‘అక్షరాలా’ నిర్లక్ష్యం | Education negligence | Sakshi
Sakshi News home page

‘అక్షరాలా’ నిర్లక్ష్యం

Published Mon, Sep 21 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

‘అక్షరాలా’ నిర్లక్ష్యం

‘అక్షరాలా’ నిర్లక్ష్యం

గుంటూరు ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన పేద కుటుంబాల విద్యార్థినులను చేరదీసి వారికి ఉచిత వసతితో కూడిన విద్యను అందించేందుకు ఉద్దేశించిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. జిల్లాలో 24 కేజీబీవీలు ఉండగా అన్నింట్లోనూ కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులే పనిచేస్తున్నారు. ఊళ్లకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న కేజీబీవీల్లో విద్యార్థినులకు భద్రత కరువైంది. గ్రామీణ ప్రాంతాల్లో బాలికా అక్షరాస్యతను పెంపొందించేందుకు ఉద్దేశించిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు ఒకనాడు దేశంలో విలువలతో కూడిన విద్యాలయాలుగా విరాజిల్లాయి. ఎంతో ఘన చరిత్ర కలిగిన కేజీబీవీలు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రాభవం కోల్పోతున్నాయి. పేద కుటుంబాల్లోని విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించి సమాజంలో విద్యావంతులుగా నిలపాల్సిన కేజీబీవీలు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నడుస్తున్నాయి.

 కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులే దిక్కు
 జిల్లాలో 24 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో సర్వశిక్షా అభియాన్ యాజమాన్యంలో ఆరు, సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహణలో ఆరు, ఏపీ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో ఎనిమిది, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో మరో నాలుగు ఉన్నాయి. వీటిలో 4,904 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్కో కేజీబీవీలో 200 మంది విద్యార్థినులున్నారు. పులిచింతల నిర్వాసితుల గ్రామాల్లో నుంచి 104 మంది విద్యార్థినులను సమీప మండలాల్లోని కేజీబీవీల్లో చేర్పించారు. ఒక్కో కేజీబీవీల్లో ప్రత్యేకాధికారితో పాటు ఆరుగురు కాంట్రాక్ట్ రెసిడెన్స్ టీచర్లు పనిచేస్తున్నారు.

వీరితో పాటు ఔట్ సోర్సింగ్ పద్ధతిపై మగ్గురు వంటపని వారు, ఇద్దరు వాచ్‌మెన్‌లు, అటెండర్, ఒక ఏఎన్‌ఎం పని చేస్తున్నారు. మధ్యలో బడి మానేసిన, అనాథలు, తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన విద్యార్థినులకు కేజీబీవీల్లో ఉచిత విద్య అందించాలని నిబంధనలు స్పష్టం చేస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులను అర్ధాంతరంగా పాఠశాల మాన్పించి వేసి కేజీబీవీల్లో చేర్పిస్తున్నారు. దీంతో అసలు లక్ష్యం కాస్తా నీరుకారుతోంది. విద్యార్థినుల భద్రతకు సంబంధించి పటిష్టమైన విధానం లేకపోవడంతో కేజీబీవీల్లోకి రాత్రి వేళ ఆగంతుకులు ప్రవేశించిన సంఘటనలు ఉన్నాయి.

కేజీబీవీలకు ప్రహరీ, పగలు, రాత్రి కాపలాదారులు ఉన్నప్పటికీ ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కరువై కాలం నెట్టుకొస్తున్నారు. రోజులో 24 గంటలు కేజీబీవీల్లో ఉంటున్న విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించడంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఉద్యోగ భద్రత లేకపోవడం, వ్యక్తిగత సమస్యలతో మహిళా ఉపాధ్యాయినులు విధి నిర్వహణలో అభద్రతా భావానికి గురవుతున్నారు.

 ఊళ్లకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో...
 ఊరికి దూరంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న కేజీబీవీలకు చేరుకునేందుకు సరైన రవాణా సదుపాయాలు లేక ఉపాధ్యాయినులు, విద్యార్థులను చూసేం దుకు వెళ్లే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళల్లో ఆగంతుకులు చొరబడితే రక్షణ కల్పించే వ్యవస్థ లేకపోవడంతోపాటు, పిలిస్తే పలికే నాథుడు సైతం కరువయ్యారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకొస్తున్న కేజీబీవీల్లో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు శాశ్వత రీతిలో నియామకాలు చేపట్టాల్సిన అవసరముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement