Women teachers
-
‘హనీట్రాప్’తో లీక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించాల్సిన ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్’ పరీక్ష పేపర్ లీకేజీ వెనుక హనీట్రాప్ ఉన్నట్టు బయటపడింది. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ తనకు సన్నిహితంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ప్రోద్బలంతో ప్రశ్నపత్రాన్ని బయటికి తెచ్చినట్టు తేలింది. ఆ టీచర్ కోరిక మేరకే ప్రవీణ్ ప్రశ్నపత్రాన్ని తీసుకురాగా.. సదరు టీచర్ మాత్రం ఓ దళారీ సాయంతో ముగ్గురు అభ్యర్థులకు పేపర్‌ను విక్రయించినట్టు వెల్లడైంది. ఈ క్రమంలోనే పేపర్ లీకేజ్ విషయం బహిర్గతమైంది. దీనిపై టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్’ పోస్టులకు ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా.. దీనిని టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. సోదరుడి కోసమంటూ అడిగి హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేణుకకు కొన్నాళ్లుగా ప్రవీణ్‌కుమార్‌తో పరిచయం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీఎస్పీఎస్సీ పరీక్షలకు రేణుక సోదరుడు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష రాయాల్సి ఉంది. పోటీ ఎక్కువగా ఉండటంతో తన సోదరుడిని ఎలాగైనా గట్టెక్కించాలని భావించిన రేణుక తన భర్తతో కలిసి ప్రవీణ్‌ను సంప్రదించింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కావాలని కోరింది. అప్పటికే ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ప్రవీణ్ వెంటనే అంగీకరించాడు. టీఎస్పీఎస్సీలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌తో కలిసి పేపర్ తస్కరణకు పథకం వేశాడు. ఈ పేపర్లు కమిషన్‌కు చెందిన సెక్షన్ ఆఫీసర్ శంకరమ్మ ఆధీనంలో, ఆమె కంప్యూటర్లోనే ఉంటాయి. ఈ విషయం తెలిసిన ప్రవీణ్, రాజశేఖర్ ఆ కంప్యూటర్‌పై నిఘా పెట్టారు. 28న తస్కరణ.. 2న కాల్చివేత.. ప్రవీణ్, రాజశేఖర్ పలుమార్లు శంకరమ్మకు చెందిన కంప్యూటర్ను పరిశీలించారు. సరైన లాక్, ఫైర్‌వాల్స్ లేవని నిర్థారించుకుని.. గత నెల 28న రంగంలోకి దిగారు. కార్యాలయం నుంచి అంతా వెళ్లిపోయేదాకా వేచిచూసిన ఈ ఇద్దరూ.. మెల్లగా ఆ పేపర్‌ను ఓ పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రాజశేఖర్ కంప్యూటర్ నుంచి ప్రింట్ ఔట్ తీసుకున్నారు. ప్రవీణ్ ఈ ప్రశ్నపత్రాన్ని తీసుకువెళ్లి రేణుక, ఆమె భర్తకు అప్పగించాడు. కేవలం రేణుక సోదరుడు చదువుకోవడానికే వినియోగించాలని, మరునాడే తిరిగి ఇచ్చేయాలని చెప్పాడు. దీనికి అంగీకరించిన రేణుక, ఆమె భర్త ఆ పేపర్ తీసుకువెళ్లారు. అయితే రేణుక పేపర్‌ను సోదరుడికి ఇవ్వడంతోపాటు జిరాక్సు తీసి పెట్టుకుంది. తమ స్వగ్రామం సర్పంచ్ కుమారుడితో తన వద్ద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉంటే విక్రయిస్తానని చెప్పింది. సర్పంచ్ కుమారుడు తనకు తెలిసిన ముగ్గురు అభ్యర్థులను ఏర్పాటు చేశాడు. వారికి రూ.14 లక్షలకు పేపర్‌ను విక్రయించిన రేణుక రూ.4 లక్షలు తాను తీసుకుని, రూ.10 లక్షలను ప్రవీణ్‌కు ఇచ్చింది. అతడు ఇచ్చిన పేపర్‌ను ఈ నెల 2న తిరిగి ఇచ్చేసింది. ఓ అభ్యర్థి రూమ్మేట్కు తెలియడంతో.. రేణుక పరీక్ష ప్రశ్నపత్రాన్ని విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రవీణ్.. తనకు తిరిగిచ్చిన పేపర్‌ను సైదాబాద్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లి కాల్చేశాడు. అయితే ప్రశ్నపత్రం కొన్న అభ్యర్థుల్లో ఒకరు హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. అతడి రూమ్మేట్ సైతం కొన్నాళ్లుగా టీఎస్పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం రాత్రి మాటల సందర్భంలో సదరు అభ్యర్థి పేపర్ లీకేజీని రూమ్మేట్కు చెప్పాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకవడంపై కంగుతిన్న రూమ్మేట్ ఇతర స్నేహితులతో కలిసి శనివారం టీఎస్పీఎస్సీ వద్దకు వెళ్లి ఆరా తీశాడు. అక్కడి నుంచే ‘డయల్–100’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చిన పోలీసులు.. ఈ విషయం ఆరా తీసి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు టీఎస్పీఎస్సీ సెక్రటరీ దృష్టికి విషయం తీసుకువెళ్లడంతోపాటు పరిశీలన జరపగా పేపర్ లీకేజీపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పేపర్ సైతం లీక్? టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీపై బేగంబజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి.. ప్రవీణ్, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో రేణుకతోపాటు ఇతరుల పాత్ర బయటికి వచ్చింది. పోలీసులు మొత్తం 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో చేతులు మారిన రూ.14 లక్షలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితులను బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. వీరిని విచారిస్తున్న నేపథ్యంలోనే.. గత వారం టీఎస్పీఎస్సీ నిర్వహించిన ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పరీక్ష పేపర్లు కూడా లీక్ అయ్యాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులను సోమవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. పేపర్ లీకేజీ అంశంపై టీఎస్పీఎస్సీ అధికారులు కూడా అంతర్గత విచారణ ప్రారంభించారు. -
కేరళలో ముదురుతున్న ‘చీరకట్టు’ వివాదం..
తిరువనంతపురం: మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు స్పందించారు. టీచర్లు తప్పనిసరిగా చీరలు ధరించాలనే పద్ధతి.. కేరళ ప్రగతిశీల వైఖరికి ఏమాత్రం అనుకూలంగా లేదని పేర్కొన్నారు. కేరళలోని అనేక విద్యా సంస్థలు తప్పనిసరిగా చీర ధరించాల్సిందేననే పద్దతిని కొనసాగిస్తున్నాయని పలువురు మహిళా ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఉన్నత విద్యాశాఖ శుక్రవారం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ‘‘ఎలాంటి దుస్తులు ధరించాలనేది మా వ్యక్తిగత అభిప్రాయం. ఈ విషయంలో మీ జోక్యం ఏంటంటూ’’ బిందు విద్యాసంస్థల యాజమాన్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక తాను మినిస్టర్‌ని మాత్రమే కాక కేరళ వర్మ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నానని తెలిపారు. కాలేజీకి చుడిదార్లు వేసుకెళ్తాను అన్నారు. (చదవండి: చీర కట్టును ప్రపంచానికి చుట్టింది) ఈ సందర్భంగా బిందు మాట్లాడుతూ.. "ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు తన వైఖరిని స్పష్టం చేసింది. కేరళలో ఉపాధ్యాయులు ఎలాంటి సంస్థలలో పనిచేసినా సరే.. వారి సౌకర్యానికి తగ్గట్టుగా దుస్తులు ధరించే హక్కు ఉంది. మహిళా ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా చీరలు ధరించాల్సిందే అనే ఈ పద్ధతి కేరళ ప్రగతిశీల వైఖరికి అనుకూలం కాదు’’ అన్నారు. "ఒక టీచర్‌కు అనేక బాధ్యతలు ఉంటాయి. అయితే ఇటువంటి పాత, వాడుకలో లేని ఆలోచనలకు కట్టుబడి ఉండటం ఆ బాధ్యతలలో ఒకటి కాదు. ఒకరి దుస్తుల ఎంపిక పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. మరొకరి దుస్తుల ఎంపికను విమర్శించే, జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు" అని బిందు స్పష్టం చేశారు. (చదవండి: ‘మిమ్మల్ని చీరలో చూస్తే.. కన్నీళ్లు ఆగవు’) దీనిపై మినిస్టర్ మరింత స్పష్టత ఇస్తూ మే 9, 2014న ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసిందని తెలిపారు. అయినప్పటికి , రాష్ట్రంలోని అనేక సంస్థలు ఇలాంటి పద్ధతులను కొనసాగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అందుకే మరోసారి ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. చదవండి: చీర కట్టుకొని వస్తే ఎలా? రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు అవమానం -
తమిళనాడు గర్ల్స్ హైస్కూల్స్‌లో...మహిళా టీచర్లే మేలా!
తమిళనాడు ఇప్పుడు టీచర్ల లైంగిక వేధింపులతో ఉడుకుతోంది. వరుసబెట్టి టీచర్ల లైంగిక దుశ్చర్యలను విద్యార్థినులు బయటపెడుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇకపై గర్ల్స్ హైస్కూల్స్‌లో అందరూ మహిళా టీచర్లనే నియమించే ఆలోచన చేస్తోంది. అయితే అది సరైన నిర్ణయమేనా అని చర్చ జరుగుతోంది. చేసిన పాపం ఊరికే పోదని పెద్దలు అంటారు. విద్యార్థినుల అమాయకత్వాన్ని, నిస్సహాయతను, బెదురును, భయాన్ని ఆసరాగా చేసుకుని వారిపై లైంగిక దుశ్చర్యలకు పాల్పడిన టీచర్లను ఇప్పుడా పాపం వెంటాడుతోంది. తమిళనాడులో ఇప్పటికి నలుగురు టీచర్లు అరెస్ట్ అయ్యారు. అయితే వీరిలో ఇద్దరు ఆ పాఠశాలల పూర్వవిద్యార్థుల ఫిర్యాదుల వల్ల కావడం గమనించాల్సిన విషయం. బ్యాచెస్ వెళ్లిపోయాయి... మనం బాధించిన విద్యార్థినులు ఇప్పుడు లేరు... మన పబ్బం గడిచిపోయింది అని కీచకచర్యలకు పాల్పడిన టీచర్లు ఎవరైనా అనుకుంటూ ఉంటే వారు ఇకపై మనశ్శాంతిగా ఉండే వీలులేదని, ఏ క్షణమైనా వారిపై పూర్వవిద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చని, వాటిపై వెంటనే చర్యలు ఉంటాయని తమిళనాడులో జరుగుతున్న ఉదంతాలు నిరూపిస్తున్నాయి. మూడు వారాల క్రితం మొదలు మూడు వారాల క్రితం చెన్నైలోని ప్రతిష్టాత్మక పద్మ శేషాద్రి బాలభవన్ స్కూల్ విద్యార్థినులు ఆ స్కూల్లో పని చేసే కామర్స్ టీచర్ రాజగోపాలన్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు. స్కూల్లో చదువుతున్న విద్యార్థినులతో పాటు చదివి బయటకు వెళ్లిన విద్యార్థినులు కలిసి సోషల్ మీడియాలో నేరుగా రాజగోపాలన్‌పై పోస్ట్ పెట్టడంతో దుమారం రేగింది. వెంటనే తమిళ సెలబ్రిటీలు చాలామంది విద్యార్థినుల రక్షణ గురించి, వాళ్లకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడటం మొదలెట్టారు. రాజగోపాలన్ తన ఆన్లైన్ క్లాసుల్లో కేవలం టవల్ కట్టుకుని హాజరవడం, వాట్సప్‌లో తప్పుడుగా వ్యవహరించడం ఇవన్నీ విద్యార్థినులు పెద్దలకు పోలీసులకు తెలియచేశారు. ఈ సంఘటనకు వచ్చిన మద్దతు చూశాక మెల్లగా ఇతర స్కూళ్లలో ఇలాంటి టీచర్ల వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థినులు బయటకు వచ్చి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. వీటి ఫలితంగా మరో కామర్స్ టీచర్, ఒక పి.టి టీచర్, ఒక కేంద్రీయ విద్యాలయ టీచర్ అరెస్ట్ అయ్యారు. కేంద్రీయ విద్యాలయ టీచర్‌పై ఏకంగా 22 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. కీచక ఆలోచనలు కీచక టీచర్లు విద్యార్థినులను వేధించడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. స్కూల్ టైమ్ కంటే ముందు రమ్మని విద్యార్థినులను కోరడం, తల్లిదండ్రులు లేని సమయంలో పలకరింపుగా స్టూడెంట్ ఇంటికి వెళ్లడం, తండ్రి లాంటి వాణ్ణి అంటూ చనువుగా తాకడం, ఏదైనా క్యాంప్‌కు తీసుకెళ్లినప్పుడు అవకాశం తీసుకోవడం, ఫోన్లలో వీడియోకాల్స్‌లో అర్ధనగ్నంగా కనిపించడం... ఇవన్నీ విద్యార్థినులకు వేదన కలిగిస్తున్నాయి. కొందరు మాత్రమే తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళుతున్నారు. కొందరు స్కూలు యాజమాన్యాల దృష్టికి తీసుకువెళుతున్నారు. అయితే ఇలాంటి కీచక టీచర్లు విద్యార్థినుల వద్ద తప్ప మిగిలిన ప్రవర్తన అంతా ఆదర్శప్రాయంగా ఉండేలా జాగ్రత్త పడుతూ ఉండటంతో మేనేజ్మెంట్లు అయోమయంలో పడటం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఇలాంటి ప్రవర్తన ఎదురుకాని ఇతర విద్యార్థినులు ‘సార్ మంచోడ’న్న కితాబు ఇస్తుండటంతో సమస్య వస్తోంది. అయితే ప్రస్తుతం చెన్నైలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి టీచర్లో ఒకరికి మించి ఆరోపణలు చేస్తుండటంతో వారు ‘పోక్సో’ చట్టం, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం తీవ్ర విచారణ ఎదుర్కొనాల్సి ఉంటుంది. నివారణ చర్యలు తమిళనాడు ప్రభుత్వం జరుగుతున్న పరిణామాల పట్ల వెంటనే స్పందించింది. ప్రతి స్కూల్లో విద్యార్థినుల కోసం కమిటీలు వేయడం ఒక నిర్ణయంగా తీసుకుంది. అంతేకాదు, ఆన్లైన్ క్లాసుల నిర్వహణ గురించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆన్లైన్ క్లాసుల సమయంలో టీచర్లు కాని, విద్యార్థులు కాని స్కూళ్లలో హాజరైనట్టుగా ఫార్మల్ బట్టలు ధరించాలని చెప్పింది. అంతే కాదు... లైంగిక వేధింపుల నివారణకు ఇకపై అన్ని ప్రభుత్వ బాలికా పాఠశాలల్లో అందరూ మహిళా టీచర్లనే నియమించాలనే ఆలోచన కూడా చేస్తోంది. అయితే ఈ ఆలోచన చర్చకు తావిస్తోంది. అందరూ మహిళా టీచర్లనే నియమిస్తే విద్యార్థినులకు జెండర్‌కు సంబంధించిన వివేచన, స్పృహ బొత్తిగా తప్పిపోయే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ‘కేవలం మహిళలనే నియమించాలనే నియమం వల్ల మంచి టీచర్ కాకపోయినా స్త్రీ కాబట్టి నియమించే ప్రమాదం ఉంది’ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ‘మహిళా టీచర్లను నియమించడం కంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కఠినమైన చట్టాల అమలు గురించి ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది’ అని మరికొందరు అంటున్నారు. గురువుకు సంస్కారం సమాజంలో గురువుకు ఉన్న స్థానం మరెవరికీ లేదు. తల్లితండ్రి తర్వాత గురువునే పూజించాలని మన ధర్మాలు చెబుతున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత పిల్లలు గడిపేది గురువుతోనే. గురువుల వ్యక్తిత్వం, ప్రవర్తన పిల్లలపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. తాము గౌరవించే గురువుల్లో ఒకరిద్దరైనా సరే తమ పట్ల మలినంగా వ్యవహరిస్తే వారి మనసులకు చాలా గట్టి దెబ్బ తగులుతుంది. అయితే గురువుల ఎంపిక గురించి ఇప్పుడు మేనేజ్మెంట్లకు ఎలాంటి పట్టింపు ఉంది అనేది చర్చనీయాంశం. సబ్జెక్ట్‌లో బాగుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కాని వారి వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉంది, వారు ఏ పుస్తకాలను చదివారు, ఏ భావధారను కలిగి ఉన్నారు, ఏ విలువలు ప్రదర్శిస్తున్నారు అనేది గమనించే అవకాశం లేదు. సాహిత్య స్పర్శ, సామాజిక స్పృహ ఉన్న గురువుల సంఖ్య చాలా తక్కువ ఉంటోందని గతాన్ని ప్రస్తుతాన్ని పోల్చి చూసే వారు అంటుంటారు. విద్యార్థులకు సత్ప్రవర్తనను నూరి పోసే గురువుల సదాచారాల ఉన్నతి కోసం సంస్థాగతమైన శిబిరాలు, శిక్షణల గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సి ఉంటుంది. గురువు అనే అద్దం నుంచే ఈ సమాజం అనే ప్రతిబింబం పుడుతుందని గురువులందరూ అర్థం చేసుకుంటే విద్యార్థుల నుంచి వారికి సదా జేజేలే అందుతాయి. – సాక్షి ఫ్యామిలీ -
వయసు 73.. వరుడు కావలెను; నెటిజన్ల ప్రశంసలు
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఇటీవల 73ఏళ్ల రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలు జీవిత భాగస్వామి కోసం ‘వరుడు కావలెను’ అని పెళ్లి ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన స్థానికంగానూ, సామాజిక మాధ్యమంలోనూ విపరీతంగా చర్చకు దారితీసింది. చాలామంది ఆమె ధైర్యానికి, పాజిటివ్ ఆలోచనను మెచ్చుకోగా, మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినవారూ ఉన్నారు. ఇంకొందరు ఈ బామ్మ ట్రెండ్‌సెటర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరు, వయసేంటో మర్చిపోయావా బామ్మా అని ఇంకొకరు.. ఇలా తలా ఒక మాట అన్నవారూ ఉన్నారు. ఈ ప్రకటన వెనుక ఉన్న అంతర్లీన సమస్యపై మాత్రం ఎవరూ అంతగా దృష్టిపెట్టలేదు. ఒంటరి జీవితం.. ప్రకటనలో ఆమె ..‘సంప్రదాయ కుటుంబం, ఆరోగ్యంగా ఉన్న 70 ఏళ్ల పైబడిన వ్యక్తితో జీవితం పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాన’ని తెలిపింది. ఆమె తన గురించి తెలియజేస్తూ– ‘నాకు నా సొంత కుటుంబం లేదు. నా తల్లిదండ్రులు చనిపోయారు. నా మొదటి వివాహం, విడాకులు బాధాకరమైనవి కావడంతో ఇన్నేళ్లుగా తిరిగి వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఒంటరి జీవితం నన్ను భయపెడుతోంది. ఎవరి సాయం లేకుండా బస్‌స్టాప్ నుండి ఇంటికి, ఇంటి నుండి బయటకు నడవడానికి, ఇంట్లో ఒంటరిగా ఉండటానికి కూడా భయపడుతున్నాను. అందుకే జీవితభాగస్వామి కోసం చూస్తున్నాన’ని తెలిపింది. మూసధోరణులు విచ్ఛిన్నం వివాహం, జీవిత భాగస్వామి అనే విషయాలు ఇంకా మన వ్యవస్థలో సంప్రదాయక కోణం నుంచే ఆలోచిస్తున్నారు. కానీ, ఒంటరి జీవితానికి ఏ వయసులోనైనా తోడు అవసరం అనే విషయం అంతగా పట్టించుకోరు. అందుకే, ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ అయ్యింది. అయితే, యువత నుంచి మాత్రం ఆమె నిర్ణయం సమాజంలో సాంస్కృతిక మూసలను విచ్ఛిన్నం చేస్తుందని విపరీతంగా ప్రశంసలు అందుకుంది. సామాజిక కార్యకర్తలు ఈ విషయం పట్ల స్పందిస్తూ ‘మహిళలు అనేకాదు మగవారు కూడా ఒంటరితనం పట్ల భయపడుతుంటారు. అయితే, భాగస్వామి కోసం ఎంచుకునే స్వతంత్రం మగవారికే అధికంగా ఉంటుంది. దీనినే ఇప్పటివరకు సమాజం ఆమోదిస్తూ వచ్చింది. ఇలాంటి ధోరణికి ఈ ప్రకటన ఓ సమాధానం అవుతుంది’ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అద్దం ‘సమాజంలో వృద్ధుల పరిస్థితి ఎలా ఉందో ఈ పరిస్థితి కళ్లకు కడుతుంది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం కూడా మానసిక సమస్యలు పెరగడానికి కారణం అవుతున్నాయని’ మానసిక నిపుణులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఒంటరిగా ఉండే వాళ్లు తోడు కోరుకుంటారు. అయితే, ఆమె సంప్రదాయ కోణంలో జీవితాంతం ఉండే తోడు అవసరం గురించి ఆలోచించి ఆ ప్రకటన ఇచ్చింది. చాలాకాలంగా మూస పితృస్వామ్య ఆలోచనకు, యవ్వనంగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంటారనే ఆలోచనలకు ఈ ప్రకటన ఒక అడ్డంకిని తొలగిస్తుంది. ఇంజనీర్‌గా పదవీ విరమణ చేసిన 69 ఏళ్ల వ్యక్తి నుంచి ఆమెకు తోడుగా ఉంటాననే స్పందన రావడం గమనార్హం. -
క్లాస్‌రూమ్‌లో మహిళా టీచర్ల వికృతచర్య!
పట్నా : ఇటీవల తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినికి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు స్కూలు హెడ్ మాస్టర్ సైతం మొత్తం 18 మంది 7 నెలలపాటు నరకం చూపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ క్రమంలో ఏడాదిన్నర కిందట ఓ ఐదేళ్ల బాలికపై ఇద్దరు మహిళా టీచర్లు చేసిన అసహజ లైంగిక చర్యల కేసులో పట్నా కోర్టు స్పందించింది. చిన్నారితో టీచర్లు తమ లైంగిక కార్యకలాపాలు కొనసాగించారని పోలీసులు కోర్టుకు విన్నవించారు. నుతన జోసెఫ్, ఇందూ ఆనంద్ అనే మహిళా టీచర్లు ఓ తెలుగు మీడియం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. 2016 నవంబర్ నెలలో ఈ టీచర్లు స్కూలు వేళలు ముగిశాక ఓ ఐదేళ్ల బాలిక దుస్తులు విప్పి వికృతచర్యలకు పాల్పడ్డారు. కొన్నిరోజుల తర్వాత టీచర్లు ఏదో చేస్తున్నారని ఇంట్లో చెప్పగా.. ఆగ్రహావేశాలకు లోనైన విద్యార్థిని తల్లిదండ్రులు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు గతంలోనే బాలికను మెడికల్ టెస్ట్‌ల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆపై మెడికల్ రిపోర్టులలో బాలికపై లైంగిక చర్యలు నిజమేనని తేలింది. వాయిదాల అనంతరం తాజాగా కేసు విచారణ జరిపిన జడ్జీ జస్టిస్ రవీంద్రనాథ్ త్రిపాఠి ఈ జూలై 20న మహిళా టీచర్లకు శిక్ష ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. -
‘కడియం’ వ్యాఖ్యలు అనైతికం
సాక్షి, సిటీబ్యూరో: ఖమ్మం జిల్లాలో మహిళా ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీరుపై ఉపాధ్యాయ సంఘాలు విరుచుకు పడ్డాయి. ఒక వైపు కుటుంబం.. మరోవైపు సమాజ బాధ్యతలు విజయవంతంగా కొనసాగిస్తున్న మహిళా టీచర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పీఆర్టీయూ హైదరాబాద్ శాఖ పేర్కొంది. సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు బి. మధుసూదన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ టి. తిరుపతి రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం మాటలు తీవ్ర మనోవేదన కలిగించాయని, తక్షణమే మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి నర్రా భూపతిరెడ్డి డిమాండ్ చేశారు. ఆందోళనలు చేపడతాం: పాఠశాలలను బలోపేతం చేయకుండా ఉపాధ్యాయులను నిందిస్తున్న కారణంగానే ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల శాతం పడిపోతోందని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం ధ్వజమెత్తింది. ప్రభుత్వం ఉదాసీనతతోనే భవిష్యత్ తరాలు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను టీచర్ల నెత్తిన రుద్దితే.. డిప్యూటీ సీఎం వైఖరికి నిరసనగా ఆందోళన చేస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండల్ రెడ్డి, ప్రధానకార్యదర్శి మనోహర్ రాజు, ఉపాధ్యక్షులు రవీందర్ హెచ్చరించారు. -
‘అక్షరాలా’ నిర్లక్ష్యం
గుంటూరు ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన పేద కుటుంబాల విద్యార్థినులను చేరదీసి వారికి ఉచిత వసతితో కూడిన విద్యను అందించేందుకు ఉద్దేశించిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. జిల్లాలో 24 కేజీబీవీలు ఉండగా అన్నింట్లోనూ కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులే పనిచేస్తున్నారు. ఊళ్లకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న కేజీబీవీల్లో విద్యార్థినులకు భద్రత కరువైంది. గ్రామీణ ప్రాంతాల్లో బాలికా అక్షరాస్యతను పెంపొందించేందుకు ఉద్దేశించిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు ఒకనాడు దేశంలో విలువలతో కూడిన విద్యాలయాలుగా విరాజిల్లాయి. ఎంతో ఘన చరిత్ర కలిగిన కేజీబీవీలు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రాభవం కోల్పోతున్నాయి. పేద కుటుంబాల్లోని విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించి సమాజంలో విద్యావంతులుగా నిలపాల్సిన కేజీబీవీలు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నడుస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులే దిక్కు జిల్లాలో 24 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో సర్వశిక్షా అభియాన్ యాజమాన్యంలో ఆరు, సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహణలో ఆరు, ఏపీ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో ఎనిమిది, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో మరో నాలుగు ఉన్నాయి. వీటిలో 4,904 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్కో కేజీబీవీలో 200 మంది విద్యార్థినులున్నారు. పులిచింతల నిర్వాసితుల గ్రామాల్లో నుంచి 104 మంది విద్యార్థినులను సమీప మండలాల్లోని కేజీబీవీల్లో చేర్పించారు. ఒక్కో కేజీబీవీల్లో ప్రత్యేకాధికారితో పాటు ఆరుగురు కాంట్రాక్ట్ రెసిడెన్స్ టీచర్లు పనిచేస్తున్నారు. వీరితో పాటు ఔట్ సోర్సింగ్ పద్ధతిపై మగ్గురు వంటపని వారు, ఇద్దరు వాచ్మెన్లు, అటెండర్, ఒక ఏఎన్ఎం పని చేస్తున్నారు. మధ్యలో బడి మానేసిన, అనాథలు, తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన విద్యార్థినులకు కేజీబీవీల్లో ఉచిత విద్య అందించాలని నిబంధనలు స్పష్టం చేస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులను అర్ధాంతరంగా పాఠశాల మాన్పించి వేసి కేజీబీవీల్లో చేర్పిస్తున్నారు. దీంతో అసలు లక్ష్యం కాస్తా నీరుకారుతోంది. విద్యార్థినుల భద్రతకు సంబంధించి పటిష్టమైన విధానం లేకపోవడంతో కేజీబీవీల్లోకి రాత్రి వేళ ఆగంతుకులు ప్రవేశించిన సంఘటనలు ఉన్నాయి. కేజీబీవీలకు ప్రహరీ, పగలు, రాత్రి కాపలాదారులు ఉన్నప్పటికీ ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కరువై కాలం నెట్టుకొస్తున్నారు. రోజులో 24 గంటలు కేజీబీవీల్లో ఉంటున్న విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించడంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఉద్యోగ భద్రత లేకపోవడం, వ్యక్తిగత సమస్యలతో మహిళా ఉపాధ్యాయినులు విధి నిర్వహణలో అభద్రతా భావానికి గురవుతున్నారు. ఊళ్లకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో... ఊరికి దూరంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న కేజీబీవీలకు చేరుకునేందుకు సరైన రవాణా సదుపాయాలు లేక ఉపాధ్యాయినులు, విద్యార్థులను చూసేం దుకు వెళ్లే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళల్లో ఆగంతుకులు చొరబడితే రక్షణ కల్పించే వ్యవస్థ లేకపోవడంతోపాటు, పిలిస్తే పలికే నాథుడు సైతం కరువయ్యారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకొస్తున్న కేజీబీవీల్లో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు శాశ్వత రీతిలో నియామకాలు చేపట్టాల్సిన అవసరముంది. -
మహిళా టీచర్లకు అదనపు భారం!
* మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలు * ఇప్పటికే పని భారం ఎక్కువైందని ఆవేదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో బాలికల కోసం నిర్మించిన హాస్టళ్ల నిర్వహణ బాధ్యత గందరగోళంగా మారింది. 175 మోడల్ స్కూళ్లలో చేపట్టిన బాలికల హాస్టళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి. త్వరలోనే వాటిని ప్రారంభించి బాలికలకు నివాస వసతి కల్పించేందుకు విద్యా శాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో స్కూళ్లలో పనిచేసే టీచర్లే వార్డెన్ల విధులు నిర్వహించాలని సోమవారం విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా టీచర్లలో సీనియర్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని సూచించింది. హాస్టళ్లలోని వసతుల వివరాలు, వార్డెన్ బాధ్యతలు ఎవరికిఅప్పగిస్తున్నారనే అంశాలను ఈ నెల 15లోగా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నివేదిక పంపించాలని పేర్కొంది. దీంతో మహిళా టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తమకు పాఠశాలల్లో పనిభారం అధికంగా ఉందని, దీనికి తోడు వార్డెన్ బాధ్యతలు చూడటం కష్టమవుతుందని రాష్ట్ర మోడల్ స్కూల్ టీచర్ల అసోసియేషన్ వాపోతోంది. పైగా మోడల్ స్కూళ్లు మండల కేంద్రాలకు దూరంగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ఓ మహిళా టీచర్ వందమంది బాలికలతో ఉండటం శ్రేయస్కరం కాదని పేర్కొంది. పైగా వివాహితులైన టీచర్లు తమ కుటుంబాన్ని వదిలి ఉండటం (భర్త, కుటుంబ సభ్యులు ఉండటానికి వీల్లేదు కాబట్టి) సాధ్యం కాదంటోంది. ఈ నేపథ్యంలో హాస్టళ్ల నిర్వహణకు ప్రత్యేకంగా మహిళా వార్డెన్లను నియమించి రాత్రి వేళల్లో బాలికలకు రక్షణగా మహిళా కానిస్టేబుళ్లను నియమించాలని కోరుతోంది. -
మహిళా టీచర్లను వేధిస్తే కటకటాలే..!
వీరఘట్టం: మహిళా టీచర్లను వేధించేవారు ఇక కటకటాలు లెక్కపెట్టాల్సిందే. వేధింపులకు గురిచేసే వారిపై తక్షణ చర్యలు తీసుకొనేలా పాఠశాల విద్యాశాఖ చర్యలకు శ్రీకారం చుట్టింది. డీఈవో కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటుచేసి విచారణ కమిటీ నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా మహిళా టీచర్లను వేధింపులకు గురిచేసినా, వారిని సూటిపోటి మాటలతో అగౌరవ పరిచినా, ఇంకేమైనా ఇబ్బందులకు గురిచేసినా అందుకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకొనే అంశంపై విద్యాశాఖ యంత్రాంగం పట్టించుకునేది కాదు. పోలీసులకు సంబంధించిన వ్యవహారంగా గుర్తించి విస్మరించేది. టీచర్లు నేరుగా పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం మినహా ప్రత్యేకించి విద్యాశాఖలో ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థ ఉండేది కాదు. దీంతో సత్వర విచారణ జరిగేది కాదు. న్యాయం కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా ప్రత్యేక ఫిర్యాదుల విభాగానికి శ్రీకారం చుట్టింది. పలు కోణాల్లో విచారించి చర్యలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు నివేదిస్తుంది. ఈ నివేదికల ఆధారంగా బాధ్యులైన వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒత్తిడి చేస్తే ఇక అంతే... జిల్లాలో సుమారు 5 వేల మంది మహిళా టీచర్లు పని చేస్తున్నారని విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవాలని హెచ్చరించి మహిళా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉదంతాలు లేకపోలేదని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఏ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలనేది ఉపాధ్యాయుల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని, బలవంతంగా సభ్యత్వం తీసుకోవాలని ఒత్తిడి చేస్తే అది వేధింపుల కిందకే వస్తుందని, అలాంటి ఘటనల పైనా ఉపాధ్యాయినులు ఫిర్యాదుల విభాగం దృష్టికి తీసుకురావచ్చునని విద్యాశాఖాధికారులు సూచించారు. మానసిక, శారీరక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.