్రదేశాలను నిర్ధారిస్తున్నారు. రోడ్డు సౌకర్యం, భవిష్యత్‌ వినియోగం, నదిలో మట్టి నమూనాలు సేకరణ, ఎంత లోతులో గ్రావెల్‌ ఉందనే అంశాలుపై పూర్తి  వివరాలు సేకరించామని, ఈ నెలాఖరులోగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా వంతెన పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్‌అండ్‌బీ జేఈ ఆంజనేయులు తెలిపారు.

వంతెన నిర్మాణం పూర్తయితే సంతకవిటి నుంచి ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాలకు రహదారి సౌకర్యం కలగడంతో పాటు రెండు జిల్లాలను కలిపేవారధిలా మారనుంది. సంతకవిటి మండలంలో నాగావళి నదిపై రెండో వంతెనగా లెక్కల్లోకి వస్తుంది. 560 మీటర్ల పొడవున వంతెన నిర్మాణం కానుంది. 1998–99 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మిస్తామంటూ హామీ ఇచ్చింది. అప్పట్లో రూ.90 లక్షలు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించి నా పనులు చేయలేదు. 2017లో ఏడాదిన్నర పాటు వాల్తేరుతో పాటు పరిసర గ్రామాల ప్రజలు దీక్షలు చేసినా పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతీయుల వంతెన కలను నెరవేర్చుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

ప్రమాదాలకు చెక్‌ 
వాల్తేరు వద్ద  నాగావళి నదిని దాటి వందలాదిమంది ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. నది ఉద్ధృతంగా ప్రవహించినప్పుడు నాటు పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా ఉంటున్నాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల కృషితో వంతెన కల సాకారమవుతోంది. ఈప్రాంత ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రుణపడి ఉంటారు.  
– సిరిపురపు జగన్మోహనరావు, జెడ్పీ వైస్‌ చైర్మన్, హొంజరాం  

అందరి సహకారంతో 
ప్రజలు సమస్యలు పరిష్కరించడమే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గతంలో అర్ధాంతరంగా ఉండిపోయిన వంతెనలు, రోడ్లు కూడా పూర్తిచేస్తాం. వాల్తేరు వద్ద బలసలరేవు వంతెన నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తాం. అందరి సహకారంతో వంతెన నిర్మాణం సాకారంకానుంది.   
– కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే  

కష్టాలు తీరుతాయి..  
ఇసుకలపేట నుంచి అటు శ్రీకాకుళం, ఇటు ఆమదాలవలస చాలా దగ్గర. మధ్యలో నాగావళి నది ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నరకయాతన పడేవారు. వంతెన నిర్మాణంతో ఆ కష్టాలన్నీ తీరుతాయి. మా గ్రామంతో పాటు పరిసర గ్రామాలు ప్రజలు, వంతెన సాధన కమిటీ తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.  
– గురుగుబెల్లి స్వామినాయుడు, 
కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్, వాల్తేరు    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement