బాగుపడుతున్న గిరిజన బతుకులు.. పెరుగుతున్న జీవన ప్రమాణాలు
ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలతో నిశ్చింత.. పోడు భూముల సాగుతో పోషణ
ఆదుకుంటున్న రైతు భరోసా నల్ల మిరియాలు, కొండ చీపుర్లు లాంటి అటవీ ఉత్పత్తులకు ఊతమిస్తే మరింత మేలు
గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన తెగలు ప్రగతి బాటలో పురోగమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాల జారీ, దేశంలో తొలిసారిగా ఏజన్సీ రైతులకు రైతు భరోసా లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు గిరిజనాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, అటవీ సంపదతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసింది. అడవితో ముడిపడిన గిరిజనుల జీవితం అక్కడి నుంచే అభివృద్ధి చెందేలా బాటలు వేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం, పోడు భూముల సాగును ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తోంది.
గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నేతృత్వంలో ఇ.రవీంద్రబాబు, జి.చిన్నబాబు, నాగరాజు చిక్కాల రూపొందించిన నివేదికను గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు జె.వెంకట మురళి ఆవిష్కరించారు. గిరిజన యువత, కళాకారులు, నాయకులు, అధికారులతో సహా పలువురిని భాగస్వాములను చేశారు. ఆర్వోఎఫ్‌ఆర్, పీసా, 1 ఆఫ్ 70 చట్టాలు, గిరిజన జీవనోపాధి, సంప్రదాయ కళారూపాలు, అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించడంతోపాటు గిరిజనులకు సంబంధించిన పలు పుస్తకాలను అధ్యయనం చేశారు.
సాగు.. నైపుణ్యాభివృద్ధి.. మార్కెటింగ్
పాడేరు, రంపచోడవరం, సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16 గ్రామాల్లో అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించారు. సాగు, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ ద్వారా గిరిజనులకు మరింత మేలు చేయవచ్చని నివేదిక సూచించింది. పంటల సాగులో మెళకువలతోపాటు నైపుణ్యాభివృద్ధి చర్యల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొంది. నల్ల మిరియాలు, మిర్చి, కొండ చీపుర్లు లాంటి అటవీ ఉత్పత్తులు, సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించవచ్చని సూచించింది.
ప్రధానంగా అత్యంత బలహీన గిరిజన సమూహాలైన (పీవీటీజీ) మూక దొర, భగత, కొండ దొర, సవర, కొండ రెడ్డి తెగల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆదాయం లభించేలా కొండ చీపుర్లు, గడ్డి పెంపకం, మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణ, అవగాహన కల్పించాలని నిర్దేశించింది. కాఫీ తోటల్లో అంతర పంటలుగా నల్ల మిరియాల సాగును ప్రోత్సహించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచవచ్చు. దీంతోపాటు మిర్చి రకాల సాగుపై అవగాహన పెంచడం, అధిక దిగుబడులు సాధించేలా పరిజ్ఞానాన్ని అందించడం, మంచి ధర దక్కేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనంలో పేర్కొంది.
అడవి బిడ్డలకు అండగా సీఎం జగన్
⇒ గిరిజనులకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలిచారు. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో గిరిజన కుటుంబాలకు ఏకంగా 3.22 లక్షల ఎకరాలను అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్‌ఆర్) ప్రకారం పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీకి దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టగా సీఎం జగన్ ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలతోపాటు డీకేటీ పట్టాలు పంపిణీ చేసి ఆ భూములను సాగులోకి తెచ్చేందుకు ఉపాధి హామీతో చేయూతనందించారు.
⇒ దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండంగా నిలిచారు. కాఫీ తోటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు లాంటివి అందించారు. అంతర పంటగా మిరియాల సాగుకు అవసరమైన పరికరాలు అందించారు.
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర దక్కేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా జీసీసీ చెల్లిస్తోంది. శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనుల ద్వారా సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‘ బ్రాండ్‌తో మార్కెటింగ్ చేస్తున్నారు. గిరిజన రైతులకు వ్యవసాయం, కాఫీ సాగుకు జీసీసీ రుణాలు అందచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment