సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్‌ఈ) కె.జగజ్యోతి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్ బాయిస్ హాస్టల్ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్‌డ్ కాంట్రాక్టర్ చేపట్టారు.
వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్‌ను ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ(డీఎస్‌ఎస్) భవన్‌లో జగజ్యోతిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్‌ఛార్జి హోదాలో ఎస్‌ఈ బాధ్యతలూ నిర్వర్తిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment