వీరఘట్టం: మహిళా టీచర్లను వేధించేవారు ఇక కటకటాలు లెక్కపెట్టాల్సిందే. వేధింపులకు గురిచేసే వారిపై తక్షణ చర్యలు తీసుకొనేలా పాఠశాల విద్యాశాఖ చర్యలకు శ్రీకారం చుట్టింది. డీఈవో కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటుచేసి విచారణ కమిటీ నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా మహిళా టీచర్లను వేధింపులకు గురిచేసినా, వారిని సూటిపోటి మాటలతో అగౌరవ పరిచినా, ఇంకేమైనా ఇబ్బందులకు గురిచేసినా అందుకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకొనే అంశంపై విద్యాశాఖ యంత్రాంగం పట్టించుకునేది కాదు.
పోలీసులకు సంబంధించిన వ్యవహారంగా గుర్తించి విస్మరించేది. టీచర్లు నేరుగా పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం మినహా ప్రత్యేకించి విద్యాశాఖలో ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థ ఉండేది కాదు. దీంతో సత్వర విచారణ జరిగేది కాదు. న్యాయం కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా ప్రత్యేక ఫిర్యాదుల విభాగానికి శ్రీకారం చుట్టింది. పలు కోణాల్లో విచారించి చర్యలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు నివేదిస్తుంది. ఈ నివేదికల ఆధారంగా బాధ్యులైన వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఒత్తిడి చేస్తే ఇక అంతే...
జిల్లాలో సుమారు 5 వేల మంది మహిళా టీచర్లు పని చేస్తున్నారని విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవాలని హెచ్చరించి మహిళా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉదంతాలు లేకపోలేదని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఏ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలనేది ఉపాధ్యాయుల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని, బలవంతంగా సభ్యత్వం తీసుకోవాలని ఒత్తిడి చేస్తే అది వేధింపుల కిందకే వస్తుందని, అలాంటి ఘటనల పైనా ఉపాధ్యాయినులు ఫిర్యాదుల విభాగం దృష్టికి తీసుకురావచ్చునని విద్యాశాఖాధికారులు సూచించారు. మానసిక, శారీరక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
మహిళా టీచర్లను వేధిస్తే కటకటాలే..!
Published Sat, May 23 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
Advertisement
Advertisement