Viraghattam
-
జోరుగా క్రికెట్ బెట్టింగ్
వీరఘట్టం : జూదానికి అలవాటు పడిన కొందరు దానిని మానుకోలేక సీజనల్ జూదానికి తెరలేపుతున్నారు. ఏడాదిలో 60 శాతం పేకాటకు, మిగిలిన 40 శాతం క్రికెట్ బెట్టింగ్‌లతో కాలం వెల్లబుచ్చుతున్నారు. యువతను కూడా ఈ రొంపిలోకి లాగుతున్నారు. నెల రోజులుగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా వన్డే, టీ-20 మ్యాచ్‌లకు వీరఘట్టంలో ఒక రోజుకు రూ.5లక్షల వరకూ బెట్టింగ్‌లు విచ్చలవిడిగా బహిరంగ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. వీరఘట్టం అంబేడ్కర్ జంక్షన్లో ఉదయం 7 గంటల నుంచి 9గంటల వరకూ ఇవే చర్చలు. రూ.వెయ్యి, రెండు, మూడు వేలు ఇలా... పందాలు కాస్తూ బెట్టింగ్ బంగార్రాజులు పేట్రేగి పోతున్నారు. చిన్నచిన్న కిరాణ షాపులు, పకోడి బడ్డీలు, పాన్ షాపుల వద్ద ఈ తతంగం అంతా జరుగుతోంది. అంతా ఆన్లైన్లోనే... గతంలో ముఖాముఖిగా బెట్టింగ్‌లు కాసేవారు. కంప్యూటర్ పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ బెట్టింగ్‌కు తెర తీశారు. పాలకొండ, తోటపల్లి, పార్వతీపురం, విశాఖపట్టణం, బరంపురం తదితర పట్టణాల్లో క్రికెట్ మాఫీయాతో కొంతమందికి సంబంధాలు ఉండడంతో మాయదారి క్రికెట్ బెట్టింగ్‌లు వీరఘట్టంలో గత మూడేళ్ళ నుంచి యథేచ్ఛగా జరుగుతున్నాయి. అయితే ఇంత వరకూ వీరఘట్టంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి క్రికెట్ బెట్టింగ్‌లు బారి నుంచి యువతను రక్షించాలని పలువురు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఎస్సై బి.రామారావు వద్ద సాక్షి ప్రస్తావించగా క్రికెట్ బెట్టింగ్‌లు అంశం ఇంత వరకూ తమ దృష్టికి రాలేదని చెప్పారు. అయినా సరే బెట్టింగ్ రాయుళ్ళపై నిఘా వేసి బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై కే సులు నమోదు చేస్తామన్నారు. క్రికెట్ ఏదైనా బెట్టింగ్ జరగాల్సిందే... ఇండియా ఆడే మ్యాచ్‌లే కాదు... క్రికెట్ ఏ తరహాదైనా బెట్టింగ్‌లు మాత్రం కాల్‌మనీ వ్యవహారం కంటే దారుణంగా జరుగుతున్నాయి. టెస్ట్ మ్యాచ్‌లు, టీ-20, వన్డే, ఐ.పి.ఎల్ మ్యాచ్‌లు అని తేడా లేకుండా బెట్టింగ్ కాస్తున్నారు. ఈ బెట్టింగ్‌లకు అలవాటు పడిన యువత పక్కతోవ పడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులువాడి కుదేలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
వీరఘట్టం: మండల కేంద్రం తెలగవీధిలో వివాహిత గ్రంధి లిల్లీగ్రేస్(24) అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. భర్త, అత్తమామల వేధింపులకు నిండు ప్రాణం బలైందని కొందరు, భర్త, అత్తమామలే హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణలతో వివాహిత మృతి అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక తెలగవీధిలో గత కొన్ని నెలలుగా గ్రంధి రాజు అతని భార్య లిల్లీగ్రేస్, అత్తమామలు అప్పయ్యమ్మ, సూర్యరావు నివాసముంటున్నారు. వీరు విశాఖపట్నం జిల్లా తగరపువలస గ్రామం నుంచి ఇక్కడకు వలస వచ్చి బీరువాలు మరమ్మతులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లిల్లీగ్రేస్ను భర్తతో పాటు అత్తమామలు నిత్యం వేధిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేక శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పాలకొండ డీఎస్పీ సి.హెచ్.ఆదినారాయణ, సీఐ ఎన్.వేణుగోపాలరావు, పోలీసులు సంఘటనా స్థలానికి ఆదివారం ఉదయం చేరుకొని మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. భర్త, అత్తమామల వేధింపులే ఈ చావుకి కారణమని అనుమానిస్తున్నారు. అయితే తన భార్య లిల్లీగ్రేస్ ఇంటిలో వంటగదిలో ఉరిపోసుకొని చనిపోయినట్టు భర్త రాజు పోలీసులకు తెలిపాడు. అనంతరం మృతిరాలి భర్త రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిల్లీగ్రేస్ మృతిపై ఎస్ఐ బి.రామారావు కేసు నమోదు చేశారు. తహశీల్దార్ ఎం.వి.రమణ ఆధ్వర్యంలో పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇది ముమ్మాటికీ హత్యే ఇది ముమ్మాటికీ హత్యే అంటూ మృతురాలి తల్లిదండ్రులు కొయ్యాన యోహన్, అన్నమణి ఆరోపించారు. భర్తతో పాటు అత్తమామలు ఎన్నోసార్లు వేధించారని తన కుమారై లిల్లీగ్రేస్ ఫోన్లో చెప్పేదని, ఇవన్నీ కుటుంబంలో సహజమేనని సర్దిచెప్పేవారుమన్నారు. అయితే ఇంత దారుణానికి ఒడిగడతారని మేము అనుకోలేదని భోరున విలపించారు. తమ కుమారైలాంటి దుస్థితి మరెవరికీ రాకుండా ఉండాలంటే ఆమెను హత్య చేసిన భర్త, అత్తమామలను కఠినంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 2010లో రూ. 5 లక్షల కట్నం, 5 తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేశామన్నారు. తమ కుమారైను బాగా చూసుకుంటారని భావిస్తే చిత్ర హింసలు పెట్టి పైలోకాలకు పంపించారని విలపించారు. తల్లి లేని మా మనవళ్లు అనాథలయ్యారంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. కుమ్మక్కు అవుతున్న పోలీసులు లిల్లీగ్రేస్ను భర్త, అత్తమామలు హత్య చేసి... ఈ ఉదంతాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని, వారికి అనుగుణంగా పోలీసులు కేసు నమోదు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్షుడు గంగరాపు సింహాచలం, జిల్లా ఐద్వా సంఘ ఉపాధ్యక్షురాలు గంగరాపు ఈశ్వరమ్మ, సీపీఎం, పలు ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు వీరఘట్టం పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం ఆందోళన చేశారు. వివాహితను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
కాగితాల్లోనే నిర్బంధం !
వీరఘట్టం : బడిఈడు బాలలందరికీ నిర్బంధ విద్య అందించే లక్ష్యంతో రూపొందించిన విద్యా హక్కు చట్టం జిల్లాలో అమలుకు నోచుకున్న దాఖలాలులేవు. చదువు కావాలని కోరిన ప్రతి పిల్లవాడికి విద్యను హక్కుగా చేసి ఉచితంగా చదువు చెప్పించేలా ప్రతిష్టాత్మకంగా తెచ్చిన చట్టం అమల్లో ప్రభుత్వం ఒకఅడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయి. కేంద్ర పభుత్వం 2010లో దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చిన రైటు టూ ఎడ్యుకేషన్ యాక్ట్ (ఆర్టీఈ-2009) కు బుజు పట్టింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై అటు ప్రభుత్వం, ఇటూ విద్యాశాఖాధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలలను పాఠశాలలకే పరిమతం చేసి, బాలకార్మిక వ్యవస్థను సమూలంగా రూపుమాపే లక్ష్యంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను నిరుపేద, ఆల్పాదాయ వర్గాల పిల్లలతో ఉచితంగా భర్తీ చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టం అమలుకు ముందుకు రాకపోవడంతో విద్యాశాఖాధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే.. విద్యాభివృద్ధి లేనిదే సమాజాభివృద్ధి సాధించలే దని భావించిన కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 27న విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది. ఎనిమిది నెలల తర్వాత 2010 ఏప్రిల్ ఒకటో తేదీన అమల్లోకి తెచ్చింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన,పేద విద్యార్థులకు 25 శాతం రిజ్వరేషన్, ప్రభుత్వం గుర్తింపు లేకుండా పాఠశాలలు కొనసాగరాదనే ప్రధానాంశాలు చట్టంలో పొందుపరిచారు. అయితే వీటిలో ఏ ఒక్కటీ జిల్లాలో సక్రమంగా అమలు కాలేదు. చట్టం వచ్చిన ఐదేళ్ల కాలంలో జిల్లాలోని ఏ ఒక్క కార్పొరేట్ పాఠశాలలోనూ పేద విద్యార్థులతో 25 శాతం సీట్లను ఉచితంగా భర్తీ చేయలేదు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో సైతం అధికారులు విఫలమయ్యారు. పేదలపై ఫీజు భారం విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలుకాకపోవడంతో పేద, ఆల్పాదాయ వర్గాల పిల్లలు అవస్థలు పడతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న వారు వేలాది రూపాయలను ఫీజులుగా చెల్లిస్తున్నారు. చట్టం నిర్దేశించిన విధంగా జరిగితే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వడం ద్వారా పేద వర్గాల పిల్లలతో భర్తీ చేసిన పాఠశాలలకు ఆ మేరకు ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని చట్టంలో పొందుపరిచారు. మరోవైపు చట్టంలో పొందుపర్చిన విధంగా ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవన నిర్మాణాలు చేపట్టి, పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా.. జిల్లాలో ఆ పరిస్థితి లేదు. -
సర్దుకుపోదాం...!
బెల్టు షాపులపై దాడులు జరుగుతాయి... కానీ కేసు నమోదు కాదు. లూజు విక్రయాలు... ఎమ్మార్పీకంటే అధిక మొత్తాలకు విక్రయాలు చేసినట్టు ఫిర్యాదు చేస్తే.. వెంటనే వచ్చివాలుతారు... కానీ చర్యలుండవు. పర్మిట్‌రూమ్‌లను బార్లుగా మార్చేస్తే... వార్నింగ్‌లిస్తారు... కానీ మూయించరు. అయితే గియితే... నెలకో... రెండు నెలలకో ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటారు. ఇదంతా ఎక్సయిజ్ అధికారులు మద్యం వ్యాపారులతో చేసుకున్న లోపాయికారి ఒప్పందమట! వీరఘట్టం/పాలకొండ: జిల్లాలో కొత్త మద్యం పాలసీ ప్రకారం దుకాణాలకు లెసైన్సు పొందిన వ్యాపారులు హుషారుగా ఉన్నారు. అవసరమైనచోట్ల బెల్టుషాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎమ్మార్పీకంటే అధికంగా విక్రయాలు చేస్తున్నారు. అయినా ఎక్సయిజ్ అధికారులు కిమ్మనడంలేదు. ఎందుకంటే లక్ష్యాలు పూర్తవ్వడమే లక్ష్యం. ఒకవేళ చర్యలు తీసుకున్నా తూతూ మంత్రంగా నెలకో కేసు నమోదు చేస్తారంట. జిల్లాలో 202 మద్యం షాపులకు ఇటీవల లెసైన్సులు మంజూరు చేశారు. 23 మండలాల్లో సర్కారు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదే అదనుగా విస్తృతంగా బెల్టుషాపులు ఏర్పాటైపోయాయి. ప్రభుత్వం మారిన తర్వాత బెల్టుషాపులపై నిషేధం విధించింది. దీనివల్ల కొంతమేరకు మద్యం అమ్మకాలకు తెర పడుతుందనుకున్నారు. కాని లక్ష్యాల పేరుతో అధికారులే బెల్టు షాపులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. అర్ధరాత్రి వరకు అమ్మకాలు సాగిస్తున్న వ్యాపారులపై దాడులు చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా... కేసులు మాత్రం నమోదు చేయడం లేదు. నిత్యం నిఘా ఉంచాల్సిన ఎక్సైజ్ శాఖ మాత్రం లక్ష్యాల మాటున ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఎమ్మార్పీ ఉల్లంఘనలపైనా, పర్మిట్రూమ్ల్ని బార్లుగా మార్చేయడంపైనా... వీరు పట్టించుకోవడం లేదు. బడ్డీకొట్లు.... టీస్టాళ్లు... కిరాణా అంగళ్లు మద్యం కేంద్రాలుగా మారినా దాడులు కరువయ్యాయి. ఎందుకిలా...? ఈ ఏడాది కొత్తగా సర్కారు దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రభావం ప్రైవేటు వ్యాపారులపై పడింది. దీంతో అమ్మకాలు కూడా గతేడాది కంటే తక్కువగానే ఉన్నాయి. దీంతో బెల్టుషాపుల ఏర్పాటుకు ప్రైవేటు వ్యాపారులు తెర తీశారు. బెల్టుషాపు కావల్సిన వారికి ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. దాదాపు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. పాలకొండ సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో సుమారు 250 గ్రామాలు ఉన్నాయి. ఇంచుమించు అన్ని గ్రామాల్లోనూ బెల్టుషాపులు కొన్ని బహిరంగంగా... మరికొన్ని గుట్టుగా కొనసాగుతున్నాయి. గతేడాది నెలకు ఒక్కో మండలం నుంచి ఒకటి, రెండు కేసుల చొప్పున ఇప్పటి వరకు 66 కేసులు నమోదు చేసి, 2,128 క్వార్టరు బాటిళ్లను స్వాధీనం చేసుకొని 70 మందిని అరెస్టు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ కేసులు కూడా ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల నమోదు చేసినవేనని తెలుస్తోంది. ఈ సారి బెల్టుషాపులు పెరుగుతున్నా కేసులు నమోదు మాత్రం జరగడంలేదు. అధికారులు వీటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాడులు చేస్తున్నాం ఈ విషయంపై పాలకొండ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారావు వద్ద ప్రస్తావించగా బెల్టుషాపులపై దాడులు నిర్విహ స్తున్నామని, బెల్టుషాపుల వివరాలను తెలియజేస్తే అటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
ఏసీబీ వలలో రెవెన్యూ చేప
సబ్సిడీ పంపుసెట్టు అనుమతి ప్రతిపాదన కోసం లంచం డిమాండ్ రూ.4 వేలు తీసుకుంటూ తహశీల్దార్ కార్యాలయం వద్ద పట్టుబడిన వీఆర్వో ఉలిక్కిపడిన రెవెన్యూ అధికారులు వీరఘట్టం : సబ్సిడీ పంపుసెట్టుకోసం ప్రతిపాదన పంపడానికి లంచం డిమాం డ్ చేసిన ఓ రెవెన్యూ ఉద్యోగి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. వీరఘట్టం మండలంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ రంగరాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మొట్టవెంకటాపురం గ్రామానికి చెందిన బోను రాజారావుతో పాటు మరో ఇద్దరు రైతులు తమ పొలంలో సబ్సిడీపై ప్రభుత్వం అందజేసే పంపుసెట్టుకావాలని మూడు నెలల క్రితం వీరఘట్టం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తుచేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన తహశీల్దార్ ఎం.వి.రమణ వాటికి సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని బిటివాడ, కుమ్మరిగుంట వీఆర్ఓగా పని చేస్తున్న ఎల్.వెంకటరత్నంనాయుడును ఆదేశించారు. పొలాలు పరిశీలించి నివేదికలు ఇవ్వడానికి అర్జీదారులను రూ. 5వేలు లంచం కావాలని డిమాండ్ చేశారు. ఎంతగా బతిమిలాడినా ఆయన ససేమిరా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూ. నాలుగు వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేగాకుండా వీఆర్ఓ ఒత్తిడికి విసిగిపోయిన వారు ఏసీబీ అధికారులను గురువారం ఆశ్రయించారు. పథకం ప్రకారం... అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీఎస్పీ రంగరాజ్ అధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు లక్ష్మోజి, రమేష్‌లు పథకం ప్రకారం వీఆర్ఓ వెంకటరత్నంనాయుడును శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో తహశీల్దార్ కార్యాలయం గేట్ వద్ద రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి వీఆర్ఓను శ్రీకాకుళం తమ వెంట తీసుకు వెళ్లారు.తహశీల్దార్ ఎం.వి.రమణ నుండి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఉలిక్కిపడిన వీరఘట్టం వరుస దాడులతో వీరఘట్టం మండలం ఒక్కసారి శుక్రవారం ఉలిక్కిపడింది. గురువారం చలివేంద్రిలో విజిలెన్స్ అధికారుల దాడులు, తాజాగా వీరఘట్టంలో ఏసీబీ దాడులతో అవినీతి అధికారులతో పాటు అక్రమ వ్యాపారుల్లో దడ మొదలైంది. అవినీతికి ఎవరైనా పాల్పడితే 9440446124 నంబరుకు సమాచారం ఇస్తే అవినీతి పరుల భరతం పడతామని ఏసీబీ డీఎస్పీ రంగరాజ్ ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు. -
మహిళా టీచర్లను వేధిస్తే కటకటాలే..!
వీరఘట్టం: మహిళా టీచర్లను వేధించేవారు ఇక కటకటాలు లెక్కపెట్టాల్సిందే. వేధింపులకు గురిచేసే వారిపై తక్షణ చర్యలు తీసుకొనేలా పాఠశాల విద్యాశాఖ చర్యలకు శ్రీకారం చుట్టింది. డీఈవో కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటుచేసి విచారణ కమిటీ నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా మహిళా టీచర్లను వేధింపులకు గురిచేసినా, వారిని సూటిపోటి మాటలతో అగౌరవ పరిచినా, ఇంకేమైనా ఇబ్బందులకు గురిచేసినా అందుకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకొనే అంశంపై విద్యాశాఖ యంత్రాంగం పట్టించుకునేది కాదు. పోలీసులకు సంబంధించిన వ్యవహారంగా గుర్తించి విస్మరించేది. టీచర్లు నేరుగా పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం మినహా ప్రత్యేకించి విద్యాశాఖలో ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థ ఉండేది కాదు. దీంతో సత్వర విచారణ జరిగేది కాదు. న్యాయం కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా ప్రత్యేక ఫిర్యాదుల విభాగానికి శ్రీకారం చుట్టింది. పలు కోణాల్లో విచారించి చర్యలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు నివేదిస్తుంది. ఈ నివేదికల ఆధారంగా బాధ్యులైన వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒత్తిడి చేస్తే ఇక అంతే... జిల్లాలో సుమారు 5 వేల మంది మహిళా టీచర్లు పని చేస్తున్నారని విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవాలని హెచ్చరించి మహిళా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉదంతాలు లేకపోలేదని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఏ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలనేది ఉపాధ్యాయుల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని, బలవంతంగా సభ్యత్వం తీసుకోవాలని ఒత్తిడి చేస్తే అది వేధింపుల కిందకే వస్తుందని, అలాంటి ఘటనల పైనా ఉపాధ్యాయినులు ఫిర్యాదుల విభాగం దృష్టికి తీసుకురావచ్చునని విద్యాశాఖాధికారులు సూచించారు. మానసిక, శారీరక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. -
ప్రతిపాదనలే.. పనుల్లేవు!
వీరఘట్టం:తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనుల ప్రతిపాదనలను అధికారులు తీరిగ్గా ఇప్పుడు పంపడంతో పనులు ఎప్పటికి జరుగుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్లుగా ఆయకట్టు రైతులు ఆధునికీకరణ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో రూ.139 కోట్లతో ప్రతిపాదించిన తోటపల్లి కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులకు పాలకొండ మండలం నవగాం వద్ద అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా మూడేళ్ల కిందట రూ.7 కోట్లతో పనులు ప్రారంభించారు. అలాగే ఓనిగెడ్డ వద్ద రూ.7 కోట్లతో చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టారు. మిగిలిన రూ.124 కోట్లతో ఇప్పుడు ప్రతిపాదనలు రూపొందించి ఫైలును రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి పంపించినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. కాగితాలకే పరిమితం ఆధునికీకరణ పనులకు గతంలో ఆమోదించిన ప్రతిపాదనలే కార్యరూపం దాల్చలేదు. వాటిని పట్టించుకోకుండా అధికారులు కొత్త ప్రతిపాదనలు సిధ్ధం చేశారు. ఎప్పటికప్పుడు చేస్తున్న ప్రతిపాదనలు కాగితాలకు పరిమితమవుతున్నాయే తప్ప పనులు జరగడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత నాలుగేళ్లుగా కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరు నామమాత్రంగా అందుతోంది. ఆధునీకరణ ప్రక్రియ తెరపైకి రావడంతో కాలువల నిర్వహణను, చిన్న చిన్న మరమ్మతులను సైతం అధికారులు గాలికొదిలేశారు. దీంతో కాలువల పరిస్థితి దయనీయంగా మారింది. తుప్పలు, పూడికలతో నీరు చివరి ప్రాంతానికి చేరడం గగనమవుతోంది. 32 కి లోమీటర్ల పొడవున్న ఎడమ కాలువ, 20 కిలోమీటర్ల పొడవున్న కుడి కాలువలో రెండు అడుగుల మేర పూడిక పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపాదనలు పంపితే పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు.. ఖరీఫ్‌కు ఎలా నీరి స్తారని రైతులు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు. -
లెక్కల ‘పంచాయితీ’
వీరఘట్టం: గ్రామ పంచాయతీల జమాఖర్చుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం(2013-14) జమాఖర్చుల నమోదే ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలోని 1099 పంచాయతీల్లో ఇప్పటి వరకు 412 గ్రామాల వివరాలు మాత్రమే నమోదయ్యాయని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ప్రత్యేక ఏజెన్సీ సాంకేతిక పరిజ్ఞానం అందించినప్పటికీ పంచాయతీరాజ్ సిబ్బంది నిరాసక్తత కారణంగా ఈ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది. స్థానిక సంస్థలకు మంజూరు చేస్తున్న నిధులు వినియోగం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ విధానం అమలుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంటింగ్, సాప్ట్వేర్ సిస్టమ్(ప్రియా సాప్ట్వేర్ సిస్టమ్) రూపొందించారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించే బాధ్యతను కార్వీ సంస్థకు అప్పగించారు. ఈ సాఫ్ట్వేర్ వినియోగంపై గ్రామపంచాయతీ కార్యదర్శులకు సామర్లకోటలో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. మొదట్లో సొంతంగా కంప్యూటర్లు అందుబాటులో లేనందున వివరాలు నమోదు చేయడానికి ప్రైవేటు నెట్ సర్వీసులను వినియోగించేందుకు అనుమతి ఇచ్చారు. ఇందుకు అయ్యే ఖర్చులను పంచాయతీ నిధుల నుంచి తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత అన్ని మండల కేంద్రాల్లో రెండేసి కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఇద్దరు ఆపరేటర్లను నియమించారు. వారానికోసారైనా ఆ మండలంలోని పంచాయతీల జమాఖర్చులు నమోదు చేయించాలని ఆదేశించారు. తర్వాత ప్రతి పంచాయతీకి ఒక ఆపరేటర్‌ను నియమించారు. అయినా పరిస్థితి మారలేదు. జిల్లాలో అన్ని పంచాయతీల్లోనూ కంప్యూటర్లు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. పూర్తిస్థాయి సమాచారం ఆన్లైన్లో పొందిపరిస్తే ఢిల్లీలోని ఉన్నతాధికారులతో పాటు సదరు పంచాయతీ ప్రజలు కూడా ఆ వివరాలు తెలుసుకొనేందుకు వీలవుతుంది. తద్వారా నిధుల వినియోగంలో పారదర్శకత ఉంటుంది. మళ్లీ నిధుల విడుదలకు మార్గం సుగమమవుతుంది. 40 శాతమే పూర్తి అయితే పంచాయతీ సిబ్బంది మాత్రం దీనిపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో 1099 పంచాయతీలు ఉండగా కేవలం 40 శాతం.. అంటే 412 పంచాయతీలు మాత్రమే గత ఆర్థిక సంవత్సరం జమా ఖర్చుల వివరాలు నమోదు చేశాయి. మండలాల వారీగా పరిశీలిస్తే ఏ మండలంలోనూ నూరు శాతం నమోదు పూర్తి కాలేదు. గత ఏడాది లెక్కల నమోదు పూర్తి అయితేనే ఈ ఆర్థిక సంవత్సరం వివరాల నమోదుకు అనుమతిస్తారు. వెంటనే పూర్తి చేయాలని ఆదేశించాం జమాఖర్చుల నమోదుపై జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి బి.ఎం.సెల్వియాను వివరణ కోరగా పంచాయతీ లెక్కల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కార్యదర్శులను గతంలోనే ఆదేశించామన్నారు. ఈ విషయంలో వెనుకబడిన మాట వాస్తవమేనని, మళ్లీ మరోసారి సమావేశం నిర్వహించి పెండింగ్ వివరాలు వెంటనే నమోదు చేయాలని ఆదేశిస్తామని చెప్పారు. -
సీఎస్పీలకు మంగళం
వీరఘట్టం:ఇంతకాలం గ్రామాల్లో సంక్షేమ పింఛన్ల పంపిణీ బాధ్యతను నిర్వర్తిస్తున్న కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్(సీఎస్పీ) వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడేసింది. ఈ బాధ్యతలను డిసెంబర్ నుంచి అంటే సోమవారం నుంచి పోస్టల్ విభాగానికి అప్పగించడంతో జిల్లాలో సుమారు 400 మంది సీఎస్పీలు రోడ్డున పడ్డారు. గత ఎనిమిది నెలలుగా వీరితో పని చేయించుకున్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్కపైసా అయినా చెల్లించకుండానే ఉద్యోగాల నుంచి తొల గించింది. వీరి నుంచి పింఛన్ల పంపిణీ యంత్రాలను ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాబు వస్తే.. జాబొస్తుందన్న నినాదంతో ఎన్నికల్లో ఓట్లు పొంది గద్దెనెక్కిన టీడీపీ సర్కారు కొత్త ఉద్యోగాల సంగతి అటుంచితే.. ఉన్న ఉద్యోగులను ఇళ్లకు పంపడమే పనిగా పెట్టుకుందన్న విమర్శలు రేగుతున్నాయి. సీఎస్పీలే దీనికి తాజా ఉదాహరణ. ప్రభుత్వం మంజూరు చేస్తున్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లకు ప్రతి నెలా ఆయా లబ్ధిదారులకు అందజేయడంతోపాటు ఉపాధి హామీ పనులు చేసిన వారికి వేతనాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపు బాధ్యతలను ఎనిమిది నెలల క్రితం సీఎస్పీలకు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు ప్రతిఫలంగా వారు పంపిణీ చేసిన మొత్తంలో ఒక శాతం కమీషన్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు జిల్లా 400 మంది సీఎస్పీలను నియమించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వారు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంతవరకు ఏ ఒక్కరికీ పైసా అయినా కమీషన్ చెల్లించలేదు. కాగా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొత్తం సీఎస్పీల వ్యవస్థనే తొలగించాలని నిర్ణయించింది. పింఛన్ల పంపిణీ బాధ్యతను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ డాక్ వర్కర్స్కు అప్పగించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ కావడంతో జిల్లా అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై సీఎస్పీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది నెలలుగా కమీషన్ ఇవ్వకపోయినా, ఈ ఉద్యోగాన్నే నమ్ముకున్న తమను ప్రభుత్వం ఉన్న పళంగా తొలగించి నట్టేట ముంచిందని ఆవేదన చెందుతున్నారు. దీనిపై డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ తనూజరాణితో ప్రస్తావించగా వాస్తవమేనని ధ్రువీకరించారు. సీఎస్పీలను తొలగించి పోస్టల్ డాక్ వర్కర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. క్రితం సీఎస్పీలకు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు ప్రతిఫలంగా వారు పంపిణీ చేసిన మొత్తంలో ఒక శాతం కమీషన్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు జిల్లా 400 మంది సీఎస్పీలను నియమించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వారు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంతవరకు ఏ ఒక్కరికీ పైసా అయినా కమీషన్ చెల్లించలేదు. కాగా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొత్తం సీఎస్పీల వ్యవస్థనే తొలగించాలని నిర్ణయించింది. పింఛన్ల పంపిణీ బాధ్యతను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ డాక్ వర్కర్స్కు అప్పగించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ కావడంతో జిల్లా అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై సీఎస్పీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది నెలలుగా కమీషన్ ఇవ్వకపోయినా, ఈ ఉద్యోగాన్నే నమ్ముకున్న తమను ప్రభుత్వం ఉన్న పళంగా తొలగించి నట్టేట ముంచిందని ఆవేదన చెందుతున్నారు. దీనిపై డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ తనూజరాణితో ప్రస్తావించగా వాస్తవమేనని ధ్రువీకరించారు. సీఎస్పీలను తొలగించి పోస్టల్ డాక్ వర్కర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎలా బతికేది ఉద్యోగం నుంచి ఆకస్మికంగా తొలగిస్తే ఎలా బతికేది. యంత్రాల్లో సాఫ్ట్వేర్ లోడ్ చేస్తామని చెప్పి తీరా ఇప్పుడు మమ్మల్ని తీసేశామని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మా పరిస్ధితి ఏంటి.. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. - పూతి కుమారి, సి.ఎస్.పి, వీరఘట్టం 8 నెలలుగా పని చేస్తున్నాం ఏప్రిల్ నుంచి పని చేస్తున్నాం. ఇంతవరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అర్ధాంతరంగా ఉద్యోగాలు ఊడగొట్టారు. ఇదే ఆధారంగా పని చేస్తున్నాం. మా గతేం కావాలి. - దాసరి పుణ్యవతి, సి.ఎస్.పి, వీరఘట్టం -
నాగావళి పరవళ్లు
వీరఘట్టం, గరుగుబిల్లి: వరద నీటితో నాగావళి నది పోటెత్తుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఎగువన ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు దిగువనున్న తోటపల్లి బ్యారేజీకి చేరుతోంది. నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో తోటపల్లి ప్రాజెక్టు అధికారులు నదిలోకి నీటిని విడిచిపెడుతున్నారు. ఆదివారం రాత్రి సమయానికి ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేసి 37 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఉదయం వరకు బ్యారేజీ వద్ద నాగావళి నదిలో 5050 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా.. మధ్యాహ్నం ఒంటిగంటకు 28 వేల క్యూసెక్కులకు, సాయంత్రం ఆరు గంటలకు 42 క్యూసెక్కులకు పెరిగింది. బ్యారేజీ గరిష్ట నీటిమట్టం 105 మీటర్లు కాగా సాయంత్రానికి 102 మీటర్లకు, రాత్రికి 102.7 మీటర్లకు పెరిగింది. నీటి ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు దిగువకు వదిలే నీటి పరిమాణాన్ని కూడా క్రమంగా పెంచుతున్నారు. మధ్యాహ్నం బ్యారేజీ నుంచి 35వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంత్రం 37వేల క్యూసెక్కులకు, రాత్రి 40,752 క్యూసెక్కులకు పెంచారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఏఈ శివశంకర్, తదితరులు పర్యవేక్షిస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీఆర్ఓలకు సూచించారు. పాలకొండ మండల వాసులకు ముంపు భయం ! పాలకొండ: తోటపల్లి గేట్లు ఎత్తివేతతో పాలకొండ మండలం చినమంగళాపురం, గొట్టమంగళాపురం, ఎరకరాయపురం,గోపాలపురం,అంపిలి,అన్నవరంతో పాటు బూర్జ మండలం ఏటి ఒడ్డు పర్తా, అల్లిన,కిలంతర,లక్కుపురం,జిబిపురం,అగ్రహారం,కాఖండ్యాం,లాభాం,గుత్తావల్లి,నారాయణపురం గ్రామాలకు ముంపు ప్రమాదం ఉండడంతో ఆయా గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే పాలకొండ మండలం అన్నవరం, బూర్జ మండలం, కాఖండ్యాం వద్ద నిర్మించిన కరకట్లు పూర్తిగా కరిగిపోవడం వల్ల గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ కష్టాలు!
వీరఘట్టం, న్యూస్‌లైన్ :వ్యవసాయ విద్యుత్ సరఫరాలో పంపిణీ నష్టాలను నివారించి అన్నదాతకు మేలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం హైవోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(హెచ్‌వీడీఎస్) పథకాన్ని రూపొం దించింది. ప్రస్తుతం ఉన్న పెద్ద ట్రాన్స్ఫార్మర్ల వల్ల పంపిణీ నష్టాలు పెరుగుతున్నాయి. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 20 నుంచి 30 వరకు వ్యవసాయ బోర్లు ఉంటున్నాయి. దీంతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పెరిగి లోవోల్టే జీ సమస్య ఏర్పడుతోంది. ఫలితంగా వ్యవసాయ పంపుసెట్ల మోటార్లు తర చూ కాలిపోతున్నాయి. అందుకే పెద్ద ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హెచ్‌వీడీఎస్ పథకాన్ని రూపొందిం చారు. దీనికింద 3 నుంచి 5 వ్యవసాయ కనెక్షన్లకు ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ చొప్పున ఏర్పాటు చేస్తారు. దీనివల్ల పంపిణీ నష్టాలు తగ్గుతాయి. లోవోల్టేజీ సమస్య తీరిపోతుంది. వ్యవసాయ పంపు సెట్లు కాలిపోవడం చాలావరకు తగ్గిపోతుంది. జిల్లాలో ఈ పథకానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. హైదరాబాద్‌కు చెందిన జీవీఎస్ సంస్థకు రూ.38 కోట్లతో టెండరును కట్టబెట్టింది. దీంతో సమస్య తీరుతుంద ని రైతులు ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. చేతులేత్తేసిన కాంట్రాక్ట్ సంస్థ రూ.38 కోట్ల భారీ టెండరు దక్కించుకున్న జీవీఎస్ సంస్థ హెచ్‌వీడీఎస్ అమలులోపూర్తిగా చేతులెత్తేసింది. టెండర్ నిబం ధనల ప్రకారం 2013జూలైనాటికి జిల్లాలో ఉన్న 25,565 వ్యవ సాయ పంపుసెట్లను హెచ్‌వీడీఎస్ కిందకు తీసుకురావాలి. నిర్దేశిత గడువు ముగిసి ఆరునెలలు దాటింది. కానీ జిల్లాలో 20 శాతం పనులు కూడా పూర్తికాలేదు. తొలుత రణస్థలం, లావే రు, ఎచ్చెర్లమండలాల్లో పనులు ప్రారంభించి 2013 జులై నాటి కి జిల్లా అంతటా పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ జిల్లా అం తటా దేవుడెరుగు.. కనీసం లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో కూడా పనులు పూర్తి చేయలేదు. లావేరు మండలంలో 350 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 150 ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే అమర్చారు. మెట్టవలస, బుడుమూరు, రొంపివలస, లక్ష్మీపురం, రేగపాలెం, బుడతవలస గ్రామాల్లో అరకొర పనులతో సరిపెట్టారు. రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. పట్టించుకోని అధికారులు అన్నదాతకు ఎంతో మేలు చేసే హెచ్‌వీడీఎస్ పథకాన్ని సకాలంలో పూర్తిచేయాలన్న ఉద్దేశం కాంట్రాక్టు సంస్థకు ఉన్నట్లు కనిపించడం లేదు. పనులు 20 శాతం కూడా పూర్తికాకపోయినా ఈస్ట్రన్ డిస్కం అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ సంస్థను మందలించి పనులు చేయించాలన్న ధ్యాస కూడా వారికి లేకుండాపోయింది. తప్పనిసరైతే కాంట్రాక్టు రద్దు చేసి మరో సంస్థకు అప్పగించవచ్చు. కానీ అధికారులు ఆ దిశగా కూడా ప్రయత్నించడం లేదు. కమీషన్లు దండుకోవడానికే వారు కాంట్రాక్టు సంస్థకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాతకు తప్పని వెతలు హెచ్‌వీడీఎస్ పథకం అమలుకాకపోవటంతో అన్నదాతలకు విద్యుత్ కష్టాలు కొనసాగుతున్నాయి. వేసవి వస్తుండటంతో విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం 4 గంటలు కూడా ఇవ్వడం లేదు. విద్యుత్ సరఫరా ఉన్న సమయంలో లోవోల్టేజీ సమస్య వేధిస్తోంది. ట్రాన్స్ఫార్మర్లకు శివారులో ఉన్న పంపుసెట్లకు సమస్య మరింత ఎక్కువగా ఉంది. లోడు పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. రైతుల పంపుసెట్ల మోటార్లు కూడా కాలిపోతున్నాయి. దీంతో మరమ్మతుల ఖర్చు అన్నదాతకు అదనపు భారమవుతోంది. ఒక్క పాలకొండ డివిజన్‌లోనే గడచిన నెల రోజుల్లో 200కుపైగా మోటార్లు కాలిపోయాయి. మరోవైపు కాలిపోయిన పెద్ద ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు రైతులే చందాలు వేసుకుని పాలకొండ తీసుకువెళ్లాల్సి వస్తోంది. చిన్నచిన్న ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తే ఈ కష్టాలన్నీ తీరుతాయి. కానీ పథకాన్ని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి అటు కాంట్రాక్టు సంస్థకు, ఇటు అధికారులకు లేకుండాపోయింది. దీంతో నిధులున్నా పనులు పూర్తికాక అన్నదాతలు కుంగిపోతున్నారు.