ఉపశమనం: శాంతించిన నాగవల్లి
ఒడిశాలో భారీ వర్షాలతో పోటెత్తిన నాగావళి నది సోమవారం సాయంత్రానికి కాస్త శాంతించింది. దీని వరద ప్రవాహం జిల్లా కేంద్రాన్ని సోమవారం తెల్లవారుజామునే చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేసింది. ఆదివారం రాత్రి భామిని ప్రాంతంలో ఓ వృద్ధుడు నాగావళి నదిలో గల్లంతయ్యాడు. మరోవైపు వంశధార నదిలోనూ వరద ప్రవాహం పెరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా చెదురుమదురు నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. ఒక్కరోజునే జిల్లా మొత్తంమీద వెయ్యి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడనం మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను మంగళవారం కూడా కొనసాగించాలని జిల్లా కలెక్టరు కె.ధనుంజయరెడ్డి ఆదేశాలిచ్చారు. ఈ వరదతో వెయ్యి ఎకరాల్లోని వరినాడు మడులు, వెదలు నీటమునిగాయి.
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: అల్పపీడనం ప్రభావంతో గత శనివారం రాత్రి నుంచి ఒడిశాలో భారీ వర్షాలు పడటంతో నాగావళి నది పోటెత్తిన సంగతి తెలిసిందే. తోటపల్లి ప్రాజెక్టు వద్ద రికార్డు స్థాయిలో వరదనీరు చేరడంతో (ఇన్‌ఫ్లో) జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే నదీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలకు సిబ్బందిని పంపించారు. ఆదివారం ఒడిశాతో పాటు విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసిన వరద సోమవారం తెల్లవారుజామున శ్రీకాకుళం నగరాన్ని చుట్టుముట్టింది. అయితే నాగావళి నది సోమవారం సాయంత్రానికి శాంతించింది.
వరద ప్రవాహం క్రమేపీ తగ్గుముఖం పట్టింది. నాగావళి ఒడ్డున ఉన్న జిల్లాకేంద్రం శ్రీకాకుళంలోని తురాయిచెట్టు వీధిలో పలు ఇళ్లల్లోకి వరదనీరు చొరబడింది. జిల్లా కలెక్టరు కె.ధనుంజయ్‌రెడ్డి, జాయింట్ కలెక్టరు కేవీఎన్ చక్రధరబాబు, ఎస్పీ త్రివిక్రమ వర్మ తదితర అధికారులంతా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అలాగే ఆంధ్రా ఒడిశా సరిహద్దులో మహేంద్రగిరి గిరి కొండల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఉధృతంగా వచ్చి పలాస మండలం కందిరిగాం, బ్రాహ్మణతర్ల, పెదంచల, వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి, బెండి గేటు, బెండి నుంచి సముద్రపు పొరలోకి వచ్చింది.
నాగావళిలోకి తగ్గిన వరద...
తోటపల్లి ప్రాజెక్టు నుంచి నాగావళి నదిలోకి అవుట్ ఫ్లో ఆదివారం అర్ధరాత్రి లక్ష క్యూసెక్కుల నీరు ఉంది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు 25 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఉదయం 5 గంటలకు ఇన్‌ఫ్లో 13 వేల క్యూసెక్కులు మాత్రమే ఉండటంతో ఎనిమిది గేట్లలో ఐదు గేట్లు మూసేసి అవుట్ ఫ్లో 7,500 క్యూసెక్కులకు తగ్గించారు. సాయంత్రం 5 గంటలకు ఇన్‌ఫ్లో 8,500 ఉండగా, అవుట్ ఫ్లో 7,300 క్యూసెక్కులు ఉంది. తోటపల్లి ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం లెవెల్ 105 మీటర్లు కాగా ప్రస్తుతం 103.80 మీటర్లు లెవెల్ ఉంది. దిగువన నారాయణపురం ఆనకట్ట వద్ద సోమవారం ఉదయం ఆరు గంటలకు 97,750 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదయ్యింది.
పది గంటల నుంచి తగ్గుముఖం పట్టింది. సాయంత్రం ఆరు గంటల సమయానికి 12,300 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ఇక నారాయణపురం ఆనకట్ట వద్ద సోమవారం ఉదయం 97,750 క్యూసెక్కుల వరద నీరు పోటెత్తింది. 11 గంటల సమయానికి 21,350 క్యూసెక్కులకు, మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 13,300 క్యూసెక్కులకు నీటి ప్రవాహం తగ్గింది. శ్రీకాకుళం పాత వంతెన వద్ద ఉదయం ఆరు గంటల సమయంలో 71,890 క్యూసెక్కుల నీటి ప్రవాహం పోటెత్తింది. 11 గంటల సమయంలో 90,400 క్యూసెక్కులు రావడంతో ఒక్కసారిగా శ్రీకాకుళం నగర ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 42 వేల క్యూసెక్కులకు నాగావళి వరద ఉద్ధృతి కాస్త తగ్గింది. సాయంత్రానికి కాస్త శాంతించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
నిలకడగా వంశధార...
జిల్లాలోని మరో ప్రధాన నది వంశధారలోనూ వరద ఉద్ధృతి సోమవారం సాయంత్రానికి నిలకడగా ఉంది. వంశధార నదిలో భామిని మండలం తాలాడ గ్రామానికి కొల్ల గోపాలం (65) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కూరగాయల కొనుగోలు నిమిత్తం ఆదివారం సాయంత్రం ఒడిశా సరిహద్దులో నాగావళిని దాటి వెళ్లాడు. రాత్రి తిరుగు ప్రయాణంలో వరద ఉద్ధృతిని అంచనా వేయలేక నదిలోకి దిగాడు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ప్రస్తుతం నదిలో రెవెన్యూ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వంశధార నదీపరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో అక్కడక్కడా వరదనీరు ప్రవేశించింది. సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. వంశధార నదిపైనున్న గొట్టా బ్యారేజీ వద్ద సోమవారం ఉదయం ఆరు గంటలకు 27 వేల క్యూసెక్కుల నీటిప్రవాహం ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 34 వేల క్యూసెక్కులకు పెరిగింది. రెండు గంటలకు 31 వేల క్యూసెక్కులకు తగ్గింది. సాయంత్రానికి మరికాస్త తగ్గింది. 27,866 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది.
కొనసాగుతున్న అప్రమత్తత...
బంగాళాఖాతంలో అల్పపీడనం దృష్ట్యా కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను మంగళవారం కూడా కొనసాగించాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఒకవేళ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఒడిశాలో మళ్లీ భారీ వర్షాలు ఉంటే నాగావళి, వంశధార నదుల్లో వరద పోటెత్తే ప్రమాదం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత కొనసాగుతోంది.
సుమారు వెయ్యి ఎకరాల్లో నష్టం...
నాగావళి వరద ప్రభావంతో జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాల్లో వరినారు మడులు, ఎదలకు నష్టం వాటిల్లింది. ఆమదాలవలస, పొందూరు మండలాల పరిధిలో నెల్లిమెట్ట, సింగూరు, బొడ్డేపల్లి గ్రామాల్లో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఎద పొలాలు, నారుమడుల్లో వరద నీరు చేరింది. వంగర మండలం సంగాంలోని శివాలయం వరదల కారణంగా నీట మునిగింది. రేగిడి మండలం కె. వెంకటాపురం గ్రామంలోకి నాగావళి వరద నీరు చేరింది. సంతకవిటి మండలం కేఆర్ పురం రంగారాయపురం గ్రామాల మధ్య నది గట్టు కోతకు గురైంది. వీరఘట్టం మండలం పరిధి చిదిమి, పాలమెట్ట రహదారి వర్షాల కారణంగా చిద్రమైంది. గోపాలపురంలో 30 ఎకరాల పైబడి నారుమడులు నీటమునిగాయి. ఇచ్ఛాఫురం మండలం బాహుదానది పరివాహక పారంతాల్లో పంట పొలాల్లోకి వర్షం నీరు చేరింది. వర్షాల కారణంగా పలాస మండలం అల్లుకోల, రెంటికోట, వరదరాజపురం, గరుడకండి, సరియాపల్లి, పూర్ణభద్ర, అమలుకుడియ గ్రామాల్లోని పంట పొలాల్లోకి నీరు చేరింది.
సీఎం హామీ ఇచ్చినా...
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చినా జిల్లా కేంద్రంలో చిన్న రోడ్డు పని కూడా కాలేదని వరద బాధితురాలొకరు మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణను నిలదీశారు. శ్రీకాకుళం నగరంలోని తురాయిచెట్టు వీధిలో ముంపు ప్రాంతాన్ని సోమవారం ఉదయం పరిశీలనకు వెళ్లిన ఆయనను వరద బాధితులు నిలదీశారు. నాగావళి నది గట్టును ఆనుకొని ఉన్న తురాయిచెట్టు వీధి రోడ్డును ఎత్తు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. హుదూద్ తుపాను తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలనకు వచ్చిన సందర్భంలో భరోసా ఇచ్చారు. కానీ దాదాపు మూడేళ్లు అయిపోతున్నా రోడ్డు ఎత్తుచేసే పని మాత్రం జరగలేదు. దీంతో నాగావళి నది వరదనీరు సోమవారం తెల్లవారుజామున తురాయిచెట్టు వీధిలోకి చొరబడింది.
రోడ్డుపై మోకాలు లోతున, ఇళ్లలో రెండు అడుగల ఎత్తున నీరు చేరింది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వారిని ఉదయం మాజీ మంత్రి గుండ పరామర్శకు వచ్చారు. రోడ్డు ఎత్తు చేసి ఉంటే ఇప్పుడు వరద ముప్పు తప్పేదని స్థానిక మహిళ ఒకరు ఆయనను నిలదీశారు. నిధులున్నాయని, త్వరలోనే పని ప్రారంభిస్తామని గుండ సర్ధి చెప్పాలని ప్రయత్నించినా స్థానికులు శాంతించలేదు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని, హామీలే తప్ప పనులు కనిపించట్లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.