కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఇటీవల 73ఏళ్ల రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలు జీవిత భాగస్వామి కోసం ‘వరుడు కావలెను’ అని పెళ్లి ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన స్థానికంగానూ, సామాజిక మాధ్యమంలోనూ విపరీతంగా చర్చకు దారితీసింది. చాలామంది ఆమె ధైర్యానికి, పాజిటివ్ ఆలోచనను మెచ్చుకోగా, మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినవారూ ఉన్నారు. ఇంకొందరు ఈ బామ్మ ట్రెండ్‌సెటర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరు, వయసేంటో మర్చిపోయావా బామ్మా అని ఇంకొకరు.. ఇలా తలా ఒక మాట అన్నవారూ ఉన్నారు. ఈ ప్రకటన వెనుక ఉన్న అంతర్లీన సమస్యపై మాత్రం ఎవరూ అంతగా దృష్టిపెట్టలేదు.
ఒంటరి జీవితం..
ప్రకటనలో ఆమె ..‘సంప్రదాయ కుటుంబం, ఆరోగ్యంగా ఉన్న 70 ఏళ్ల పైబడిన వ్యక్తితో జీవితం పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాన’ని తెలిపింది. ఆమె తన గురించి తెలియజేస్తూ– ‘నాకు నా సొంత కుటుంబం లేదు. నా తల్లిదండ్రులు చనిపోయారు. నా మొదటి వివాహం, విడాకులు బాధాకరమైనవి కావడంతో ఇన్నేళ్లుగా తిరిగి వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఒంటరి జీవితం నన్ను భయపెడుతోంది. ఎవరి సాయం లేకుండా బస్‌స్టాప్ నుండి ఇంటికి, ఇంటి నుండి బయటకు నడవడానికి, ఇంట్లో ఒంటరిగా ఉండటానికి కూడా భయపడుతున్నాను. అందుకే జీవితభాగస్వామి కోసం చూస్తున్నాన’ని తెలిపింది.
మూసధోరణులు విచ్ఛిన్నం
వివాహం, జీవిత భాగస్వామి అనే విషయాలు ఇంకా మన వ్యవస్థలో సంప్రదాయక కోణం నుంచే ఆలోచిస్తున్నారు. కానీ, ఒంటరి జీవితానికి ఏ వయసులోనైనా తోడు అవసరం అనే విషయం అంతగా పట్టించుకోరు. అందుకే, ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ అయ్యింది. అయితే, యువత నుంచి మాత్రం ఆమె నిర్ణయం సమాజంలో సాంస్కృతిక మూసలను విచ్ఛిన్నం చేస్తుందని విపరీతంగా ప్రశంసలు అందుకుంది. సామాజిక కార్యకర్తలు ఈ విషయం పట్ల స్పందిస్తూ ‘మహిళలు అనేకాదు మగవారు కూడా ఒంటరితనం పట్ల భయపడుతుంటారు. అయితే, భాగస్వామి కోసం ఎంచుకునే స్వతంత్రం మగవారికే అధికంగా ఉంటుంది. దీనినే ఇప్పటివరకు సమాజం ఆమోదిస్తూ వచ్చింది. ఇలాంటి ధోరణికి ఈ ప్రకటన ఓ సమాధానం అవుతుంది’ అన్నారు.
మారుతున్న పరిస్థితులకు అద్దం
‘సమాజంలో వృద్ధుల పరిస్థితి ఎలా ఉందో ఈ పరిస్థితి కళ్లకు కడుతుంది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం కూడా మానసిక సమస్యలు పెరగడానికి కారణం అవుతున్నాయని’ మానసిక నిపుణులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఒంటరిగా ఉండే వాళ్లు తోడు కోరుకుంటారు. అయితే, ఆమె సంప్రదాయ కోణంలో జీవితాంతం ఉండే తోడు అవసరం గురించి ఆలోచించి ఆ ప్రకటన ఇచ్చింది. చాలాకాలంగా మూస పితృస్వామ్య ఆలోచనకు, యవ్వనంగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంటారనే ఆలోచనలకు ఈ ప్రకటన ఒక అడ్డంకిని తొలగిస్తుంది. ఇంజనీర్‌గా పదవీ విరమణ చేసిన 69 ఏళ్ల వ్యక్తి నుంచి ఆమెకు తోడుగా ఉంటాననే స్పందన రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment