నాగావళి పరవళ్లు
వీరఘట్టం, గరుగుబిల్లి: వరద నీటితో నాగావళి నది పోటెత్తుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఎగువన ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు దిగువనున్న తోటపల్లి బ్యారేజీకి చేరుతోంది. నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో తోటపల్లి ప్రాజెక్టు అధికారులు నదిలోకి నీటిని విడిచిపెడుతున్నారు. ఆదివారం రాత్రి సమయానికి ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేసి 37 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఉదయం వరకు బ్యారేజీ వద్ద నాగావళి నదిలో 5050 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా..
మధ్యాహ్నం ఒంటిగంటకు 28 వేల క్యూసెక్కులకు, సాయంత్రం ఆరు గంటలకు 42 క్యూసెక్కులకు పెరిగింది. బ్యారేజీ గరిష్ట నీటిమట్టం 105 మీటర్లు కాగా సాయంత్రానికి 102 మీటర్లకు, రాత్రికి 102.7 మీటర్లకు పెరిగింది. నీటి ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు దిగువకు వదిలే నీటి పరిమాణాన్ని కూడా క్రమంగా పెంచుతున్నారు. మధ్యాహ్నం బ్యారేజీ నుంచి 35వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంత్రం 37వేల క్యూసెక్కులకు, రాత్రి 40,752 క్యూసెక్కులకు పెంచారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఏఈ శివశంకర్, తదితరులు పర్యవేక్షిస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీఆర్‌ఓలకు సూచించారు.
పాలకొండ మండల వాసులకు ముంపు భయం !
పాలకొండ: తోటపల్లి గేట్లు ఎత్తివేతతో పాలకొండ మండలం చినమంగళాపురం, గొట్టమంగళాపురం, ఎరకరాయపురం,గోపాలపురం,అంపిలి,అన్నవరంతో పాటు బూర్జ మండలం ఏటి ఒడ్డు పర్తా, అల్లిన,కిలంతర,లక్కుపురం,జిబిపురం,అగ్రహారం,కాఖండ్యాం,లాభాం,గుత్తావల్లి,నారాయణపురం గ్రామాలకు ముంపు ప్రమాదం ఉండడంతో ఆయా గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే పాలకొండ మండలం అన్నవరం, బూర్జ మండలం, కాఖండ్యాం వద్ద నిర్మించిన కరకట్లు పూర్తిగా కరిగిపోవడం వల్ల గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు.